బాల పాఠము – పరాశర భట్టర్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< ఎంబార్

పిల్లలందరు కలిసి ఆండాళమ్మ గారి ఇంటికి వస్తారు.

బామ్మగారు: పిల్లలు రండి, ఈ రోజు మనం ‘పరాశర భట్టర్’ గురించి చెప్పుకుందాము. ఎంబార్ల శిష్యులైన వీరు ఎంబెరుమానార్ల పట్ల ఎంతో భక్తి ప్రపత్తులతో ఉండేవారు. పిల్లలూ మీకు గుర్తుందా…. వ్యాస పరాశర ఋషులకు కృతజ్ఞతలు వ్యక్తపరస్తూ కూరత్తాళ్వాన్ల ఇద్దరు పుత్రులకు పరాశర భట్టరని, వేద వ్యాస భట్టరని ఎంబెరుమానార్లు నామకరణం చేస్తారు. ఆళవందార్లకు చేసిన ప్రమాణాలలో ఇది ఒకటి. పెరియ పెరుమాళ్ళ అనుగ్రహంతో కూరత్తాళ్వాన్, ఆండాళ్ దంపతులకు పరాశర భట్టర్, వేద వ్యాస భట్టర్ జన్మిస్తారు.

azhwan_bhattars
కూరత్తాళ్వాన్లు వారి కుమారులు పరాశర భట్టర్, వేద వ్యాస భట్టర్లతో

పరాశర: నాకూ, వ్యాసునికి ఈ ఆచార్యుల పేర్లే పెట్టారా?

బామ్మగారు: అవును పరాశర. సాధారణంగా పుట్టిన పిల్లలకు పెరుమాళ్ళు లేదా ఆచార్యుల పేర్లు పెడతారు.  పిల్లలను పిలిచేటప్పుడైన మనకి భగవన్నామాలను, ఆచార్యుల దివ్య పేర్లను పలికే అవకాశం దొరుకుతుంది. పెరుమాళ్తాయార్ల నామాలు, ఆచార్యుల నామాలను పెట్టడానికి కారణం ఖచ్చితంగా ఇదే. వారి పేర్లను పిలుస్తూ, వాళ్ళ మంగళ గుణాలను ధ్యానించే అవకాశం మనకు దొరుకుతుంది. లేకపోతే, ఈ రోజుల్లో, ఆచార్యులు పెరుమాళ్ళ దివ్య నామ జపం చేయడానికి  సమయం తీయడం కష్టమైపోయింది. ఈ రోజుల్లో పరిస్థితులు చాలా మారిపోయాయి. అందరూ అర్ధం లేని పేర్ల వెనుకబడి, పెరుమాళ్తాయార్లు, ఆచార్యులను పూర్తిగా మరచిపోతున్నారు.

శ్రీరంగానికి వచ్చిన తరువాత, కూరత్తాళ్వాన్ రోజూ భిక్షాటనకై (ఉంజవృత్తి) వెళ్ళేవారు. ఒక రోజు కుండపోత వర్షం పడుతున్న కారణంగా ఉంజవృత్తికి వెళ్ళలేకపోతారు. ఈ దంపతులిద్దరు ఆ రాత్రికి ఖాళీ కడుపుతో పడుకుంటారు. ఆండాళమ్మకి గుడి నుండి రాత్రి నైవేద్య ఘంటానాదం వినిపిస్తుంది. ఆవిడ పెరుమాళ్ళతో, “ఇక్కడ, మీ భక్తులు ప్రసాదం లేకుండా ఉంటే, అక్కడ మీరు భోగాన్ని అనుభవిస్తున్నారా?” అని చెప్పి బాధపడుతుంది. పరిస్తితిని గ్రహించి, పెరియ పెరుమాళ్ళు ఆలయ మర్యాదలతో తన ప్రసాదాలను ఉత్తమ నంబి ద్వారా ఆళ్వాన్ దంపతుల ఇంటికి పంపుతారు. ప్రసాదాలు రావడం చూసి ఆళ్వాన్ ఆశ్చర్యపోతారు. వెంటనే, వారు ఆండాళ్ ను “నువ్వేమైన పెరుమాళ్ళతో మొర పెట్టుకున్నావా?” అని అడుగుతారు. అవునంటుంది ఆండాళమ్మ. అందుకు ఆళ్వాన్లు కొంత కలవరపడి, అందులో నుండి రెండు గుప్పిల్ల ప్రసాదాన్ని మాత్రమే తీసుకొని, కొంచెం తాను తిని మిగిలినది ఆండాళమ్మకు ఇస్తారు. ఆ రెండు గుప్పిల్ల ప్రసాదమే వారికి అందమైన ఇద్దరు బిడ్డలను ప్రసాదిస్తుంది.

వ్యాస: నాన్నమ్మా, ఎంబార్లు భట్టారకు ఎలా ఆచార్యులైయ్యారు?

బామ్మగారు: ఆ ఇద్దరు పిల్లలు పుట్టగానే, వాళ్ళను చూసిన ఎంబార్ వారు, వాల్లిద్దరూ సంప్రదాయం కోసమే జన్మించారని తెలుసుకుంటారు. వాళ్ళ ముఖం తేజస్సుని చూసి వెంటనే వారికి దృష్ఠి తగలకూడదని రక్షణగా ద్వయ మహామంత్రాన్ని పఠిస్తారు. తరువాత, ఎంబెరుమానార్లు ఆ ఇద్దరు పిల్లలను చూసి వాళ్ళకు ద్వయ మహామంత్రంతో సంప్రదాయ ప్రవేశం అయిపోయిందని గమనిస్తారు. ఎంబార్ను అడిగి విచారించగా వారు ద్వయ మహామంత్రాన్ని పఠించినట్టు చెబుతారు. ఎంబార్ల ద్వారా ఆ పిల్లలు ద్వయ మహామంత్రం పొందినందువల్ల వారు ఆ పిల్లలకు ఆచార్యులైనారు. ఆ శిశువులిద్దరూ  ఎంబార్, ఆళ్వాన్ల వద్ద విద్య నేర్చుకుంటూ పెరిగి పెద్దవాళ్ళవుతారు. పెరియ పెరుమాళ్ళ అనుగ్రహంతో జన్మించి నందువల్ల, పిల్లలిద్దరికీ పెరియ పెరుమాళ్ళన్నా, పెరియ పిరాట్టి అన్నా మహాప్రీతి ఉండేది. పరాశర భట్టర్ను పెరియ పెరుమాళ్ళకు దత్తతివ్వమని ఆళ్వాన్ను ఎంబెరుమానార్లు నిర్దేశిస్తారు. తమ ఆచార్యుని సంకల్పం ప్రకారం అలాగే చేస్తారు. వాస్తవానికి స్వయంగా శ్రీరంగ నాచ్చియారే భట్టర్ను తన సన్నిధిలో పెంచిందని చెప్తారు. పెరియ పెరుమాళ్ళు, పిరాట్టి, భట్టర్ల మధ్య సంబంధం అటువంటిది. ఒకసారి, భట్టర్ పెరుమాళ్ళ సన్నిధిలో కొన్ని పాసురాలను పాడి బయటకు వస్తారు. వస్తుండగా రామానుజులు భట్టర్ని చూసి, అతనిలో తనని తాను చూసి, అనంతాళ్వాన్ను, ఇతర శిష్యులను పిలిచి తనతో సమానంగా భట్టర్తో వ్యవహరించమని నిర్దేశిస్తారు. తన తరువాత భట్టర్ను ధర్శప్రవర్తకునిగా రామానుజులు భావించేవారు. చిన్నతనం నుండి భట్టర్ మహా బుద్దిశాలి. వారి జ్ఞానం గురించిన అనేక కథలు ఉన్నాయి.

అత్తుళాయ్: వాటి గురించి మాకు చెప్పండి నాన్నమ్మా!

బామ్మగారు: ఒకసారి, భట్టర్ వీధిలో ఆడుకుంటునారు. సర్వజ్ఞ భట్టన్ అనే ఒక విద్వానుడు పల్లకిలో అటుగా వస్తున్నాడు. రామానుజుల వంటి గొప్ప విద్వానులున్న ఆ శ్రీరంగంలో, పల్లకిలో వారిని తీసుకురావడం చూసి భట్టర్ ఆశ్చర్యపోయి నేరుగా వారి దగ్గరకు వెళ్ళి తనతో వాదనకు రమ్మని సవాలు చేస్తారు. సర్వజ్ఞ భట్టన్ భట్టార్ను చూసి చిన్నపిల్లవాడనుకొని, చర్చలో గెలుపు తనదే అని ఊహిస్తారు. భట్టర్ తన గుప్పిట్లో కొంచెం ఇసుక తీసుకొని, తన చేతిలో ఎంత ఇసుక ఉందని అడుగుతారు. సర్వజ్ఞ నోట్లో నీళ్ళు నములుతూ తెలియదంటారు. “అరచేతి నిండా” అని జవాబు ఇచ్చుండవచ్చు కదా అని భట్టర్ అంటారు. భట్టర్ మేధాశక్తికి ఆశ్చర్యపోయి, సర్వజ్ఞ భట్టాన్ పల్లకి నుండి క్రిందకు దిగి వచ్చి భట్టార్ను ఎత్తుకొని అతని తల్లిదండ్రుల దగ్గరకు తీసుకువెళ్లి పొగుడుతారు.

వేదవల్లి: అది చాలా తెలివైన జవాబే నాన్నమ్మ!

బామ్మగారు: భట్టర్ చాలా చురుకైన పిల్లవాడు. పాఠాలను చటుక్కున పట్టేసేవాడు. తన బాల్య వయస్సులో గురుకులంలో చదువుకునే రోజుల్లో, ఒకానొక సందర్భంలో, భట్టర్ వీధిలో ఆడుకుంటున్నప్పుడు ఆళ్వాన్ వచ్చి, తరగతికి హాజరు కాకుండా వీధిలో ఎందుకు ఆడుకుంటున్నావు అని అడిగారు. భట్టార్ “ప్రతిరోజూ వాళ్ళు మళ్ళీ మళ్ళీ అదే పాఠాన్ని బోధిస్తున్నారు” అని అంటారు – సాధారణంగా ఒకే సందై 15 రోజులు చెప్తారు. అయితే భట్టర్ మొదటి రోజునే పాఠం నేర్చేసుకునేవారు. అతన్ని పరీక్షించడానికి ఆళ్వాన్ ఒక పాశురాన్ని పఠించమంటారు. భట్టర్ సునాయాసంగా చెప్పేస్తారు.

వ్యాస: తండ్రి లాగానే కొడుకు కూడా!

బామ్మగారు (చిరునవ్వుతో): అవును! కూరత్తాళ్వాన్లు కూడా మహా జ్ఞాని. వారికి గొప్ప జ్ఞాపకశక్తి ఉండేది. కూరత్తాళ్వాన్ల వినయం విధేయతలు భట్టార్కి వారసత్వంగా అబ్బాయి.  ఒక సారి ఒక కుక్క శ్రీరంగం ఆలయంలోకి వచ్చేస్తుంది. అలాంటి సందర్భాల్లో సాధారణంగా అర్చకులు గుడిని సంప్రోక్షించి శుభ్రం చేస్తారు. అక్కడి అర్చకులు ఒక లఘు సంప్రోక్షణ చేయాలని నిర్ణయించుకుంటారు. ఇది విని, భట్టర్ పెరియ పెరుమాళ్ళ దగ్గరకి పరిగెత్తుకుంటూ వెళ్లి,  రోజూ నేను గుడికి వస్తుంటాని, ఇంతవరకూ ఏ సంప్రోక్షణ చేయలేదు. కానీ ఇప్పుడు ఒక కుక్క గుడిలోకి వచ్చిందని సంప్రోక్షణ ఎందుకు చేస్తున్నారు? అని అడుగుతారు. అంతటి వినమ్ర స్వభావం ఉండేది వారికి. గొప్ప విద్వాంసులైనప్పటికీ, తనను తాను వారు కుక్క కన్నా తక్కువగా భావించేవారు. దేవ లోకంలో ఒక దేవతగా జన్మించే కంటే శ్రీరంగంలో ఒక కుక్కగా జన్మించటానికి ఇష్టపడతాను అని చెప్పేవారు.

వేదవల్లి: నాన్నమ్మా, శ్రీరంగ నాచ్చియార్ భట్టర్ని తన బిడ్డలా పెంచిందని చెప్పారు కదా! అయితే పెరుమాళ్ళు పిరాట్టితో వీరు మాట్లాడేవారా, తిరుక్కచ్చి నంబి దేవ పెరుమళ్ళతో మాట్లాడినట్టుగా?

బామ్మగారు: అవును వేదవల్లి. భట్టర్ కూడా పెరియ పెరుమాళ్ళతో పిరాట్టితో మాట్లాడేవారు. మీకు తెలుసా, సంవత్సరానికి ఒకసారి, వైకుంట ఏకాదశికి ముందు రోజు, పగల్ పత్తు ఉత్సవం 10 వ రోజున, నంపెరుమాళ్ళు నాచ్చియార్ అలంకరణతో ఊరేగింపుగా వస్తారు. ఆ రోజు శ్రీరంగ నాచ్చియార్ తిరువాభరణాలను ధరించి నాచ్చియార్లాగా అందంగా ఆసీనులౌతారు. ఒకసారి నంపెరుమాళ్ళు భట్టర్ను పిలిచి తాను తాయార్లాగా కనిపిస్తున్నానా? అని అడుగుతారు. భట్టరెప్పుడూ తాయార్ పక్షపాతి. భక్తితో ప్రేమతో నంపెరుమాళ్ళను చూసి, అలంకారంలో కొరత లేదు కానీ వారి నేత్రాలలో కరుణ కానరావట్లేదని అంటారు. తన తల్లి అయిన నాచ్చియార పట్ల వారికున్న ప్రేమ అలాంటిది.

భట్టార్ను అనుసరించేవారు వందలాదిమంది ఉండేవారు. క్రమం తప్పకుండా వారి కాలక్షేపాలను విని, వారి బోధనలకు ప్రభావితులైన వారు ఎందరో ఉండేవారు. అయినప్పటికీ,  కొందరు భట్టర్ని ఇష్టపడేవారు కాదు. మహా వ్యక్తులకిది మామూలే. ఇది రామానుజులకు కూడా జరిగింది. ఒకసారి, భట్టర్ని ఇష్టపడని కొందరు, అసూయతో వారిని నిందించడం మొదలుపెట్టారు. ఎవరైనా మీ పైన అరిస్తే నువ్వు ఏం చేస్తావు, వ్యాసా?

వ్యాస: అతనిపై తిరిగి అరుస్తాను. నేను ఎందుకు భరించాలి?

బామ్మగారు: అదే పెద్దలు కూడా చేసేది. కానీ మీకు తెలుసా భట్టర్ ఏమి చేసారో? తన ఆభరణాలను, ఖరీదైన శాలువలను తనపై కేకలు వేసిన వ్యక్తికి బహుమానంగా ఇస్తారు. “ప్రతి శ్రీ వైష్ణవుడు రెండు పనులు చేయాల్సిన అవసరం ఉంది – ఒకటి భగవత్ స్తుతి చేయడం, రెండవది తమ లోపాల గురించి ఆలోచించడం. నేను భగవత్ స్తుతి చేయడంలో మునిగిపోయి నా లోపాల గురించి విచారించడం మరచిపోయాను. నా బాధ్యతను గుర్తుచేసి నాకు ఎంతో మేలు చేశావు, అందువల్ల నేను నీకు బహుమానం ఇస్తున్నాను” అని అంటారు. వారి మనోభావన అలాంటిది.

పరాశర: నాన్నమ్మా, నంజీయర్ను సాంప్రదాయంలోకి తీసుకురమ్మని రామానుజులు భట్టర్ని ఆదేశించారని మీరు చెప్పినట్టు నాకు గుర్తుంది. భట్టర్ అది ఎలా చేశారు?

పరాశర భట్టర్ (తిరువడిలో నంజీయర్) – శ్రీరంగం

బామ్మగారు: నీకు ఇంకా గుర్తుందా? చాలా సంతోషం. అవును, రామానుజుల దివ్య సూచనల ప్రకారం, నంజీయర్ను సంప్రదాయంలోకి తీసుకురావడానికి భట్టర్ తిరునారాయణపురానికి వెళతారు. ఇంతకు ముందు ఈ చోటు గురించి మనం విన్నాము? ఎప్పుడో ఎవరికైనా గుర్తుందా?

వేదవల్లి: నాకు గుర్తుంది. రామానుజులు సంస్కరించిన అనేక దేవస్థానాలలో తిరునారాయణపురం ఒకటి. రామానుజులు మెల్కోటేలో ఆలయ విధులను పునరుద్ధరించారు.

బామ్మగారు: చాలా మంచిది వేదవల్లి. ముస్లిం దోపిడీదారుల బారి నుండి ఉత్సవ మూర్తి సెల్వప్పిళ్ళైని తిరిగి తెచ్చి, తిరునారాయణపురం ఆలయ వ్యవస్థను రామానుజులు సరిచేస్తారు. మాధవాచార్యుల (నంజీయర్ యొక్క అసలు పేరు) తదీయారాధన కూటం (భాగవతుల భోజనాలయం) కు భట్టరు వెళ్ళి, తాను తినకుండా అక్కడే మాధవాచార్యుల కోసం ఎదురుచూస్తుంటారు. అది గమనించిన మాధవాచార్యులు భట్టరు వద్దకు వచ్చి, ఎందుకు తినలేదో వారికి ఏం కావాలో అడుగుతారు. వారితో వాదించాలని ఉందని భట్టర్ కోరుతారు. భట్టర్ గొప్పతనం గురించి విన్న మాధవాచార్యులు వెంటనే అంగీకరిస్తారు. భట్టర్ మొదట తిరునెడుందాండకం ప్రబంధాన్ని, తరువాత శాస్త్రార్థాల ఆధారంగా భగవత్ ఆధిపత్యాన్ని నిరూపిస్తారు. మాధవాచార్యులు ఓటమిని అంగీకరించి, భట్టర్ల చరణాలపైన పడి, తనను వారి శిష్యులుగా స్వీకరించమంటారు. భట్టర్ శిష్యునిగా సంప్రదాయ అర్థాలతో పాటు, అరుళిచ్చెయల్ కూడా నేర్చుకుంటారు. శ్రీరంగానికి చేరుకాగానే భట్టర్ వారికి గొప్ప స్వాగతం లభిస్తుంది. భట్టర్ రాకకై ఆత్రంగా ఎదురుచూస్తున్నపెరియ పెరుమాళ్ళు ఆసక్తితో మొత్తం సంఘటనను భట్టర్ నోటివెంట వింటారు. భట్టర్ విజయంతో ఆనందపడి పెరియ పెరుమాళ్ళు మళ్ళీ తిరునెడుందాండకంను చదివి వినిపించమని భట్టర్ని కోరతారు.

భట్టార్కి నంపెరుమాళ్ళ తిరుమేని అన్నా, నాచ్చియార్ల తిరుమేని అన్నా మహా ప్రీతి ఉండేది. ఒక సారి పెరియ పెరుమాళ్ళ ఎదుటా కొన్ని పాశురాలను, వాటి అర్ధాలను పఠిస్తుండగా, పెరుమాళ్ళు ఎంతో సంతోషించి “ఇప్పుడే నీకు మోక్షాన్నిస్తాను” అని అంటారు. భట్టర్ సంతోషించి నంపెరుమాళ్ళతో, తనకు పరమపదంలో కూడా నంపెరుమాళ్ళే దర్శనం ఇవ్వకపోతే అక్కడ నుండి ఒక రంధ్రం చేసి దూకి శ్రీరంగానికి తిరిగి వచ్చేస్తానని అంటారు. ఒక సారి అనంతాళ్వాన్లు పరమపదనాథునికి 2 చేతులు ఉంటాయా లేక 4  చేతులు ఉంటాయా అని భట్టర్ని ప్రశ్నిస్తారు. భట్టర్, ఒకవేళ వారికి 2 చేతులుంటే వారు పెరియ పెరుమాళ్ళ లాగా కనిపిస్తారు లేక ఒకవేళ 4 చేతులు ఉంటే నంపెరుమాళ్ళా లాగా కనిపిస్తారు అని సమాధానమిస్తారు. భట్టర్ నంపెరుమాళ్ళకు మించి ఇంకెవరినే చూసేవారు కాదు. వారు పెరుమాళ్ళ ప్రతి రూపాన్ని నంపెరుమాళ్ళ సంబంధంతోనే చూసేవారు. నంపెరుమాళ్ళు వీరికి మోక్షాన్ని ప్రసాదిస్తారు. వారి తల్లి అండాళ్ ఆశీర్వాదంతో ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి, ఆచార్యులకు నిత్య కైంకర్యం చేయడానికి పరమపదానికి చేరుకుంటారు. మన శ్రీ వైష్ణవ సాంప్రదాయం బాధ్యతను తదుపరి ఆచార్యులైన నంజీయర్కి అప్పగిస్తారు.

అత్తుళాయ్: నాన్నమ్మా, వినడానికి భట్టర్ చరిత్ర చాలా బాగుంది. నంపెరుమాళ్ళతో వారి సంబంధం, భక్తి గురించి వింటే మనస్సు కరిగిపోతుంది. అటువంటి భర్తను, పుత్రులను పొందిన ఆండాళమ్మ ధన్యురాలు.

బామ్మగారు:  అవును అత్తుళాయ్. నిజంగా ఆండాళమ్మ ధన్యురాలు. రేపు, నేను నంజీయర్ గురించి చెబుతాను. ఇప్పుడు ఈ పండ్లు తీసుకొని ఇంటికి వెళ్లండి.

పిల్లలు భట్టర్ వారి చరిత్రను స్మరించుకుంటూ ఇంటికి వెళ్తారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2016/08/beginners-guide-bhattar/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment