శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
<< ఆళవన్దారుల శిష్యులు – భాగము 2
పరాశర, వ్యాస, వేదవల్లి మరియు అత్తులాయ్, ఆండాల్ నాన్నమ్మ ఇంటికి వస్తారు .
నాన్నమ్మ: పిల్లలూ! స్వాగతం. మీ చేతులు కాళ్ళు కడుక్కోండి. ఇక్కడ ఆలయంలో తిరుఆదిపురం ఉత్సవం జరిగింది, ఈ ప్రసాదం తీసుకోండి. ఈవేళ, మనం ఆండాల్ పిరాట్టికి ప్రియమైన వారి గురించి చర్చను ప్రారంభించబోతున్నాము, ఆమె తన సొంత సోదరుడిగా పిలిచేవారు. ఎవరో ఊహించగలరా?
వ్యాస: లేదు నాన్నమ్మా, ఆండాల్ పిరాట్టి సోదరుడు ఎవరు నాన్నమ్మా? ఆండాల్ కి సోదరుడు ఉన్నాడా?
నాన్నమ్మ: అవును, పుట్టుకతో కాదు కాని, ప్రేమ మరియు అనురాగంచేత అతను ఆమెకు సోదరుడు. వారిని గోదాగ్రజా లేదా కోయిల్ అన్నన్ అని పిలిచేవారు, వారు ఎవరో కాదు మన రామానుజులే! అగ్రజ అంటే సంస్కృతంలో అన్నయ్య అని అర్థం.రామానుజులు ఆండాల్ (గోదాదేవి) చేత తన సోదరుడిగా పరిగణించబడ్డారు కాబట్టి వారు గోదాగ్రజా అని పిలువబడ్డారు. ఇళైయాళ్వారు శ్రీపెరంబుదూర్లో కేశవ దీక్షితులు మరియు కాంతిమతి అమ్మగారికి జన్మించారు. వారు స్వయంగా ఆదిశేషుని యొక్క అవతారం. వారు తిరువల్లిక్కేని పార్థసారథి పెరుమాళ్ యొక్క దయతో జన్మించారు.

ఉభయ నాచియార్లతో పార్థసారథి మరియు ఉడైయవరులు – తిరువల్లిక్కేని
పరాశర: నాన్నమ్మా! ఆండాల్, రామానుజులకన్నా చాలా ముందుకాలంలో జన్మించలేదా? అప్పుడు వారెలా అన్నయ్య అవుతారు?
నాన్నమ్మ: మంచి ప్రశ్న పరాశర. ముందు నేను చెప్పినట్లు, వారు పుట్టుకతో కాదు కానీ వారి ఆచరణతో సోదరుడైయ్యాడు. గోదాదేవి, పెరుమాళ్ పై పవిత్రమైన ప్రేమతో 100 గంగాళాల పాయసాన్నిఇంకా 100 గంగాళాల వెన్నను తిరుమాలిరుంచోలై అళగర్ పెరుమాళ్ కు నైవేద్య నివేదన చేస్తానని సంకల్పిస్తారు. కానీ, ఆమె చిన్నపిల్లగా ఉండటం వలన, ఆచరణాత్మకంగా సాధ్యం కాలేదు. రామానుజులు నాచ్చియార్ తిరుమొళి పాశురం చదవి, గోదాదేవియొక్క కోరికను గ్రహించి, ఈ నైవేద్య సమర్పణను తానే జరపాలనుకుంటారు. రామానుజులు ఆండాలమ్మ తరపున 100 గంగాళాల పాయసాన్న, 100 గంగాళాల వెన్నను తిరుమాలిరుంచోలై అళగర్ పెరుమాళుకు నైవేద్య నివేదన చేస్తారు. వారు నివేదన పూర్తిచేసి, శ్రీవిల్లిపుత్తూరు చేరుకున్నప్పుడు, ఆండాల్ అతన్ని స్వాగతించి, వారిని కోయిల్ (శ్రీరంగం) నుండి వచ్చిన అన్నయ్యా (అన్నన్) అని పిలుస్తుంది, ఆ కారణంగా కోయిల్ అన్నన్ అనే పేరు వచ్చింది. వారిని ఆమె అన్నగా పిలుస్తారు ఎందుకంటే ఒక అన్న ఎప్పుడూ తన సోదరి కోరికలను నెరవేరుస్తారు కాబట్టి.
అత్తులాయ్, తిరుప్పావై నుండి కొన్ని పాసురములను నువ్వు చదవగలవా? మీ పాఠశాల ఫాన్సీ డ్రెస్సు పోటీలో నువ్వు ఆండాల్ గా వేషం వేసుకొని పాసురాలు పాడావని నాకు గుర్తుంది.
నాన్నమ్మ: నేను ఈ రోజు ఎందుకు చదవమంటున్నానో తెలుసా? ఎందుకంటే, రామానుజులను తిరుప్పావై జీయర్ అని కూడా పిలుస్తారు. వారు ప్రతిరోజు తిరుప్పావై పఠించేవారు. తిరుప్పావై గొప్ప విద్వాంసులైన రామానుజుల హృదయానికి దగ్గరగా ఉండేది, వారు ప్రతిరోజు తిరుప్పావై పఠించేవారు. ఎందుకో మీకు తెలుసా?
వేదవల్లి: తిరుప్పావైని చాలా సులభంగా నేర్చుకోవచ్చు. నాకు మొత్తం 30 పాసురాలు వచ్చు!
నాన్నమ్మ (చిరునవ్వు తో): చాలా మంచిది వేదవల్లి. తిరుప్పావై నేర్చుకోవడం సులభమేమీ కాదు, ఇంకా ఆ 30 పాసురాలలో మన సాంప్రదాయం యొక్క సారాంశం మొత్తం నిమిడి ఉంది. ఇది వేదంలోని విస్తృత జ్ఞానానికి సమానంగా భావిస్తారు. అందుకే అది “వేదం అనైత్తుక్కుం విత్తాగుం” అని పిలువబడుతుంది – ఈ 30 పాసురాలలో మొత్తం 4 వేదాల నిగూఢమైన సారాంశం ఇమిడి ఉంది.
అత్తులాయ్: నాన్నమ్మా, రామానుజులకు చాలా పేర్లు ఉన్నట్లున్నాయి. మొదట, మీరు ఇళైయాళ్వార్ అని అన్నారు, ఇప్పుడు కోయిల్ అన్నన్ మరియు తిరుప్పావై జీయర్ అని అంటున్నారు!
నాన్నమ్మ: అవును. వారికి ఆ పేర్లన్నీ వారి ఆచార్యులు, ఆండాళ్ మరియు ఎమ్బెరుమాన్ ద్వారా ప్రేమతో ఇవ్వబడినవి. ఇప్పటివరకు మీరు రామానుజులయొక్క ఆచార్యులను మరియు రామానుజుల జీవితంలో ఆ ఆచార్యుల సహకారాలను చూశారు.ఇప్పుడు రామానుజుల యొక్క వివిధ పేర్లను మరియు వారికి ఆ పేర్లన్నీ ఎవరు ఇచ్చారో కూడా చూద్దాము.
- ఇళైయాళ్వార్ అని తిరుమలై నంబి (రామానుజులకు మేన మామయ్య) ఇచ్చిన పుట్టిన పేరు.
- శ్రీరామానుజ అని మధురాంతగంలో పంచ సంస్కార సమయంలో పెరియ నంబి వారిచే ఇవ్వబడింది.
- యతిరాజ మరియు రామానుజముని అని రామానుజులకు వారి సన్యాసాశ్రమ దీక్ష స్వీకరించు సమయాన దేవ పెరుమాళ్ చేత ఇవ్వబడింది.
- ప్రపంచంలోని అన్ని సంపత్తులు ఇప్పుడు రామానుజుల వారి ఆధీనములో ఉన్నట్టు ఉడయవర్ అని స్వయంగా నంపెరుమాళ్ ఆ పేరును ఇచ్చారు.
- లక్ష్మణముని అన్న పేరు తిరువరంగ పెరుమాళ్ అరయర్ వారు ఇచ్చారు.
- తిరుక్కోష్టిఊర్ లో అక్కడ ఉన్న జనులచేత శరణాగతి చేయించి మన సాంప్రదాయానికి రామానుజులు గొప్ప అర్ధాన్ని తెచ్చినందుకు తిరుక్కోష్టిఊర్ నంబి చేత ఎమ్బెరుమానార్ అని పేరు ఇవ్వబడింది. తిరుక్కోష్టిఊర్ నంబి “రామానుజుల కరుణా భావానికి చాలా ఆకర్షితుడై,” మీరు ఎంబెరుమాన్ కన్నా కరుణామయులు, అందుకే ఎమ్బెరుమానార్ అనే పేరు వచ్చింది అన్నారు.
- శఠకోపన్ పొన్నడి అని తిరుమలై ఆండాన్ వారి చేత ఇవ్వబడింది.
- ఆండాళ్ చేత కోయిల్ అన్నన్ అని పిలువబడ్డారు.
- శ్రీ భాష్యకారర్ అని కాష్మీర్లో సరస్వతి దేవి ఇచ్చిన పేరు.
- భూతపురిసర్ అని శ్రీపెరుంబుదూర్ లో ఆదికేశవపెరుమాళ్ ఇచ్చారు.
- దేశికేంద్ర అని మన తిరుమల శ్రీవేంకటేశ్వరుడు ప్రసాదించిన పేరు.
కాబట్టి, మొత్తంమీద, రామానుజులు చాలామంది ఆచార్యులను కలిగి ఉండేవారు. రామానుజులను వారందరూ జాగ్రత్తగా చూసుకుంటూ మరియు జ్ఞానబోధ చేస్తూ, ఆళవందార్ తరువాత మన సాంప్రదాయం ముందుకు సాగేవిధంగా జాగ్రత్తపడ్డారు. ఆళవందార్ ఆశీర్వాదాలతో వారు మొట్టమొదట తిరుక్కచ్చి నంబి ద్వారా శ్రీవైష్ణవంలోకి తీసుకురాబడ్డారు. పంచ సంస్కారము పెరియ నంబి చేత తీసుకొని, తిరుమలై ఆండాన్ ద్వారా పూర్తిగా తిరువాయిమోళి యొక్క సారాన్ని నేర్చుకున్నారు, తిరువరంగ పెరుమాళ్ అరైయర్ నుండి మన సాంప్రదాయం యొక్క సారాన్ని నేర్చుకొని, చరమశ్లోక సారాన్ని తిరుక్కోష్టిఊర్ నంబి నుండి నేర్చుకొని, చివరకు తన మేనమామ పెరియ తిరుమలై నంబి ద్వారా శ్రీరామాయణం యొక్క పూర్తి అర్ధం తెలుసుకున్నారు. అలా, ఆళవందార్ యొక్క ఆరుగురు గొప్ప శిష్యులు వారి ఆచార్యుని పట్ల వారి బాధ్యతను నెరవేర్చుకున్నారు.

రామానుజ – శ్రీ పెరుంబుదూరు
వేదవల్లి: నాన్నమ్మా, ఆళవందార్ గురించి మాట్లాడేటప్పుడు, మీరు రామానుజులు వారి శిష్యులు కాలేదు కానీ వారి కోరికలు తీరుస్తానని వాగ్దానం చేశారని చెప్పారు. అవి ఏంటి నాన్నమ్మా? ఆళవందార్ల మనసులోని సంకల్పం రామానుజులు ఎలా తెలుసుకున్నారు?
నాన్నమ్మ: చాలా మంచి ప్రశ్న. ఆళవందార్ రామానుజులను శ్రీరంగానికి తీసుకురమ్మని పెరియ నంబిని అడిగినప్పుడు, పెరియ నంబి కాంచిపురానికి బయలుదేరుతారు. పెరియ నంబి రామానుజులను శ్రీరంగానికి తీసుకువచ్చే సమయానికి , ఆళవందార్లు ఈ ప్రపంచాన్ని విడిచి పరమపదం చేరుకుంటారు. శ్రీరంగం చేరుకున్న తరువాత, పెరియ నంబి మరియు రామానుజులు జరిగినది తెలుసుకుంటారు. ఆలవందారు యొక్క తిరుమేనిని (దైవ రూపం) రామానుజులు చూసినపుడు, వారి ఒక చేతి మూడు వేళ్లు ముడుచుకొని ఉండటం గమనిస్తారు. ఆళవందార్ శిష్యులను అడిగినప్పుడు, ఆళవందార్లకు కొన్ని నెరవేరని కోరికలు ఉన్నాయని చెప్తారు. రామానుజులు వెంటనే ప్రమాణం చేస్తారు:
- వ్యాస మరియు పరాశార ఋషుల పట్ల వారి కృతజ్ఞతలను నిరూపించుట.
- వారి జీవిత కాలంలో నమ్మాళ్వారి పట్ల ప్రేమ కృతజ్ఞతలను చూపించుట.
- వ్యాస బ్రహ్మ సూత్రాలపైన భాష్యం వ్రాయుట, తరువాత కాలంలో అది శ్రీభాష్యంగా పిలువబడింది, కూరత్తాళ్వారి సహాయంతో రామానుజుల చేత లిఖించబడింది. ఈ కార్య నిర్వహణకోసం కూరత్తాళ్వారులతో వారు స్వయంగా కాష్మీరుకి ప్రయాణం చేస్తారు.
రామానుజులచేత ఈ 3 ప్రమాణాలు తీసుకోగానే ఆళవందార్ మూడు వేళ్ళు తెరుచుకుంటాయి. ఈ సంఘటనను చూచిన అందరు శిష్యులు ఆశ్చర్యపడతారు మరియు రామానుజులను పొగడ్తలతో నింపి మరియు మన సాంప్రదాయానికి తదుపరి ఆచార్యులుగా కీర్తిస్తారు. కాని, ఎమ్బెరుమానార్ ఆళవందార్ పరమద దుఃఖంతో శ్రీరంగంలోని శ్రీరంగనాథుని సేవించకుండానే కాంచిపురానికి వెళ్ళిపోతారు.
వ్యాస: కానీ నాన్నమ్మా, రామానుజుల ప్రతిజ్ఞతో ఆళవందార్ యొక్క వేళ్లు ఎలా ఆవిధంగా ప్రతిస్పందించాయి?
నాన్నమ్మ: వ్యాస, రామానుజులు మరియు ఆళవందార్ ల సంబంధం ఇంద్రియాలకు అతీతమైనది. మనస్సు, ఆత్మ ద్వారా కట్టుబడి ఉన్న సంబంధం వారిది. ఆళవందార్ లు వారి 3 కోరికలు ఏమిటో చెప్పారా? అయినప్పటికీ, ఆళవందార్ ల సంకల్పం ప్రకారం రామానుజులు ప్రమాణం చేశారు. ఇది ఎలా జరగినట్టు? వ్యాస, ఇటువంటి సంబంధాలు ఉనికిలో ఇంకా ఉన్నాయి. ఎలాగైతే రామానుజులు యొక్క మనస్సులో వేలాడుతున్న సందేహాలు వారు స్వయంగా అడగకుండానే దేవపెరుమాళ్ రామానుజులకు స్పష్టం చేశారో, అలాగే. ఇలాంటి సంబంధాలు ఆత్మసంబంధాలు, శరీరానికి సంబంధించినవి కావు. ఆళవందార్ రామానుజుల మధ్య సంబంధం కూడా అటువంటిదే.
ఇంతకాలంగా మనం రామానుజులు వారి వివిధ ఆచార్యుల గురించి ప్రతి విషయం చూశాము. రేపు నేను రామానుజులు ఎలా గొప్ప నాయకుడైయ్యారో మరియు ఎలా ఈ ప్రయాణంలో వారికి అనేక మంది శిష్యులయ్యారో చెబుతాను.
మూలము : http://pillai.koyil.org/index.php/2016/08/beginners-guide-ramanujar-1/
పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org