బాల పాఠము – శ్రీమన్నారాయణ ఎవరు?

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీవైష్ణవం – బాల పాఠము

<< బాల పాఠము – శ్రీవైష్ణవం పరిచయము

ఆండాళ్ బామ్మగారు పరాశర వ్యాసులని  శ్రీరంగము కోవెలకి తీసుకొని వెళ్ళారు.

srirangam-temple

వ్యాస: ఆహా! నాన్నమ్మ, ఇది చాలా పెద్ద గుడి. మేము ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత పెద్ద గుడిని చూడలేదు. మహారాజులు మాత్రమే ఇలాంటి పెద్ద భవనాలలో ఉంటారని విన్నాము. మనము ఇప్పుడు రాజుగారిని దర్శించుకోవడానికి వెళ్ళుతున్నామా?

బామ్మగారు: అవును, ఇప్పుడు మనము అందరికీ రాజైన రంగరాజును దర్శించుకోడానికి వెళ్ళుతున్నాము. రంగరాజుని (శ్రీరంగానికి రాజు) మనము ప్రేమతో పెరియ పెరుమాళ్ అని, ఉత్సవమూర్తిని నంపెరుమాళ్ అని పిలుస్తాము. పెరియ పెరుమాళ్ తమ ఆధిపత్యాన్ని, స్వామిత్వాన్ని మనకు తెలియపరచడానికి ఇక్కడ ఆదిశేషునిపై పవళించి ఉంటారు. వీరు తమ భక్తుల రాకకై వేచి ఉండి వారిని అనుగ్రహిస్తుంటారు. కాని, ఉత్సవమూర్తి అయిన నంపెరుమాళ్ మాత్రం తమ సౌలభ్యముతో అందరినీ  అనుగ్రహిస్తారు. ఎవరైనా సరే వీరిని సులభముగా దర్శించుకోవచ్చు. ఎలా అంటే, వీరు తమ భక్తుల ఇబ్బందులను గ్రహించి, ఎవరైతే తన దర్శనానికి రాలేకపోయారో వారిదగ్గరికి తమ తిరువీధి ఊరేగింగు (పురప్పాడు) సమయంలో వెళ్ళి వారిని కూడా అనుగ్రహిస్తాడు. శ్రీరంగములో నంపెరుమాళ్ళు సంవత్సరము పొడుగునా తమ భక్తుల వద్దకి స్వయముగా తానే వచ్చి తన అనుగ్రహ ప్రసాదాన్ని అందరికీ ప్రసాదిస్తాడు.

పరాశర: నాన్నమ్మ, కాని పెరుమాళ్ వైకుంఠములో కదా ఉండేది, మరి ఇక్కడ కూడా ఎలా ఉన్నారు?

బామ్మగారు: అవును పరాశర, నీవు విన్నది నిజము. పెరుమాళ్ళుండేది వైకుంఠములోనే కానీ! వారు మన మధ్యలో ఉండటం కోసం ఇక్కడకు కూడా వేంచేస్తారు. నీవు వినే ఉంటావు, నీరు ఏ విధంగానైతే అనేక రూపములలో ఉంటుందో (ఘనము,ద్రవము, ఆవిరి, పొగమంచు, మంచు), అదే విధంగా, పెరుమాళ్ళు కూడా ఐదు స్వరూపాలలో ఉంటారు. అవి పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చా స్వరూపాలు. పెరుమాళ్ళు ఇక్కడ శ్రీరంగములో అర్చావతార స్వరూపంలో మన మధ్య వేంచేసి ఉన్నారు. అవతారం అనగా క్రిందికి రావడము. నేను ముందు చెప్పిన విధముగా, మనము అందరి మంచి కోసం పెరుమాళ్ళను ప్రార్థిస్తాము. శ్రీమన్నారాయణుడు మన ప్రార్థనలను ఆలకించి ఇక్కడ శ్రీరంగంలో వేంచేసి ఉన్నారు. ఇదే కాక, వారికి మన యెడల అమితమైన వాత్సల్యము ఉండట చేత, మనతోనే ఉండటానికి ఇష్టపడతాడు. ఈ కారణంగా స్వామి శ్రీరంగంలో వేంచేసి వున్నాడు.

bhagavan-5-forms-parathvadhi-panchakam

బామ్మగారు, వ్యాస పరాశరులు సన్నిధిలోనికి వెళ్ళి పెరియ పెరుమాళ్ళను సేవించుకున్నారు.

వ్యాస: మీరు చెప్పినది విన్న తరువాత మాకు కూడా పెరుమాళ్ళ యందు ప్రీతి కలుగుతూ ఉంది. అంతే కాకుండా, చూడడానికి స్వామి మనలానే ఉన్నారు కదా!

బామ్మగారు: స్వామి చూడడానికి మాత్రమే కాదు, ఒకప్పుడు మనలానే మన మధ్య జీవించాడు కూడ. స్వామి విభవ అవతారములో, తన వైకుంఠాన్ని వదిలి శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడుగా ఈ లోకంలో అవతరించి, మనలో ఒకరిగా ఇక్కడ ఉన్నాడు. మనందరికీ ప్రత్యేకముగా శ్రీరామ కృష్ణ అవతారముల యందు ప్రీతి ఎక్కువ ఉండడం కారణంగా స్వామి కృష్ణుడిలా పెరియ పెరుమాళ్ళ రూపంలోనూ,  శ్రీరాముడిలా నంపెరుమాళ్ళరూపంలోనూ మనతోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. పెరియ పెరుమాళ్ళు శయనించి ఉండి నిత్యం తమ భక్తుల గురించి దీర్ఘముగా ఆలోచిస్తూ దర్శనమిస్తాడు. నంపెరుమాళ్ళు ఎప్పుడూ మన మధ్య ఉంటూ మన ప్రేమని స్వీకరిస్తూ ఆనందిస్తాడు.

ఆ తరువాత ముగ్గురూ ఇంటికి చేరుకున్నారు.

వ్యాస పరాశరులు: సరే అయితే, నాన్నమ్మ. మేము ఆడుకోడానికి వెళుతున్నాము.

బామ్మగారు: పిల్లలూ! జాగ్రత్తగా ఆడుకోండి. వీలైనంత వరకు మీ స్నేహితులతో శ్రీమన్నారాయణుడి వైభవం గురుంచి చర్చించడం మరచిపోకండి.

రఘు వంశీ రామానుజ దాసన్

మూలము : http://pillai.koyil.org/index.php/2014/07/beginners-guide-who-is-sriman-narayana/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

1 thought on “బాల పాఠము – శ్రీమన్నారాయణ ఎవరు?”

Leave a Comment