శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
పిల్లలందరూ కలిసి ఆండాళమ్మ ఇంటికి వచ్చారు.
పరాశర: నాన్నమ్మా, నిన్న మీరు రామానుజులు, వారి శిష్యుల జీవిత చరిత్రల గురించి చెప్తానన్నారు.
బామ్మగారు: అవును. వారి శిష్యుల గురించి చెప్పే ముందు, రామానుజులకు ఉన్న ప్రత్యేకత గురించి మీరు తెలుసుకోవాలి. రామానుజుల అవతార రహస్యం గురించి సుమారు 5000 సంవత్సరాల ముందు నమ్మాళ్వార్లు మధురకవి ఆళ్వార్లకు భవిష్యవాణి చెప్పారు. తరువాత కాలంలో నాథమునులకు కూడా చెప్పారు. చరమోపాయ నిర్ణయం అనే గొప్ప గ్రంథంలో ఎంబెరుమానార్ల అవతారం గురించి నమ్మాళ్వార్లు నాథమునుల మధ్య జరిగిన సంభాషణలు వివరించబడి ఉన్నాయి. నమ్మాళ్వార్లు మధురకవి ఆళ్వార్లకి ప్రసాదించిన ఎంబెరుమానార్ల దివ్య విగ్రహమే ఆళ్వార్తిరునగరిలోని భవిష్యదాచార్య సన్నిధిలో ఇప్పటికీ పూజింపబడుతుంది.
వ్యాస: ఓ! అయితే, ఆళ్వారులకు, మన ఆచార్యులకు రామానుజుల అవతార వివరాలు ముందే తెలుసన్నమాట. ఆశ్చర్యంగా ఉంది నాన్నమ్మా. వారి చరిత్రను చెప్పడం.
బామ్మగారు: రామానుజులు మన దేశం నలుమూలలు సంచరించి వైష్ణవత్వాన్ని ప్రచారం చేశారు. కొన్నిసార్లు ప్రచారం సులువుగా సాగేది. కానీ ఎన్నో సార్లు విరోధాలను ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ రామానుజులు తమ జ్ఞానంతో, ప్రేమతో అందరి మెప్పు పొందేవారు. వారు కాంచీపురంలో ఉన్న రోజుల్లో తంజమాంబతో వివాహం జరిగింది, కానీ త్వరలోనే దేవ పెరుమాళ్ళ నుండి సన్యాసాశ్రమం స్వీకరించారు. సన్యాసం స్వీకరించేటప్పుడు, తాను సమస్థం త్యాగం చేస్తాను, ఒక్క తన మేనల్లుడు ముదలియాండాన్ తప్ప, అని ప్రమాణం చేస్తారు.
వ్యాస: నాన్నమ్మా, వారు ఎందుకు సన్యాసం తీసుకుంటారు? వివాహితులుగానే ఉండి కైంకర్యాలు ఎందుకు చేయలేదు?
బామ్మగారు: వ్యాస, దీనికి అనేక కారణాలున్నాయి. ఒకటి, రామానుజులకు వారి భార్యకు మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఉండటం వలన, రెండు, కొన్ని గొప్ప కార్యాల కోసం కొన్ని త్యాగాలు చేయాలి, తప్పదు. వైష్ణవ సిద్ధాంతాన్ని మన దేశం నలుమూలలా ప్రచారం చేసే బాధ్యత వారి భుజంఫై ఉందని మనకందరికీ తెలిసు. ఉదాహరణకు, సైనికులు మన దేశ సరిహద్దులను రక్షించడం కోసం, వారి కుటుంబాలను, వారి ప్రియమైన వారిని విడిచి ఉంటారు. ఎందుకంటే అది వారి బాధ్యత కాబట్టి. అదేవిధంగా, రామానుజుల మనస్సులో గొప్ప సంకల్పం ఒకటి ఉంది. వేద అభ్యున్నతికి పాటుపడటమే వారి జీవిత ఉద్దేశ్యం. అందువల్ల సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. జీయర్ కాగానే, ముదలియాండాన్, కూరత్తాళ్వాన్ వంటి భాగవతోత్తములు రామానుజులకు శిష్యులయ్యారు.
అత్తుళాయ్ : ఇంత పెద్ద బాధ్యతను మోయడం ఒక భారం కాదా? రామానుజులు ఎలా అన్ని ఒంటరిగా చేశారు?
బామ్మగారు: కాదు అత్తుళాయ్! ఇది ఒక భారం కానే కాదు. మన పని పట్ల మనకి మక్కువ ఉంటే, అది భారంగా అనిపించదు. అంతేకాకుండా, రామానుజులు ఒంటరిగా ఎప్పుడూ లేరు. రామానుజులను ముదలియాండాన్, కూరత్తాళ్వాన్, ఎంబార్, అనంతాళ్వాన్, కిడాంబి ఆచ్చాన్, వడుగ నంబి, పిళ్ళై ఉరంగావిల్లి దాసు మొదలగు గొప్ప శిష్యులు రాత్రింబగళ్ళు కంటికి రెప్పలా చూసుకుంటుండేవారు. ఒకానొక సమయంలో రామానుజులను హతమార్చడానికి వారిపైన హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి. ఎంబార్, కూరత్తాళ్వాన్ వంటి శిష్యులు తమ ఆచార్యుని రక్షించుకోడానికి తమ ప్రాణాలనే పణంగా పెట్టారు. కూరత్తాళ్వాన్, పెరియ నంబి వారు శైవరాజు ఆస్థానానికి వెళ్లి తమ కంటిచూపును ఎలా పోగొట్టుకున్నారో మనందరికి తెలుసు. అటువంటి గొప్ప శిష్యులు వీరి చుట్టూ ఉండేవారు. అనేక దేవాలయాలలో ఆలయ వ్యవస్తను సరి చేసి, పునః స్థాపించడంలో రామానుజులు గొప్ప శ్రద్ధ తీసుకున్నారు.
వేదవల్లి: అవును నాన్నమ్మా! శ్రీరంగం, తిరుపతి వంటి అనేక దివ్య దేశాలల్లో ఆలయ నియమాలను, ఆచారాలన్నింటినీ సరిచేశారని విన్నాను. మాకు దీని గురించి వివరంగా చెప్తారా?
బామ్మగారు: నిజమే వేదవల్లి. రామానుజులు కేవలం వేదాల ఆధారంగా ఆచారాలను తిరిగి అమలు చేసారు. శ్రీరంగ క్షేత్ర వ్యవహారాలన్నీ పెరియ కోయిల్ నంబి అనే పేరుతో ఒకరు చూసుకుంటుండేవారు. ఆలయంలో అవసరమైన మార్పులు చేయడాన్ని పెరియ కోయిల్ నంబి విరోధించారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయ అవగాహన పెరియ కోయిల్ నంబికి కల్పించి ఆలయ వ్యవస్థలో మార్పులు చేయాలని కూరత్తాళ్వాన్ను పంపిస్తారు. కూరత్తాళ్వాన్ల మార్గనిర్దేశం తర్వాత పెరియ కోయిల్ నంబి రామానుజులకు శరణాగతులై తిరువరంగత్తు అముదనార్ అనే పేరును సంపాదించుకున్నారు. వీరు రామానుజులను స్తుతించి ఇరామానుజ నూఱ్ఱందాది రచించారు. తిరుమల వేంకటేశ్వరుడు విష్ణు స్వరూపుడని నిరూపించింది కూడా రామానుజులే.
పరాశర: ఏంటి? వేంకటేశ్వర స్వామి ఎవరో కాదు సాక్షాత్ విష్ణుమూర్తి అని మనందరికీ తెలుసు. ఈ విషయంపైన ఏదైనా సందేహం ఉందా?
బామ్మగారు: అవును! తిరుమల వేంకటేశ్వరుడు స్వయంగా విష్ణుమూర్తియే. కానీ కొందరు రుద్ర స్వరూపుడని చెప్పుకున్నారు. ఇంకొంతమంది స్కందుడని చెప్పుకున్నారు. ఇవన్నీ విని రామానుజులు తిరుపతికి వెళ్ళి, శ్రీవేంకటేశ్వరుడి స్వరూప సత్యాన్ని స్థాపించారు. వీరెవరో కాదు శంఖ చక్రధారి అయిన శ్రీమన్ నారాయణుడే అన్న సత్యాన్ని స్థాపించారు. అలా తిరుపతి ఆలయం ఆచారాలను స్థాపించటంతో పాటు, రామానుజులు శ్రీవేంకటేశ్వరుడి స్వరూప సత్యాన్ని కూడా స్థాపించారు. అలా, రామానుజులు శ్రీవేంకటేశ్వరుడికి ఆచార్యులైనారు. ఇక్కడే, రామానుజులు తమ మేనమామ అయిన పెరియ తిరుమలై నంబి వద్ద రామాయణాన్ని నేర్చుకున్నారు. ఇలా అనేక దేవాలయాలలో ఆలయ విధులను పునరుద్ధరించారు. వాటిలో తిరునారాయణపురం ముఖమైనది.
అత్తుళాయ్: నాన్నమ్మా, ఆ రోజుల్లో మేల్కోటెలో ఉన్న జైనులు రామానుజులను ఇబ్బంది పెట్టేవారని విన్నాను.
వ్యాస: నాన్నమ్మా! ముస్లిం దాడుల్లో తిరునారాయణపురం పెరుమాళ్ళను దొంగిలించారని కూడా విన్నాను.
బామ్మగారు: అవును, నెజమే. ఆలయాల వ్యవస్థను సరిచేసేటప్పుడు రామానుజులు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. అయితే, మార్పు అందరి మంచికైనా సరే చాలామంది ఆ మార్పుని స్వాగతించరు. పాత ఆచారాలే మంచివని భావిస్తారు. సరియైనా కాకపోయినా మార్పుని స్వీకరించరు. మార్పు తెచ్చే వ్యక్తిని స్వాగతించరు కూడా. సమాజం వైఖరి ఇలా ఉంటుంది. ఈ కాలంలోనే మార్పులు తీసుకురావడం చాలా కష్టం, 1000 సంవత్సరాల క్రితం ఊహించండి, రామానుజులు ఎన్ని కష్టాలను ఎదుర్కోవలసి వచ్చిందో. జైన పండితులు విశిష్టాద్వైత నిజాన్ని అంగీకరించడానికి ఇష్టపడలేదు. 1000 జైన పండితులు ఒకేసారి తమ 1000 ప్రశ్నలకు సమాధానమివ్వాలని రామానుజులను సవాలు చేసారు. రామానుజులు తమ అసలు స్వరూపమైన ఆదిశేషుని వేయి పడగలతో ఒకేసారిగా వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చి గెలుపు పొందుతారు .
ముస్లిం దాడులలో తిరునారాయణపురం ఉత్సవ మూర్తియైన సెల్వప్పిళ్ళైని దొంగిలించి తీసుకువెళ్ళిపోతారు. ఆ ముస్లిం రాజు కుమార్తె తన అంతఃపురంలో సెల్వప్పిళ్ళైని ఉంచుకొని ఎంతో ప్రేమతో చూసుకునేది. రామానుజులు వెళ్ళి సెల్వప్పిళ్ళైను రక్షిస్తారు. ఆమె సెల్వప్పిళ్ళై నుండి దూరమైయ్యి ఆ విరహాన్ని భరించలేకపోతుంది.
అత్తుళాయ్: ఎలాగైతే ఆండాళ్ కృష్ణుని విరహాన్ని భరించలేకపోయిందో, అలాగా నాన్నమ్మా?
బామ్మగారు: అవును, సరిగ్గా ఆండాళ్ లాగానే. సెల్వప్పిళ్ళైని రామానుజులతో పంపాలనే ఆలోచనను భరించలేకపోయింది ఆ ముస్లిం యువరాణి. చివరికి, ఆ యువరాణిని సెల్వప్పిళ్ళైతో కల్యాణం జరిపిస్తారు రామానుజులు. నిజమైన భక్తి కులమతాలకు మించినది అని ఇక్కడ మనకు అర్థమౌతుంది.
వ్యాస: నాన్నమ్మా, ఆళవందార్ల మూడు కోరికలను రామానుజులు ఎలా నేరవేరుస్తారో మీరు చెప్పలేదు.
బామ్మగారు: కూరత్తాళ్వాన్లకు ఇద్దరు పిల్లలతో సంతానభాగ్యం కలుగుతుంది. రామానుజులు వారిద్దరికి మహాఋషుల పేర్లతో వ్యాస పరాశరులను నామకరణం చేసి ఆళవందార్ల మొదటి కోరికను నెరవేర్చుతారు. ఎంబార్ అని పిలువబడే గోవింద భట్టార్లకు శిరియ గోవింద పెరుమాళ్ళని ఒక తమ్ముడు ఉండేవాదు. అతని పుత్రునికి నమ్మాళ్వార్ల పేరుతో పరాంకుశ నంబి అని నామకరణం చేసి, తద్వారా రెండవ కోరికను వాగ్దానం నెరవేర్చుతారు. శ్రీ భాష్యాన్ని వ్రాసి ఆళవందార్ల మూడవ కోరికను నెరవేర్చుతారు. శ్రీ భాష్యాన్ని వ్రాయడానికి, రామానుజులు కూరత్తాళ్వాన్లతో కష్మీరుకి వెళతారు.
వేదవల్లి: కష్మీరులో ఏమి జరిగింది?
బామ్మగారు: శ్రీ భాష్యాన్ని వ్రాయడానికి గతంలో వ్రాసిన బోదాయనవృత్తి గ్రంథాన్ని సేకరించేందుకు రామానుజులు కష్మీర్కి వెళతారు. ఆ గ్రంథాన్ని తీసుకొని తిరిగి వస్తుంటే, కొంతమంది దుష్టులు, రామానుజులు తన స్వార్థం కోసం తమ గ్రంథాలయంలో నుండి గ్రంథాన్ని తీసుకెళుతున్నారని భావించి, ఆ ఆలోచనను భరించలేక వాళ్ళు రామానుజులను దారిలో అనుసరించి, ఆ గ్రంథాన్ని రామానుజుల దగ్గర నుండి దోచుకుంటారు.
వ్యాస: ఎంత దారుణం!
బామ్మగారు: అవును! కానీ, ఆ దుష్టుల చేతుల్లో ఆ గ్రంథం పడే ముందే, మొదటి నుండి చివరిదాకా కూరత్తాళ్వాన్లు ఒక సారి చదివి కంఠస్తం చేసేస్తారు.
వ్యాస: మొత్తం గ్రంథాన్ని కంఠస్తం చేసేస్తారా? అది ఎలా సాధ్యమవుతుంది నాన్నమ్మా? నేను కూడా నా పుస్తకాలను అలా కంఠస్తం చేసుకుంటే ఎంత బాగుండో!
బామ్మగారు (నవ్వుతూ): రామానుజులకు కూరత్తాళ్వాన్లు కేవలం శిష్యులే కాదు, ఒక గొప్ప వరం కూడా. రామానుజుల సంబంధంతో అందరూ ఉద్ధరింపబడుతూ ఉంటే, తన శిష్యుడైన కూరత్తాళ్వాన్ల సంబంధంతో రామానుజులు ఉద్ధరింపబడ్డారని వారే స్వయంగా కూరత్తాళ్వాన్లను పొగిడేవారు. అంతటి గొప్ప విద్వానుడైనప్పటికీ, రామానుజుల నివాసమైన కూరత్తాళ్వాన్ల హృదయంలోకి అణువు మాత్రం కూడా అహంకారం రానిచ్చేవారు కాదు. కూరత్తాళ్వాన్ల సహాయంతో, శ్రీ భాష్యం పూర్తిచేసి, ఆళవందార్లకు చేసిన మూడవ ప్రమాణాన్ని నిలబెట్టుకుంటారు. శ్రీరంగాన్ని పరిపాలించే శైవరాజు మరణం తరువాత, రామానుజులు శ్రీరంగానికి తిరిగివస్తారు.
చివరగా, రామానుజులు ఈ లోకాన్ని వదిలి పరమపదానికి చేరుకోవడానికి ముందు, తన తరువాత సాంప్రదాయాన్ని నడిపించడానికి కూరత్తాళ్వాన్ల పుత్రుడైన పరాశర భట్టార్ని ఆచార్యునిగా నిర్ణయిస్తారు. భట్టార్ను, ఇతర శిష్యులను ఎంబార్ని ఆశ్రయించి వారి మార్గదర్శకత్వంలో జ్ఞానాన్ని పొందమని నిర్దేశిస్తారు. వారు తనతో అందరూ ఎలా గౌరవ మర్యాదలతో వ్యవహరించారో అదేవిధంగా భట్టార్తో కూడా వ్యవహరించాలని తన శిష్యులందరినీ నిర్దేశిస్తారు. రామానుజులను సాంప్రదాయంలోకి తీసుకురావటానికి ఆళవందార్లు పెరియ నంబి వారిని నియమించినట్టు, నంజీయర్ను సాంప్రదాయంలోకి తీసుకురామని భట్టార్ని రామానుజులు నియమిస్తారు. ఎంబెరుమానార్లు తమ ఆచార్యులైన పెరియ నంబిని, ఆళవందార్ల తిరువడిని ధ్యానిస్తూ ఈ ప్రపంచాన్ని వదిలి శ్రీమన్నరాయణుని నిత్య కైంకర్యంలో పాలుపంచుకోడానికి పరమపదం చేరుకుంటారు. రామానుజులను విడిచి ఉండలేక ఎంబార్ కూడా పరమపదం చేరుకుంటారు.
పరాశర: నాన్నమ్మా, రామానుజుల శరీరం ఇప్పటికీ శ్రీరంగంలో సంరక్షితంగా ఉందని విన్నాను. అది నిజమా?
బామ్మగారు: అవును పరాశర, అది నిజం. గొప్ప ఆచార్యుల శరీరం గురించి మాట్లాడేటప్పుడు, ‘తిరుమేని’ అని అంటాము. శ్రీరంగం ఆలయం లోపల రామానుజుల సన్నిధి క్రింద వారి తిరుమేనిని భద్రపరిచారన్నది నిజం. ఈ రోజు మనం చూస్తున్న రామానుజుల సన్నిధి ఒక సమయంలో శ్రీరంగనాథుని వసంత మండపంగా ఉండేది. మన పూర్వాచార్యుల మహిమల గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని ప్రసాదించమని మనం రామానుజుల తిరువడిని, శ్రీరంగనాథుడిని ప్రార్థిద్దాం. చాలా ఆలస్యమైంది. మీరు ఇక ఇంటికి వెళ్ళండి. ఆ సారి మనం మళ్ళీ కలుసుకున్నప్పుడు రామానుజుల శిష్యుల మహిమల గురించి చెబుతాను .
రామానుజులు, వారి కైంకర్యాలు, వారు ఎదుర్కొన్న అనేక ఇబ్బందుల గురించి, మన సాంప్రదాయ మహా గొప్ప ఆచార్యులుగా ఎలా ఎదిగారో ధ్యానిస్తూ పిల్లలు ఇంటికి వెళ్ళారు.
మూలము : http://pillai.koyil.org/index.php/2016/08/beginners-guide-ramanujar-2/
పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org