శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
వ్యాస మరియు పరాశరులకు ఆళ్వారుల జీవనం వివరించే ప్రక్రియలో ఉన్నారు ఆండాళ్ నాన్నమ్మ.
వ్యాస: మనము ముదలాళ్వారులు మరియు తిరుమళిశై ఆళ్వారుల గురించి విన్నాము. తరువాత ఎవరు నాన్నమ్మ?
ఆండాళ్ నాన్నమ్మ: ఆళ్వారులలో ప్రముఖముగా పరింగణించబడు వారు నమ్మాళ్వార్, వారి గురించి చెబుతాను. వారి ప్రియ శిష్యుడు అయిన మధురకవి ఆళ్వారు గురించి కూడా కొంచం చెబుతాను.
పరాశర: సరే నాన్నమ్మ. వారి గురించి వినాలని చాలా ఆసక్తిగా ఉంది
ఆండాళ్ నాన్నమ్మ: తమిళంలో నమ్మాళ్వార్ అంటే “మన ఆళ్వారు” అని అర్థం. పెరుమాళ్ స్వయంగా వారికి ఈ నామాన్ని ప్రసాదించారు. నమ్మాళ్వారు ఆళ్వార్ తిరునగారిలో వైశాఖ మాసంలో విశాఖా నక్షత్రంలో పుట్టారు. ఆ ప్రాంతం రాజు/అధికారుడు అయిన కారి మరియు వారి భార్య ఉదయనంగై దంపతులకు పుట్టారు. కారి మరియు ఉదయనంగై లకు చాలా కాలంగా సంతానం లేదు. వారు ఇరువురు తిరుక్కురుంగుడి నంబి ని సంతానం కొరకు ప్రార్థించారు. నంబి వారే స్వయంగా పుత్రుడిగా జన్మిస్తానని ఆశీర్వదిస్తారు. కారి మరియు ఉడైయనంగై ఆళ్వార్ తిరునగరికి తిరిగి వస్తారు. అతి తక్కువ సమయములోనే ఉడైయనంగై ఒక అందమైన శిశువునకు జన్మనిస్తుంది. వీరిని పెరుమాళ్ అంశంగా మరియు కొన్ని సార్లు విష్వక్సేనుడి అంశంగా పరిగణిస్తారు.
వ్యాస: ఓ! చాలా బావుంది. అయితే, వారు స్వయంగా పెరుమాళ్లా?
ఆండాళ్ నాన్నమ్మ: వారి కీర్తిని చూస్తే తప్పకుండా చెప్పవచ్చు. కాని మన ఆచార్యుల వివరణ ప్రకారం, వారు స్వయంగా జీవాత్మలలో ఒకరుగా, అనాదిగా ఈ ప్రపంచములో అల్లాడుచు ఉన్నారని మరియు శ్రీమన్నారాయణుడు అనంతమైన దయతో దివ్యంగా కటాక్షించారాని స్వయంగా చాటారు. అయితే, వారిని పెరుమాళ్ విశేషంగా ఆశీర్వదించారు అని ఆంగీకరించవచ్చు.
పరాశర: అవును నాన్నమ్మ, ప్రారంభంలో మీరు చెప్తుండగా నాకు గుర్తుంది, పెరుమాళ్ కొంతమంది విశేషమైన వ్యక్తులను విశేషంగా పరిపూర్ణ జ్ఞానాన్ని కటాక్షించారని, వారినే ఆళ్వారులుగా చేసారని, అలా తీర్చిదిద్దిన వారై మన లాంటి ఎంతోమందిని పెరుమాళ్ దగ్గరకు చేరుస్తారని చెప్పారు.
ఆండాళ్ నాన్నమ్మ: అక్షరాలా నిజం పరాశర. అద్భుతం, మీ ఇద్దరికీ ఈ ముఖ్యమైన విషయాలు ఎంత చక్కగా గుర్తున్నాయి. ఇప్పుడు నమ్మాళ్వార్ పుట్టిన తరువాత, వారు మామూలి పిల్లవాడి లాగా పుట్టినా, వారు ఏమీ తినలేదు, యేడవలేదు, ఏమీ చేయలేదు. మొదటిలో వారి తల్లి తండ్రులు భయపడ్డారు. పుట్టిన పన్నెండవ రోజున వారు ఆదినాథ పెరుమాళ్ గుడికి వచ్చి ఆ శిశువును పెరుమాళ్ ముందు ఉంచారు. వేరే శిశువుల పోలికలో విశేషమైన గుణాలు ఉన్న ఈ శిశువుకు మాఱన్ ( భిన్నంగా ఉన్న వారు)అని నామకరణం చేసారు. వారి అసమానమైన లక్షణం చూసి, వారి తల్లి తండ్రులు వారిని దివ్య వ్యక్తిగా భావించి వారిని గుడికి దక్షిణంగా ఉన్న ఒక దివ్యమైన చింతచెట్టు క్రింద ఉంచి భక్తితో పూజించారు. అప్పటి నుండి వారు 16 సంవత్సరాలు ఒక్క మాట మాట్లాడకుండా ఆ చింతచెట్టు క్రింద ఉన్నారు.
వ్యాస’: అయితే, ఆ సమయమంతా ఏమి చేసారు? వారు ఆఖరికి మాట్లాడారా?
ఆండాళ్ నాన్నమ్మ: శ్రీ మన్నారాయణుని అనుగ్రహముతో జన్మించిన వారైనందున , వారు ఎల్లప్పుడూ అగాధమైన ధ్యానంలో ఉండేవారు. ఆఖరున, మధురకవి ఆళ్వారుల రాక వారిని మాట్లాడించింది.
పరాశర: మధురకవి ఆళ్వార్ ఎవరు? వారు ఏంచేశారు?
ఆండాళ్ నాన్నమ్మ: మధురకవి ఆళ్వార్ తిరుక్కోళూర్లో చైత్ర మాసంలో చిత్రా నక్షత్రంలో పుట్టారు. వారు ఒక అద్భుతమైన మేధావి మరియు శ్రీ మన్నారాయణుని భక్తులు. వయస్సులో వారు నమ్మాళ్వార్ కంటే చాలా పెద్దవారు. వారు తీర్థయాత్రకై అయోధ్యకు వెళ్ళారు. అప్పటికే వారు మాఱన్ జీవతం గురించి విన్నారు. ఒకానొక సమయంలో దక్షిణ దిశగా ఒక జ్యోతి ప్రకాశించడం వారు గమనించి ఆ దిశగా వారు పయనిస్తారు. ఆ జ్యోతి వారిని ఆఖరున ఆళ్వార్ తిరునగరి గుడిలో మాఱన్ ఉన్నదగ్గరకు చేరుస్తుంది.
వ్యాస: నమ్మాళ్వార్, మధురకవి ఆళ్వారుతో మాట్లాడారా?
ఆండాళ్ నాన్నమ్మ: అవును, వారు మాట్లాడారు. మధురకవి ఆళ్వారు వారిని ఒక దివ్యమైన సంభాషణలోకి నిమగ్నం చేస్తారు. ఆఖరున వారు మాట్లాడతారు. వారి మహిమలను అర్థంచేసుకొని మరు క్షణం వారి శిష్యులయ్యి నేర్చుకోవలసిన సారమైన మూల సూత్రాలను వారి వద్ద నేర్చుకుంటారు. వారు నమ్మాళ్వారుకు శేష జీవితమంతా సేవ చేశారు.
పరాశర: ఓ!, చాలా బాగుంది. అయితే, సత్యమైన జ్ఞానం నేర్చుకోవాలంటే వయస్సుతో సంబంధం లేదు. ఇక్కడ, మధురకవి ఆళ్వారు వయస్సులో నమ్మాళ్వార్ కంటే పెద్దవారైనా, వారు ఈ సూత్రాలు నమ్మాళ్వార్ వద్ద నేర్చుకున్నారు.
ఆండల్ నాన్నమ్మ: చాలా బాగా గమనించావు పరాశర. అవును, నేర్చుకోవటానికి వినయ విధేయతలు ఉంటేచాలు, ఆ వ్యక్తి వయస్సులో చిన్నవాడైనను సరే. అది శ్రీవైష్ణవులకు ఉండవలసిన నిజమైన లక్షణం అని ఇక్కడ చేసి నిరూపించారు మధురకవి ఆళ్వారు. కొన్ని సంవత్సరాల తరువాత, 32 వ యేడు, నమ్మాళ్వార్ పెరుమాళ్ యొక్క విరహవేదన భరించలేక పరమపదాన్ని అధీష్ఠించాలని నిర్ణయించుకుంటారు. పెరుమాళ్ యొక్క కీర్తి ప్రఖ్యాతులను వారి నాలుగు ప్రబంధాలు – తిరువిరుత్తం, తిరువాయ్మొళి, తిరువారిశిరియం మరియు పెరియ తిరువందాది లో కీర్తించి పెరుమాళ్ అనుగ్రహముతో పరమపదాన్ని అదిష్ఠించి పెరుమాళ్ యొక్క శాశ్వత కైంకర్యంలో నిమగ్నమై ఉండిపోయారు.
వ్యాస: పరమపదానికి వెళ్ళటానికి అది చాలా అల్పవయస్సు కదా నాన్నమ్మ.
ఆడాల్ నాన్నమ్మ: అవును. కాని వారు శాశ్వతమైన బ్రహ్మానందాన్ని పొందాలనుకున్నారు. పెరుమాళ్ కూడా వారు అక్కడ ఉండాలనుకున్నారు. కనుక, వారు ఈ ప్రపంచాన్ని విడిచి అక్కడికి చేరుకున్నారు. మధురకవి ఆళ్వారు, మరిగించిన నదీ జలంలో నుంచి పొందిన నమ్మాళ్వారి ఆర్చా విగ్రహాన్ని ఈ దివ్య దేశంలో స్థాపించారు, తగిన పూజా విధులను ఏర్పాటు చేశారు. వీరు నమ్మాళ్వారి కీర్తిని ప్రశంసిస్తూ రచించిన ప్రబంధము “కణ్ణినుణ్ శిరుత్తాంబు”. వారు నమ్మాళ్వార్ గొప్పతనాన్ని అంతటా వ్యాపించి స్థిరపరచారు.
పరాశర: అయితే, మధురకవి ఆళ్వారు కారణంగా నమ్మాళ్వారి గొప్పతనము మనము గ్రహించ గలుగుతున్నాము.
ఆండాళ్ నాన్నమ్మ: అవును, వారు నమ్మాళ్వార్ కు పరిపూర్ణ అంకితులు. నమ్మాళ్వార్ పై వారి ఆ అంకిత భావం వల్లనే స్వయంగా పెరుమాళ్లచే ప్రశంసించబడ్డారు. భాగవతుల ప్రశంస భగవాన్ ప్రశంస కంటే గొప్పదిగా భావిస్తారు. ఎప్పుడు సాధ్యమైతే అప్పుడు మనము కూడా భాగవతుల సేవ చేయవలెను.
వ్యాస మరియు పరాశర: తప్పకుండా నాన్నమ్మ. మేము ఈ విషయము గుర్తుపెట్టుకొని ఆ అవకాశము కొరకు ఎదురు చూస్తాము.
ఆండాళ్ నాన్నమ్మ: దీనితో మనము నమ్మాళ్వార్ మరియు మధురకవి ఆళ్వార్ జీవితం చూసాము. పదండి నమ్మాళ్వార్ సన్నిధికి వెళ్లి వారిని సేవిద్దాము.
అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి
మూలము: http://pillai.koyil.org/index.php/2014/11/beginners-guide-nammazhwar-and-madhurakavi-azhwar/
పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org