శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
పిల్లలందరు కలిసి బామ్మగారింటికి వచ్చారు.
బామ్మగారు: పిల్లలూ! రండి. మీ చేతులు కాళ్ళు కడుక్కొని ప్రసాదం తీసుకోండి. రేపు ఏరోజో మీకు తెలుసా? రేపు ఆళవందార్ల తిరునక్షత్రం రోజు. ఆషాడ మాసం, ఉత్తరాషాడ నక్షత్రం. అళవందార్ల గురించి ఇక్కడ ఎవరికి గుర్తుంది?
అత్తుళాయ్: నాకు గుర్తుంది! రామానుజులను మన సాంప్రదాయంలోకి రప్పించమని దేవ పెరుమాళ్ళను ప్రార్థించింది వీరే.
వ్యాస: అవును. అంతేకాకుండా, వీరు పరమపదం చేరుకున్న తరువాత, వారి తీరని మూడు కోరికలను చూచిస్తూ, వారి చరమ తిరుమేనిలో మూడు వేళ్లు ముడుచుకొని ఉంటాయి. వాటిని పూర్తి చేస్తానని రామానుజులు ప్రమాణం చేస్తారు. రామానుజులు మాట ఇచ్చిన వెంటనే, ఆ మూడు వేళ్ళు విప్పుకుంటాయి.
పరాశర: నాన్నమ్మా, రామానుజులు ఆళవందార్ల మధ్య ఆత్మసంబంధం అని, ఇంద్రియాలకు అతీతమైనదని మీరు చెప్పినట్టు మాకు గుర్తుంది.
బామ్మగారు: అవును! రేపు వారి తిరునక్షత్రం. ఈ ప్రసాదం తీసుకోండి. రేపు గుడికెళ్లి రామానుజులను సాంప్రదాయంలోకి తెచ్చిన ఆ గొప్ప ఆచార్యులను సేవించడం మర్చిపోకండి. ఇక మనం రామానుజుల తరువాత వచ్చిన ఆచార్యుడు ‘ఎంబార్’ గురించి తెలుసుకుందాం. కమల నయన భట్టార్, శ్రీదేవి అమ్మగారికి పుత్రునిగా మధురమంగళంలో ‘ఎంబార్’ జన్మించారు. వీరికి ‘గోవింద పెరుమాళ్’ అని జన్మనామము. కానీ గోవింద భట్టార్, గోవింద దాసు, రామానుజ పదఛాయ అని కూడా పిలుస్తారు. వీరు రామానుజులకు బంధువు అవుతారు. రామానుజులపైన హత్యా ప్రయత్నం జరిగినప్పుడు రక్షించింది కూడా వీరే.
వేదవల్లి: హత్య !నాన్నమ్మా? రామానుజుల జీవితంలో వారిపైన నేను ఒకసారి మాత్రమే హత్యా ప్రయత్నం జరిగిందని భావించాను. అప్పుడు కూరత్తాళ్వాన్లు పెరియ నంబి వారు కలిసి వారి ప్రాణాలను రక్షిస్తారని గుర్తుంది. వీరిపైన ఎన్నిసార్లు హత్యా ప్రయత్నం జరిగింది నాన్నమ్మా?
బామ్మగారు: ఎన్నోసార్లు! సమయం వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను. మొదటిసారి, వారి గురువు యాదవప్రకాశులు వారిని చంపాలని అనుకుంటారు. రామానుజులకు యాదవప్రకాశులకు మధ్య వేదార్ధాల గూర్చి అభిప్రాయ భేదాలు ఎప్పుడూ తలెత్తుతూనే ఉండేవి. యాదవప్రకాశులు వేదవాక్యాలను తారుమారు చేసి తప్పుడు అర్ధాలు చెప్పేవారు. అది విన్నప్పుడల్లా రామానుజులకు బాధ కలిగేది. విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రకారం అర్థాలను వివరించేవారు. యాదవప్రకాశులు ఒక అద్వైతి. రామానుజులు ఇచ్చిన వివరణలను అంగీకరించేవారు కాదు. రామానుజుల వివరణలు యదార్ధమే అని తెలిసినప్పటికీ, తనను పోటీగా భవించే వారు. రామానుజులు తనను ఆచార్య స్థానం నుండి తొలగించేస్తాడేమోనని భావించేవారు. కాని రామానుజులకు అణువు మాత్రం కూడా అలాంటి ఉద్దేశ్యం ఉండేది కాదు. అలా యాదవప్రకాశుల మనస్సులో రామానుజుల పట్ల అసూయా ద్వేషాలు మొలకెత్తుతాయి. యాదవప్రకాశులు వారి శిష్యులతో కలిసి కాశీ యాత్రకు వెళ్లినప్పుడు రామానుజులను చంపడానికి ప్రయత్నిస్తారు. ఇది తెలిసిన గోవింద పెరుమాళ్ళు రామానుజులకు తెలియచేస్తారు. రామానుజులను తప్పించుకొని దక్షిణం వైపున్న కాంచీపురానికి వెళితే ప్రాణాలు దక్కుతాయని చెబుతారు. రామానుజులు వెంటనే అక్కడి నుండి బయలుదేరి తప్పించుకుంటారు. ఇలా, గోవింద పెరుమాళ్ళు రామానుజుల ప్రాణాలను కాపాడతారు.
వ్యాస : నాన్నమ్మా, గోవింద పెరుమాళ్ళు కూడా యాదవప్రకాశుల శిష్యులేనా?
బామ్మగారు: అవును వ్యాస. గోవింద పెరుమాళ్లు రామానుజులిద్దరూ కలిసి యాదవప్రకాశుల వద్ద విద్యాభ్యాసం చేస్తుండేవారు. రామానుజులు తిరిగి వెళ్ళిపోయినప్పటికీ, గోవింద పెరుమాళ్ళు తమ యాత్రను కొనసాగించి, శివభక్తుడుగా మారి కాళహస్తిలో అనే స్థలంలో ఉంటూ ఉళ్ళంగై కొండ నాయనార్ గా పిలువబడ్డారు. ఇది తెలుసుకున్న రామానుజులు, గోవింద పెరుమాళ్ళను సంస్కరించి సంప్రదాయంలోకి తీసుకురమ్మని తమ మామగారైన పెరియ తిరుమలై నంబిని పంపుతారు. పెరియ తిరుమలై నంబి కాళహస్తికి వెళ్లి నమ్మాళ్వార్ల పాశురాలను, ఆళవందార్ల స్తోత్రరత్న శ్లోకాలను వినిపించి సంస్కరించేందుకు ప్రయత్నిస్తారు. గోవింద పెరుమాళ్ళు తన తప్పు తెలుసుకొని సంప్రదాయంలోకి తిరిగివస్తారు. కాబట్టి పిల్లలు, ఆళవందార్లు పరమపదం చేరిన తరువాత కూడా, రామానుజులు మాత్రమే కాకుండా వారి సోదరుడైన గోవింద పెరుమాళ్ళను కూడా సంప్రదాయంలోకి తీసుకురావడంలో సాధనమైనారు.పెరియ తిరుమలై నంబి ఆచార్యులుగా గోవింద పెరుమాళ్ళకు పంచ సంస్కారం చేసి, ఇద్దరూ తిరుపతికి తిరిగి వస్తారు. గోవింద పెరుమాళ్ళు తమ ఆచార్య కైంకర్యాలను నిర్వహిస్తుండేవారు. ఇక్కడ, మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. రామానుజులు పెరియ తిరుమలై నంబి గోవింద పెరుమాళ్ళ వద్దకు వెళ్లి సంస్కరించారే కానీ, గోవింద పెరుమాళ్ళు వీరి వద్దకు రాలేదు. మీరిది గమనించాలి. ఇలా తమ శిష్యుల శ్రేయస్సు కోసం వాళ్ళ దగ్గరకు వెళ్లి, ఆ శిష్యుల బాగు పట్ల నిస్వార్థ భావంతో శ్రద్ధ చూపే ఆచార్యులను ‘కృపా మాత్ర ప్రసన్నాచార్యులు’ అని పిలుస్తారు. రామానుజులు, పెరియ తిరుమలై నంబి వారిద్దరూ గోవింద పెరుమాళ్ళకు కృపా మాత్ర ప్రసన్నాచార్యులే.
పరాశర: నాన్నమ్మా, గోవింద పెరుమాళ్ళ గురించి ఇంకా చెప్పరా, ఏ కైంకర్యాలు చేశారు?
బామ్మగారు: గోవింద పెరుమాళ్ళు పెరియ తిరుమలై నంబి వారి పట్ల చూపిన ఆచార్యాభిమాన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఒకానొక సమయంలో, పెరియ తిరుమలై నంబి పడుకోవటానికి గోవింద పెరుమాళ్ళు పడక తయారుచేస్తున్నారు. గోవింద పెరుమాళ్ళు తమ ఆచార్యుల ఆ పడకపై వారే పడుకుంటారు. ఈ విషయం తెలుసుకొని తిరుమలై నంబి వారు గోవింద పెరుమాళ్ళను అడిగారు. గోవింద పెరుమాళ్ళు తాను అల చేసినందుకు నరకానికి వెళ్ళినా ఫరవాలేదు కాని ఆచార్యుల పడక మెత్తగా హాయిగా ఉండాలనంటారు. ఇది వారికున్న ఆచార్యాభిమానాన్ని చూపిస్తుంది. ఇక్కడ వారు తనను తానూ పట్టించుకోకుండా ఆచార్యుల తిరుమేనిపై ఎక్కువ శ్రద్ధ వహించారు. రామానుజులు పెరియ తిరుమలై నంబి వద్ద శ్రీ రామాయణ సారాన్ని నేర్చుకోవడానికి తిరుపతికి వచ్చే సమయం ఆసన్నమైంది. ఒక సంవత్సరం పాటు నంబి వద్ద అభ్యసించిన తరువాత, తిరిగి బయలుదేరే సమయంలో రామానుజులను ఏదైనా అడగమంటారు. రామానుజులు కైంకర్యం కోసం గోవింద పెరుమాళ్ళను ఇవ్వమంటారు. నంబి సంతోషంగా అంగీకరిస్తారు. కానీ, గోవింద పెరుమాళ్ళు తిరుమలై నంబి నుండి దూరం వెళ్ళడానికి ఇష్టపడరు.
వ్యాస : నాన్నమ్మా, ఎందుకు గోవింద పెరుమాళ్ళను పంపిస్తారు? తమ ఆచార్య కైంకర్యం సంతోషంగా చేస్తున్నప్పుడు గోవింద పెరుమాళ్ ఎందుకు వెళ్ళాలి?
బామ్మగారు: రామానుజుల వద్ద ఉండి అనేక కైంకర్యాలను చేస్తూ సంప్రదాయంలో గోవింద పెరుమాళ్ళు గొప్ప పాత్ర వహించాల్సి ఉంది. తన చిన్ననాటి నుండి రామానుజుల పట్ల ప్రేమాభిమానాలతో ఉండేవారు. రామానుజులు పరమపదానికి చేరుకున్న తరువాత, రామానుజుల శిష్యులకు, పరాశర భట్టార్లకు వీరే మార్గదర్శిగా ఉండేవారు. ఇన్ని బాధ్యతలు ఎదురుచూస్తుండగా, గోవింద పెరుమాళ్ళు తమ ఆచార్యుడిని త్యాగం చేసివలసిందే, తన మార్గదర్శిగా రామానుజులను స్వీకరించాల్సిందే. కానీ క్రమేణా వారు రామానుజులను తన సర్వస్వంగా భావించారు. రామానుజుల తిరుమేని సౌందర్యాన్ని వర్ణిస్తూ పాశురాన్ని వ్రాసారు. దానినే “ఎంబెరుమానార్ వడివళగు పాశురం” అని పిలుస్తారు. సంప్రదాయం విషయానికి వస్తే, అందరి ఉన్నతి కోసం దేనినైనా త్యాగం చేయటానికి సిద్ధంగా ఉండాలి. గోవింద పెరుమాళ్ళు కూడా అదే చేశారు.
అత్తులాయ్ : గోవింద పెరుమాళ్ళు పెళ్లి చేసుకున్నారా? వారికి పిల్లలు ఉన్నారా?
బామ్మగారు: గోవింద పెరుమాళ్ళు నిరంతరం భగవత్ విషయంలో మునిగి ఉండేవారు. ప్రతి వస్తువులో, ప్రతి ఒక్కరిలో భగవంతుణ్ణి చూసేవారు. వారికి వివాహం అయ్యింది కానీ, గోవింద పెరుమాళ్ళకున్న భగవత్ విషయాసక్తిని చూసి, ఎంబెరుమానార్లు స్వయంగా గోవింద పెరుమాళ్ళకు సన్యాసాశ్రమ స్వీకారం చేయించి ‘ఎంబార్’ అన్న నామాన్ని ప్రసాదిస్తారు. ఎంబార్లు తమ ఆఖరి రోజులలో, పరాశర భట్టార్ని పిలిచి అందమైన మన ఈ శ్రీవైష్ణవ సాంప్రదాయాన్ని ముందుకు నడిపించమని నిర్దేశిస్తారు. రామానుజుల తిరువడిని నిరంతరం ధ్యానించమని, “ఎంబెరుమానార్ తిరువడిగాళే తంజం” అని జపం చేయమని నిర్దేశిస్తారు. తాను తమ ఆచార్యునికిచ్చిన మాటను నిలబెట్టమని చెప్పి, ఎంబార్లు తన ఆచార్య తిరువడి కైంకర్యం చేయడానికి పరమపదానికి చేరుకుంటారు. ఆ తరువాత, భట్టార్ తన ఆచార్యుని అడుగుజాడల్లో నడుచుకుంటూ మచ్చలేని మన సాంప్రదాయాన్ని ముందుకు నడిపిస్తారు.
వేదవల్లి : నాన్నమ్మా, భట్టార్ గురించి చెప్తారా?
బామ్మగారు: మీరు ఈ సారి వచ్చినప్పుడు భట్టార్ గురించి చెప్తాను. చీకటి పడుతోంది ఇంటికి వెళ్లండి. గుడికి వెళ్ళడం మర్చిపోకండి, ఆళవందార్ల తిరునక్షత్రం రేపు.
ఆళవందార్లు, పెరియ తిరుమలై నంబి, రామానుజులు, ఎంబార్ల గురించి ఆలోచిస్తూ పిల్లలు ఇళ్ళకు బయలుదేరారు.
మూలము : http://pillai.koyil.org/index.php/2016/08/beginners-guide-embar/
పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org