బాల పాఠము – నమ్మాళ్వార్, మధురకవి ఆళ్వార్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< తిరుమళిశై ఆళ్వార్

ఆళ్వార్ల జీవితాన్ని వ్యాస పరాశరులకు వివరించే పనిలో బామ్మగారు ఉన్నారు.

వ్యాస: మనము ముదలాళ్వార్లు, తిరుమళిశై ఆళ్వారు గురించి విన్నాము. తరువాత ఏ ఆళ్వారు నాన్నమ్మ?

బామ్మగారు: అందరు ఆళ్వార్లలో ప్రముఖులుగా పరింగణించబడే నమ్మాళ్వార్ల గురించి చెబుతాను. వారి ప్రియ శిష్యుడైన మధురకవి ఆళ్వారు గురించి కూడా కొంచం చెప్తాను.

nammazhwar-madhurakavi
నమ్మాళ్వార్ – ఆళ్వార్ తిరునగరి, మధురకవి ఆళ్వార్ – తిరుక్కోలూర్

పరాశర: సరే నాన్నమ్మ. వాళ్ళ గురించి వినాలని ఎంతో ఆతృతగా ఉంది.

బామ్మగారు: తమిళంలో నమ్మాళ్వార్ అంటే “మన ఆళ్వారు” అని అర్థం. స్వయంగా పెరుమాళ్ళే వీరికి ఈ నామాన్ని ప్రసాదించారు. వీరు ఆళ్వార్తిరునగారిలో వైశాఖ మాసంలో విశాఖా నక్షత్రంలో జన్మించారు. ఆ ప్రాంతం రాజైన కారి, వారి ధర్మ పత్ని ఉడయనంగైకు జన్మించారు. ఈ దంపతులకు ఎంతో కాలంగా సంతానం లేనందున తిరుక్కురుంగుడినంబిని సంతానం కొరకు ప్రార్థించారు. వారే స్వయంగా పుత్రుడిగా జన్మిస్తానని నంబి ఆ దంపతులను ఆశీర్వదిస్తారు. ఆ దంపతులిద్దరూ ఆళ్వార్తిరునగరికి తిరిగి వచ్చిన కొద్ది కాలంలోనే ఉడయనంగై ఒక అందమైన బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డను పెరుమాళ్ళ అంశంగా, మరికొందరు విష్వక్సేనుడి అంశంగా భావిస్తారు.

వ్యాస: ఓ! చాలా బావుంది. అయితే, వారు స్వయంగా పెరుమాళ్ళేనా?

బామ్మగారు: వారి మహిమని చూస్తే ఖచ్చితంగా చెప్పవచ్చు. కాని మన పూర్వాచార్యుల వివరణల ప్రకారం, వీరు జీవాత్మలలో ఒకరుగా, అనాదిగా ఈ సంసారంలో అల్లాడుతున్నట్టుగా, శ్రీమన్నారాయణుడి అనంత కృప కారణగా దివ్య కటాక్షం పొందారని చాటారు. అయితే, వీరిపైన పెరుమాళ్ళు విశేష అనుగ్రహం కురిపించారని మనం అర్థ చేసుకోవచ్చు.

పరాశర: అవును నాన్నమ్మ, పెరుమాళ్ళు కొందరిపైన ప్రత్యేకంగా కటాక్షించి వారికి పరిపూర్ణ  జ్ఞానాన్ని ప్రసాదిస్తారని, వారినే ఆళ్వార్లుగా చేసారని, ఆ ఆళ్వార్లు మన లాంటివారినెందరినో తీర్చిదిద్ది పెరుమాళ్ళ దగ్గరకు చేరుస్తారని మొదట్లో మీరు చెప్పినట్టు నాకు గుర్తుంది.

బామ్మగారు:  అక్షరాలా నిజం పరాశర. ముఖ్యమైన విషయాలను మీ ఇద్దరు ఇంత చక్కగా గుర్తుపెట్టుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. సరే! నమ్మాళ్వార్ల జీవిత కథ దగ్గరకు వద్దాము మనము. వీరు మామూలి పిల్లవాడిలా జన్మించారు కానీ యేడవ లేదు, తిన లేదు, ఏమీ చేయ లేదు. వీరి తల్లి తండ్రులు భయపడ్డారు. పుట్టిన పన్నెండవ రోజున వాళ్ళు ఆదినాథ పెరుమాళ్ళ సన్నిధికి వెళ్లి ఆ బిడ్డను పెరుమాళ్ళ ముందు ఉంచారు. అందరి పిల్లల్లా లేకుండా వేరేగా ఉన్న ఈ శిశువుకు మాఱన్ (భిన్నంగా ఉన్నవాడు) అని నామకరణం చేసారు. ఆ బిడ్డ విశేష గుణాలను చూసి ఆ తల్లి తండ్రులు బిడ్డను ఒక దివ్య ఆత్మగా భావించి ఆదినాథ పెరుమాళ్ళ సన్నిధికి దక్షిణంగా ఉన్న చింతచెట్టు క్రింద ఉంచి భక్తితో పూజించారు. 16 సంవత్సరాల పాటు ఆ బిడ్డ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ చింతచెట్టు క్రిందే ఉన్నారు.

వ్యాస: అయితే, ఆ సమయమంతా ఏమి చేసారు? ఆఖరికి మాట్లాడారా?

బామ్మగారు: శ్రీ మన్నారాయణ అనుగ్రహముతో జన్మించినందున, నిత్య ధ్యానంలో ఉండేవారు. ఆఖరున, మధురకవి ఆళ్వార్ల రాక వారిని మాట్లాడించింది.

పరాశర: మధురకవి ఆళ్వారు ఎవరు నాన్నమ్మా?

బామ్మగారు: మధురకవి ఆళ్వారు తిరుక్కోళూర్లో చైత్ర మాసంలో చిత్రా నక్షత్రంలో జన్మించారు. వీరు ఒక అద్భుతమైన మేధావియే కాకుండా శ్రీమన్నారాయణుని మరమ భక్తుడు. వయస్సులో వారు నమ్మాళ్వార్ల కంటే పెద్దవారు. వీరు తీర్థ యాత్రకై అయోధ్యకు వెళ్ళారు. అప్పటికే ‘మాఱన్’ గురించి విన్నారు. ఒకానొక సమయంలో వీరు దక్షిణ దిశగా ఒక జ్యోతి వెలుగుతుండగా  గమనించి ఆ దిక్కువైపు ప్రయాణం చేశారు. ఆఖరున ఆ జ్యోతి వారిని ఆళ్వార్తిరునగరి గుడిలో మాఱన్ ఉన్న దగ్గరకు చేర్చింది.

వ్యాస: మధురకవి ఆళ్వారుతో నమ్మాళ్వార్లు మాట్లాడారా?

బామ్మగారు : అవును, మాట్లాడారు. మధురకవి ఆళ్వారు వారితో సంభాషించారు. ఆఖరున నమ్మాళ్వార్లు నోరు విప్పి మాట్లాడసాగారు. నమ్మాళ్వార్ల మహిమను అర్థం చేసుకొని మరు క్షణమే వారి శిష్యులయ్యి, అతి ముఖ్యమైన మూల సూత్రాలను వారి నుండి తెలుసుకుంటారు. మధురకవి ఆళ్వారు తమ శేష జీవితమంతా నమ్మాళ్వార్లకు సేవచేస్తూ గడిపారు.

పరాశర: ఓ! ఆశ్చర్యంగా ఉంది నాన్నమ్మా. అయితే, అసలైన జ్ఞానం గురించి తెలుకోవాలంటే వయస్సుతో సంబంధం లేదన్నమాట. మధురకవి ఆళ్వార్లు వయస్సులో నమ్మాళ్వార్ల కంటే పెద్దవారైనా, ఇక్కడ మధురకవి ఆళ్వార్లు జ్ఞానాన్ని నమ్మాళ్వార్ల వద్ద పొందారు.

బామ్మగారు : బాగా గమనించావు పరాశర. వ్యక్తి వయస్సులో చిన్నవాడైనా సరే నేర్చుకోవటానికి శ్రద్ధ వినయ విధేయతలు ఉంటేచాలు. అది శ్రీవైష్ణవులకు ఉండవలసిన ముఖ్యమైన గుణమని చేసి నిరూపించారు మధురకవి ఆళ్వార్లు. కొన్ని సంవత్సరాల తరువాత, నమ్మాళ్వార్ల 32 వ యేడు, పెరుమాళ్ళు లేకుండా ఉండలేక ఆ విరహవేదన  భరించలేక పరమపదానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. పెరుమాళ్ళ మహిమలను స్తుతిస్తూ నాలుగు ప్రబంధాలు – తిరువిరుత్తం, తిరువాయ్మొళి, తిరువాశిరియం, పెరియ తిరువందాదిలో వ్రాసారు. పెరుమాళ్ళ అనుగ్రహముతో పరమపదానికి చేరుకొని  పెరుమాళ్ళ నిత్య కైంకర్యంలో ఉండిపోయారు.

వ్యాస: చాలా చిన్న వయస్సులో పరమపదానికి చేరుకున్నారు కదా నాన్నమ్మా?

బామ్మగారు : అవును. కాని వారు నిత్యానందాన్ని పొందాలనుకున్నారు. పెరుమాళ్ళు కూడా నమ్మాళ్వార్లు అక్కడే ఉండాలని ఆశించారు. కనుక ఈ సంసారాన్ని విడిచి పరమపదానికి చేరుకున్నారు. మధురకవి ఆళ్వార్లు తామ్రపర్ణి నదీ జలాన్ని మరిగించి ప్రాప్తమైన నమ్మాళ్వారి ఆర్చా విగ్రహాన్ని ఆళ్వార్తిరునగరి దివ్యదేశంలో స్థాపించారు. తగిన పూజా విధానాలను ఏర్పాటు చేశారు. వీరు నమ్మాళ్వార్లను కీర్తిస్తూ స్తుతిస్తూ రచించిన ప్రబంధమే “కణ్ణినుణ్ శిరుత్తాంబు”. నమ్మాళ్వార్ల గొప్పతనాన్ని అంతటా వ్యాపింపజేశారు.

పరాశర: అయితే, మధురకవి ఆళ్వార్ల కారణంగానే మనం నమ్మాళ్వార్ల గొప్పతనాన్ని గ్రహించగలుగుతున్నాము.

బామ్మగారు : అవును, నమ్మాళ్వార్లకు వీరు పరిపూర్ణ అంకితులై ఉండేవారు. నమ్మాళ్వార్లపై వీరికి ఉన్న భక్తి భావం కారణగానే స్వయంగా పెరుమాళ్ళే వీరిని పొగిడారు. భాగవత ప్రశంస భగవత్ ప్రశంస కంటే గొప్పదిగా భావిస్తారు. సాధ్యమైనంతవరకు మనము కూడా భాగవత సేవ చేస్తుండాలి.

వ్యాస పరాశరులు: తప్పకుండా నాన్నమ్మ. ఈ విషయము గుర్తుంచుకుంటాము.

బామ్మగారు : మనము నమ్మాళ్వార్లు, మధురకవి ఆళ్వార్ల జీవితం గురించి చూసాము. పదండి నమ్మాళ్వార్ల సన్నిధికి వెళ్లి వారిని సేవిద్దాము.

మూలము: http://pillai.koyil.org/index.php/2014/11/beginners-guide-nammazhwar-and-madhurakavi-azhwar/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

1 thought on “బాల పాఠము – నమ్మాళ్వార్, మధురకవి ఆళ్వార్”

  1. Excellent narration of Nammalwar’s grandeur..Very nice way of introducing if Sat Sampradaya..Dasoham.. Dr.Chilakapati Vijaya Raghavacharya, Vijayawada

    Reply

Leave a Comment