శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
<< నమ్మాళ్వార్ మధురకవి ఆళ్వార్
వ్యాస పరాశరులు ఆండాళమ్మగారి దగ్గరకి వెళ్లి ఆళ్వార్ల కథలు చెప్పమని అడిగారు.
బామ్మగారు: పిల్లలూ! ఈ వేళ ఆళ్వారైన ఒక రాజు గురించి చెప్తాను.
వ్యాస: ఎవరు నాన్నమ్మ? వారి పేరు ఏమిటి?
బామ్మగారు: వారి పేరు కులశేఖర ఆళ్వారు. వీరు మాఘ మాసములో పునర్వసు నక్షత్రంలో కేరళలోని తిరువంజిక్కలంలో క్షత్రియ కులములో జన్మించారు.
పరాశర: క్షత్రియ అంటే ఏంటి నాన్నమ్మ?
బామ్మగారు: సాధారణంగా క్షత్రియులు అంటే, రాజులు, అధికారులన్నమాట. వాళ్ళు రాజ్యాలను పరిపాలిస్తుంటారు. పౌరులకు రక్షణనిస్తుంటారు.
వ్యాస: ఓ! మన రంగరాజులాగా అన్నమాట. శ్రీరంగం నుండి మనందరిని పాలించి రక్షింస్తునట్టుగా కదా నాన్నమ్మా?
బామ్మగారు: అవును. మన పెరుమాళ్ళు అందరి రాజు. కాని ప్రతి రాజ్యాన్ని ఒక రాజు పరిపాలిస్తుంటాడు. ఈ రాజులు ఆ పౌరులచేత గౌరవింపబడుతుంటారు. ఇక ఇతిహాసానికి వద్దాము. క్షత్రియ కులములో జన్మించడం వలన వీరు పాలించే వారిగా, స్వతంత్రులుగా తమను తాము భావించేవారు. కాని, శ్రీమన్నారాయణుని అనుగ్రహముతో, ప్రతి ఒక్కరూ పెరుమాళ్ళకు పరతంత్రులని గ్రహించి పెరుమాళ్ళ మహిమలను వినుట యందు రుచి పెంచుకొని, భాగవతుల పట్ల కూడా భక్తి భావంతో ఉండేవారు.
పరాశర: నాన్నమ్మ, భాగవతులని ఆదరించడంలో మనం మధురకవి ఆళ్వార్ల లాగా ఉండాలని మీరు చెప్పారు. నాకు గుర్తుంది. వీరి మధురకవి ఆళ్వార్ల లాగా ఉండేవారా నాన్నమ్మ?
బామ్మగారు: చాలా బావుంది పరాశర. అవును, కులశేఖర ఆళ్వార్లకి శ్రీరామాయణం అంటే మహాప్రీతి ఉండేది. చూడండి, మన సాంప్రదాయములో “శ్రీరాముడు” ని ప్రేమతో “పెరుమాళ్” అని పిలుస్తారు. కులశేఖర ఆళ్వార్లకి శ్రీరాముడి పట్ల, శ్రీరామాయణం పట్ల ఉన్న మహాప్రీతి విశ్వాసాల వలన “కులశేఖర పెరుమాళ్” గా పిలువబడ్డారు. వీరు పండితుల నుండి శ్రీరామాయణాన్ని ప్రతి రోజు వింటూ లీనమైపోయేవారు. ఒకసారి, శ్రీరాముడిని 14000 రాక్షసులు దాడి చేసారని విని, ఆగ్రహంతో తన సేనను వెళ్లి శ్రీరాముడికి సాహాయం చేయమని ఆదేశం ఇచ్చారు. శ్రీరాముడు ఒక్కడే ఆ రాక్షసులను ఓడించాడని అక్కడి భాగవతులు చెప్పి వారిని ఓదార్చేవారు.
వ్యాస: వీరు పెరుమాళ్ళ గురించి వినడంలో ఉంటే రాజ్యాన్ని ఎలా పాలించేవారు నాన్నమ్మా?
బామ్మగారు: అవును. మంచి ప్రశ్న. వీరు రాజ్య కార్యభారాలలో ఎక్కువ దృష్టి పెట్టలేకపోయేవారు. పెరుమాళ్ళ భక్తులైన భాగవతులతో వీరికున్న బంధాన్ని తొలగించాలని మంత్రులు ఆలోచించారు. అంతఃపుర మందిరములోని పెరుమాళ్ళ ఆభరణం ఒకటి దొంగిలించి అది భాగవతులు దొంగిలించారని మంత్రులు చెప్పారు. మంత్రులు చెప్పిన మాటలు ఆళ్వారు నమ్మలేదు. అక్కడి ఆచారం ప్రకారము, తమ మాట నిజమని నిరూపించుకోవటానికి పాము ఉన్న కుండలో చెయ్యి పెట్టాలి. ఈ పని చేయటానికి ఆ వ్యక్తి చాలా సాహసవంతుడై తన మాటపైన గట్టి నమ్మకము ఉన్నవారై ఉండాలి. కులశేఖర పెరుమాళ్ పాము ఉన్న కుండను తీసుకురమ్మన్నారు, భాగవతులు ధైర్యంగా తమ చెతులు లోపల పెట్టి నిర్దోశులని నిరూపించుకున్నారు.
పరాశర: బావుంది నాన్నమ్మ.
బామ్మగారు: శ్రీరాముడు ఎలాగైతే పెరియ పెరుమాళ్ళను ఆరాధించారో అలాగే కులశేఖర ఆళ్వార్లు కూడా పెరియ పెరుమాళ్ళన్నా, శ్రీరంగమన్నా మహా ప్రీతితో ఉండేవారు.
వ్యాస: శ్రీరామునికి పెరియ పెరుమాళ్ళకు సంబంధం ఏమిటి నాన్నమ్మా?
బామ్మగారు: అయోధ్యలో శ్రీరాముడికి తిరువారాధన పెరుమాళ్ళుగా పెరియ పెరుమాళ్ ఉండేవారు. తిరువారాధన పెరుమాళ్ అంటే మన ఇండ్లల్లో నిత్యారాధన అందుకునే పెరుమాళ్. అయితే పెరియ పెరుమాళ్ళను తమ రాజభవనములో శ్రీరాముడు ఆరాధించేవారు. కాని తమ తిరువారాధన పెరుమాళ్ళను తమ ప్రియ భక్తుడైన విభీషణుడికి బహుమతిగా ఇచ్చారు. విభీషణుడు పెరియ పెరుమాళ్ళను లంకకు తీసుకోని వెళ్లుతుండగా, సంధ్యావందనం చేయండం కోసం శ్రీరంగంలో ఆగారు. సంధ్యా వందనము ముగించుకొని లంకా ప్రయాణం కొనసాగిస్తామనుకున్నారు. కానీ, పెరియ పెరుమాళ్ళు విభీషణుడితో తనకు ఆ ప్రదేశము చాలా నచ్చినదని, అక్కడే ఉండి దక్షిణ దిక్కులో ఉన్న లంకవైపు ముఖము చేసి ఉంటానని అన్నారు. విభీషణుడు పెరియ పెరుమాళ్ళ మాటను అంగీకరించి, పెరుమాళ్ళను అక్కడే ఉంచి లంకకు వెళ్లిపోయారు. అట్లా, పెరియ పెరుమాళ్ళు శ్రీరంగానికి వేంచేశారు. ఇప్పటికీ ఇక్కడే ఉన్నారు.
పరాశర: ఓ! బాగుంది నాన్నమ్మ. పెరుమాళ్( శ్రీరాముడు) పెరియ పెరుమాళ్ళ మధ్య ఈ సంబంధం గురించి ముందు మాకు తెలియదు.
బామ్మగారు: అయితే, కులశేఖర ఆళ్వార్లకి కూడా పెరియ పెరుమాళ్ళన్నా శ్రీరంగమన్నా మహాప్రీతి ఉండేది. వారు ప్రతి రోజు వారి రాజ్యము నుండి శ్రీరంగానికి వచ్చేవారు, తిరిగి వెళ్ళే వారు కాదు. వారి మంత్రులు రాజ్య పరిపాలన ఉందని ఏదో ఒక కారణం వారికి చెప్పి తిరిగి తీసుకెళ్లేవారు. చివరికి, తమ రాజ్యాన్ని వదిలి వచ్చి శ్రీరంగానికి చేరుకుంటారు. పెరుమాళ్ళను కీర్తిస్తూ పెరుమాళ్ తిరుమొళి ప్రబంధాన్ని పాడి కొంత కాలం శ్రీరంగంలోనే జీవించారు. ఆఖరున, ఈ సంసారాన్ని వదిలి నిత్య సేవ చేయటానికి పరమపదానికి చేరుకుంటారు.
వ్యాస: నాన్నమ్మ, ఎంత ఎక్కువ ఆళ్వార్ల గురించి వింటే అంత ఎక్కువ పెరుమాళ్ళ గురించి తెలుసుకుంటాం. ఎందుకంటే ఆళ్వార్ల దృష్ఠి మొత్తం పెరుమాళ్ళపైనే ఉండేది.
బామ్మగారు: అవును. మనం కూడా మన దృష్ఠిని పెరుమాళ్ళపైన, వారి భక్తులపైన ఉంచాలి. ఇప్పుడు మనము కులశేఖర ఆళ్వార్ల సన్నిధికి వెళ్లి వారిని సేవించుకుందాం.
వ్యాస పరాశరులు: సరే నాన్నమ్మ. వెళ్దాం పదండి.
మూలము: http://pillai.koyil.org/index.php/2014/11/beginners-guide-kulasekarazhwar/
పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org