బాల పాఠము – నంపిళ్ళై శిష్యులు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<<బాల పాఠము – నంపిళ్ళై

పరాశర, వ్యాస, వేదవల్లి మరియు అత్తుళాయ్ తో కలిసి నాన్నమ్మ ఇంటికి వస్తారు, ఆండాళ్ నాన్నమ్మ వంటింట్లో వంట చేస్తున్నారు. పిల్లలు మాట్లాడుతూ రావడం చూసి వారిని స్వాగతించడానికి నాన్నమ్మ బయటకు వస్తారు.

నాన్నమ్మ : పిల్లలూ రండి. మీరు కాళ్ళు చేతులు కడుక్కొని గుడి నుంచి తెచ్చిన ఈ ప్రసాదం తీసుకోండి. క్రిందటిసారి మనం మన ఆచార్య నంపిళ్ళై గురించి చెప్పుకున్నాము. అప్పుడు నేను చెప్పినట్టుగా, ఈవేళ నంపిళ్ళై వారి ప్రముఖ శిష్యులైన వడక్కు తిరువీధి పిళ్ళై, పెరియ వాచ్చాన్ పిళ్ళై, పింభళగియ పెరుమాళ్ జీయర్, ఈయున్ని మాధవ పెరుమాళ్, నడువిళ్ తిరువీధి పిళ్ళై భట్టర్ గురించి మాట్లాడుకుందాము.

వ్యాస: నాన్నమ్మా, నంపిళ్ళైకి చాలా మంది శిష్యులు ఉన్నట్టున్నారు. మీరు వారి గురించి మాకు చెప్తారా?

నాన్నమ్మ: సరే, ఒకరి తరువాత ఒకరిని గురించి మనం చెప్పుకుందాము. మనం నంపిళ్ళై శిష్యుడు, వ్యాఖ్యాన చక్రవర్తి అయిన పెరియవాచ్చాన్ పిళ్ళైతో ప్రారంభిద్ధాం. ఈయన సేంగనూర్లో (తిరుచ్చంగనల్లూర్) యామునర్ కుమారుడిగా, కృష్ణ నామధేయంతో జన్మించారు, తరువాత పెరియవాచ్చాన్ పిళ్ళైగా పిలవబడ్డారు. వారు నంపిళ్ళై ప్రధాన శిష్యులలో ఒకరు, వారు నంపిళ్ళై నుండి అన్ని శాస్త్రార్ధాలను నేర్చుకున్నారు. వారు నాయనారాచ్చాన్ పిళ్ళైని తన దత్తపుత్రునిగా స్వీకరిస్తారు. తిరుక్కన్నమంగై ఎమ్పెరుమాన్ స్వయంగా తిరుమంగై ఆళ్వార్ వద్ద నుండి వారి పాసురాల అర్థాలను నేర్చుకోవాలని అనుకుంటారు – అందుకని తిరుమంగై ఆళ్వార్ నంపిళ్ళైగా ప్రకటమై, ఎమ్పెరుమాన్, పెరియవాచ్చాన్ పిళ్ళై గా ప్రకటమై అరుళిచ్చెయల్ అర్థాలను తెలుసుకుంటారు.

పెరియవాచ్చాన్ పిళ్ళై – సేంగనూర్

వ్యాస: నాన్నమ్మా, ఎందుకు పెరియవాచ్చాన్ పిళ్ళైని వ్యాఖ్యాన చక్రవర్తిగా పిలుస్తారు?

నాన్నమ్మ : పెరియవాచ్చాన్ పిళ్ళై మాత్రమే సంపూర్ణ అరుళిచ్చెయల్ కి వ్యాఖ్యానం వ్రాశారు.  రామాయణం మరియు అరుళిచ్చెయల్ పై వారికి ఉన్న నైపుణ్యం అసమానమైనది. అతను పాసురపడి రామాయణం అని పిలవబడే గ్రంథం వ్రాశారు, అక్కడ వారు ఆళ్వారుల పాసురాల నుండి మాత్రమే పదాలను తీసుకొని శ్రీరామాయణాన్ని ప్రస్ఫుటమైన రీతిలో వివరించి వ్రాశారు. వారు అనువదించి వ్రాయకపోయినట్లైతే, ఎవరూ కూడా అరుళిచ్చెయల్ నిగూఢమైన అర్థాన్ని తెలుసుకొని వాటి గురించి మాట్లాడగలిగేవారు కారు. వారు విస్తృతంగా మన పూర్వాచార్యులు రచించిన అన్ని గ్రంథాలకు వ్యాఖ్యానాలు పూర్తిచేశారు.

నంపిళ్ళై యొక్క ప్రముఖ శిష్యులలో వడక్కు తిరువీధి పిళ్ళై కూడా ఒకరు. శ్రీరంగంలో శ్రీకృష్ణ పాదర్ గా  జన్మించిన వీరు పూర్తిగా ఆచార్య నిష్ఠలోనే మునిగిఉండేవారు. వడక్కు తిరువీధి పిళ్ళైకి వారి ఆచార్యులైన నంపిళ్ళై యొక్క దయతో ఒక కుమారుడు జన్మిస్తాడు. వారి ఆచార్యులైన నంపిళ్ళై (లోకాచార్య అని కూడా పిలుస్తారు) యొక్క దీవెనలతో జన్మించినందున తన కుమారుడికి పిళ్ళై లోకాచార్య అని నామకరణం చేస్తారు. నంపిళ్ళై, లోకాచార్యగా పిలువబడే వెనకటి కథ మీకు గుర్తుందనుకుంటాను.

వ్యాస: అవును, నాన్నమ్మా. కందాడై తోళప్పర్ నంపిళ్ళైని లోకాచార్య గా పేర్కొన్నారు. మాకు ఆ కథ గుర్తుంది.

వడక్కు తిరువీధి పిళ్ళై – కాంచీపురం

నాన్నమ్మ : వడక్కు తిరువీధి పిళ్ళై తన పుత్రునికి పిళ్ళైలోకాచార్య అని పేరు పెట్టినప్పుడు, నంపిళ్ళై ఆ బిడ్డకు అళగియ మణవాలన్ అని నామకరణం చేయాలని వారి ఇచ్చను ప్రకటిస్తారు. నంపెరుమాళ్ అనుగ్రహంతో కొద్దికాలానికే వారికి రెండవ పుత్రుడు జన్మిస్తాడు. ఆ నవ శిశువుకి అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ అని నామకరణం చేస్తారు, ఎందుకంటే అతను అళగియ మణవాలన్ (నంపెరుమాళ్) యొక్క కృపతో జన్మించాడు కాబట్టి. ఈవిధంగా వడక్కు తిరువీధి పిళ్ళై తన ఆచార్యులైన నంపిళ్ళై యొక్క కోరిక నెరవేరుస్తారు. ఆ ఇద్దరు బాలురు రామ లక్ష్మణుల లాగా కలిసిమెలిసి పెరిగి గొప్ప విద్వాంసులుగా మారి మన సాంప్రదాయానికి గొప్ప కైంకర్యాలు చేయసాగారు. వారిద్దరికీ నంపిళ్ళై , పెరియవాచ్చాన్ పిళ్ళై, వడక్కు తిరువీధి పిళ్ళై, తదితరులవంటి గొప్ప ఆచార్యుల కృపా కటాక్షాలు మరియు మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ ఉండేది.

ఒకసారి వడక్కు తిరువీధి పిళ్ళై, తదీయారాధన కొరకై నంపిళ్ళైని తన తిరుమాలిగైకి (శ్రీవైష్ణవులు ఉండే గృహాలను తిరుమాలిగై అని పిలుస్తారు) ఆహ్వానిస్తారు. నంపిళ్ళై ఆ ఆహ్వానాన్ని స్వీకరించి వారి  తిరుమాలిగైకి వస్తారు. నంపిళ్ళై స్వయంగా తిరువారాధనం మొదలుపెడతారు, వారు కోయిల్ ఆళ్వార్ (పెరుమాళ్ సన్నిధి) లో తాటి ఆకులపై చక్కగా స్పష్టంగా వ్రాయబడిన, నమ్మాళ్వార్ రచించిన పాసురాలపై తాను చేసిన బోధనలు, ఉపన్యాసాలు మరియు వాటి వివరణలు చూస్తారు. ఆసక్తికరంగా, వాటిలో కొన్ని చదివి వడక్కు తిరువీధి పిళ్ళైని అవి ఏంటో అడుగుతారు. నంపిళ్ళై యొక్క ఉపన్యాసాలు విన్న తరువాత ప్రతిరోజు రాత్రి వాటిని వ్రాసి నమోదు చేసుకుంటారని వడక్కు తిరువీధి పిళ్ళై వివరిస్తారు. తన అనుమతి లేకుండా అలా ఎందుకు చేశారని ప్రశ్నిస్తారు. అతను పెరియవాచ్చాన్ పిళ్ళై యొక్క వ్యాఖ్యానాలకు (ఆళ్వారుల పాసురాల యొక్క అర్ధ వివరణలు) పోటీగా ఏమైనా చేస్తున్నారేమోనని అడుగుతారు. వడక్కు తిరువీధి పిళ్ళై అపరాధము మన్నించమని వెంటనే నంపిళ్ళై యొక్క చరణ కమలాలపై పడి భవిష్యత్తులో వాటిని సూచించడానికి మాత్రమే వ్రాశారని వివరిస్తారు. నంపిళ్ళై ఒప్పుకొని, వడక్కు తిరువీధి పిళ్ళైని వారి వ్యాఖ్యానాలను కీర్తిస్తారు. అటువంటి అపారమైన జ్ఞానం మరియు ఆచార్య అభిమానం వడక్కు తిరువీధి పిళ్ళై కలిగి ఉండేవారు.

పరాశర: ఆ వ్యాఖ్యానానికి ఏం జరిగింది? వడక్కు తిరువీధి పిళ్ళై వ్యాఖ్యనాన్ని పూర్తి చేశారా?

నాన్నమ్మ : అవును, వడక్కు తిరువీధి పిళ్ళై వ్యాఖ్యానం పూర్తి చేస్తారు, ఆ తిరువాయ్మోలి వ్యాఖ్యానాన్నే ప్రముఖంగా ఈడు 36000 పడి అని పిలుస్తారు. నంపిళ్ళై ఆ వ్యాఖ్యానాన్ని రాబోవు తరాలవారు కూడా నేర్చుకోవడానికి ఈయున్ని మాధవ పెరుమాళ్ కి ఇవ్వమని వడక్కు తిరువీధి పిళ్ళై ని ఆదేశిస్తారు.

nampillai-goshti1

నంపిళ్ళై కాళక్షేప గోష్టి – కుడినుండి రెండవ స్థానంలో కూర్చొని ఉన్న ఈయున్ని మాధవ పెరుమాళ్

వేదవల్లి: నాన్నమ్మా, నంపిళ్ళై ఇచ్చిన వ్యాఖ్యానంతో  ఈయున్ని మాధవ పెరుమాళ్ ఏమి చేశారు?

పట్టి: ఈయున్ని మాధవ పెరుమాళ్ ఆ వ్యాఖ్యానాన్ని తన కుమారుడైన ఈయున్ని పద్మనాభ పెరుమాళ్ కు బోధిస్తారు. ఈయున్ని పద్మనాభ పెరుమాళ్ తన ప్రియ శిష్యుడైన నాళుర్ పిళ్ళైకి బోధిస్తారు. ఈ విధంగా సరైన పద్ధతిలో ఒకరి తరువాత ఒకరి శిష్యులకు వెళుతూ వచ్చింది. నాళూరాచ్చాన్  పిళ్ళై నాళుర్ పిళ్ళై యొక్క కుమారులు మరియు ప్రియమైన శిష్యులు కూడా. నాళూరాచ్చాన్ పిళ్ళై వారి తండ్రి చరణకమలాల వద్ద ఈడు 36000 పడి నేర్చుకుంటారు. నాళూరాచ్చాన్  పిళ్ళైకి అనేక శిష్యులు ఉండేవారు, వారిలో తిరువాయ్మొలి పిళ్ళై ఒకరు. నాళూరాచ్చాన్  పిళ్ళై మరియు నాళుర్ పిళ్ళై, దేవపెరుమాళ్ కు మంగళాశాసనం చేయటానికి కాంచిపురానికి వెళ్ళినప్పుడు, ఈడు వ్యాఖ్యానాన్ని తిరువాయ్మొలి పిళ్ళైకి బోధించమని ఎమ్బెరుమాన్ స్వయంగా నాళూరాచ్చాన్  పిళ్ళైని ఆదేశిస్తారు.  తిరువాయ్మొలి పిళ్ళై ఇతరులతో పాటు ఈడు వ్యాఖ్యానాన్ని నాళూరాచ్చాన్ పిళ్ళై నుండి నేర్చుకుంటారు, తిరువాయ్మొలి పిళ్ళై ఈట్టు పెరుక్కర్గా (ఈడు వ్యాఖ్యానాన్ని పోషించి కాపాడేవాడా అని అర్థం) పిలవబడిన మణవాల మామునికి బోధిస్తారు. ఆ విధంగా క్రమేణా మణవాల మామునికి చేరుకుంటుందని తెలుసు అందుకే నంపిళ్ళై ఈ వ్యాఖ్యానాన్ని ఈయున్ని మాధవ పెరుమాళ్ కి అందజేస్తారు.

అత్తుళాయ్ : నాన్నమ్మా, ఈయున్ని మాధవ పెరుమాళ్ మరియు ఈయున్ని పద్మనాభ పెరుమాళ్ పేరులో “ఈయున్ని” అంటే ఏమిటి?

నాన్నమ్మ : “ఈథల్” అంటే తమిళంలో దానము. “ఉన్నుతల్” అంటే భుజించడం. ఈయున్ని అనగా అతను ఇతర శ్రీ వైష్ణవులకు వడ్డించిన తరువాత మాత్రమే తానూ భుజించే ధర్మసంబంధమైనవాడు అని అర్థం.

నంపిళ్ళై యొక్క మరో ప్రముఖ శిష్యుడు పింభళగియ పెరుమాళ్ జీయర్. నంజీయర్ (ఒక సన్యాసి) భట్టార్నిసేవించినట్టుగా, వారు సన్యాసి అయిఉండి కూడా (గృహస్థుడైన) నంపిళ్ళై ని సేవించేవారు. వారిని నంపిళ్ళై యొక్క ప్రియమైన శిష్యుడు మరియు పింభళగియ పెరుమాళ్ జీయర్ అని కూడా పిలుస్తారు. వారు తన జీవితాన్ని ఒక నిజమైన శ్రీ వైష్ణవుడిగా వారి ఆచార్యుల పట్ల అమితమైన భక్తి గౌరవాలతో జీవించారు. వారి ఆచార్యాభిమానం ప్రఖ్యాతిగాంచినది.

nampillai-pinbhazakiya-perumal-jeer-srirangam

నంపిళ్ళై చరణకమలాల వద్ద పింభళగియ పెరుమాళ్ జీయర్ – శ్రీరంగం

పరాశర: నాన్నమ్మా,  మీరు ఈరోజు నంపిళ్ళై మరియు వారి శిష్యుల మధ్య జరిగిన సంభాషణలు మాకు చెప్పలేదు. వారి మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణలను మాకు చెప్పండి.

నాన్నమ్మ : మన పూర్వాచార్యులు అందరూ కేవలం భగవత్ విషయం మరియు భాగవత కైంకర్యం గురించి మాత్రమే సంభాషించేవారు. ఒకసారి పింభళగియ పెరుమాళ్ జీయర్ అనారోగ్యంతో బాధపడుతున్నపుడు, తను తొందరగా కోలుకోవటానికి ఎమ్బెరుమాన్ని ప్రార్థించమని ఇతర శ్రీ వైష్ణవులని అడుగుతారు. సాధారణంగా మన సాంప్రదాయంలో, శ్రీ వైష్ణవులు ఎమ్బెరుమాన్ని ఏ ఇతర కోరికల కోసం ప్రార్థన చేయరాదు – అనారోగ్యం నుండి కోలుకోవడానికి కూడా. దీన్ని చూసి, నంపిళ్ళై శిష్యులు ఈ విషయం గురించి నంపిళ్ళై ని అడుగుతారు. నంపిళ్ళై మొదట ఇలా అంటారు, “వెళ్ళి అన్ని శాస్త్రాలలో నిపుణుడైన ఎంగళాళ్వాన్ ని అడగండి”. “శ్రీరంగం అంటే అనురాగం ఉండి ఉండవచ్చు అందుకని మరికొంత కాలం ఇక్కడ ఉండాలని కోరికేమో వారికి ” అని ఎంగళాళ్వాన్ అంటారు. నంపిళ్ళై వారి శిష్యులను అమ్మంగి అమ్మాళ్ ని అడగమని చెబుతారు, “నంపిళ్ళై కాలక్షేప గోష్ఠిని విడిచి వెళ్లాలని ఎవరు అనుకుంటారు? వారు ప్రార్ధన చేస్తున్నారేమో, నంపిళ్ళై కాలక్షేపాన్ని వినాలని.” చివరకు నంపిళ్ళై స్వయంగా జీయర్ ని అడుగుతారు. జీయర్ నంపిళ్ళై తో ఇలా అంటారు, “నిజమైన కారణం మీకు తెలిసినప్పటికీ, అది నా ద్వారా వినాలని అనుకుంటున్నారు. నేను ఇక్కడ ఉండాలని ఎందుకు అనుకుంటున్నానో చెప్తాను. ప్రతిరోజూ, మీరు స్నానం చేసిన తరువాత, మీ రూపం యొక్క దైవ దర్శనమును పొందగలుగుతున్నాను మరియు వింజామర సేవ చేయగలుగుతున్నాను. నేను ఈ సేవను విడిచిపెట్టి అప్పుడే పరమపదానికి ఎలా వెళ్ళను?”. అని అంటారు. అలా పింభళగియ పెరుమాళ్ జీయర్ ఒక శిష్యుని యొక్క నిజమైన స్వభావాన్ని వెల్లడి చేశారు – వారి స్వంత ఆచార్యల యొక్క దివ్య స్వరూపంపై పూర్తి భక్తి అనురాగాలు ఉండటమే అని. నంపిళ్ళై పై జీయర్ భక్తి గురించి విన్న వారంతా ఆశ్చర్యపోయారు. నంపిళ్ళై పై పింభళగియ పెరుమాళ్ జీయర్ కు ఎంత అనురాగం అంటే వారు పరమపద ఆలోచనను కూడా విస్మరించారు. వారి ఆచార్య నిష్ఠ అంత గాఢమైనది.

చివరిగా నంపిళ్ళై మరొక శిష్యుని గురించి మనం చూద్దాము – నడువిళ్ తిరువీధి పిళ్ళై భట్టర్. ప్రారంభంలో, నడువిళ్ తిరువీధి పిళ్ళై భట్టర్ నంపిళ్ళైపై అనుకూలమైన వైఖరి ఉండేది కాదు. వారి గొప్ప కుటుంబ వారసత్వం (కూరత్తాళ్వార్ మరియు పారాశర భట్టర్ యొక్క కుటుంబస్తుడు) కారణంగా అహంకారంతో నంపిళ్ళైని గౌరవించేవారు కాదు. వారు నంపిళ్ళై యొక్క చరణ కమలాల వద్ద శరణాగతి చేయడం వెనక చాలా ఆసక్తికరమైన కథ ఉంది.

నంపిళ్ళై కాళక్షేప గోష్టి – కుడినుండి మూడవ స్థానంలో కూర్చొని ఉన్న నడువిళ్ తిరువీధి పిళ్ళై భట్టర్

వ్యాస: కూరత్తాళ్వార్ వంశీయుడు అహంకార లక్షణాలు కలిగి ఉండటం ఎంత విచిత్రం. మాకు ఆ కథ చెప్పండి నాన్నమ్మ!

నాన్నమ్మ : సరే, కానీ వారి అనవసరమైన గర్వం ఎక్కువ కాలం ఉండలేదు! ఎంతైనా, వారు కూరత్తాళ్వారి మనుమడు కదా! ఒకసారి, నడువిళ్ తిరువీధి పిళ్ళై భట్టర్ రాజదర్బారుకి వెళ్తున్నారు. వారికి దారిలో పింభళగియ పెరుమాళ్ జీయర్ కలుస్తారు,తనతోపాటు వారిని కూడా రాజదర్బారుకి రమ్మని ఆహ్వానిస్తారు. రాజు వారిని స్వాగతిస్తారు, వారిని సత్కరించి ఆసనమిస్తారు. భట్టర్ యొక్క మేధస్సును పరీక్షించడానికి రాజు శ్రీ రామాయణం నుండి ఒక ప్రశ్న అడుగుతారు. వారంటారు, “శ్రీ రాముడు తనను తాను సాధారణ మానవుడినని మరియు దశరథుని ప్రియ పుత్రుడినని అంటారు. కానీ జటాయువు చివరి క్షణాలలో వున్నప్పుడు, శ్రీరాముడు జటాయువుకి వైకుంటం చేరుకుంటావని ఆశీర్వదిస్తారు. అతను ఒక సాధారణ మానవుడైతే, వైకుంటం చేరుకుంటావని ఒకరిని ఎలా ఆశీర్వదిస్తారు?”. భట్టర్ నోట మాటలేక స్పందించ లేకపోయారు. అంతలో రాజుగారు మరేదో పనిమీద పరధ్యానంలో వుంటారు. ఆ సమయంలో, భట్టార్ జీయర్ వైపు మళ్ళి “నంపిళ్ళై ఉంటే ఈ ప్రశ్నకు సమాధానం ఎలా వివరించి ఉండేవారు?” అని వారిని అడుగుతారు. జీయర్ సమాధానమిస్తూ “ఒక నిజాయితీ గల వ్యక్తి అన్ని ప్రపంచాలను నియంత్రించగలరని నంపిళ్ళై వివరించి ఉండేవారు”. భట్టార్, రాజువారికి ఆ సమాధానాన్ని వివరిస్తారు. రాజు ఆ సమాధానాన్ని అంగీకరించి వారిని సిరిసంపదలతో సత్కరిస్తారు. నంపిళ్ళై పై గొప్ప కృతజ్ఞతతో భట్టార్ నంపిళ్ళై ఇంటికి వెళ్లి వారి చరణ కమలాల యందు ఈ సంపదను ఉంచి వారికి శరణాగతి చేస్తారు. భట్టార్ నంపిళ్ళైకి చెప్తూ, “మీ బోధనల నుండి కేవలం ఒక్క చిన్న వివరణతో ఈ సంపద నాకు దక్కింది. మీ విలువైన సంబంధం / మార్గదర్శకత్వం నేను ఎప్పుడూ విస్మరిస్తూనే వచ్చాను. ఇప్పటి నుండి, నేను మీ సేవ చేస్తూ మన సాంప్రదాయ సూత్రాలను నేర్చుకుంటానని వారు నిశ్చయించుకుంటారు. నంపిళ్ళై భట్టార్ని స్వీకరించి వారికి మన సాంప్రదాయ తత్వార్థాలను బోధిస్తారు. కాబట్టి పిల్లలు, మీరు ఈ కథ నుండి ఏమి నేర్చుకున్నారు?

వేదవల్లి: వారి పూర్వీకుల ఆశీర్వాదంతో, భట్టర్ వారి గమ్యాన్ని చేరుకున్నారని తెలుస్తుంది.

అత్తుళాయ్ : నంపిళ్ళై యొక్క గొప్పతనం మరియు జ్ఞానం గురించి నేను తెలుసుకున్నాను.

నాన్నమ్మ : మీరు ఇద్దరూ చక్కగా చెప్పారు. కానీ ఈ కథ నుండి మనం మరో పాఠం కూడా నేర్చుకున్నాము.మనము మన ఆచార్యాల ద్వారా ఎమ్బెరుమాన్ని సమీపిస్తున్నప్పుడు వారు ఎలా స్వీకరిస్తారో, అటువంటి ఆచార్యులను చేరుకోవడం కేవలం శ్రీవైష్ణవుల దివ్య అనుబంధం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. దీనినే శ్రీవైష్ణవ సంబంధం లేదా అడియార్గల్ సంబంధం అని పిలుస్తారు. ఇక్కడ దైవ సంబంధమైన శ్రీవైష్ణవుడు ఎవరు భట్టార్ని నంపిళ్ళైతో కలిపింది?

పరాశర: పింభళగియ పెరుమాళ్ జీయర్!

నాన్నమ్మ : అవును! ఇక్కడ భాగవత సంబంధం యొక్క ప్రాముఖ్యత గోచరమౌతుంది. జీయర్, నంపిళ్ళై యొక్క ప్రియ శిష్యుడై నందు వలన, ఆచార్య జ్ఞానం (పరిజ్ఞానము) మరియు సంబంధం తో భట్టర్ ని అనుగ్రహించారు. నంపిళ్ళై మరియు వారి శిష్యుల చరణ కమలాలను మనం ధ్యానిద్దాం. మనం మరో సారి కలుసుకున్నపుడు, వడక్కు తిరువీధిపిళ్ళై వారి ఇద్దరు కుమారులు మరియు వారి అసమానమైన కైంకర్యాల గురించి మీకు చెప్తాను.

పిల్లలు వివిధ ఆచార్యలు మరియు వారి దివ్య సేవల గొప్పతనాన్ని గురించి ఆలోచిస్తూ వారి ఇంటికి వెళ్లిపోతారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2016/09/beginners-guide-nampillais-sishyas/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *