బాల పాఠము – పిళ్ళై లోకాచార్య మరియు నాయనార్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<<బాల పాఠము – నంపిళ్ళై శిష్యులు

పరాశర, వ్యాస, వేదవల్లి మరియు అత్తుళాయ్ తో కలిసి నాన్నమ్మ ఇంటికి వస్తారు, నాన్నమ్మ తిరుప్పావై పఠిస్తూ ఉంటే చూసి వారు ఆ పాఠం పూర్తయ్యేవరకు వేచి చూస్తారు. నాన్నమ్మ పాఠము పూర్తి అయ్యాక పిల్లలతో మాట్లాడుతూ లోపలికి రమ్మంటారు.

నాన్నమ్మ: పిల్లలూ! లోపలికి రండి!

వ్యాస: నాన్నమ్మా, క్రిందటిసారి మీరు వడక్కు తిరువీధి పిళ్ళై యొక్క కుమారుల గురించి చెప్తానని అన్నారు. వారి గురించి మాకు చెప్పరూ.

నాన్నమ్మ: అవును వ్యాస. ఈ రోజు మనం వడక్కు తిరువీధి పిళ్ళై యొక్క సుప్రసిద్ధులైన ఇద్దరు కుమారుల గురించి మాట్లాదాము. నేను క్రిందటిసారి చెప్పినట్లుగా, వారి ఆచార్యులైన నంపిళ్ళై మరియు నంపెరుమాళ్ యొక్క అనుగ్రహంతో, వడక్కు తిరువీధి పిళ్ళైకి ఇద్దరు కుమారులు పిళ్ళై లోకాచార్య మరియు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు జన్మించారు. ఆ ఇద్దరు బాలురు రామ లక్షణుల లాగా కలిసి పెరుగి గొప్ప విద్వాంసులుగా మారి మన సాంప్రదాయానికి గొప్ప కైంకర్యాలు చేశారు.

నంపిళ్ళై పరమపదానికి చేరుకున్న తరువాత, వడక్కు తిరువీధి పిళ్ళై మన సాంప్రదాయానికి తదుపరి ఆచార్యులై వారి కుమారులకు తాను తన ఆచార్యులైన నంపిళ్ళై నుండి నేర్చుకున్న అన్ని అంశాలను ఉపదేశిస్తారు. కొంతకాలం తర్వాత వడక్కు తిరువీధి పిళ్ళై వారి ఆచార్యులైన నంపిళ్ళైని ధ్యానిస్తూ తన చరమ తిరుమేనిని విడిచి  పరమపదానికి చేరుకుంటారు. వారి తరువాత వారి కుమారుడు పిళ్ళై లోకాచార్య మన సాంప్రదాయానికి ఆచార్యులుగా అధీష్టిస్తారు.

అత్తుళాయ్: నాన్నమ్మా,  పిళ్ళై లోకాచార్య ఎవరో కాదు దేవ పెరుమాళ్ అని నేను విన్నాను.

కాట్టళగియ కోయిల్ లో కాలక్షేపం చేస్తూ పిళ్ళై లోకాచార్య

నాన్నమ్మ: అవును అత్తుళాయ్, నువ్వు విన్నది నిజమే. పిళ్ళై లోకాచార్య ఎవరో కాదు స్వయంగా దేవ పెరుమాళే. జ్యోతిష్కుడిలో పిళ్ళై లోకాచార్య వారి ఆఖరి రోజులలో, మన సాంప్రదాయ తదుపరి ఆచార్యులు కావలసిన తిరుమలై ఆళ్వారు (తిరువాయ్మోలి పిళ్ళై) కి వ్యాఖ్యానాలు బోధించమని నాళూర్ పిళ్ళైని ఆదేశిస్తారు. తిరుమలై ఆళ్వారు దేవ పెరుమాళ్ మంగళాసాసం కోసం కాంచీపురానికి వెళ్ళినప్పుడు, దేవ పెరుమాళ్ పక్కనే నిలబడి ఉన్న నాళూర్ పిళ్ళైతో మాట్లాడుతూ అంటారు “నేను జ్యోతిష్కుడిలో చెప్పినట్లుగా మీరు తిరుమలై ఆళ్వారుకి అరుళిచ్చెయల్ అన్ని అర్థాలను నేర్పించాలి” అని అంటారు.

వేదవల్లి: నాన్నమ్మా, పిళ్ళై లోకాచార్య జ్యోతిష్కుడిలో ఎందుకు వారి చివరి రోజులు గడిపారు? వారు శ్రీరంగంలో జన్మించలేదా?

నాన్నమ్మ: పిళ్ళై లోకాచార్యులు అందరి ప్రయోజనం కోసం సులభమైన తమిళ భాషలో ఆళ్వార్ ల పాసురాలపై అందమైన గ్రంథాలు రాసిన ఒక గొప్ప ఆచార్యులు. సంస్కృతం లేదా తమిళ భాషల్లో అందరికీ ప్రావీణ్యం ఉండదు. భాషా ప్రావీణ్యం లేకపోయినా మన పూర్వాచార్యుల రచనల గురించి తెలుసుకొని లాభపడే కోరిక ఉన్నవారి కోసం పిళ్ళై లోకాచార్యులు గొప్ప దయతో వారి ఆచార్యుల నుండి విన్న ఉపదేశాలను సాధారణమైన, ప్రస్ఫుటమైన భాషలో రచించి ఉంచారు. వారి రచనలలో అతి గొప్పదైన శ్రీవచన భూషణం దివ్యమైన శాస్త్రం, మన సాంప్రదాయ అర్ధాల వివరాలను తెలియజేస్తుంది. అందువల్ల వారు ప్రమాణ రక్షణం (మన సాంప్రదాయం యొక్క పరిజ్ఞాన పునాదిని రక్షించడం / పోషించడం) చేసిన ముఖ్యమైన ఆచార్యులు.

పిళ్ళై లోకాచార్యులు – శ్రీరంగం

పిళ్ళై లోకాచార్య మన సాంప్రదాయ ఆధ్యాత్మిక జ్ఞానాధారాన్ని కాపాడుకోవడమే కాకుండా, మన సాంప్రదాయ మూలాధారమైన శ్రీరంగం నంపెరుమాళ్ని కూడా పరిరక్షించారు. శ్రీరంగంలో అన్ని కార్యాలు సక్రమంగా జరుగుతున్న రోజుల్లో హఠాత్తుగా ముస్లింల ముట్టడి అడవి మంటలా వ్యాపించింది. ఈ ముస్లిం రాజులు మన దేవాలయాల విస్తారమైన సంపదను లక్ష్యంగా చేసుకొని ఆక్రమించడంలో ప్రసిద్దులు, కావున అందరూ చాలా భయపడ్డారు. వెంటనే పిళ్ళై లోకాచార్య (శ్రీవైష్ణవ వరిష్ఠమైన ఆచార్య) పరిస్థితిని వారి నియంత్రణలోకి తీసుకుంటారు. పెరియ పెరుమాళ్ ఎదురుగా ఒక గోడను కట్టమని శ్రీవైష్ణవులను ఆదేశించి, నంపెరుమాళ్ మరియు ఉభయ నాచియార్లను తన వెంట తీసుకొని భారతదేశ దక్షిణదిశ వైపు బయలుదేరుతారు. వారు ఆ సమయంలో చాలా వృద్ధులు కానీ తన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా  నంపెరుమాళ్తో  పాటు ప్రయాణించారు. వారు అడవుల గుండా వెళుతుండగా, కొంతమంది దొంగలు వచ్చి, నంపెరుమాళ్ ఆభరణాలను దోచుకుంటారు. కొని, తరువాత పిళ్ళై లోకాచార్యులు  వారి మనస్సు మార్చుతారు, వారు పిళ్ళై లోకాచార్యులకు శరణాగతి చేసి ఆభరణాలను తిరిగి వారికి అప్పగిస్తారు.

ఆ తరువాత, వారు జ్యోతిష్కుడి (మధురై సమీపంలో) అనే ప్రదేశానికి చేరుకుంటారు. పిళ్ళై లోకాచార్య వృద్ధులై అనారోగ్యం కారణంగా, పరమపదానికి చేరుకోవాలని నిర్ణయించుకొంటారు. వారు తన శిష్యులలో ఒకరైన తిరుమలై ఆళ్వార్ (తిరువాయ్మోలి పిళ్ళై)ను తదుపరి ఆచార్యులుగా చేయాలని నిర్ణయించుకుంటారు. ఈ సమయంలోనే తిరుమలై ఆళ్వార్ కి వ్యాఖ్యానాలు బోధించమని  నాలూర్ పిళ్ళైని నిర్దేశిస్తారు. అప్పుడు శ్రీశైలేశ (తిరువాయ్మోలి పిళ్ళై) మధురై రాజు వద్ద పని చేస్తుండేవారు. వారిని సాంప్రదాయంలోకి తిరిగి తీసుకురావాలని కూరకులోత్తమ దాసు మరియు విలంచోలై పిళ్ళై ని ఆదేశిస్తారు, తద్వారా వారు తదుపరి ఆచార్యునిగా మారవచ్చునని వారిని నిర్దేశిస్తారు. చివరగా వారు తన చరమ తిరుమేనిని వదిలి, జ్యోతిష్కుడిలో పరమపదానికి చేరుకుంటారు. అలా పిళ్ళై లోకాచార్య నంపెరుమాళ్ భద్రత కోసం వారి జీవితాన్ని త్యాగం చేశారు. వారు మరియు వేలాది శ్రీవైష్ణవులు వారి జీవితాలను నంపెరుమాళ్ కోసం త్యాగం చేయకపోయుంటే ఈవాల్టి రోజు మనం శ్రీరంగంలో నంపెరుమాళ్ని దర్శనం చేసుకునే వాళ్ళం కాదు, సేవించుకునే వాళ్ళం కాదు.

జ్యోతిష్కుడి – పిళ్ళై లోకచార్యులు పరమపదించిన స్థానం

పరాశర: వారు స్వయంగా దేవ పెరుమాళ్ అవతారం అనడంలో అతిశయోక్తి లేదు, వారు త్యాగాల సంగ్రహము!

నాన్నమ్మ: అవును పరాశర, అందువల్ల దేవ పెరుమాళ్ని మన సాంప్రదాయ పెరుమాళ్ అని కూడా పిలుస్తారు. పిళ్ళై లోకాచార్య  ప్రమాణ రక్షణ (మన గ్రంథాల రూపంలో జ్ఞానాధారం యొక్క రక్షణ) మాత్రమే కాకుండా, వారు ప్రమేయ రక్షణం (నంపెరుమాళ్ యొక్క రక్షణ) లో కూడా కీలక పాత్ర పోషించారు. వారు నంపెరుమాళ్ యొక్క రక్షణ గురించి ఆలోచిస్తూ ఒక శ్రీవైష్ణవుని యొక్క నిజమైన లక్షణాన్ని మనకు చూపించారు. పెరయాళ్వార్ ఎమ్బెరుమాన్ యొక్క తిరుమేని గురించి ఆందోళన చెంది పల్లాండు పల్లాండు అని పాడి నట్టుగా, పిళ్ళై లోకాచార్య నంపెరుమాళ్ అర్చామూర్తిని పితృ వాత్సల్య భావంతో ప్రేమతో సంరక్షించారు, వారి జీవితాన్ని త్యాగము చేయటానికి సిద్ధమైనారేే కాని ముస్లిం ఆక్రమణదారులు నంపెరుమాళ్ని తీసుకువెళ్ళనివ్వలేదు. అందువల్ల, మీరు ఈసారి పెరుమాళ్ ఆలయానికి వెళ్ళినపుడు, నేడు మనకున్న ఈ సాంప్రదాయం వేలమంది శ్రీవైష్ణవులు చేసిన నిస్వార్ధమైన త్యాగంతో నిర్మించబడినదని మీరు గుర్తుంచుకోవాలి. వారు మన సాంప్రదాయాన్ని మరియు నంపెరుమాళ్ని కాపాడారు, ఎందుకంటే ఆ కారణంగా మనమూ, మన భవిష్యత్తు తరాలవారూ ఆ ఫలాన్ని పొందవచ్చునని. మనము వారి ఋణము ఎప్పుడూ తీర్చుకోలేము. వారికి కృతజ్ఞతగా వారి త్యాగాలను గుర్తుంచుకొని, మన సాంప్రదాయాన్ని గౌరవించి, ముందు తరాల వారికి ఆ విలువలను, జ్ఞానాన్ని అందించి ముందుకు తీసుకువెెెళ్ళవలెను.

అత్తుళాయ్: నానమ్మ, పిళ్ళై లోకాచార్య తమ్ముడైన అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్ గురించి మాకు చెప్పండి.

nayanar

అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్

నాన్నమ్మ: నాయనార్ మన సాంప్రదాయ సూత్రాలపై అద్భుతమైన గ్రంథాలు వ్రాశారు, వాటిలో ఆచార్య హృదయం శ్రేష్ఠమైన కృతి. వారికున్న సాంప్రదాయ, దివ్యదేశ జ్ఞానం వలన వారిని పెరియ వాచ్చాన్ పిళ్ళై లాంటి గొప్ప ఆచార్యులకు సమానంగా పరిగణిస్తారు.  నాయనార్ గొప్ప ఆచార్యులుగా ప్రశంసించబడే వారు. వారిని సాధారణంగా అందరూ  “జగత్ గురువరానుజ – లోకాచార్యకు తమ్ముడు” గా కీర్తించే వారు. పిళ్ళై లోకాచార్యను వదిలి నాయనార్ చిన్న వయస్సులోనే వారి తిరుమేనిని విడవాలని నిర్ణయించుకొని పరమపదాన్ని అధీష్టిస్తారు. వారి రచనలు జ్ఞాన రత్నాలు, ఆ రచనలు లేకపొతే మన సాంప్రదాయం యొక్క క్లిష్టమైన అర్థాలు, వివరాలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేవికావు. మాముని నాయనార్ని మరియు వారి రచనలను మెచ్చుకుంటూ పెరియ వాచ్చాన్ పిళ్ళై తరువాత, నాయనార్ వారి రచనలతో కీలక పాత్ర వహించారని కీర్తిస్తారు. నాయనార్ పరమపదం చేరుకున్నప్పుడు, పిళ్ళై లోకాచార్య దుఃఖ సాగరంలో పడి నాయనార్ యొక్క తిరుముడిని (తల) తన ఒళ్ళో ఉంచి విలపిస్తారు. ఈ ప్రపంచం వారిని కొద్ది కాలంలోనే కోల్పోయిందని వారు నాయనార్ని ఒక శ్రేష్ఠమైన శ్రీవైష్ణవ దృష్టితో చూస్తారు.

వ్యాస: నాన్నమ్మా, పిళ్ళై లోకాచార్య మరియు నాయనార్ వారి జీవితాలు వినడానికి చాలా ఆసక్తికరంగా మరియు భావోద్వేగంగా ఉన్నాయి.

నాన్నమ్మ: అవును వ్యాస. మన ఆచార్యుల జీవితాల గురించి మాట్లాడటం మొదలుపెడితే, సమయమే తెలియదు. బయట చీకటి పడుతోంది. పిల్లలు మీరిప్పుడు మీ ఇళ్లకి వెళ్లాలి. మనము ఈ సారి కలుసుకున్నప్పుడు పిళ్ళై లోకాచార్య శిష్యుల గురించి మీకు చెప్తాను.

పిల్లలు వడక్కు తిరువీధి పిళ్ళై, పిళ్ళై లోకాచార్య, అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్ మరియు వారి అద్భుతమైన జీవితాల గురించి ఆలోచిస్తూ వారి ఇంటికి వెళ్ళిపోతారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2016/09/beginners-guide-pillai-lokacharyar-and-nayanar/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *