Monthly Archives: December 2018

బాల పాఠము – కైంకర్యం

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< బాల పాఠము – ఉత్తమ అనుష్ఠానాలు

పరాశర, వ్యాస, వేదవల్లి, అత్తుళాయ్ అందరూ కలిసి బామ్మవారి ఇంటికి వస్తారు.

బామ్మగారు: రండి పిల్లలూ. దేవుడికి పెట్టిన పండ్లను ఇస్తాను మీరు చేతులు కాళ్ళు కడుక్కోండి. ఆళవందార్ల తిరునక్షత్రం జరుపుకున్నారా?

పరాశర: అవును నాన్నమ్మ, చక్కగా జరుపుకున్నాము. ఆళవందార్ల సన్నిధిలో దర్శనం కూడా బాగా జరిగింది. అక్కడ, తిరునక్షత్రం ఉత్సవాలు చాలా బాగా చేశారు. మా నాన్నగారు ఆళవందార్ల వాళి తిరునామాలు మాకు నేర్పించారు. ఇంట్లో ఆ తిరునామాలను పఠించాము.

బామ్మగారు: చాలా మంచిది.

వేదవల్లి: నాన్నమ్మా,  మీరు క్రిందటి సారి ‘కైంకర్యం’ ప్రాముఖ్యత గురించిఅ చెప్తానన్నారు, మీకు గుర్తుందా?

బామ్మగారు: నాకు గుర్తుందమ్మా. నువ్వు గుర్తుంచుకొని అడిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. పెరుమ్మళ్ళకు, వారి భక్తులకు చేసే సేవను ‘కైంకర్యం’ అంటాము. పెరుమాళ్ళ సంతృప్తి మనం కైంకర్యం చేయాలి.

వ్యాస: పెరుమ్మళ్ళు సంతోషంపడతారంటే మేము ఎంతో ఆనందంగా కైంకర్యం చేస్తాము. కైంకర్యం ఎలా చేయాలి నాన్నమా?

బామ్మగారు: మనం కైంకర్యం మన మనస్సుతో (మానసిక కైంకర్యం), మన వాక్కుతో (వాచిక కైంకర్యం), మన శరీరంతో (శరీర కైంకర్యం) చేయవచ్చు. ఆండాళ్ నాచ్చియార్ కూడా, మనం అతడి మహిమలను పాడవచ్చని, ధ్యానించ వచ్చని, పుష్పాలు అర్పించ వచ్చని తమ తిరుప్పావై 5 వ పాశురంలో పాడి చెప్పింది. పెరుమాళ్ళ దివ్య కళ్యాణ గుణాలను స్మరించడం మానసిక కైంకర్యంలోకి వస్తుంది. పెరుమాళ్ళను, వారి భక్తుల మహిమలను కీర్తించడం, పాడటం, మాట్లాడటం, ముఖ్యంగా ఆళ్వార్ల పాశురాలను, పుర్వాచార్యుల స్తోత్రాలను సేవించడం పెరుమాళ్ళకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇవన్నీ వాచిక కైంకర్యంలోకి వస్తాయి. ఆలయ ప్రాంగణాలను, సన్నిధులను శుభ్రం చేయడం, ముగ్గుల వేయడం, పూల దండలతో అలంకరించడం, తిరువారాధనం కోసం గంధాన్ని నూరడం వంటివి శారీరక కైంకర్యంలోకి వస్తాయి. మొదట, మన ఇట్లో పెరుమాళ్ళకు సాధ్యమైనంత కైంకర్యం చేయాలి. మీ లాంటి పిల్లలు చేసిన  కైంకర్యాన్ని పెరుమాళ్ళు ఎంతో ఆనందంగా స్వీకరిస్తారు.

పరాశర: చాలా చక్కగా వివరించారు నాన్నమ్మా. ఇంట్లో మా నాన్నగారు చేసే తిరువారాధనంలో సంతోషంగా పాల్గొంటాము.

బామ్మగారు: మంచిది.

అత్తుళాయ్: నేను వేదవల్లి ముగ్గులు వేసి, పూలల్లి దండలు కడతాము.

బామ్మగారు:  విని చాలా ఆనందం వేస్తుంది అత్తుళాయ్. ఇంకొక ముఖ్య విషయమేమిటంటే, భగవానుడి కంటే భాగవతుల (భక్తుల) సేవ చేయడం ముఖ్యం. ఉదాహరణకు, లక్ష్మణుడు శ్రీ రాముడికి  కైంకర్యాలు చేసాడు, కానీ శత్రుఘ్నుడు రాముడి ప్రియమైన సోదరుడు, భక్తుడైన భరతుడికి కైంకర్యం చేశాడు. అంతేకాకుండా, నమ్మాళ్వార్లు శ్రీకృష్ణుడినే తన ఆహారం, నీరుగా భావించేవారు. కానీ మధుర కవి ఆళ్వార్లు మాత్రం నమ్మాళ్వార్లనే తమ భగవంతునిగా భావించేవారు. ఇది భగవత్ భక్తుల (భాగవతుల) గొప్పతనాన్ని చూపిస్తుంది. కాబట్టి, మనము ఎప్పుడూ వారి భక్తులకు దాసులుగా ఉండాలి.

అత్తుళాయ్: మీరు చెప్పినట్లు తప్పకుండా భగవత్ భక్తులకు (భాగవతులకు) సేవ చేసే ప్రయత్నం చేస్తాము. కానీ భాగవతులను ఎలా సేవించాలి నాన్నమ్మా?

బామ్మగారు: ఎవరైనా భాగవతులు మన ఇంటికి వచ్చినపుడు, వారికి శాష్టాంగ నమస్కారం చేయాలి,  వాళ్ళాని అన్ని సౌకర్యాలు అందజేస్తూ, వాళ్ళకి అవసరమైన సహాయం చేయాలి. మనం పెరుమాళ్ళు, ఆళ్వార్లు, ఆచార్యుల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళు చేసే కైంకర్యాలలో ఏమైన సహాయం అవసరమేమో వినమ్రంగా అడిగి తెలుసుకోవాలి. ఇలాంటి ఎన్నో సేవలు మనం భాగవతులకు చేయవచ్చు.

అత్తుళాయ్: తప్పకుండా నాన్నమ్మా.  దీని గురించి మాకు బాగా అర్థమైంది. అలాంటి అవకాశం ఏదైనా వస్తే వదులుకోము.

(మిగతా ముగ్గురు పిల్లలు కూడా ఒకే సారి “అవును” అని అంటారు)

బామ్మగారు:  పిల్లలూ ఎంతో ఆనందంగా ఉంది.

వేదవల్లి: మీరు చెప్తుంటే వింటూనే ఉండాలనిపిస్తుంది. ఇంకా చెప్పండి నాన్నమ్మ!

బామ్మగారు: కానీ ఇప్పుడు చీకటి పడింది. ఈసారి, మనం ఇంకో విషయం గురించి చర్చించుకుందాం. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్లండి.

పిల్లలు నాన్నమ్మతో చర్చించుకున్న విషయాల గురించి ఆలోచిస్తూ తమ ఇళ్ళకు సంతోషంగా వెళతారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2018/10/beginners-guide-kainkaryam/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – ఉత్తమ అనుష్ఠానాలు

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< బాల పాఠము – అష్ట దిగ్గజులు తదితరులు

పరాశర, వ్యాస, వేదవల్లి, అత్తుళాయ్ అందరు కలిసి బామ్మగారి ఇంటికి వస్తారు.

బామ్మగారు: రండి పిల్లలూ. మీరు చేతులు కాళ్ళు కడుక్కోండి, మీకు పండ్ల ప్రసాదాన్ని ఇస్తాను. ఈ నెలలో విశేషం ఏమిటో  మీకు తెలుసా?

వేదవల్లి: నేను చెప్తాను నాన్నమ్మ. మీరు చెప్పింది నాకు గుర్తుంది. ఇది “శూడి క్కొడుత్త శుడర్కొడి” ఆండాళ్ నాచ్చియార్ పుట్టిన నెల. ఆమె ఆషాడ మాసం పూర్వా ఫాల్గుని నక్షత్రంలో అవతరించింది.

పరాశర: అవును. ఈ నెలలో నాథమునుల మనుమలు ఆళవందార్ల తిరునక్షత్రం కూడా వస్తుంది. వీరు ఆషాడ మాసం ఉత్తర ఆషాడ నక్షత్రంలో అవతరించారు. అవునా నాన్నమ్మా?

బామ్మగారు: బాగా చెప్పావు. ఇప్పటి వరకు మనము ఆళ్వార్లు ఆచార్యుల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు మనం రోజూ ఆచరించవలసిన అనుష్ఠానాల (ఉత్తమ ఆచారాలు) గురించి తెలుసుకుందాము.

అత్తుళాయ్: నాన్నమ్మా, అనుష్ఠానం అంటే ఏంటి?

బామ్మగారు: శాస్త్రం మన మంచి కోసం కొన్ని నియమాలను విధించింది. ఆ నియమాలనే అనుష్ఠానం (ఉత్తమ ఆచరణలు) అని అంటారు. ఉదాహరణకు: ఉదయాన్నే లేచి స్నానం చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక నియమం. తిరుప్పావైలో
ఆండాళ్ నాచ్చియార్ కూడా అన్నారు “నాట్కాలే నీరాడి” అని.

వ్యాస: అవును నాన్నమ్మా, నాకు గుర్తుంది తిరుప్పావై రెండవ పాశురంలో ఉంది.

బామ్మగారు: అవును! ఉదయాన్నే లేచి పెరుమాళ్ళని మనస్సులో స్మరించుకుంటే మన మనస్సులు శుద్ధి అవుతాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఉదయాన్నే స్నానం చేసి, ఊర్ధ్వపుండ్రం పెట్టుకొని, ఉపనయనం అయిన వాళ్ళు సంధ్యావందనం, అన్య రోజువారీ కర్మానుష్ఠానాలు చేయాలి.

వ్యాస పరాశరులు: నాన్నమ్మా, మేము నిత్య కర్మానుష్ఠానాలు క్రమం తప్పకుండా చేస్తాము.

బామ్మగారు: సంతోషం పిల్లలూ!

వేదవల్లి: ఆనందంగా ఊర్ధ్వపుండ్రాలు కూడా ధరించాము. ఊర్ధ్వపుండ్రాలు ధరించడంలో ఉన్న ప్రాముఖ్యత గురించి చెప్పండి నాన్నమ్మా! చాలా వినాలని ఉంది.

బామ్మగారు: సరే, వినండి. ‘తిరుమన్ కాప్పు’ – కాప్పు అంటే రక్షణ అని అర్థం. పిరాట్టి  పెరుమాళ్ళు, మనతో ఉన్నట్టు, మనల్ని ఎప్పుడూ రక్షింస్తున్నట్టు అర్థం. తిరుమన్ కాప్పు ధరిస్తే, మనం పెరుమాళ్ళ భక్తులమని స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి మనము తిరుమన్ కాప్పుని గర్వంగా ధరించాలి.

వేదవల్లి: ఊర్ధ్వపుండ్రాల ప్రాముఖ్యత గురించి అర్థం చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది.

పిల్లలందరూ ఒకే సారి: అవును నాన్నమ్మా.

బామ్మగారు: చాలా మంచిది పిల్లలూ. అదే విధంగా, మన మంచి కోసం శాస్తం మనకి అనేక ఇతర నియమాలను విధించింది. వాటిలో కొన్ని ఇప్పుడు మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి. తినడానికి ముందు, తరువాత మన చేతులూ కాళ్ళు కడుక్కోవాలి. ఎందుకంటే మనం పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యము బాగుంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, పెరుమాళ్ళకి నివేదించిన ప్రసాదాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇలా చేయడం ఎంతో అవసరం. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన స్వభావం ఉంటుంది. పెరుమాళ్ళ ప్రసాదాన్ని తింటే, వారి కృపతో మనలో సత్వ గుణాలు అభివృద్ధి చెందుతాయి.

పరాశర: మా ఇంటిలో, నా అమ్మ ప్రసాదం సిద్ధం చేస్తుంది, నాన్నగారు దేవుడికి నివేదన చేస్తారు. పెరుమాళ్ళ తీర్థం తీసుకున్న తరువాత మాత్రమే ప్రసాదాన్ని తింటాము.

బామ్మగారు: మంచి అలవాటు.

నలుగురూ నవ్వు ముఖంతో సరే అంటారు. 😊

బామ్మగారు: ఇంకా, కొన్ని ఆళ్వార్ల కొన్ని పాశురాలను పఠించిన తరువాత మాత్రమే ప్రసాదం తీసుకోవాలి. పెరుమాళ్ళకు నివేదించినది మన కడుపుకి ఆహారం. మన నాలుకకు ఏమిటి ఆహారం?

అత్తుళాయ్: నాలుకకి ఆహారమా! అంటే ఏమిటి నాన్నమ్మా?

బామ్మగారు: పెరుమాళ్ళ దివ్య నామ జపం మన జిహ్వకి (నాలుకకి) ఆహారం. నమ్మాళ్వార్లను దేవుడిగా భావించేవారు మధురకవి ఆళ్వార్లు. తమ కణ్ణునుణ్ శిఱుత్తాంబులో కురుగూర్ నంబి (నమ్మాళ్వార్ల నామాలలో ఒకటి) అన్నప్పుడల్లా నాలుకపై తేనె పోసినట్టుగా ఉంటుందని మధురకవి ఆళ్వార్లు అనేవారు.

నమ్మాళ్వార్లు – మధురకవి ఆళ్వార్లు

వేదవల్లి: నాన్నమ్మా, మధురకవి ఆళ్వార్లకు నమ్మాళ్వార్ల పట్ల ఉన్న భక్తి గురించి మీరు చెప్పినప్పుడు మా గుండెను కరిగించివేసింది. ఇప్పడి నుండి కణ్ణునుణ్ శిఱుత్తాంబును పఠించిన తరువాతనే మేము ప్రసాదం తీసుకుంటాము.

బామ్మగారు: బావుంది వేదవల్లి.

వ్యాస: మీరు చెప్తుంటే అలాగే వింటూ ఉండాలని అనిపిస్తుంది. ఇంకా చెప్పండి నాన్నమ్మా.

బామ్మగారు: మరో సారి ఇంకా మాట్లాడుకుందాం. బయట చాలా చీకటి పడుతోంది. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్లండి.

పిల్లలు నాన్నమ్మ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ సంతోషంగా వాళ్ళ ఇండ్లకు వెళ్ళారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2018/08/beginners-guide-anushtanams/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – అష్ట దిగ్గజులు తదితరులు

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

 << బాల పాఠము – అళగియ మణవాళ మామునులు

బామ్మగారు: పిల్లలూ రండి, మనం చర్చించుకున్న విషయాలన్నీ మీకు గుర్తున్నాయని అనుకుంటున్నాను.

పిల్లలందరూ కలిసి ఒకేసారిగా:  నమస్కారం నాన్నమ్మా, అవును గుర్తున్నాయి, అష్ట దిగ్గజుల గురించి తెలుకోడానికి వచ్చాము నాన్నమ్మా.

బామ్మగారు: మంచిది, మొదలు పెడదాం.

పరాశర: నాన్నమ్మా, అష్ట దిగ్గజులు అంటే 8 శిష్యులు. అవునా నాన్నమ్మా?

బామ్మగారు: అవును పరాశర. అష్ట దిగ్గజులు మణవాళ మామునుల ఎనిమిది శిష్యులు. పొన్నడిక్కాల్ జీయర్, కోయిళ్ అణ్ణన్, పతంగి పరవస్తు పట్టర్పిరాన్ జీయర్, తిరువేంకట జీయర్, ఎఱుంబియప్పా, ప్రతివాది భయంకరం అణ్ణన్, అపిళ్ళై, అప్పిళ్ళార్ వారి 8 శిష్యులు. మామునుల తర్వాత మన సంప్రదాయ అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారు.

మణవాళ మామునులకు ‘ప్రాణ సుక్రుత్’ (ప్రాణం కంటే ప్రియమైన) లాంటి వారైన పొన్నడిక్కాల్ జీయర్లతో మొదలుపెడదాం.

ponnadikkal-jiyar

బామ్మగారు: అళగియ వరదర్ గా జన్మించి, వీరు పొన్నడిక్కాల్ జీయర్లుగా ప్రసిద్ధులైయ్యారు.

పరాశర: నాన్నమ్మా, వారిని పొన్నడిక్కాల్ జీయర్ అని ఎందుకు పిలిచేవారు?

బామ్మగారు: పొన్నడిక్కాల్ అంటే మణవాళ మామునుల శిష్య సంపదకి పునాది వేసినవారు అని అర్ధం. ఎంతోమంది ఆచార్యులు మామునులను ఆశ్రయించేందుకు పొన్నడిక్కాల్ జీయర్ని పురుషకారంగా భావించేవారు.

పొన్నడిక్కాల్ జీయర్కి కూడా అష్ట దిగ్గజులను మణవాళ మామునులు నియమించారు. మణవాళ మామునులు పొన్నడిక్కాల్ జీయర్ని వానమామలై దివ్య దేశానికి వెళ్ళమని నిర్దేశిస్తారు. ఎందుకంటే దేవనాయక పెరుమాళ్ళు (వానమామలై పెరుమాళ్ళు) విశ్వక్సేనుల వారిచే శ్రీముఖాన్ని (దివ్య ఆజ్ఞ) మామునులకు పంపి పొన్నడిక్కాల్ జీయర్ని వానమామలై దివ్య దేశానికి పంపి అక్కడి కైంకర్యాలను చూసుకోమని ఆదేశిస్తారు.

వ్యాస: నాన్నమ్మా, పొన్నడిక్కాల్ జీయర్ దైవనాయక పెరుమాళ్ళకు మామగారు అని విన్నాను. నిజమేనా?

బామ్మగారు: అవును వ్యాస. పొన్నడిక్కాల్ జీయర్లు తిరుమల నుండి నాచియార్ విగ్రహాన్ని తీసుకువచ్చి దేవనాయక పెరుమాళ్ళతో దివ్య కళ్యాణం ఏర్పాటు చేస్తారు. వీరే కన్యాదానం కూడా చేసి, పెరయాళ్వార్లలాగా పొన్నడిక్కాల్ జీయర్ కూడా తనకు మామగారు పెరుమాళ్ళని చాటుతారు.

మణవాళ మామునుల ఆదేశాలను పాఠించి దేశం నలుమూలలకు వెళ్లి మన సంప్రదాయ ప్రచారం చేశారు. చివరికి, వారి ఆచార్యులైన అళగియ మణవాళ మామునుల దివ్య తిరువడిని ధ్యానిస్తూ పొన్నడిక్కాల్ జీయర్ తన చరమ తిరుమేనిని విడిచి పరమపదం పొందుతారు.

మనము కూడా పెరుమాళ్ళు, ఆచార్యులపైన భక్తి ప్రపత్తులు పెరగాలని పొన్నడిక్కాల్ జీయర్ల దివ్య తిరువడిని ప్రార్థన చేద్దాం.

బామ్మగారు: ఇప్పుడు ‘కోయిల్ అణ్ణన్’ గురించి చెప్పుకుందాం. మణవాళ మామునుల ప్రియ శిష్యులలో వీరు ఒకరు. అష్ట దిగ్గజులలో ఒకరు. కోయిల్ అణ్ణన్ జీవితంలో ఆసక్తికరమైన సంఘటన ఒకటి జరిగి మణవాళ మామునుల ఆశ్రయించాల్సి వస్తుంది.

koilannan

పరాశర: నాన్నమ్మా, ఏమిటది?

బామ్మగారు: ముదలియాండాన్ లాంటి గొప్ప వంశంలో జన్మించి, వీరు మణవాళ మామునులను ఆశ్రయించాలనుకోలేదు. ఈ ఘట్టం వీరిని మణవాళ మామునుల తిరువడి వద్దకు చేర్చింది. కోయిల్ అణ్ణన్ తమ శిష్యులతో శ్రీరంగంలో ఉండేవారు. శ్రీభాష్యకారులు (శ్రీ రామానుజులు) కోయిల్ అణ్ణన్ ని మణవాళ మామునులను ఆశ్రయించమని ఆజ్ఞాపించారని మనందరికీ తెలుసు. శ్రీ రామానుజులు కోయిల్ అణ్ణన్ వారికి మార్గనిర్దేశం చేస్తూ ముదలియాండాన్లతో తన సంబంధాన్ని బలపరచుకోమని అంటారు.

తాను ఆదిశేషుడినని, మరలా మణవాళ మామునులుగా తిరిగి వచ్చారని, తనతో పాటు తన బంధువులందరినీ మణవాళ మామునుల తిరువడి సంబంధం పొందమని ఎంబెరుమానార్లు తెలుపుతారు. పిల్లలు గమనించండి, ఇదంతా వారి స్వప్నంలో జరుగుతుంది. తరువాత అణ్ణన్ మేలుకొని ఆశ్చర్యపోయి తన సోదరులకు ఈ స్వప్నం గురించి వివరిస్తారు.

కందాడై ఆచార్యపురుషులతో కలిసి అణ్ణన్ జీయర్ మఠానికి వెళ్ళి మణవాళ మామునులను ఆశ్రయిస్తారు. మణవాళ మామునులు వానమామలై (పొన్నడిక్కాల్) జీయర్ని పంచ సంస్కారం కోసం అవసరమైన సామగ్రిని సిద్ధం చేయమని నిర్దేశిస్తారు.

పిల్లలూ, మణవాళ మామునులకు అతి ప్రియమైనవారు కోయిల్ కందాడై అణ్ణన్ల చరిత్ర గురించి కొన్ని అంశాలను చూశాము. వీరికున్న అచార్యాభిమానంలో కొంత మనము కూడా పొందాలని కోరుకుంటూ వారి దివ్య తిరువడిని ప్రార్థన చేద్దాము.

ఇప్పుడు నేను ‘మోర్ మున్నార్ అయ్యర్’ (పరవస్తు పట్టర్పిరాన్ జీయర్) గురించి చెప్తాను. మణవాళ మామునుల అష్ట దిగ్గజులలో ఒకరైన వీరు, తమ ఆచార్యులను ఎప్పుడూ విడవకుండా ఉండేవారు. ఎంబెరుమానార్లతో ఎంబార్ ఉన్నట్టుగా, వీరు ఎప్పుడూ మణవాళ మామునులతోనే ఉండేవారు.

OLYMPUS DIGITAL CAMERA

వేదవల్లి: నాన్నమ్మా, వారిని ‘మోర్ మున్నార్ అయ్యర్’ అని ఎందుకు  పిలిచేవారు?

బామ్మగారు: ఆసక్తికరమైనదిగా ఉంది కదూ.  ప్రతిరోజూ, వీరు మణవాళ మామునుల శేష ప్రసాదాన్ని తినేవారు. మణవాళ మామునులు పెరుగన్నంతో ముగించిన ఆ అరటి ఆకులోనే పరవస్తు పట్టర్పిరాన్ జీయర్ వారు తమ ఆచార్యుల శేష ప్రసాదం రుచి మారనివ్వకుండా అలాగే పెరుగన్న ప్రసాదంతో మొదలుపెట్టి  పప్పన్నంలోకి వచ్చేవారు. అందుకని వీరు “మోర్ మున్నార్ అయ్యర్” గా ప్రసిద్ధులైయ్యారు.

వీరు మణవాళ మామునుల నుండి శాస్త్రార్థాలను నేర్చుకుని, వారికి నిత్యం సేవలు అందిస్తుండేవారు. మణవాళ మామునులు పరమపదించిన తరువాత, పట్టర్పిరాన్ జీయర్ తిరుమలలో స్థిరపడి, అక్కడి స్థానికులెందరినో ఉద్దరించారు. మణవాళ మామునులకు ప్రియమైన వీరు గొప్ప విద్వాంసులు. ఆచార్య నిష్ఠకు పరాకాష్ట అయిన వీరు గురుపరంపర గురించి, మన పూర్వాచార్యులు వాళ్ళ ఆచార్యులపై ఎంతగా ఆధారపడి ఉండేవారో తెలియజేస్తూ  ‘అంతిమోపాయ నిష్ఠ’ అనే గ్రంథాన్ని వ్రాశారు.

eRumbiappA-kAnchi

బామ్మగారు: పిల్లలూ. ఇప్పుడు నేను ఎఱుంబి అప్పా గురించి చెప్తాను. వారి అసలు పేరు దేవరాజు. వారి గ్రామంలో తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటున్న రోజుల్లో మణవాళ మామునుల గురించి విని వారిని కలుసు కోవాలనుకుంటారు. ఎఱుంబి అప్పా కొంతకాలం మణవాళ మామునులతో ఉండి రహస్య గ్రంథాల గురించి నేర్చుకొని చివరికి తమ గ్రామానికి తిరిగి వెళ్లి అక్కడ కైంకర్యాన్ని కొనసాగిస్తారు.

తమ ఆచార్యుడిని నిరంతరం ధ్యానిస్తూ, మణవాళ మామునుల రోజువారీ దినచర్యలను వివరిస్తూ పూర్వ ఉత్తర దినచర్యలను వ్రాసి, ఒక శ్రీ వైష్ణవుని ద్వారా మణవాళ మామునులకు పంపుతారు. మణవాళ మామునులు ఎఱుంబి అప్పా నిష్టకి మెచ్చి, ఎరుంబి అప్పాని మఠానికి రమ్మని ఆహ్వానిస్తారు.

వ్యాస: నాన్నమ్మా, పట్టర్పిరాన్ జీయర్, పొన్నడిక్కాల్ జీయర్ లాగా ఎఱుంబి అప్పాకి కూడా తమ ఆచర్యులంటే భక్తి ఉంది కదా నాన్నమ్మా?

బామ్మగారు:  అవును వ్యాస. ఎఱుంబి అప్పా అత్యంత ముఖ్యమైన రచనలలో ఒకటి “విళక్షణ మోక్ష అధికారి నిర్ణయం”.  ఎఱుంబి అప్పా వారికి,  తమ శిష్యులలో ఒకరైన సేనాధిపతి ఆళ్వన్ మధ్య జరిగిన సంభాషణల సంగ్రహమే ఈ గ్రంథం.

వేదవల్లి: నాన్నమ్మా, ‘విళక్షణ మోక్ష అధికారి నిర్ణయం’ అంటే ఏమిటి?

బామ్మగారు: ఈ గ్రంథం మన ఆళ్వారులు / ఆచార్యుల శ్రీసూక్తులను తప్పుగా అర్థం చేసుకుని అపార్థాలకు దారితీసే సందేహాలను వివరిస్తుంది. ఎఱుంబి అప్పా తమ బోధనలలో ఈ సంసారం నుండి వైరాగ్య ప్రాముఖ్యతను, పూర్వాచార్యుల జ్ఞాన అనుష్ఠానాలపైన ప్రీతిని గురించి తెలిపి, ఎలా ఆచారణలో పెట్టాలో కూడా మనకు మార్గనిర్దేశం చేశారు.

మణవాళ మామునులను ఎల్లప్పుడూ స్మరణలో ఉంచుకున్న ఎఱుంబి అప్పాని మనం స్మరించుకుందాం.

బామ్మగారు: పిల్లలూ, ఇప్పుడు ప్రతివాది భయంకరం అణ్ణా గురించి చెప్పుకుందాం. వేదాంతాచార్యులచే ఆశీర్వదించబడిన  వీరు హస్తిగిరినాథుడిగా జన్మించి, తమ  జీవిత ప్రారంభ కాలంలో కంచీపురంలో నివసించిన గొప్ప విద్వాంసులు.  ఇతర సాంప్రదాయ పండితులపై, అనేక విద్వాంసులపై చర్చలో గెలిచిన వారు వీరు.

pb-annan-kanchi

తరువాత తిరుమలలో ఉంటూ శ్రీవేంకటేశ్వరుడికి సేవలు అందిస్తున్న రోజుల్లో, మణవాళ మామునుల మహిమ గురించి విని, వారిని ఆశ్రయించాలనే ఉద్దేశ్యంతో శ్రీరంగంలోని మామునుల మఠాన్ని చేరుకుంటారు. ఆదే సమయంలో మణవాళ మామునులు కాలక్షేపం చేస్తుండగా విని, మణవాళ మామునులకు శాస్త్ర జ్ఞానంలో ఉన్న పటుత్వాన్ని అర్థం చేసుకొని, వారికి శరణాగతి చేసి శిష్యులౌతారు.

వీరు ఎంబెరుమానార్లను, మణవాళ మామునులను కీర్తిస్తూ అనేక గ్రంథాలను వ్రాసారు. తమ ఆచార్యులైన మణవాళ మామునుల ఆనందం కోసం, అత్యంత ప్రజాదరణ పొందిన వెంకటేశ సుప్రభాతం, వెంకటేశ ప్రపత్తి మొదలైనవి తిరువెంకటేశ్వరుడికి సమర్పించారు.

బామ్మగారు: పిల్లలూ,  చివరిగా మనం అప్పిళ్ళై, అప్పిళ్ళార్ గురించి చర్చించుకుందాం. వారి గురించి ఎక్కువ వివరాలు మనకు అందుబాటులో లేవు. వీరు కూడా మణవాళ మామునులకు అతి ప్రియమైన శిష్యులు, అష్ట దిగ్గజులలో ఒకరైనారు. వారిరువురు ఉత్తర భారతదేశంలో అనేక పండితులపై గెలిచన గొప్ప విద్వాంసులు.

appiLLaiappiLLAr

వీళ్ళు మణవాళ మామునుల కీర్తి గురించి విన్నారు కానీ అంతగా ఆసక్తి చూపేవారు కాదు. కందాడై అణ్ణన్, ఎఱుంబి అప్పా వంటి మహానుభావులు మణవాళ మామునుల తిరువడి సంబంధం పొందారని తెలుసుకొని, కొద్ది కాలంలోనే మణవాళ మామునులను ఆశ్రయిస్తారు.

మణవాళ మామునులు అప్పిళ్ళార్, అప్పిళ్ళైలద్దరికీ  పంచ సంస్కారం చేస్తారు.

అప్పిళ్ళార్లకు జీయర్ మఠంలో తదీయారాదనం కైంకర్య బాధ్యతను అప్పగిస్తారు. ఎలాగైతే కిడాంబి ఆచ్చాన్ మఠం బాధ్యతలతో పాటు ఎంబెరుమానార్లను సేవించారో అలాగే, మణవాళ మామునులకు అప్పిళ్ళార్ సేవలు అందించేవారు.

అప్పిళ్ళై మణవాళ మామునుల దివ్య సూచనలను అనుసరిస్తూ తిరువందాదులకు వ్యాఖ్యానాలు వ్రాసి, అనేక దివ్య ప్రబంధ సంబంధమైన కైంకర్యాలలో మణవాళ మామునులకు సహాయం అందించారు.

మణవాళ మామునుల చివరి రోజులల్లో, అప్పిళ్ళార్ తమ తిరువారారాధనం కోసం అర్చా విగ్రహాన్ని ప్రసాదించమని కోరతారు.  మణవాళ మామునులు నిత్యం ఉపయోగించే ఒక చెంబుని వారికి ఇచ్చి, ఆ చెంబును కరిగించి రెండు విగ్రహాలు తయారు చేయమని ఆదేశిస్తారు. చెరి ఒకటి మణవాళ మామునుల విగ్రహాన్ని తమ తిరువారారాధనం కోసం తీసుకుంటారు.

పిల్లలూ, వీరికున్న అచార్యాభిమానంలో కొంత శాతం మనము కూడా రావాలని కోరుకుంటూ వారి దివ్య  తిరువాడికి ప్రార్థన చేద్దాము.

పిల్లలు ఇప్పటి వరకు మనం మణవాళ మామునుల గురించి, వారి అష్ట దిగ్గజుల మహిమ గురించి తెలుసుకొఉన్నాము.

పరాశర: ఈ రోజు మనం చాలా నేర్చుకున్నాము నాన్నమ్మా.

బామ్మగారు: అవును. నేను ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం అందరికి చెప్తాను. జాగ్రత్తగా వినండి.

మణవాళ మామునుల కాలం తర్వాత అనేక ఆచార్యులు పట్టణాలలో, గ్రామాలలో భక్తులను అనుగ్రహిస్తూ వచ్చారు. ఆచార్యలు దివ్య దేశాలలో, అభిమాన స్థలాలలో, ఆళ్వార్ / ఆచార్య అవతార స్థలాలలో, ఇతర క్షేత్రాలలో నివసించి జ్ఞాన, భక్తి ప్రపత్తులను అందరిలో పెంచే  ప్రయత్నము చేస్తూనే వస్తున్నారు.

తిరుమళిశై అణ్ణవప్పంగార్, మొదటి శ్రీపెరుంబుతూర్ ఎంబార్ జీయర్  ఇటీవలి కాలం (200 సంవత్సరాల క్రితం) వారు. వారి గ్రంథాలు, కైంకర్యాల ద్వారా మన సంప్రదాయానికి గణనీయంగా దోహదపడ్డారు.

నేను మీతో పంచుకున్న జ్ఞానమంతా ఈ పరంపర ఆచార్యుల ద్వారా పొందినదే. ఎప్పుడూ వీరికి కృతజ్ఞతతో ఉండాలి. మీరందరి  సమయం ఆనందంగా గడిచిందని ఆశిస్తున్నాను. మన మనస్సు, బుద్ధి, శరీరం ఇటువంటి ఆచార్యులు, ఆళ్వారులు, ఎంబెరుమానార్ల కైంకర్యంలో ఉపయోగించాలి.

సరే,  చీకటి పడింది. మనం ఆచార్యుల గురించి ఆలోచిస్తూ నేటికి ముగిద్దాం.

పిల్లలు:  ధన్యవాదాలు నాన్నమ్మా.

మూలము : http://pillai.koyil.org/index.php/2018/07/beginners-guide-ashta-dhik-gajas-and-others/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – తిరువాయ్మోళి పిళ్ళై

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

  శ్రీ వైష్ణవం – బాల పాఠము

<<బాల పాఠము – పిళ్ళై లోకాచార్యుల శిష్యులు

పిళ్ళై లోకాచార్యుల శిష్యుల గురించి ఇంకా తెలుసుకోడానికి పిల్లలందరూ కలిసి ఆండాళమ్మ ఇంకిటి వచ్చారు. ఆవిడ వంట చేస్తూ ఒక చిరునవ్వు నవ్వారు. వంట ముగించుకొని శ్రీరంగనాథుడి ప్రసాదాన్ని పిల్లలకు పంచిపెట్టారు.

బామ్మగారు: పిల్లలూ లోపలికి రండి, పెరుమాళ్ళ ప్రసాదం తీసుకోండి. మనం చర్చించుకున్న విషయాలు మీకు గుర్తున్నాయి కదా? 

వ్యాస: నాన్నమ్మా, మనం కూరకుళోత్తమ దాసు, విళాంచోళ్ళై పిళ్ళై  గురించి చెప్పుకున్నాము. ఇంకా “ఆచార్య అభిమానమే ఉత్తారకం” గురించి కూడా నేర్చుకున్నాము.

బామ్మగారు: పిల్లలూ, మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ రోజు పిళ్ళై లోకాచార్యుల శిష్యులలో మరొకరు ‘తిరుమలై ఆళ్వార్’ గురించి తెలుసుకుందాము.

అత్తుళాయ్: నాన్నమ్మా, తిరుమలై ఆళ్వార్ అనే పేరు, వీరికి ఆళ్వార్ల తిరువాయ్మోళిపై ఉన్న మహాప్రీతి వల్ల వచ్చిందని నేను విన్నాను. నిజమేనా నాన్నమ్మా!

బామ్మగారు: అవును అత్తుళాయ్. వీరిని శ్రీశైలేశ, శఠకోప దాసు, ముఖ్యంగా తిరువాయ్మోళి పిళ్ళై అని పిలిచేవారు. నమ్మాళ్వార్ల పట్ల, వారి తిరువాయ్మోళి పట్ల ఉన్న భక్తి కారణంగా వీరికి ఈ పేరు వచ్చింది. తిరుమలై ఆళ్వార్లకు చిన్న  వయస్సులోనే పిళ్ళై లోకాచార్యుల తిరుహస్థాలతో పంచ సంస్కారం జరిగింది.  కాని కొంతకాలం తర్వాత, మన సంప్రదాయానికి దూరమై పోయి మధుర రాజ్యానికి ప్రధాన సలహాదారుడిగా సేవ చేయసాగారు.

వ్యాస: తిరుమలై ఆళ్వార్లను మళ్లీ సంప్రాదయాంలోకి ఎవరు తీసుకువచ్చారు నాన్నమ్మా?

బామ్మగారు: పిల్లలు, మీ ఆసక్తికి మిమ్మల్ని నేను మెచ్చుకోవాలి. పిళ్ళై లోకాచార్యులు తమ చివరి రోజులలో, 
కూరకుళోత్తమ దాసులతో పాటు మరికొందరు శిష్యులను పిలిచి తిరుమలై ఆళ్వార్లను సంస్కరించి మరలా సంప్రదాయంలోకి తీసుకురమ్మని నిర్దేశిస్తారు.

వేదవల్లి: నాన్నమ్మా, అయితే కూరకుళోత్తమ దాసులు ఏమి చేశారు? 

బామ్మగారు: సరే, ఒకసారి తిరుమలై ఆళ్వార్లు యదావిధిగా తమ పల్లకీలో వెళుతున్నారు. కూరకుళోత్తమ దాసు ‘తిరువిరుత్తం’ పఠిస్తుండగా వింటారు. పిళ్ళై లోకాచార్యుల తిరువడి సంబంధం వీరికి ముందే ఉన్నందున, కూరకుళోత్తమ దాసుల గొప్పతనాన్ని అర్ధం చేసుకోగలుగుతారు. తిరుమలై ఆళ్వార్లు పల్లకీ నుంచి క్రిందకు దిగి ‘తిరువిరుత్తం’ ప్రబంధ అర్ధాలను బోధించమని కూరకుళోత్తమ దాసులను వేడుకుంటారు. 

పరాశర: నాన్నమ్మా, కూరకుళోత్తమ దాసుల నుండి తిరుమలై ఆళ్వార్లు ఎలా నేర్చుకున్నారో చెప్పరా!

బామ్మగారు: కూరకుళోత్తమ దాసులు రాజభవనానికి వచ్చి తిరుమలై ఆళ్వార్లకు పాటాలు చెప్తుండేవారు. తిరుమలై ఆళ్వార్లు ఊర్ధ్వ పుండ్రం ధరించేటప్పుడు పిళ్ళై లోకాచార్యుల తనియన్ సేవించడం చూసి ఆనందిస్తారు. రాజకార్యాలలో వ్యస్థులై ఉండటం కారణంగా పాటాలకు హాజరు కాలేకపోతుంటారు. తిరుమలై ఆళ్వార్లు క్షమాపణ కోరగా, కూరకుళోత్తమ దాసులు వారిని క్షమించి తమ శేష ప్రసాదాన్ని వారికిస్తారు. ఆ ప్రసాదం స్వీకరించినప్పడి నుండి తిరుమలై ఆళ్వార్లు పరివర్తనం చెంది, పూర్తిగా భౌతిక విషయాలను విడిచి, రాజ్య భారాన్ని యువరాజుకి అప్పగించి రాజ్యాన్ని వదిలి పెట్టేస్తారు.

కూరకుళోత్తమ దాసులు తమ ఆఖరి రోజులల్లో,  తిరుమలై ఆళ్వార్లను తిరుక్కణ్ణంగుడి పిళ్ళై వద్ద తిరువాయ్మోళిని వివరంగా నేర్చుకోమని నిర్దేశిస్తారు. తరువాత, రహస్య అర్థాలను విళాంచోళై పిళ్ళై వద్ద నేర్చుకుంటారు. తిరుమలై ఆళ్వార్లను సంప్రదాయ ప్రవర్తకుడిగా నియమించి కూరకుళోత్తమ దాసుల తమ పరమపదం చేరుకుంటారు. పిళ్ళై లోకాచార్యులను ధ్యానిస్తూ తిరుమలై ఆళ్వార్లు కూరకుళోత్తమ దాసుల చరమ కైంకర్యాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.

వ్యాస: నాన్నమ్మా, ఆ పైన తిరుమలై ఆళ్వార్లు మన సంప్రాదయాన్ని నడిపించారా?

బామ్మగారు: కాదు వ్యాస. తిరుక్కణ్ణంగుడి పిళ్ళై వద్దకు తిరుమలై ఆళ్వార్లు వెళ్లి తిరువాయ్మోళి నేర్చుకోవడం ప్రారంభించారు. వీరు పాశురార్థాలను ఇంకా లోతుగా తెలుసుకోవాలని ఆశిస్తారు. అందుకని, పిళ్ళై వీరిని తిరుప్పుట్కుళి జీయర్ వద్దకు పంపుతారు. దురదృష్టవశాత్తు వీరు అక్కడికి చేరికునే ముందే జీయర్ పరమపదం చేరుకుంటారు. తిరుమలై ఆళ్వార్లు ఎంతో నిరాశ చెంది, మనస్సు బాగోలేక దేవ పెరుమాళ్ళకు మంగళాశాసనం చేసుకోవాలని అనుకుంటారు.

పరాశర: నాన్నమ్మా, రామానుజులు ఆలవందార్ల వద్దకు చేరుకునే ముందే వారు పరమపదించినట్టుగా ఉంది ఈ సంఘటన కూడా, అవునా నాన్నమ్మా?

బామ్మగారు: అవును పరాశర, వీరు దేవ పెరుమాళ్ళకు మంగళాశాసనం చేయటానికి కంచి చేరుకున్నారు; అక్కడ అందరూ వీరిని స్వాగతిస్తారు. దేవ పెరుమాళ్ళు శఠకోపంతో, మాలలతో, చందనంతో ఆశీర్వదిస్తారు. తిరుమలై ఆళ్వార్లు తిరుప్పుట్కుళి జీయర్ ను కలుకోకపోయినా, తిరువాయ్మోళి ఈడు వ్యాఖ్యానంతో పాటు అరుళిచ్చెయల్ (దివ్య ప్రబంధం) అర్థాలను కూడా ఉపశించమని నాలూర్ పిళ్ళైని దేవ పెరుమాళ్ళు ఆదేశిస్తారు.

నాలూర్ పిళ్ళై ఎంతో సంతోషిస్తారు, కానీ వయోవృద్దులు కావడంతో తిరుమలై ఆళ్వార్లకు బోధించలేనేమోనని భావించి, నాలూర్ పిళ్ళై పుత్రుడు నాలూర్ ఆచ్చాన్ పిళ్ళైని దేవ పెరుమాళ్ళు ఆదేశిస్తారు. ఈ దివ్య ఆజ్ఞ వినగానే, నాలూర్ పిళ్ళై  ఎంతో సంతోషంగా తిరుమలై ఆళ్వార్లను తన పుత్రుడు నాలూర్ వాచ్చాన్ పిళ్ళై వద్దకు తీసుకువచ్చి ఈడుతో పాటు అరుళిచ్చెయల్ అర్థాలను కూడా బోధించమని చెప్తారు. తిరునారాయణపురత్తు ఆయీ, తిరునారాయణపురత్తు పిళ్ళై ఈ విషయం గురించి తెలుసుకొని నాలూర్ వాచ్చాన్ పిళ్ళై తిరుమలై ఆళ్వార్లను ఇద్దరినీ తిరునారాయణపురానికి వచ్చి అక్కడే ఉండి కాలక్షేపం కొనసాగించుకోమని విన్నపించుకుంటారు. అలాగైతే తాము కూడా నేర్చుకోగలమని ప్రార్థిస్తారు. వారి ఆహ్వానాన్ని స్వీకరించి వారిరువురు తిరునారాయణపురంలో కాలక్షేపాన్ని కొనసాగిస్తారు. అక్కడ తిరుమలై ఆళ్వార్లు వివరంగా ఈడు ని లోతైన అర్థాలతో నేర్చుకుంటారు. తిరుమలై ఆళ్వార్ల సేవా భావానికి మెచ్చుకుని నాలూర్ ఆచ్చాన్ పిళ్ళై తమ తిరువారాధన పెరుమాళ్ళను తిరుమలై ఆళ్వార్లకు ప్రసాదిస్తారు. అలా, ఈడు 36000 పడి నాలూర్ ఆచ్చాన్ పిళ్ళై నుండి ముగ్గురు విద్వానులు – తిరుమలై ఆళ్వారు, తిరునారాయణపురత్తు ఆయీ, తిరునారాయణపురత్తు పిళ్ళై ద్వారా ప్రచారంలోకి వచ్చింది. ఆ తరువాత తిరుమలై ఆళ్వార్లు ఆళ్వార్తిరునగరికి వెళ్లి అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంటారు.

వ్యాస: ఆళ్వార్తిరునగరి నమ్మాల్వార్ల జన్మ స్థలం కదా నాన్నమ్మా? ఆళ్వార్తిరునగరి అతి దీనస్థితిలో ఉన్నప్పుడు తిరుమలై ఆళ్వార్లు పునరుద్ధరించారని నేను విన్నాను. మాకు ఆ చరిత్ర గురించి చెప్పండి నాన్నమ్మా?

బామ్మగారు: అవును వ్యాస. తిరుమలై ఆళ్వార్లు ఆళ్వార్తిరునగరికి వచ్చినప్పుడు, అది ఒక అడవిలా ఉండేది. ముస్లింల దండయాత్రల రోజుల్లో, నమ్మాళ్వార్లు ఆళ్వార్తిరునగారిని వదిలి కర్ణాటక / కేరళ సరిహద్దుల్లోకి వెళ్ళిపోతారు. ఎంతో కృషిచేసి  తిరుమలై ఆళ్వార్లు ఆ పట్టాణాన్ని, ఆలయాన్ని పునర్నిర్మించి. ఆలయ విధులను తిరిగి స్థాపించారు. మధురై రాజుల పరిపాలన సహాయంతో తిరుమలై ఆళ్వార్లు మరలా నమ్మాళ్వార్లను తిరిగి ఆళ్వార్తిరునగరికి తీసుకువస్తారు. వీరికి నమ్మాళ్వార్లన్నా, తిరువాయ్మోళి అన్నా మహా ప్రీతి చూపించేవారు. నిత్యం తిరువాయ్మోళిని పాటించేవారు, అందువల్ల వీరిని తిరువాయ్మోళి పిళ్ళై అని పిలిచేవారు. వీరు భావిష్యదాచార్య (ఎంబెరుమానార్లు) విగ్రహాన్ని తవ్వితీసి, తిరునగరికి పశ్చిమ భాగంలో, ప్రత్యేకంగా ఎంబెరుమానార్ల కోసం ఆలయాన్ని, ఆ ఆలయం చుట్టూ నాలుగు మాడవీధులని కట్టిస్తారు. ఆలయ సంరక్షణ కోసం రక్షకభటులను కూడా నియమించి అన్ని ఏర్పాట్లను కట్టుదిట్టం చేయుస్తారు. ఈ వేళ మనం చూస్తున్న ఈ ఆళ్వార్తిరునగరిని వీరు లేకుండా ఊహించుకోలేము. 

Image result for manavala mamuni

తిరువాయ్మోళి పిళ్ళై గురించి విని, అళగియ మణవాళన్ (మణవాళ మాముని సన్యాసాశ్రమానికి ముందు) ఆళ్వార్తిరునగరికి వెళ్లి, పిళ్ళై వారికి శిష్యులు అయ్యి వారికి సేవ చేసుకుంటూ అరుళిచ్చెయల్ అర్ధాలతో నేర్చుకుంటారు. తిరువాయ్మోళి పిళ్ళై తమ చివరి రోజులల్లో, తన తరువాత సంప్రదాయ ఆచార్యులు ఎవరని చింతిస్తుండగా అళగియ మణవాళన్ ఆ బాధ్యతను తాను తీసుకుంటానని మాట ఇస్తారు. ఆ మాటకి తిరువాయ్మోళి పిళ్ళై సంతోషించి, అళగియ మణవాళన్ను శ్రీభాష్యం నేర్చుకొని, తమ పూర్తి దృష్టి తిరువాయ్మోళిపైన, తిరువాయ్మోళి వ్యాఖ్యానాలపై పెట్టమని నిర్దేశిస్తారు. ఆ తరువాత తిరువాయ్మోళి పిళ్ళై పరమపదానికి చేరుకుంటారు, అళగియ మణవాళన్ వారి చరమ కైంకర్యాలను పూర్తి చేస్తారు.

తిరువాయ్మోళి పిళ్ళై తమ జీవితం మొత్తం నమ్మాళ్వార్లకి, తిరువాయ్మోళికి అంకితం చేశారు. వీరి కృషి వల్లనే మనకు ఈడు 36000 పడి వ్యాఖ్యానం అందింది, అళగియ మణవాళన్ చేత ప్రచారం చేయబడింది. కాబట్టి పిల్లలూ, ఎంబెరుమానార్లు పూర్వాచార్యులపై వారికున్న భక్తి ప్రపత్తులను మనకు కూడా ప్రాసాదించమని తిరువాయ్మోళి పిళ్ళై తిరువాడిని ప్రార్థిద్దాం.

పిల్లలందరు తిరువాయ్మోళి పిళ్ళైల గురించి చర్చించుకుంటూ ఇళ్ళకు వెళతారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2018/05/beginners-guide-thiruvaimozhip-pillai/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org


బాల పాఠము – అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

 శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< బాల పాఠము – తిరువాయ్మోళి పిళ్ళై

మణవాళ మామునుల గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా వచ్చారు పిల్లలు. ఆండళమ్మ పిల్లల్ని లోపలికి వచ్చి కూర్చోమన్నారు.

నాన్నమ్మ: పిల్లలూ, వేసవి సెలవులు ఎలా గడిపారు?

పరాశర: నాన్నమ్మా, సెలవులు బాగా గడిచాయి. ఇప్పుడు మణవాళ మామునుల గురించి  వినాలని వచ్చాము. వారి గురించి మాకు చెప్పరా?

బామ్మగారు: సరే పిల్లలు! వినండి. వీరు ఆళ్వార్తిరునగరిలో తిగళక్కిడందాన్ తిరునావీరుడైయ పిరాన్ శ్రీ రంగ నాచియార్ దంపతులకు ఆదిశేషుని అవతారంగా, యతిరాజుల పునరావతారంగా జన్మించారు. వీరికి అళగియ మణవాళన్ (అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ అని కూడా) పేరు పెట్టారు. అన్ని సామాన్య శాస్త్రాలు, వేదాధ్యయనం తమ తండ్రి నుండి నేర్చుకున్నారు.

వ్యాస: నాన్నమ్మా, తిరువాయ్మోళి పిళ్ళై వీరి ఆచార్యులు కాదా?

బామ్మగారు: అవును వ్యాస, తిరువాయ్మోళి పిళ్ళై మహిమ గురించి విని, వారికి శరణాగతులౌతారు. వీరు అరుళిచ్చెయల్ (దివ్య ప్రబంధం)లో, ప్రత్యేకించి తిరువాయ్మోళి ఈడు 36000 పడి వ్యాఖ్యానంలో నైపుణ్యం సాధిస్తారు. వీరు శ్రీ రామానుజులపై భక్తితో  ఆళ్వార్తిరునగరిలోని భవిష్యదాచార్యల సన్నిధి కైంకర్యం కూడా చేశారు. యతీంద్రుల (శ్రీరామానుజుల) పట్ల వీరికున్న ఎనలేని భక్తి ప్రపత్తుల వల్లనే వీరిని అందరు ప్రేమతో “యతీంద్ర ప్రవణ” అని పిలిచేవారు.

తరువాత, తమ ఆచార్యుల నియమనం జ్ఞాపకం చేసుకొని, మన సంప్రదాయ ప్రచారం కోసం శ్రీరంగంలో ఉంటారు. శ్రీరంగం వెళ్ళాక అక్కడ సన్యాసాశ్రమం స్వీకరించి, ‘అళగియ మణవాళ మాముని’, ‘పెరియ జీయర్’ అని ప్రసిద్దులైనారు.

వీరు ముమ్ముక్షుప్పడి, తత్వ త్రయం, వేదం, వేదాంతం, ఇతిహాస, పురాణాలు, పాశురాలు, అరుళిచ్చెయల్ నుండి అనేక ఉపప్రమాణాలతో శ్రీ వచన భూషణం వంటి అనేక రహస్య గ్రంథాలకు అందమైన వ్యాఖ్యానాలను రాశారు.

వీరు రామానుజ నూఱ్ఱందాది,  జ్ఞాన సారం, ప్రమేయ సారానికి కూడా వ్యాఖ్యానాలు వ్రాసారు. చరమోపాయ నిష్ఠను ‘ప్రమేయ సారం’ (ఆచార్యులే సర్వస్వం) వివరిస్తుంది. మామునులను కొంతమంది శ్రీవైష్ణవుల విన్నపించగా, వీరు తిరువాయ్మోళి అర్థాలను, నమ్మాళ్వార్ల మనిమను చాటుతూ తిరువాయ్మోళి నూఱ్ఱందాది రచించారు. మన పూర్వాచార్యుల విలువైన  బోధనలను, ఆళ్వార్ల జన్మస్థలాలు, తిరునక్షత్రాలు, తిరువాయ్మోళి, శ్రీ వచన భూషణ మహిమను ఉపదేశ రత్నమాలలో కూర్చి వ్రాశారు.

మామునులు కూడా దివ్య దేశ యాత్రకు వెళ్లి పెరుమాళ్ళకు, ఆళ్వార్లకు మంగళాశాసం చేశారు.

వేదవల్లి: నాన్నమ్మా, మామునులు మన సంప్రదాయానికి చేసిన కృషి చాలా అద్భుతంగా ఉంది.

బామ్మగారు: అవును వేదవల్లి, నంపెరుమాళ్ళకు కూడా  నమ్మాళ్వార్ల తిరువాయ్మోళి ఈడు 36000 పడి కాలక్షేపాన్ని మామునుల నుండి వినాలని కోరిక ఉండేది. మామునులు ఆ కాలక్షేపాన్ని10 నెలల పాటు చెప్పి, చివరకు జేష్ఠ (ఆని) మాసం మూలా నక్షత్రం రోజున శాఱ్ఱుమురతో ముగిస్తారు.

srisailesa-thanian-small

శాఱ్ఱుముర పూర్తయిన తరువాత, నంపెరుమాళ్ళు ఒక చిన్న పిల్లవాడి రూపంలో మామునుల ముందుకు వచ్చి అంజలి ముద్రతో “శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం” అని పఠించడం మొదలుపెడతారు. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయి, ఆ బాలుడు ఎవరో కాదు నంపెరుమాళ్ళె అని అర్థం చేసుకుంటారు.

పరాశర: ఓ! నంపెరుమాళ్ళే గౌరవించడం అనేది గర్వకారణం. నాన్నమ్మా, అందుకోసమేనా మన సేవాకాలం ఈ తనియన్తో మొదలుపెడతాము?

బామ్మగారు: అవును పరాశర. పెరుమాళ్ళు ఈ తనియన్ని అన్ని దివ్య దేశాలకు పంపి సేవాకాలం ప్రారంభంలో చివరిలో సేవించాలని ఆదేశించారు. తిరువెంగటేశ్వరుడు, తిరుమాలిరుంజోలై అళగర్ కూడా ఈ తనియన్ని అరుళిచ్చెయల్ సేవాకాలం ప్రారంభంలో, చివరిలో సేవించాలని ఆదేశించారు.

వీరు తమ చివరి రోజులల్లో అతి కష్టంగా ‘ఆచార్య హృదయం’ వ్యాఖ్యానాన్ని పూర్తి చేశారు. పూర్తి అయ్యాక ఇక తమ తిరుమేనిని విడిచి పరమపదానికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఈ సంసారం నుండి ఇక విముక్తిని ప్రసాదించమని ఎంబెరుమానార్లను ఆర్తితో ప్రార్థిస్తూ ‘ఆర్తి ప్రబంధం’ పఠించారు. తరువాత, ఎంబెరుమానార్ల దయతో మామునులు పరమపదానికి చేరుకుంటారు. ఆ సమయంలో దగ్గరలో ఉన్న పొన్నడిక్కాల్ జీయర్ ఈ వార్త విని శ్రీరంగంకు తిరిగి వచ్చి,
మామునుల చరమ కైంకర్యాలు పూర్తి చేస్తారు.

అత్తుళాయ్: మామునుల దివ్య చరిత్రను మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నాన్నమ్మా!

బామ్మగారు: నాకూ చాలా ఆనందంగా ఉంది అత్తుళాయ్. వీరిని పెరియ పెరుమాళ్ళె తమ ఆచార్యునిగా స్వీకరించినందున, పెరియ పెరుమాళ్ళతో ప్రారంభమైయ్యే ఆచార్య రత్నహారాన్ని, ఓరాణ్ వళి గురుపరంపరను పూర్తి చేశారు.

మనము తరువాత మామునుల శిష్యుల (అష్ట దిగ్గజాలు) గురించి చర్చిద్దాము.

మూలము : http://pillai.koyil.org/index.php/2018/06/beginners-guide-mamunigal/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Posters – AchAryas – telugu

Published by:

శ్రీః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః  శ్రీ వానాచల మహామునయే నమః

OrAN vazhi AchAryas

  1. పెరియ పెరుమాళ్
  2. పెరియ పిరాట్టి
  3. సేనై ముదలియార్
  4. నమ్మాళ్వార్
  5. శ్రీమన్నాథమునులు
  6. ఉయ్యక్కొండార్
  7. మణక్కాల్ నంబి
  8.  ఆళవందార్
  9.  పెరియనంబి
  10. ఎమ్పెరుమానార్
  11. ఎంబార్
  12. పరాశరభట్టర్
  13. నంజీయర్
  14. నంపిళ్ళై
  15. వడక్కు తిరువీధిపిళ్ళై
  16. పిళ్ళై లోకాచార్యులు
  17. తిరువాయ్ మొళిపిళ్ళై
  18. అళగియ మనవాళ మామునిగల్

Thanks to SrI dhAsarathi for preparing the posters.

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

బాల పాఠము – పిళ్ళై లోకాచార్యుల శిష్యులు

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

  శ్రీ వైష్ణవం – బాల పాఠము

<<పిళ్ళై లోకాచార్యులు, నాయనార్

పిల్లలందరు కలిసి బామ్మగారింటికి  పిళ్ళై లోకాచార్యుల శిష్యుల గురించి వినాలని ఎంతో ఉత్సాహంతో వస్తారు.

బామ్మగారు: స్వాగతం పిల్లలు, ఎలా ఉన్నారు? నేను మీ అందరి ముఖాల్లో ఉత్సాహాన్ని చూస్తున్నాను.

వ్యాస: నమస్కారం నాన్నమ్మా, మేము బాగున్నాము, మీరు ఎలా ఉన్నారు? అవును నాన్నమ్మా! పిళ్ళై లోకాచార్యుల శిష్యుల గురించి వినాలని చాలా ఆశగా ఉంది.

బామ్మగారు: అవును పిల్లలు, మీకు వాళ్ళ గురించి చెప్పాలని నాకూ ఆశగా ఉంది. పోయిన సారి పిళ్ళై లోకాచార్యుల శిష్యుల పేర్లను చెప్పుకున్నాం గుర్తుందా వీకు? వాళ్ళ పేర్లు చెప్పగలరా?

అత్తుళాయ్: నాన్నమ్మా! నాకు గుర్తున్నాయి. కూరకుళోత్తమ దాసు, విళాంచోళ్ళై పిళ్ళై, తిరుమలై ఆళ్వారు (తిరువాయ్మోలి పిళ్ళై), మణపాక్కత్తు నంబి, కొత్తూర్ అణ్ణర్, తిరుప్పుట్కొళి జీయర్, తిరుక్కణ్ణన్ గుడి పిళ్ళై, కొల్లికావల దాస.

బామ్మగారు: బావుందమ్మా అత్తుళాయ్. ఇప్పుడు వీరి గురించి వివరంగా చెప్పుకుందాము. మొదట, కూరకుళోత్తమ దాస గురించి చెప్తాను.

పిల్లలందరు: సరే నాన్నమ్మ!

బామ్మగారు: కూరకుళోత్తమ దాసులు శ్రీరంగంలో జన్మించారు. తిరుమలై ఆళ్వారు (తిరువాయ్మోలి పిళ్ళై) ని
తిరిగి మన సంప్రదాయంలోకి  తీసుకురావడంలో వీరు చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. పిళ్ళై లోకాచార్యులకు అత్యంత సన్నిహితులు వీరు. , వారు పిళ్ళై లోకాచార్యులతో ‘తిరువరంన్ ఉల’
(ముస్లింల దాడుల సమయంలో నంపెరుమాళ్ళు శ్రీరంగం వదిలి ఎన్నో ఊర్లు తిరగాల్సి వచ్చింది) సమయంలో పిళ్ళై
లోకాచార్యులతో ప్రయాణం చేశారు. కూరకుళోత్తమ దాసులను కీర్తిస్తూ మణవాళ మామునులు “కూరకుళోత్తమ దాసం ఉదారం” (చాలా దయగల, ఔదార్యం గల వ్యక్తి అని అర్థం) అన్నారు. ఎందుకంటే వీరి కృపతో తిరుమలై ఆళ్వారు తీర్చిదిద్దబడ్డారు. చివరికి, కూరకుళోత్తమ దాసుల పట్ల కృతజ్ఞతతో తిరుమలై ఆళ్వారు వారికి శరణాగతి చేసి, ఆచార్య సేవ చేసుకుంటూ ఉండిపోయి, కూరకుళోత్తమ దాసులు పరమపదించిన తరువాతనే మరలా ఆళ్వార్తిరునగరికి వెళతారు. శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రంలో ఒక శిష్యునికి “ఆచార్య అభిమానమే ఉద్ధారకం” అని చెబుతారు. ఇది ఖచ్చితంగా కూరకుళోత్తమ దాసులకు, తిరుమలై ఆళ్వార్లకు సరిపడుతుంది. మనం కూడా పిళ్ళై లోకాచార్యుల పాద పద్మాలను స్మరించే కూరకుళోత్తమ దాసులను ఎప్పుడూ గుర్తు చేసుకుందాం.

వేదవల్లి: నాన్నమ్మా! కూరకుళోత్తమ దాసుల చరిత్ర విన్నాక ఆచార్యులను శిష్యుడు ఎలా గౌరవించాలో తెలుసుకున్నాము.

బామ్మగారు: అవును వేదవల్లి, “ఆచార్య అభిమానమే ఉద్ధారకం”  అని అందరూ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇంకొక  ముఖ్యమైన శిష్యుడి గురించి తెలుసుకుందాము. వారి పేరు విళాంచోళై పిళ్ళై.

వ్యాస: నాన్నమ్మా, వీరిని విళాంచోళై పిళ్ళై అని ఎందుకు పిలుస్తారో నాకు తెలుసు. వీరు తిరువనంతపురంలో, పద్మనాభ స్వామి ఆలయ గోపురదర్శనం చేసుకోవడానికి వెళగచెట్టు ఎక్కేవారట.

viLAnchOlai piLLai

బామ్మగారు: బాగుంది వ్యాస. తక్కువ కులంలో జన్మించిన కారణంగా, గుడిలోకి వెళ్ళనిచ్చే వారు కాదు. అందుకని, పెరుమాళ్ళ దర్శనం చేసుకోవడానికి దగ్గరలో ఉన్న ఒక వెళగ చెట్టు ఎక్కి మంగళాశాసనం చేసే వారట. పిళ్ళై లోకాచార్యుల అనుగ్రహంతో వీరు ఈడు, శ్రీ భాష్యం, తత్వ త్రయం, కొన్ని రహస్య గ్రంథాలు మొదలైనవి అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ల వద్ద నేర్చుకుంటారు.

తమ ఆచార్యులైన పిళ్ళై లోకాచార్యుల వద్ద ‘శ్రీవచన భూషణము’ నేర్చుకుంటారు. శ్రీ వచన భూషణ తాత్పర్యంలో మంచి నైపుణ్యం ఉండేది వీరికి. ఆ దివ్య శాస్త్ర తాత్పర్యం అర్థాలనే “సప్త కాదై” అనే గ్రంథములో బద్రపరచారు.

పరాశర: విళాంచోళై పిళ్ళైల ఆచార్య నిష్ఠ చాలా గొప్పగా ఉంది నాన్నమ్మా!

బామ్మగారు: అవును పరాశర! తమ ఆచార్యుని ఆదేశాన్ని పాఠించి చేసిన గొప్ప కైంకర్యాలలో తిరుమలై ఆళ్వారుని మన సంప్రదాయంలోకి తీసుకురావడం ఒకటి. తిరుమలై ఆళ్వార్లకు శ్రీ వచన భూషణ సారాన్ని బోధించమని విళాంచోళై పిళ్ళైని పిళ్ళై లోకాచార్యులు నిర్దేశిస్తారు. పిల్లలూ! ఇప్పుడు, విళాంచోళై పిళ్ళై జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన ఘట్టం గురించి మీకు చెప్పబోతున్నాను.

అత్తుళాయ్: నాన్నమ్మా, సరే నాన్నమ్మా చెప్పండి.

బామ్మగారు: మీకు వినాలని ఆశగా ఉందని నాకు తెలుసు. మీకు మంచి విషయాల గురించి తెలియజేయడం నా బాధ్యత. ఇప్పుడు, జాగ్రత్తగా వినండి,

ఒక రోజు తిరువనంతపురంలో నంబూద్రీ అర్చకులు పద్మనాభస్వామికి తిరువారాధనం చేస్తున్నారు. గర్భగుడికి మూడు ద్వారాలు ఉంటాయని మీకు తెలుసుకదా? విళాంచోళై పిళ్ళై ఆలయంలోకి ప్రవేశించారు పెరుమాళ్ళ పాదాలు కనిపించేటట్టుగా ఒక ద్వారం వద్ద నిలుచున్నారు. అది చూసి నంబూద్రీ అర్చకులు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ రోజుల్లో నిమ్నజాతి వాళ్ళకి ఆలయ ప్రవేశం ఉండేది కాదు. అందుకని, అర్చకులు సన్నిధి తలుపును మూసివేసి, ఆలయం బయటకు వెళుతుంటారు.

అదే సమయంలో, విళాంచోళై పిళ్ళై శిష్యులు కొంతమంది గుడికి వచ్చి, తమ ఆచార్యులు విళాంచోళై పిళ్ళై వారి ఆచార్యులైన పిళ్ళై లోకాచార్యుల తిరువడి చేరుకున్నారని తెలియజేస్తారు. వారికి “తిరుపరియట్టం” (ప్రసాద రూపంలో పెరుమాళ్ళ వస్త్రం), పెరుమాళ్ళు ధరించిన పూలదండలు విళాంచోళై పిళ్ళై చరమ తిరుమేని అలంకారం కోసం కావాలని అడుగుతారు.

ఇది విన్న నంబూద్రీ అర్చకులు అప్పుడు విళాంచోళై పిళ్ళైల గొప్పతనాన్ని అర్ధం చేసుకొని పెరుమాళ్ళ తిరుపరియట్టం, దండలు పంపిస్తారు.

వేదవల్లి: నాన్నమ్మా, విళాంచోళై పిళ్ళైవారి చివరి క్షణాల గురించి వింటుంటే నా రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి.

వ్యాస: అవును నాన్నమ్మా, నా కళ్ళెంబడి నీళ్ళు కారుతున్నాయి. ఈ ఘట్టంతో నిమ్న జాతి వ్యక్తిని కూడా మన సంప్రదాయం ఎంత గౌరవించిందో, కీర్తించిందో తెలుస్తోంది.

బామ్మగారు: సరే పిల్లలు, మీతో సమయం బాగా గడిచింది. మీరు ఈ రోజు మనం చెప్పుకున్న వాటన్నింటినీ గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. ఈ సారి మనం కలిసినప్పుడు తిరుమలై ఆళ్వారు (తిరువాయ్మోలి పిళ్ళై) గురించి చెప్తాను.

పిల్లలందరూ ఉత్సాహంగా చర్చించుకున్న విషయాల గురించి ఆలోచిస్తూ ఆనందంతో ఇండ్లకు వెళ్ళారు.

మూలము :http://pillai.koyil.org/index.php/2018/05/beginners-guide-pillai-lokacharyars-sishyas/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – పిళ్ళై లోకాచార్యులు, నాయనార్లు

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<<బాల పాఠము – నంపిళ్ళై శిష్యులు

పిల్లలందరరూ కలిసి బామ్మగారి ఇంటికి వచ్చారు. బమ్మగారు తిరుప్పావై పఠింస్తూ ఉంటే చూసి, పూర్తయ్యే వరకు ఎదురుచూస్తున్నారు. బమ్మగారు పాఠం పూర్తి చేసుకొని, పిల్లలను లోపలికి రమ్మంటారు.

బమ్మగారు: పిల్లలూ! లోపలికి రండి!

వ్యాస: నాన్నమ్మా, క్రిందటిసారి మీరు వడక్కు తిరువీధి పిళ్ళైల కుమారుల గురించి చెప్తానన్నారు. వారి గురించి మాకు చెప్పరూ?

బమ్మగారు: అవును వ్యాస. ఈ రోజు మనం వడక్కు తిరువీధి పిళ్ళైవారి లోకప్రసిద్ధులైన ఇద్దరు కుమారుల గురించి మాట్లాడుకుందాము. వీరి ఆచార్యులు నంపిళ్ళై, నంపెరుమాళ్ళ అనుగ్రహంతో, వడక్కు తిరువీధి పిళ్ళైకి ఇద్దరు పుత్రులు ‘పిళ్ళై లోకాచార్యులు’, ‘అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు’ జన్మించారు. ఆ ఇద్దరు పిల్లలు రామ లక్షణుల లాగా కలిసి పెరుగి గొప్ప విద్వానులైయ్యి సంప్రదాయానికి ఎంన్నో కైంకర్యాలు చేశారు.

నంపిళ్ళై పరమపదానికి చేరుకున్న తరువాత, వడక్కు తిరువీధి పిళ్ళై మన సంప్రదాయ ప్రధాన ఆచార్యులుగా బాధ్యతను వహించారు. తమ ఆచార్యులు నంపిళ్ళైల నుండి తాను పొందిన జ్ఞానాన్ని తన కుమారులకు బోధించారు. కొంతకాలం తర్వాత వడక్కు తిరువీధి పిళ్ళై వారి ఆచార్య తిరువడిని చేరుకుంటారు. వారి తరువాత వారి కుమారుడు పిళ్ళై లోకాచార్యులు మన సంప్రదాయ ప్రధాన ఆచార్యులుగా బాధ్యతను తీసుకూంటారు.

అత్తుళాయ్: నాన్నమ్మా,  పిళ్ళై లోకాచార్యులు ఎవరో కాదు దేవ పెరుమాళ్ళని విన్నాను.

కాట్టళగియ కోయిల్లో కాలక్షేపం చేస్తున్న పిళ్ళై లోకాచార్యులు

బమ్మగారు: అవును అత్తుళాయ్, నువ్వు విన్నది నిజమే. పిళ్ళై లోకాచార్యులు ఎవరో కాదు స్వయంగా దేవ పెరుమాళ్ళే. పిళ్ళై లోకాచార్యులు తమ ఆఖరి రోజులలో జ్యోతిష్కుడిలో ఉన్నప్పుడు, నాళూర్ పిళ్ళైని పిలిచి మన సంప్రదాయానికి కాబోయే ప్రధాన ఆచార్యులు తిరుమలై ఆళ్వారు (తిరువాయ్మోలి పిళ్ళై) కి సంప్రదాయ విషయాలను బోధించమని ఆదేశిస్తారు. దేవ పెరుమాళ్ళకు మంగళాసాసం చేయడానికి తిరుమలై ఆళ్వారు కాంచీపురానికి వెళ్ళినప్పుడు, పక్కనే నిలబడి ఉన్న నాళూర్ పిళ్ళైతో దేవ పెరుమాళ్ళు నేరుగా మాట్లాడుతూ అంటారు, “నేను జ్యోతిష్కుడిలో చెప్పినట్లు, మీరు తిరుమలై ఆళ్వారుకి అరుళిచ్చెయల్ అర్థాలను ఉపదేశించాలి” అని అంటారు.

వేదవల్లి: నాన్నమ్మా, పిళ్ళై లోకాచార్యులు తమ చివరి రోజులు జ్యోతిష్కుడిలో ఎందుకు గడపాల్సి వచ్చింది? వారు శ్రీరంగంలో జన్మించలేదా?

బమ్మగారు : పిళ్ళై లోకాచార్యులు మనందరి లాభం కోసం సులభమైన తమిళ భాషలో ఆళ్వార్ల పాశురాలకు అందమైన వ్యాఖ్యానాలు వ్రాసిన ఒక గొప్ప ఆచార్యులు. సంస్కృతంలో, తమిళ భాషల్లో అందరికీ ప్రావీణ్యం ఉండదు. భాష రానివాళ్ళు కూడా మన పూర్వాచార్యుల వ్యాఖ్యానాల గురించి తెలుకోవాలనే కోరిక ఉన్నవారి కోసం పిళ్ళై లోకాచార్యులు గొప్ప దయతో అతి సులభమైన భాషలో రచించి ఉంచారు. వారి రచనలలో అతి గొప్పది ‘శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం’. మన సంప్రదాయ వివరాలను తెలియజేస్తుంది. వీరు మన ‘ప్రమాణ రక్షణం’ (మన సాంప్రదాయం జ్ఞాన పునాదిని రక్షించి పోషించుట) చేసిన ముఖ్యమైన ఆచార్యులు.

పిళ్ళై లోకాచార్యులు – శ్రీరంగం

పిళ్ళై లోకాచార్యులు మన సంప్రదాయ జ్ఞాన ధనాన్ని కాపాడటమే కాకుండా, మన సాంప్రదాయానికి మూలాధారమైన శ్రీరంగం నంపెరుమాళ్ళను కూడా పరిరక్షించారు. శ్రీరంగంలో అంతా సక్రమంగా ఉన్న రోజుల్లో, హఠాత్తుగా ముస్లింల దాడులు ఒక మంటలా వ్యాపించింది. ఈ ముస్లిం నవాబులు మన గుళ్ళలోని నిధులను దోచుకోడానికి దాడి చేయడంలో ఆరి తేరినవారు. అందుకని, అందరూ భయపడ్డారు. వెంటనే పిళ్ళై లోకాచార్యులు పరిస్థితిని తమ నియంత్రణలోకి తీసుకొని, పెరియ పెరుమాళ్ళ ఎదుట ఒక గోడను కట్టించి, ఉభయ నాచియార్లతో నంపెరుమాళ్ళను తీసుకొని దక్షిణం వైపుకి బయలుదేరుతారు. వయోవృద్ధులైనప్పటికీ తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా నంపెరుమాళ్ళతో ప్రయాణం ప్రారంభించారు. కొండలు, గుట్టలు, అడవుల గుండా ప్రయాణిస్తుండగా కొందరు దొంగలు వచ్చి నంపెరుమాళ్ళ తిరువాభరణాలను దోచుకుంటారు. కానీ, కొంత కాలం తరువాత పిళ్ళై లోకాచార్యులు వారి మనస్సులను మార్చగలుగుతారు. వాళ్ళందరూ పిళ్ళై లోకాచార్యులకు శరణాగతి చేసి దోచుకున్న సొమ్ముని తిరిగి వారికి అప్పగిస్తారు.

ఆ తరువాత, జ్యోతిష్కుడి (మధురై సమీపంలో) అనే ప్రదేశానికి చేరుకుంటారు. పిళ్ళై లోకాచార్యులు అనారోగ్యంతో బాధపడుతూ, పరమపదానికి చేరుకోవాలని నిర్ణయించుకొంటారు. తన శిష్యులలో ఒకరైన తిరుమలై ఆళ్వార్ (తిరువాయ్మోళి పిళ్ళై)ను సంప్రదాయ ప్రధాన ఆచార్యులుగా చేయాలనుకుంటారు. ఈ సమయంలోనే తిరుమలై ఆళ్వారుని తయారు చేయమని నాలూర్ పిళ్ళైని నిర్దేశిస్తారు. అప్పుడు శ్రీశైలేశుడు (తిరువాయ్మోళి పిళ్ళై) మధురై రాజు వద్ద పని చేస్తుండేవారు. కూరకులోత్తమ దాసుని, విలంచోలై పిళ్ళైని మధురకు పంపిస్తారు. చివరగా వారు తన చరమ తిరుమేనిని వదిలి, జ్యోతిష్కుడిలోనే పరమపదానికి చేరుకుంటారు. అలా పిళ్ళై లోకాచార్యులు నంపెరుమాళ్ళ రక్షణ కోసం వారి జీవితాన్నే త్యాగం చేశారు. వేలాది శ్రీవైష్ణవులు వాళ్ళ జీవితాలను నంపెరుమాళ్ళ కోసం అప్పుడు త్యాగం చేయకపోయుంటే ఈ రోజు మనం శ్రీరంగంలో నంపెరుమాళ్ళని దర్శనం చేసుకుకోగలిగే వాళ్ళం కాదు.

జ్యోతిష్కుడి – పిళ్ళై లోకచార్యులు పరమపదించిన స్థానం

పరాశర: వారు స్వయంగా దేవ పెరుమాళ్ళ అవతారం అనడంలో అతిశయోక్తి లేదు!

బమ్మగారు: అవును పరాశర. అందువల్ల దేవ పెరుమాళ్ళని మన సంప్రదాయ పెరుమాళ్ళ అని కూడా పిలుస్తారు. పిళ్ళై లోకాచార్య  ప్రమాణ రక్షణ మాత్రమే కాకుండా, వారు ప్రమేయ రక్షణం (నంపెరుమాళ్ళ రక్షణ) లో కూడా కీలక పాత్ర వహించారు. వీరు నంపెరుమాళ్ళ రక్షణకు పాటు పడి శ్రీవైష్ణవ లక్షణాన్ని మనకు ఆచరించి చూపించారు. పెరుమాళ్ళకు దృష్టి దోషం కలుగుతుందేమోనని పెరయాళ్వార్లు భయపడి ‘పల్లాండు’ పాడారు.  పిళ్ళై లోకాచార్యులు నంపెరుమాళ్ళ అర్చామూర్తిని పితృ వాత్సల్యభావంతో సంరక్షించారు. తన జీవితాన్నే త్యాగము చేయడానికి సిద్ధమైనారేే కాని, ముస్లిం ఆక్రామకులను నంపెరుమాళ్ళని తీసుకువెళ్ళనివ్వలేదు. అందువల్ల, మీరు ఈసారి పెరియ పెరుమాళ్ళ గుడికి వెళ్ళినపుడు, వేలాది శ్రీవైష్ణవుల నిస్వార్ధమైన త్యాగాన్ని గుర్తుంచుకోవాలి. వాళ్ళు మన సాంప్రదాయాన్ని, నంపెరుమాళ్ళని కాపాడి, ఈ వేళ మనమూ, మన భవిష్యత్తు తరాలవాళ్ళు ఆ ఫలాన్ని పొందగలిగేలా చేశారు. వారి ఋణము మనం ఎప్పుడూ తీర్చుకోలేము. వారికి కృతజ్ఞతగా వాళ్ళ త్యాగాలను గుర్తుంచుకొని, సంప్రదాయాన్ని గౌరవించి, ముందు తరాల వారికి ఆ విలువలను, జ్ఞానాన్ని అందించి ముందుకు తీసుకువెెెళ్ళడమే మనము చేయగలిగింది.

అత్తుళాయ్: నానమ్మ, పిళ్ళై లోకాచార్యుల తమ్ముడు అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్ గురించి చెప్పరా?

nayanar

అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్

నాన్నమ్మ: నాయనార్లు మన సాంప్రదాయ సూత్రాలపై అద్భుతమైన గ్రంథాలు వ్రాశారు, వాటిలో ‘ఆచార్య హృదయం’ అతి శ్రేష్ఠమైన వీరి కృతి. వీరికున్న సాంప్రదాయ పరిజ్ఞానం, దివ్య ప్రబంధ జ్ఞానం వలన, వీరిని పెరియ వాచ్చాన్ పిళ్ళైలతో సమానంగా భావిస్తారు. నాయనార్లను గొప్ప ఆచార్యులుగా కీర్తించేవారు అందరు. అందరూ “జగత్ గురు వరానుజ – లోకాచార్యుల తమ్ముడు” అని కీర్తించేవారు. వీరి రచనలు ఆణిముత్యాల వంటివి. ఆ రచనలు లేకపోయి ఉంటే మన సాంప్రదాయంలోని నిగూఢ అర్థాలను ఈ వేళ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేవికావు. మామునులు నాయనార్ల  రచనలను పొగుడుతూ పెరియ వాచ్చాన్ పిళ్ళై తరువాత నాయనార్ల వ్యాఖ్యానాలు మన సాంప్రదాయ పోషణలో కీలక పాత్ర వహించయని కీర్తించారు. నాయనార్లు పరమపదం చేరుకున్నప్పుడు, పిళ్ళై లోకాచార్యులు ఆ దుఃఖాన్ని భరించలేకపోయారు. నాయనార్ల తిరుముడిని (శిరస్సు) తన ఒళ్ళో ఉంచి విలపిస్తారు. ఈ ప్రపంచం ఒక శ్రేష్ఠమైన శ్రీవైష్ణవుడిని అతి కొద్ది కాలంలోనే కోల్పోయిందని దుఃఖిస్తారు.

వ్యాస: నాన్నమ్మా, పిళ్ళై లోకాచార్యులు, నాయనార్ల చరిత్రలు చాలా ఆసక్తికరంగాను, బాధాకరంగానూ ఉన్నాయి.

బమ్మగారు: అవును వ్యాస. మన ఆచార్యుల జీవిత చరిత్రల గురించి మాట్లాడటం మొదలుపెడితే, సమయమే తెలియదు. చీకటి పడుతోంది. పిల్లలు ఇక ఇళ్లకి వెళ్లండి. ఈ సారి మనము కలుసుకున్నప్పుడు పిళ్ళై లోకాచార్యుల శిష్యుల గురించి చెప్పుకుందాం.

పిల్లలు వడక్కు తిరువీధి పిళ్ళై, పిళ్ళై లోకాచార్యులు, అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్లు, వారి అద్భుతమైన జీవిత చరిత్రల గురించి ఆలోచిస్తూ వాళ్ళ ఇండ్లకి వెళతారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2016/09/beginners-guide-pillai-lokacharyar-and-nayanar/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – నంపిళ్ళై

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<<బాల పాఠము – నంజీయర్

పిల్లలందరు కలిసి ఆండాళమ్మ ఇంటికి వస్తారు.

బామ్మగారు: పిల్లలూ రండి. ఈ రోజు మనం నంజీయర్ల శిష్యులైన నంపిళ్ళైల గురించి మాట్లాడుకుందాం. ముందు మీకు చెప్పాను గుర్తుందా, వరదరాజుగా నంబూర్లో జన్మించిన నంపిళ్ళై తమిళ, సంస్కృత భాషా పండితులు. నంజీయర్లు తమ 9000 పడి వ్యాఖ్యానాన్ని అనుకరించడానికి, ఈ రెండు భాషల్లో నైపుణ్యత కారణంగా వరదరాజులకు ఇచ్చారని మనందరికీ తెలుసు. నంజీయర్లు వరదరాజుల నైపుణ్యతను, గొప్పతనాన్ని చూసి ‘నంపిళ్ళై’ అనే పేరును వారికి ప్రసాదిస్తారు. నంపిళ్ళైని తిరుక్కలికన్ఱి దాసు, కలివైరి దాసు, లోకాచార్య, సూక్తి మహార్ణవ, జగదాచార్యార్, ఉలగాశిరియర్ అని కూడా పిలుస్తారు.

నంపిళ్ళై – తిరువల్లిక్కేని

వ్యాస: నాన్నమ్మా, కావేరి వరదలో వారి ఆచర్యులిచ్చిన గ్రంథం కొట్టుకుపోయిన తరువాత కూడా నంపిళ్ళై వారి జ్ఞాపకశక్తితో 9000 వ్యాఖ్యానాన్ని మొత్తం తిరిగి వ్రాసారని మాకు గుర్తుంది.

బామ్మగారు: అవును, అంతటి గొప్పతనం, జ్ఞానం ఉన్నప్పటికీ, నంపిళ్ళై ఎంతో వినయ విధేయతలతో ఉండేవారు. ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ, గౌరవంతో ఉండేవారు.

వేదవల్లి: నాన్నమ్మా, నంపిళ్ళై గొప్పతనాన్ని చాటిచెప్పే సంఘటనలు కొన్ని మాకు చెప్తారా?

బామ్మగారు: నంజీయర్ల వద్ద పాసురాలు, వాటి అర్ధాలు నేర్చుకున్న తరువాత నంపిళ్ళై  శ్రీరంగంలో క్రమం తప్పకుండా పెరుమాళ్ళ సన్నిధికి తూర్పు వైపున ప్రసంగించేవారు. ఉభయ వేదాంతులు (సంస్కృత తమిళ భాషా ప్రవీణులు) కావడంతో నంపిళ్ళై పెద్ద సమూహాన్ని ఆకర్షించేవారు. వినే వారికి ఏ సందేహాలు వచ్చినా వాల్మీకి రామాయణాన్ని ఉల్లేఖించి సంతృప్తికరమైన జవాబులు ఇచ్చేవారు. ఒకసారి, నంపిళ్ళై ఉపన్యాసం ఇస్తుంన్నపుడు, పెరియ పెరుమాళ్ళు తమ శయనావస్థ నుండి లేచి నిలబడి, నంపిళ్ళై ఇస్తున్న ఉపన్యాసాన్ని వినాలని ప్రయత్నిస్తారు. తిరువిళక్కు పిచ్చన్  (సన్నిధిలో దీపాలను వెలిగించే సేవ చేసే ఒక శ్రీవైష్ణవుడు) పెరియ పెరుమాళ్ళు నిలబడటం చూసి, అర్చావత స్వరూపంగా ఉన్న పెరియ పెరుమాళ్ళకు కదిలే అనుమతి లేదని, తిరిగి శయనించమని కోరతారు. పెరుమాళ్ళు ఇచ్చిన మాటను (అర్చావతారం రూపంలో కదలనని, మాట్లాడానని) కూడా లెక్కచేయకుండా నంపిళ్ళై ప్రసంగానికి ఆకర్షితులైయ్యేవారు. అంత ఆకర్షణీయంగా ఉండేవి నంపిళ్ళైల ఉపన్యాసాలు. ఉభయ భాషలలో ప్రావిణ్యం కారణంగా వినేవారిని మంత్రముగ్ధులను చేయగలిగేవారు. ఊరెరిగింపులో నంపెరుమాళ్ళ వయ్యారి నడకకు, వారి అందమైన తిరుమేనికి ఎలా ప్రపంచం నలు మూలల నుండి భక్తులు ఆకర్షితులౌతారో అలా నంపిళ్ళై అందరిని ఆకర్షించేవారు.  ఎవరైనా శ్రీరంగంలో నంపెరుమాళ్ళ ఊరెరిగింపు చూసారా?

పెరుమాళ్ళా సన్నిధిలో నంపిళ్ళై ఉపన్యాసం – శ్రీరంగం

అత్తుళాయ్: నాన్నమ్మా, నేను చూసాను. శ్రీ రంగం భ్రహ్మోత్సవాలకు ఒక సారి వెళ్ళాము. తిరుమాడవీధుల్లో పెరుమాళ్ళను ఉరేగిస్తుంటే వారి నడకను చూసాను. చాలా బావుంటుంది.

పరాశర: అవును నాన్నమ్మా, మేము కూడా చాలా సార్లు నంపెరుమాళ్ళ ఊరెరిగింపు చూశాము.

బామ్మగారు: ఎవరు చూసుండరు? కళ్ళకి కట్టినట్టుగా ఉంటుంది కదూ? ఎలాగైతే ఊరెరిగింపులో నంపెరుమాళ్ళు తన భక్తులను ఆకర్షిస్తారో, నంపిళ్ళై కూడా తన ఉపన్యాసాలతో అందరిని ఆకర్షించేవారు. అయినా కానీ, వీరి వినయం అసమానమైనది. ఒకసారి నంపెరుమాళ్ళ ముందు, కందాడై తోళప్పర్ (ముదలియాండాల్ వంశస్తులు) నంపిళ్ళైలతో కఠినంగా మాట్లాడతారు. నంపిళ్ళైని పొగడలేక, కేకలు వేస్తారు. నంపిళ్ళై ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా, అవమానాన్ని మింగేసి, వారి తిరుమాళిగకి (ఇంటికి) వెళ్లిపోతారు.

తోళప్పర్ తిరిగి ఇంటికి వెళ్ళగానే, ఊరి వాళ్ళ ద్వారా అప్పటికే జరిగినది తెలుకున్న వీరి భార్య, తన ప్రవర్తన తప్పని గట్టిగా చెప్పి, నంపిళ్ళైల గొప్పతనం గురించి వివరిస్తుంది. వెళ్ళి నంపిళ్ళై చరణాలపైన పడి  క్షమాపణ వేడుకోమని నొక్కి చెబుతుంది. చివరకు, చేసిన పొరపాటును తెలుసుకుంటారు. మధ్య రాత్రైనా సరే నంపిళ్ళైల తిరుమాళిగకి వెంటనే వెళ్లి క్షమాపణ వేడుకోవాలని అనుకుంటారు. వారు వెళదాం అని తలుపు తెరవగానే, బయట ఎవరో ఒక వ్యక్తి నిలబడి ఉన్నట్టు  గమనిస్తారు. వారెవరో కాదు స్వయంగా నంపిళ్ళై వారే. తోళప్పర్ని చూసి నంపిళ్ళై వెంటనే కింద పడి దండంపెట్టి, ఏదైనా తప్పు జరిగి వారిని బాధ పెట్టినట్లయితే క్షమించమని అడుగుతారు. నంపిళ్ళై గొప్పతనాన్ని చూసి తోళప్పర్ ఆశ్చర్యపోతారు. పొరపాటు తోళప్పర్ వారిది అయినప్పటికీ, నంపిళ్ళై తప్పును తనపైకి తీసుకొని క్షమించమని అడుగుతారు. నంపిళ్ళైల గొప్పతనాన్ని గ్రహించిన తోళప్పర్ వెంటనే వారికి సాష్టాంగ ప్రణామాన్ని సమర్పించుకొని, ఇకపై నంపిళ్ళైవారు “లోకాచార్య” (ప్రపంచానికే గురువు) అని పిలవబడతారు అని ప్రకటిస్తారు. అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉండి అంత వినమ్రతతో ఉండేవారు కొందరు మాత్రమే ఉంటారని, లోకాచార్యుల స్థానానికి సరిగ్గా సరిపోతారని అంటారు. తోళప్పర్ ద్వేషాన్ని విడిచి అతని భార్యతో పాటు నంపిళ్ళైలకు సేవ చేయడం ప్రారంభిస్తారు. వారి నుండి శాస్త్ర  అర్థాలను కూడా నేర్చుకుంటారు.

పరాశర: ఎంత ఆశ్చర్యంగా ఉంది! కఠినంగా మాట్లాడిన వ్యక్తికి పరాశర భట్టర్లు ఖరీదైన శాలువను బహుమతిగా ఇచ్చిన సంఘటన లాగా ఉంది.

బామ్మగారు: బాగా పరిశీలించావు పరాశర! మన పూర్వాచార్యులందరూ ఇంచుమించు సమానమైన గుణాలతో ఉండేవారు – నిజమైన శ్రీవైష్ణవునిలా. రోజులు గడిచినా కొద్ది మళ్ళీ మళ్ళీ మన పూర్వాచార్యాలు, ఒక శ్రీవైష్ణవుడు తన జీవితాన్ని ఎలా గడపాలో, అందరితో ఎలా వ్యవహరించాలో నేర్పుతూనే వచ్చారు, నొక్కిచెబుతూనే ఉన్నారు. మనందరికీ ఈదర్శంగా ఉండి మార్గం చూపించారు. వారి గ్రంథాలలో సిద్ధాంత పరంగానే కాకుండా, ఆచరణాత్మకమైనదని అనుసరించి మరీ మనకు చూపించారు. కావలసింది ఆచార్యుల అనుగ్రహం, కొంచం మన కృషితో, మనం కూడా పూర్వాచార్యుల జీవితాన్ని గడపడానికి ప్రయత్నించవచ్చు. చిన్న చిన్న అడుగులు వేసి చివరికి మన గమ్యానికి చేరుకోవచ్చు.

నిజమైన శ్రీవైష్ణవుడు ఎలా ఉండాలో పరాశర భట్టర్ మనకు చూపించారు. వీరి వశస్థులైన ‘నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్’ వారు నంపిళ్ళై అంటే అసూయ పడేవారు. ఒకసారి నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ వారు పింభళగియ పెరుమాళ్ జీయర్ తో కలసి రాజ భవనానికి వెళ్ళారు. రాజు వారిద్దరిని ఆహ్వానించి, వారికి తగిన గౌరవ మర్యాదలు చేసి, ఆసనాన్నిచ్చి ఆసీనులు కామన్నారు. ఆ రాజు శ్రీ రామాయణంలో నుండి ఒక ప్రశ్న, “శ్రీ రాముడు ఎప్పుడూ తాను ఒక సామాన్య మానవుడని ప్రకటించుకున్నారు, పరమాత్ముడని అక్కడా చూపించుకోలేదు, అలాంటప్పుడు జటాయువుకి ఎలా మోక్షాన్ని ప్రసాదించారు?” అడిగారు. నంపిళ్ళై ఉండి ఉంటే ఈ ప్రశ్నకి వారు సమాధానం ఎలా ఇచ్చుండే వారు అని భట్టర్ జీయర్ని అడుగుతారు. జీయర్ వెంటనే, “రాముడి వంటి సత్యవంతుడు తన నిజాయితీ శక్తితో అన్ని లోకాలను జయించగలడు” అని చెప్పి ఉండేవారు అని అంటారు. రాజు ప్రశ్నకు భట్టర్ అదే వివరణను ఇస్తారు. రాజు ఎంతో సంతోషంచి, భట్టర్ జ్ఞానాన్ని ప్రశంశిస్తూ వారికి ఎన్నో బహుమానాలు సమర్పిస్తారు. భట్టర్ వెంటనే నంపిళ్ళైల వివరణ, దాని శక్తిని గ్రహించి, నంపిళ్ళై ఇంటికి వెళ్లి బహుమానంగా తీసుకున్న సంపదను వారికి సమర్పిస్తారు. అంతే కాకుండా వారు నంపిళ్ళై శిష్యులై వారికి సేవ చేసుకుంటారు. అలా నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ నంపిళ్ళైల అనేక శిష్యులలో ఒకరైనారు.

వేదవల్లి: నాన్నమ్మా, భట్టర్ నంజీయర్ల  మధ్య సంభాషణలు జరిగేవని క్రిందటిసారి మీరు చెప్పారు కదా! అలాగే నంజీయర్ నంపిళ్ళైల మధ్య కూడా సంభాషణలు జరిగేవా?

బామ్మగారు: అవును వేదవల్లి. నంజీయర్ నంపిళ్ళైల మధ్య కూడా అద్భుతమైన సంభాషణలు జరిగేవి. ఒకసారి, నంపిళ్ళై నంజీయర్లను , “భగవానుడు అవతారాలు ఎందుకు ఎత్తుతారు? ప్రయోజనమేమిటి?” అని ఒక ప్రశ్న అడిగారు. నంజీయర్లు సమాధానమిస్తూ “భాగవతాపచారం చేసిన వాళ్ళని శిక్షించాలనేదే భగవానుడి అవతారాల ప్రధాన” అన్నారు. ఉదాహరణకి, కృష్ణావతారంలో తన భక్తులను బాధపెట్టిన దుర్యోధనుడిని శిక్షించాలనేదే ఆ అవతార ఉద్దేశ్యం. భక్త ప్రహ్లాదుడిని హింసించిన హిరణ్యకశిపుడిని చంపాలని నారసింహుడిగా వచ్చాడు. అందువల్ల, భాగవత సంరక్షణమే అన్ని అవతారాల ప్రధాన ఉద్దేశ్యం.

వ్యాస: నాన్నమ్మా, భాగవత అపచారం అంటే ఏమిటి?

బామ్మగారు: నంజీయర్లు అంటారూ, మనం ఇతర శ్రీవైష్ణవులతో సమానమనే భావనే భాగవత అపచారం. వాళ్ళ జన్మ, జ్ఞానం మొదలైన వాటితో సంబంధం లేకుండా ఎప్పుడూ శ్రీవైష్ణవులందరి కంటే మనం తక్కువహా భావించి వ్యవహరించుకోవాలనే వారు నంజీయర్లు. ఆళ్వార్లు, ఇతర పూర్వాచార్యుల  లాగా భాగవతులను నిరంతరం కీర్తించే ప్రయత్నం చేయాలి అని కూడా అనేవారు. 

ఇతర దేవతల భజన, ఇతర దేవతాంతర ప్రార్థన నిరర్థకమైనదని నంపిళ్ళై  స్పష్టంగా నొక్కివెప్పేవారు.

అత్తుళాయ్ : నాన్నమ్మా, నంపిళ్ళైవారు దానిని ఎలా వివరించారు?

బామ్మగారు: ఒకసారి ఒకరు వచ్చి నంపిళ్ళైని అడుగుతారు , “మీ నిత్య కర్మలలో దేవతాంతరులను (ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, సూర్యుడు తదితరాలను) పూజిస్తున్నారు, కాని ఎందుకు వాళ్ళ గుళ్ళకు వెళ్ళరు?” అని అడిగారు. నంపిళ్ళై వెంటనే తెలివైన సమాధానం ఇస్తారు. నంపిళ్ళై వారిని ప్రశ్న ఒకటి అడుగుతారు, “మీరు యజ్ఞ యాగాలలో అగ్నిని ఆరాధిస్తారు, కానీ అదే అగ్నికి స్మశానంలో దూరంగా ఉంటారా? అదే విధంగా, నిత్యా కర్మలను భగవదారాధనంలో భాగంగా నిర్వర్తించాలని, ఆ భగవానుడు అన్ని దేవతలలో అంతర్యామిగా ఉన్నాడన్న భావనతో చేస్తాము. పెరుమాళ్ళనే పూజించాలని శాస్త్రం కూడా చెప్తుంది. ఆ కారణంగా దేవతాంతర గుళ్ళకు వెళ్లము” అని చెబుతారు.

వేదవల్లి: నాన్నమ్మా, ఇది చాలా సున్నితమైన విషయమని అందరూ ఈ భవనతో ఉండరని మా అమ్మ చెప్పింది.

బామ్మగారు: నిజము ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. అయితే చేదు మందులు శరీరానికి మంచి చేస్తాయి, అలాగే ఈ నిజం కూడా ఆత్మకు, శరీరానికి మంచే చేస్తుంది. కొంతమంది ఎవరో ఒప్పుకోవట్లేదని వేద ప్రమాణాలను ఖండించి, అవి వ్యర్థమని చూపించకూడదు. ఆచార్యుల అనుగ్రహంతో, భగవత్ కృపతో ఎదో ఒక సమయంలో ఈ నిజాన్ని తెలుసుకుంటారు. ఆళ్వార్ తమ పాశురాలలో అంటారూ, “అందరూ శ్రీమన్నారాయణుడి పరత్వ నిజాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందితే, భగవానుడు తన కాలక్షేపం కోసం ఆడుకోవడానికి ఈ ప్రపంచమే ఉండదు, అందుకే ఈ ఆలస్యం”. “ఈ రహస్యాన్ని గ్రహించి, వెంటనే తిరుక్కురుగూరుకు పరిగెత్తుకెళ్లి ఆదిప్పిరాన్ పెరుమాళ్ళ పాద పద్మాల యందు శరణాగతి చేయండి” అని కూడా ఆళ్వార్ అన్నారు.

వ్యాస: నాన్నమ్మా, నంపిళ్ళైకి వివాహం అయ్యిందా?

బామ్మగారు : అవును, నంపిళ్ళైకి ఇద్దరు భార్యలు ఉండేవారు. ఒకసారి, వారు ఒక భార్య దగ్గరకు వెళ్లి ఆమె తన గురించి ఏమని భావిస్తుందని అడుగుతారు. ఆమె నంపిళ్ళైని ఒక భగవత్ అవతారంగా, తన ఆచార్యునిగా భావిస్తుందని చెప్తుంది. నంపిళ్ళై చాలా ఆనందపడి ఆమెకు తిరుమాలిగకు వచ్చే శ్రీవైష్ణవుల తదీయారాదన కైంకర్యాన్ని చేయమని అంటారు. ఈ సంఘటనలో నంపిళ్ళై ఆచార్య అభిమాన ప్రాముఖ్యతను చూపించారు.

పరాశర : నాన్నమ్మా, నంపిళ్ళై జీవితం వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. వీరికి ఎంతో మంది శిష్యులు కూడా ఉండి ఉండాలి!

బామ్మగారు: అవును పరాశర! నంపిళ్ళైలకు అనేక మంది శిష్యులు ఉండేవారు, వారిలో ఆచార్యపురుషుల కుటుంబాల వారు కూడా ఉండేవారు, శ్రీరంగంలో వీరి కాలాన్ని ‘నల్లడిక్కాలం’ (మంచి కాలం) అని అందరూ కీర్తించేవారు. నంపిళ్ళై మన సంప్రదాయంలో రెండు అద్భుతమైన స్తంభాలకు పునాది వేసారు – పిళ్ళై లోకాచార్య మరియు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్, వీరిద్దరూ వడక్కు తిరువీధిపిళ్ళై కుమారులు. నంపిళ్ళై వారి ముఖ్య శిష్యులలో వడక్కు తిరువీధిపిళ్ళై, పెరియవాచ్చాన్  పిళ్ళై, పింభళగరాం పెరుమాళ్ జీయర్, కందాడై తోళప్పర్, ఈయుణ్ణి మాధవ పెరుమాళ్, నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ మొదలైనవారు ఉండేవారు.

nampillai-pinbhazakiya-perumal-jeer-srirangam

పింభళగరాం పెరుమాళ్ జీయర్ తో నంపిళ్ళై – శ్రీరంగం

మనము మళ్ళీ కలుసుకున్నపుడు, నంపిళ్ళై శిష్యుల గురించి చెప్తాను. వీరు ఎంతో దయతో  గొప్ప గ్రంథాలను మనకందించి, సంప్రదాయానికి అద్భుతమైన కైంకర్యాలను చేసారు.

పిల్లలు నంపిళ్ళైల చరిత్రను, వారి బోధనల గురించి ఆలోచిస్తూ వాళ్ళ ఇండ్లకు వెళ్ళారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2016/08/beginners-guide-nampillai/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

బాల పాఠము – నంజీయర్

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<<బాల పాఠము – పరాశర భట్టర్

పిల్లలందరూ కలిసి బామ్మగారింటికి వస్తారు.

బామ్మగారు: పిల్లలూ రండి. ఈ రోజు మనం పరాశర భట్టార్ల శిష్యులైన ఆచార్య నంజీయర్ల గురించి చెప్పుకుందాము.  ‘శ్రీ మాధవ’ గా జన్మించిన నంజీయార్లు, రామానుజుల ఆదేశంతో పరాశర భట్టర్ల ద్వారా సంప్రదాయంలోకి తీసుకురాబడతారు. భట్టర్లు తిరునేడుంతాండగం, శాస్త్రార్థాల ఆధారంతో మాధవాచార్యులను చర్చలో ఎలా గెలిచారో మనం చూశాము. ఒకప్పుడు అద్వైతులైన మాధవాచార్యులు, తరువాత పరాశర భట్టర్ల మాధ్యమంగా వైష్ణవులుగా మారి ‘నంజీయర్’ అనే పేరును తెచ్చుకుంటారు. వీరిని నిగమాంత యోగి అని, వేదాంతి అని కూడా పిలుస్తారు.

వ్యాస: నాన్నమ్మా! రామానుజులు, పరాశర భట్టర్ల వంటి గొప్ప ఆచార్యులు యాదవ ప్రకాశులు, గోవింద పెరుమాళ్ళు, యజ్ఞ మూర్తులు, శ్రీ మాధవాచార్యుల వంటి ఇతర తత్వాలను అనుసరించే వాళ్ళల్లో మార్పు తెచ్చిననట్లగా,  శైవ రాజు రామానుజులకు హాని తలపెట్టినా, వారిని ఎందుకు సంస్కరించే ప్రయత్నం చేయలేదు? శైవ రాజుల నుండి దూరంగా ఎందుకు వెళ్ళారు?

బామ్మగారు: వ్యాస, మన పూర్వాచార్యులకు ఎవరు సంస్కరించబడతారో ఎవరు కాదో బాగా తెలుసు. మనం చెప్పుకున్న ఆచర్యులందరి విషయములో వాళ్ళు ఎదుటి వాని వైభవాన్ని తెలుసుకొని, గౌరవంగా ఓటమిని అంగీకరించి, పెరియ తిరుమలై నంబి, రామానుజులు, భట్టర్ల చరణాల వద్ద శరణాగతి చేసి శ్రీ వైష్ణవ సంప్రదాయంలోకి ప్రవేశించారు. ఆ శైవ రాజు న్యాయమైన వాదనకు సిద్ధంగా లేరు కదా శ్రీమన్నారాయణుని ఆధిపత్యాన్నిగ్రహించి ఓటమిని కూడా స్వీకరించే మనసున్న వారు కాదు. పాత సామెత ఒకటుంది, “నిద్రపోతున్న వారిని మేల్కొలపడం సాధ్యం కాని నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాడిని మేల్కొలపడం సాధ్యం కాదు”. మన పూర్వాచార్యులకు ఎవరు నిజంగా నిద్రలో ఉన్నాడో ఎవరు నటిస్తున్నాడో బాగా తెలుసు. అందువల్ల వారి నిర్ణయాలు ప్రత్యర్ధులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. వ్యక్తులలో లోపాలు ఉన్నప్పటికీ, మన పూర్వాచార్యులు వారిని సంస్కరించాలని నిస్వార్థంగా ప్రయత్నించేవారు. ఎదుటి మనిషి మొండి పట్టు విరోధం చేస్తే కానీ తమ ప్రయత్నం మానుకునేవారు కాదు.

పరాశర: నాన్నమ్మా, మాధవాచార్యులకు ‘నంజీయర్’ అనే పేరు ఎలా వచ్చింది?

బామ్మగారు: వాదనలో మాధవాచార్యులపై పరాశర భట్టర్లు విజయం సాధించిన తరువాత, అతనికి అరుళిచ్చెయల్ నేర్చుకోమని నిర్దేశిస్తారు. మన సంప్రదాయ సూత్రాలను వారికి బోధించి భట్టర్లు శ్రీరంగానికి బయలుదేరుతారు. భట్టర్ వెళ్ళిన తరువాత, వారికి శిష్యుడు కావాలన్న మాధవాచార్యుల నిర్ణయానికి వారిద్దరు భార్యలు ఒప్పుకోరు. భార్యలతో కలహం, ఆచార్యుల నుండి విరహం సహించలేక, సన్యాసిగా మారాలని నిర్ణయించుకొని, ఆచార్యులతో ఉండటానికి శ్రీరంగానికి వెళతారు. వారి సంపదను మూడు భాగాలుగా విభజించి, తన ఇద్దరు భార్యలకు రెండు భాగాలనిచ్చి, మూడో భాగాన్ని భట్టర్లకు సమర్పించాలను తనతో తీసుకువెళతారు. సన్యాస దీక్షను స్వీకరించి శ్రీరంగానికి చేరుకుంటారు. శ్రీరంగంలో మాధవాచార్యులను చూసి భట్టర్, వారి అంకితభావానికి, ఆచార్యాభిమానానికి ముగ్ధులై వారిని “నంజీయర్” (మా ప్రియమైన జీయార్) అని పిలుస్తారు. అప్పటి నుండి వారు నంజీయర్ అని పిలువబడ్డారు. తమ ఆచార్యులతో నంజీయర్లు పరమ భక్తితో ఉండేవారు. వారి ఆచార్య భక్తి అనంతమైనది. వారు “ఒక వైష్ణవుడు మరో వైష్ణవుడి బాధను చూసి తల్లడిల్లితే, అటువంటి వ్యక్తి శ్రీవైష్ణవుడు” అని అనేవారు. వారి కాలంలోని శ్రీవైష్ణవులన్నా, అచార్యులన్నా నంజీయర్లకు ఎంతో గౌరవం ఉండేది.

నంజీయర్లు – తిరునారాయణపురం

అత్తుళాయ్: నాన్నమ్మా, నంజీయార్ల ఆచార్య భక్తి గురించిన కథలు కొన్ని మాకు చెప్పరా?

బామ్మగారు: ఒకసారి, భట్టర్ను పల్లకి ఊరేగింపులో, నంజీయర్లు తమ  త్రిదండాన్ని ఒక భుజాన భట్టర్ వారి పల్లకీని మరో భుజాన మోయాలని ప్రయత్నిస్తారు. ఇది గమనించిన భట్టర్ వారు “జీయా ! ఇది నీ సన్యాసాశ్రమానికి సరితూగదు. మీరు నన్ను ఎత్తుకోకూడదు” అని అంటారు. నంజీయర్ “మీ సేవకు నా త్రిదండం అడ్డంగా మారితే దానిని విరిచేసి సన్యాసాన్ని వదిలి పెడతాను” అని అంటారు.

ఇంకొక సందర్భంలో, నంజీయర్ల శిష్యులు వచ్చి భట్టర్ వారి రాకతో ప్రశాంతంగా ఉన్న ఈ నందనవనం శాంతిని కోల్పోయిందని ఫిర్యాదు చేస్తారు. నంజీయర్ అంటారు, “ఈ తోట ఉన్నదే భట్టర్ల సేవకోసం, వారి కుటుంబానికి సేవ చేయటం కోసం” అని చెప్పి స్పష్తీకరించి, బాగా గుర్తుపెట్టుకోమని హెచ్చరించారు.

ఆచార్యులు తమ శిరస్సుని శిష్యుల ఒడిళో పెట్టి పడుకునే ఆనవాయితీ ఉంది.  ఒకసారి, భట్టర్ విశ్రాంతి తీసుకోవాలని, నంజీయర్ల ఒడిళో తల పెట్టి చాలా సేపు విశ్రాంతి తీసుకుంటారు. నంజీయర్లు కదలకుండా అలాగే ఉంటారు. వారి ఆచార్య భక్తికి ఇది ఒక నిదర్శనం. భట్టర్ నంజీయర్లు ఇద్దరు ఎప్పుడూ ఆసక్తికరమైన సంభాషణలలో మునిగి ఉండేవారు.

వేదవల్లి: మన సంభాషణలు లాగానా?

బామ్మగారు (చిరునవ్వుతో): అవును, మన సంభాషణల లాగానే కానీ అవి ఇంకా చాలా ఆసక్తికరమైనవి!

ఒకసార, నంజీయర్లు, “ఎందుకు ఆళ్వార్లందరు రాముడి కంటే కృష్ణుడిపైన ఎక్కువ ఆకర్షితులై ఉండేవారు” అని భట్టర్ని అడుగుతారు. రాముడి పట్ల ఎక్కువ ఆదరణ ఉన్న భట్టర్ అంటారు, సాధారణంగా అందరూ కొత్త వాటిని గుర్తుంచుకుంటారు. కృష్ణావతారం రామావతారం కన్నా కొత్తది, ఇటీవలి అవతారం. అందువల్ల ఆళ్వార్లు కృష్ణుడిపైన ఎక్కువ మక్కువతో ఉండేవారు.

ఇంకొక సారి, “ఎందుకు మహాబలి పాతాళానికి వెళతారు? శుక్రాచార్యుడు ఎందుకు కంటిని పోగొట్టుకుంటారు? అని నంజీయర్ అడుగుతారు.  భట్టర్ వారు జవాబిస్తూ అంటారు, శుక్రాచార్యులు మహాబలిని తన మాటను నిలబెట్టుకోనివ్వలేదు. తన కంటిని కోల్పోయాడు. మహాబలి తన ఆచార్యుని మాట వినలేదు, అందుకని పాతాళ నివాసిగా శిక్షించబడ్డాడు. అందుచేత, ఇక్కడ, ఆచార్యలకు గౌరవం ఇవ్వడం ఎంత ముఖ్యమైనదో భట్టర్ నొక్కి చెబుతున్నారు. వారి మధ్య అనేక ఆసక్తికరమైన సంభాషణలు జరిగాయి. నంజీయర్లకు వారి రచనలలో ఆ సంభాషణలన్నీ కూడా సహాయపడ్డాయి.

ఒక రోజు నంజీయర్ తన రచనల అనుకరణ (కాపీలు) చేయాలని సంకల్పించి, ఈ కార్యాన్ని చేయగల సామర్థ్యం తమ శిష్యులలో ఎవరి ఉన్నదని ఆలోచిస్తుండగా, ‘నంబూర్ వరదరాజు’ చేయగలరని నిర్ణయించుకుంటారు. నంజీయర్లు తమ 9000 పడి కాలక్షేపాన్ని వరదరాజులకిచ్చి, ఏకైక మూల గ్రంథాన్ని కూడా వారికి ఇస్తారు. వరదరాజులు కావేరీ అవతల ఉన్న తన స్వస్థలానికి వెళ్లి నిరాటంకంగా కార్యాన్ని సంపన్నం చేయాలనుకొని, గ్రంథాన్ని తీసుకొని కావేరీ నదిని దాటుతుండగా, హటార్తుగా వరద రావడంతో ఈదటం మొదలు పెడతారు. గ్రంథం వారి చేతుల నుండి జారిపోయి వరదలో కొట్టుపోతుంది. వరదరాజులు కృంగి పోతారు. ఊరికి వెళ్ళాక తమ ఆచార్యులకు మ్రొక్కి, వారిచ్చిన కాలక్షేపమును గుర్తుచేసుకుంటూ 9000 పడి వ్యాఖ్యానాన్ని తిరిగి వ్రాయడం ప్రారంభిస్తారు. వీరు తమిళ భాషా నిపుణులు కావడం వలన, మంచి అర్ధాలు జతచేర్చి గ్రంథాన్ని పూర్తి చేసి చివరికి నంజీయర్కి తిరిగి ఇస్తారు. నంజీయర్లు వ్యాఖ్యానాన్ని చూసి మార్పులు ఉన్నాట్టు గమనించి, ఏమి జరిగిందో అడగగా, వరదరాజులు జరిగిన సంఘటన గురించి వివరిస్తారు. వరదరాజుల గొప్పతనాన్ని తెలుసుకొని నంజీయర్లు వారిని ఆప్యాయంగా ‘నంపిళ్ళై’ అని పిలుస్తారు. తన తరువాత సంప్రదాయ దర్శన ప్రవర్తకుడిగా ప్రకటిస్తారు. కొన్ని కొని విషయాలకు నంపిళ్ళై నంజీయర్ల కంటే మంచి వివరణలు ఇచ్చేవారు. నంపిళ్ళైల ఈ సామర్త్యాన్ని చూసి నంజీయర్లు వారిని ఎంతో మెచ్చుకునేవారు. ఇది నంజీయర్మ గొప్పతనానికి నిదర్శనం.

వ్యాస: నాన్నమ్మా, నంపిళ్ళై గురించి ఇంకా చెప్పరా మాకు?

బామ్మగారు: నంపిళ్ళై గురించి రేపు చెప్పుకుందాము. ఇప్పుడు ఆలస్యమైయ్యింది . ఇప్పుడు ఇంటికి వెళ్ళండి.

పిల్లలు భట్టర్, నంజీయర్, నంపిళ్ళైల గురించి ఆలోచిస్తూ వాళ్ళ ఇళ్లకు వెళ్తారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2016/08/beginners-guide-nanjiyar/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org