శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
తిరువరంగప్పెరుమాళ్ అరైయర్, పెరియ తిరుమలై నంబి, తిరుమాలై ఆండాన్
వ్యాస పరాశరులు వాళ్ళ స్నేహితురాలు వేదవల్లితో బామ్మగారి ఇంటికి వచ్చారు.
బామ్మగారు: పిల్లలూ లోపలికి రండి.
వ్యాస: నాన్నమ్మా, పోయిన సారి మీరు రామానుజులు, వారి ఆచార్యుల గురించి చెప్తానని అన్నారు.
పరాశర: నాన్నమ్మా, రామానుజులకు కేవలం పెరియనంబులు మాత్రమే కాదు అనేక మంది ఆచార్యులు ఉన్నారని చెప్పారు కదా? వాళ్ళు ఎవరు నాన్నమ్మా?
బామ్మగారు: పిల్లలూ! క్రిందటి సారి మీకు చెప్పాను గుర్తుందా. ఆళవందార్లకు అనేక శిష్యులుండేవారని, వాళ్ళందరూ ఇళైయాళ్వార్లను మన సాంప్రదాయంలోకి తీసుకురావడానికి కృషి చేసారని చెప్పాను. వాళ్ళల్లో ముఖ్యమైనవారు 1) తిరువరంగ ప్పెరుమాళ్ అరైయర్ 2) తిరుక్కొష్టియూర్ నంబి 3) పెరియ తిరుమలై నంబి 4) తిరుమాలై ఆండాన్ 5) తిరుక్కచ్చి నంబి, పెరియ నంబి. మనము పెరియనంనుల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు, ఇతర ఆచార్యుల గురించి, వాళ్ళు సాంప్రదాయానికి చేసిన విలువైన సేవల గురించి చెప్పుకుందాం.
పరాశర: నాన్నమ్మా, రామానుజులకు అంత మంది ఆచార్యులు ఎందుకున్నారు?
బామ్మగారు: వాళ్ళందరూ తమ తమ శైలిలో రామానుజులను గొప్ప ఆచార్యుడిగా తీర్చిదిద్దడంలో తోడ్పడ్డారు. తిరువరంగ ప్పెరుమాళ్ రామానుజులను కాంచీపురం నుండి శ్రీరంగానికి తీసుకొని వచ్చి గొప్ప కైంకర్యం చేశారు.
వ్యాస: అది ఎలా జరిగింది? ఆ కథ చెప్పండి నాన్నమ్మా.
బామ్మగారు: రామానుజులు సమాశ్రయనం చేసుకొని కాంచీపురంలో జీవిస్తున్న రోజులవి. అప్పట్లో ఒక అరైయర్ స్వామి కంచికి వెళ్లి దేవపెరుమాళ్ళ ఎదుట అరైయర్ సేవ చేయటానికి తిరుక్కచ్చి నంబిని ప్రార్థిస్తారు. అర్చకముఖేన దేవపెరుమాళ్ళు అరైయర్ సేవకి అనుమతిని ప్రసాదిస్తారు. ఆ అరైయర్ స్వామి ఎంతో ప్రేమభక్తితో పాశురాలను పాడి ఆడతారు. పెరుమాళ్ళు ఎంతో సంతోషించి అరైయర్ స్వామికి బహుమానాలను ప్రసాదిస్తారు. కాని అరైయర్ స్వామి తనకి ఆ బహుమతులు కాకుండా ఇంకేదో కావాలని ప్రార్థిస్తారు. పెరుమాళ్ళు అంగీకరించి “ఏమి కావాలో కోరుకో” అని అంటారు. అరైయర్ స్వామి రామానుజులను చూపించి, వారిని శ్రీరంగానికి పంపించమని కోరతారు. “నీవు రామానుజులను పంపమని అనుకోలేదు; ఇంకేమైనా అడుగు” అని దేవ పెరుమాళ్ళంటారు. అరైయర్ స్వామి బదులిస్తూ “మీరు ఎవరో కాదు ఒకే మాట ఒకే బాణం ఉన్న సాక్షాత్తూ ఆ శ్రీ రాముడే – ఇక మాట తప్పలేరు”. దేవపెరుమాళ్ళు అంగీకరించి రామానుజులను అరైయర్ స్వామితో పంపుతారు.
వ్యాస: ఎంత చమత్కారంగా నాన్నమ్మా? అరైయర్ స్వామి ఎంత తెలివిగా పెరుమాళ్ళనును ఒప్పించారు.
బామ్మగారు: అవును వ్యాస. అరైయర్ స్వామి వెంటనే రామానుజుల చేయి పట్టుకుని శ్రీరంగానికి బయలుదేరుతారు. రామానుజులను శ్రీరంగానికి తీసుకువచ్చి అరైయర్ శ్రీవైష్ణవులకు అతిముఖ్యమైన సేవ చేసారు. మన సాంప్రదాయాన్ని ఉన్నత స్థాయికి చేరుకునేందుకు తోడ్పడ్డారు.
వేదవల్లి: నాన్నమ్మా, ఒక్కొక్క ఆచార్యుడు ఒక్కొక్క విధంగా రామానుజులను తీర్చిదిద్దారన్నారు. అరైయర్ ఏమి బోధించారు నాన్నమ్మా?
బామ్మగారు: సాంప్రదాయ విషయాలను రామానుజులకు బోధించమని ఆళవందార్లు తమ ప్రముఖ శిష్యులకు ఆదేశన్నిచ్చి వారు పరమపదానికి చేరుకుంటారు. రామానుజులకు సాంప్రదాయ సారాన్ని బోధించమని అరైయర్కు అప్పగిస్తారు. రామానుజులు జ్ఞానం కోసం అరైయర్ వద్దకు వెళ్లే ముందు, ఆరు నెలల పాటు ఆచార్యులకు (అరైయర్) కైంకర్యం చేస్తారు. ఇది గమనించాల్సిన ముఖ్యమైన విషయం. రామానుజులు, కూరత్తాల్వాన్లు, ముదలియాండాన్, ఇంకా అనేక ఆచార్యులు వారి జీవితాల్లో జ్ఞాన ప్రసాదం తీసుకునే ముందు ఆచార్యులకు కొంతకాలం ఈవిధంగా సేవ చేసేవాళ్ళు. ఇది వాళ్ళు పొందే జ్ఞానం పట్ల, ఆ జ్ఞానాన్ని ప్రసాదించేవారి పట్ల వాళ్ళకున్న భక్తిని చూపిస్తుంది. రామానుజులు అరియార్ స్వామి కోసం ప్రతిరోజూ పాలు కాచేవారు. తమ ఆచార్యుని కోసం చందనాన్ని నూరి సిద్ధం చేసేవారు.
వ్యాస: నాన్నమ్మా, ఇతర ఆచార్యులు రామానుజులకు ఏమి బోధించారు?
బామ్మగారు: వస్తున్నా! నేను ఒకరి తరువాత ఒకరు వాళ్ళ వద్దకే వస్తున్నాను. తిరుమలై నంబి రామానుజులకు స్వయానా మేన మామగారు. వీరు శ్రీవైష్ణవ అగ్రేసరులు. వీరు తిరుమలలో ప్రతి రోజు శ్రీనివాసుల కోసం అకాశగంగ పవిత్ర జలాలను తీసుకువచ్చే కైంకర్యం చేస్తుండేవారు. మహా నిష్ఠతో శ్రీనివాసులకు సేవ చేస్తుండేవారు. రామానుజులకు అందమైన అర్థాలతో శ్రీ రామాయణాన్ని బోధించమని వీరి ఆచార్యులైన ఆళవందార్ల నిర్ధేశము. మన సాంప్రదాయంలో శ్రీ రామాయణాన్ని శరణాగతి శాస్త్రమని పిలుస్తారు. వీరు రామానుజులకు మేనమామ అయినందున ‘ఇళైయార్వార్’ అని రామానుజులకు పేరు పెట్టింది కూడా వీరే. అంతే కాకుండా రామానుజుల పిన్నమ్మ కొడుకు ‘గోవింద పెరుమాళ్’ ను కూడా సాంప్రదాయంలోకి తిరిగి తీసుకువచ్చింది తిరుమలై నంబి వారే. వీరికి సాంప్రదాయ విషయాలన్నా, ఆళ్వార్ల పాశురాలన్నా మహా ప్రీతి.
పరాశర: నాన్నమ్మా, తిరుమాలై ఆండాన్ గురించి చెబుతారా? వారు రామానుజులకు ఎలా సహాయం చేసారు?
బామ్మగారు: తిరువాయ్మోళి అర్థాలను నేర్పించే బాధ్యత తిరుమాలై ఆండాన్ కు ఇవ్వబడింది. రామానుజులు శ్రీరంగానికి వచ్చిన తరువాత, తిరుక్కోష్టివూర్ నంబి వారిని నమ్మాళ్వార్ల తిరువయ్మోలిని విని అర్థం చేసుకోమని తిరుమాలై ఆండాన్ వద్దకు చేరుస్తారు. మొదట్లో, వీరిరువుల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, ఆచార్యులైన తిరుమాలై ఆండాన్ల ఆశీర్వాదాలతో ఆళ్వార్ల పాశురాలలో దాగి ఉన్నఅర్థాలను నేర్చుకుంటారు. తిరుమాలై ఆండానుకి తమ ఆచార్యులు ఆళవందార్లంటే మహా భక్తి ప్రపత్తులు ఉండేది. వీరు తమ ఆచార్యుడు నిర్దేశించిన మార్గాన్ని, బోధనలను ఎప్పుడూ తప్పే వారు కాదు. మన సాంప్రదాయ కైంకర్యాలను నిష్ఠగా నిర్వహిస్తారని అదే వారు రామానుజులకు కూడా నేర్పిస్తారు.
వేదవల్లి: మరి తిరుక్కోష్టియూర్ నంబి, తిరుక్కచ్చి నంబి గురించి చెప్పండి నాన్నమ్మా?
బామ్మగారు: వాళ్ళకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన కథలు ఈ సారి కలుసినపుడు చెప్తాను.
పిల్లలందరూ ఒకేసారి: ఇప్పుడే చెప్పండి నాన్నమ్మా.
బామ్మగారు: ఇక ఆలస్యమవుతుంది. ఇవాల్టికి ఇది చాలు. ఇంటికి వెళ్లి రేపు మళ్ళీ రండి. మీతో పాటు మీ స్నేహితులను కూడా తీసుకురావడం మర్చిపోకండి.
పిల్లలు ఆచార్యుల గురించి ఆలోచిస్తూ వారి ఇళ్లకి వెళ్లి, మర్నాడు నాన్నమ్మ చెప్పబోయే కథల గురించి ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
మూలము : http://pillai.koyil.org/index.php/2016/07/beginners-guide-alavandhars-sishyas-1/
పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org