శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
పిల్లలందరూ కలిసి బామ్మగారింటికి వెళ్లారు. ఆండాళమ్మ వంటింట్లో వంట చేస్తున్నారు. పిల్లలు మాట్లాడుతూ రావడం చూసి ఆవిడ బయటకు వచ్చారు.
బామ్మగారు : పిల్లలూ రండి. మీరు కాళ్ళు చేతులు కడుక్కొని గుడి నుంచి తెచ్చిన ఈ ప్రసాదం తీసుకోండి. క్రిందటి సారి మనం మన పూర్వాచార్యుడు నంపిళ్ళై గురించి చెప్పుకున్నాము. ఈ వేళ నంపిళ్ళైల ప్రముఖ శిష్యులైన వడక్కు తిరువీధి పిళ్ళై, పెరియ వాచ్చాన్ పిళ్ళై, పింభళగియ పెరుమాళ్ జీయర్, ఈయుణ్ణి మాధవ పెరుమాళ్, నడువిళ్ తిరువీధి పిళ్ళై భట్టర్ల గురించి చెప్పుకుందాము.
వ్యాస: నాన్నమ్మా! నంపిళ్ళైకి చాలా మంది శిష్యులు ఉన్నట్టున్నారు. మీరు వారి గురించి మాకు చెప్తారా?
బామ్మగారు: సరే, ఒకరి తరువాత ఒకరిని గురించి మనం చెప్పుకుందాము. మనం నంపిళ్ళై శిష్యుడు, వ్యాఖ్యాన చక్రవర్తి అయిన పెరియవాచ్చాన్ పిళ్ళైతో ప్రారంభిద్ధాం. వీరు శెంగణూర్లో (తిరుచ్చంగనల్లూర్) యామునర్కు పుత్రుడిగా కృష్ణ నామదేయంతో జన్మించారు, తరువాత పెరియ వాచ్చాన్ పిళ్ళైగా ప్రసిద్ది చెందారు. వీరు నంపిళ్ళై ప్రధాన శిష్యులలో ఒకరు, నంపిళ్ళైల వద్ద శాస్త్రాధ్యనం చేశారు. వీరు నాయనారాచ్చాన్ పిళ్ళైని తన దత్తపుత్రునిగా స్వీకరించారు. స్వయంగా తిరుక్కణ్ణమంగై పెరుమాళ్ళు తిరుమంగై ఆళ్వార్ల నుండి పాశురార్థాలను నేర్చుకోవాలని అనుకుంటారు. అందుకని, తిరుమంగై ఆళ్వార్లే నంపిళ్ళైగా, పెరుమాళ్ళే పెరియవాచ్చాన్ పిళ్ళైగా అవతరించి అరుళిచ్చెయల్ అర్థాలను తెలుసుకుంటారని పెద్దలు చెబుతారు.
వ్యాస: నాన్నమ్మా, ఎందుకు పెరియవాచ్చాన్ పిళ్ళైని వ్యాఖ్యాన చక్రవర్తి అంటారు?
బామ్మగారు: అన్ని దివ్య ప్రబంధాలకు కేవలం పెరియవాచ్చాన్ పిళ్ళై మాత్రమే వ్యాఖ్యానం వ్రాశారు. శ్రీ రామాయణం, అరుళిచ్చెయల్ పై వీరికి ఉన్న పటుత్వం అసమానమైనది. ఆళ్వార్ల పాశురాలను నుండి పదాలను తీసుకొని శ్రీరామాయనాన్ని వివరిస్తూ ‘పాశురపడి రామాయణం’ అనే గ్రంథాన్ని వ్రాశారు. వీరు అనువదించి వ్రాయకపోయినట్లైతే, ఎవరూ అరుళిచ్చెయల్ నిగూఢ అర్థాన్ని తెలుసుకోలేకపోయేవారు, అరుళిచ్చెయల్ గురించి మాట్లాడగలిగేవారు కాదు. వీరు మన పూర్వాచార్యులు వ్రాసిన అన్ని గ్రంథాలకు వ్యాఖ్యానాలు పూర్తి చేశారు.
నంపిళ్ళైమ శిష్యులలో వడక్కు తిరువీధి పిళ్ళై కూడా ఒకరు. శ్రీరంగంలో శ్రీ కృష్ణ పాదర్ గా జన్మించిన వీరు, ఆచార్య నిష్ఠలోనే మునిగి ఉండేవారు. తమ ఆచార్యులైన నంపిళ్ళై కృపతో ఒక పుత్రుడు జన్మిస్తాడు. తమ ఆచార్యు నంపిళ్ళై (లోకాచార్య అని కూడా పిలుస్తారు) అనుగ్రహంతో జన్మించినందున ఆ బిడ్డకు ‘పిళ్ళై లోకాచార్య’ అని నామకరణం చేస్తారు. లోకాచార్యగా నంపిళ్ళై కథ మీకు గుర్తుందనుకుంటాను.
వ్యాస: అవును, నాన్నమ్మా. కందాడై తోళప్పర్ నంపిళ్ళైని లోకాచార్య అని పిలిచారు. మాకు ఆ కథ గుర్తుంది.
బామ్మగారు: వడక్కు తిరువీధి పిళ్ళై తన పుత్రునికి పిళ్ళై లోకాచార్య అని పేరు పెట్టినప్పుడు, నంపిళ్ళై ఆ బిడ్డకు ‘అళగియ మణవాళన్’ అనే పేరు పెట్టాలనుకున్నారని వారి ఇచ్ఛను వ్రక్తంచేస్తారు. నంపెరుమాళ్ళ అనుగ్రహంతో కొద్ది రోజుల్లోనే వారికి రెండవ పుత్రుడు జన్మిస్తాడు. ఆ బిడ్డకు ‘అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్’ అని నామకరణం చేస్తారు. ఎందుకంటే, ఆ బిడ్డ అళగియ మణవాలన్ (నంపెరుమాళ్) కృపతో జన్మించాడు కాబట్టి. ఈ విధంగా వడక్కు తిరువీధి పిళ్ళై తన ఆచార్యులైన నంపిళ్ళైల కోరికను నెరవేరుస్తారు. ఆ ఇద్దరు పిల్లలు రామ లక్ష్మణుల వలె కలిసి మెలిసి పెరిగి గొప్ప విద్వాంసులై గొప్ప గొప్ప సంప్రదాయ కైంకర్యాలు చేయసాగారు. పెరియవాచ్చాన్ పిళ్ళై, వడక్కు తిరువీధి పిళ్ళై, నంపిళ్ళై మొదలైన ఎందరో గొప్ప పూర్వాచార్యుల కృపాకటాక్షాలు ఎప్పుడూ వీరిద్దరిపైన ఉండేవి.
ఒకసారి వడక్కు తిరువీధి పిళ్ళై, తదీయారాధన కొరకై నంపిళ్ళైని తన తిరుమాలిగకి ఆహ్వానిస్తారు. నంపిళ్ళై ఆ ఆహ్వానాన్ని స్వీకరించి వారి తిరుమాలిగకి వచ్చి, స్వయంగా వారే పెరుమాళ్ళకు తిరువారాధనం మొదలుపెడతారు. కోయిల్ ఆళ్వార్ (పెరుమాళ్ళ మందిరం) లో తాటి ఆకులపై చక్కగా వ్రాయబడిన, నమ్మాళ్వార్ల పాశురాలపై వారిచ్చిన ఉపన్యాసాలు, వివరణలు చూస్తారు. వాటిలో కొన్నింటిని చదివి వడక్కు తిరువీధి పిళ్ళైని అవి ఏంటో అడుగుతారు. ఉపన్యాసాలు విన్న తరువాత ప్రతిరోజు రాత్రి వాటిని వ్రాసి ఉంచుకునేవారని వడక్కు తిరువీధి పిళ్ళై చెబుతారు. తన అనుమతి లేకుండా అలా ఎందుకు చేశారని ప్రశ్నిస్తారు. పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానాలకు పోటీగా చేస్తున్నారేమోనని ప్రశ్నిస్తారు. వడక్కు తిరువీధి పిళ్ళై అపరాధము మన్నించమని వెంటనే నంపిళ్ళైల పాదాలపైన పడి ముందు ముందు ఎప్పుడైన చూసి చదుకోవచ్చని మాత్రమే వ్రాశారని వివరిస్తారు. నంపిళ్ళై వారిని క్షమించి ఆ వ్యాఖ్యానాలు అద్భుతంగా ఉన్నాయని పొగుడుతారు. అటువంటి అపారమైన జ్ఞానం, ఆచార్య అభిమానం ఉండేది వడక్కు తిరువీధి పిళ్ళై వారికి.
పరాశర: వడక్కు తిరువీధి పిళ్ళై వ్యాఖ్యనాన్ని పూర్తి చేశారా? ఏం జరిగింది నాన్నమ్మా?
బామ్మగారు: అవును, వడక్కు తిరువీధి పిళ్ళై ఆ వ్యాఖ్యానాన్ని పూర్తి చేస్తారు. ఆ తిరువాయ్మోలి వ్యాఖ్యానాన్నే ‘ఈడు 36000 పడి’ అని పిలుస్తారు. నంపిళ్ళై, ఆ వ్యాఖ్యానాన్ని రాబోవు తరాలవారు కూడా నేర్చుకోవడానికి ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ళకి ఇవ్వమని వడక్కు తిరువీధి పిళ్ళైని ఆదేశిస్తారు.
వేదవల్లి: నాన్నమ్మా, నంపిళ్ళై ఇచ్చిన వ్యాఖ్యానంతో ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ ఏమి చేశారు?
పట్టి: ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ళు ఆ వ్యాఖ్యానాన్ని తన కుమారుడైన ఈయుణ్ణి పద్మనాభ పెరుమాళ్ళకు బోధిస్తారు. ఈయుణ్ణి పద్మనాభ పెరుమాళ్ళు తన ప్రియ శిష్యుడైన నాళుర్ పిళ్ళైకి బోధిస్తారు. ఈ విధంగా ఒకరి తరువాత ఒకరి శిష్యులకు వెళుతూ వచ్చింది. నాళూరాచ్చాన్ పిళ్ళై నాళుర్ పిళ్ళైల పుత్రుడు, ప్రియమైన శిష్యులు కూడా. నాళూరాచ్చాన్ పిళ్ళై తమ తండ్రి వద్ద ఈడు 36000 పడి నేర్చుకుంటారు. నాళూరాచ్చాన్ పిళ్ళైకి అనేక శిష్యులు ఉండేవారు, వారిలో తిరువాయ్మొలి పిళ్ళై ఒకరు. నాళుర్ పిళ్ళైతో కలిసి నాళూరాచ్చాన్ పిళ్ళై దేవపెరుమాళ్ళకు మంగళాశాసనం చేయటానికి కాంచిపురానికి వెళ్ళినప్పుడు, ఈడు వ్యాఖ్యానాన్ని తిరువాయ్మొలి పిళ్ళైకి బోధించమని స్వయంగా పెరుమాళ్ళు నాళూరాచ్చాన్ పిళ్ళైని ఆదేశిస్తారు. తిరువాయ్మొలి పిళ్ళై అందరితో పాటు ఈడు వ్యాఖ్యానాన్ని నాళూరాచ్చాన్ పిళ్ళై నుండి నేర్చుకుంటారు. తిరువాయ్మొలి పిళ్ళై ‘ఈట్టు పెరుక్కర్’ (ఈడు వ్యాఖ్యానాన్ని పెంచి పోషించేవాడు అని అర్థం) అని పిలవబడిన మణవాళ మామునులకు బోధిస్తారు. ఆ విధంగా క్రమేణా మణవాళ మామునుల వద్దకు చేరుకుంటుందని నంపిళ్ళై వారికి తెలుసు. అందుకే ఈ వ్యాఖ్యానాన్ని ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ళకు అందజేస్తారు.
అత్తుళాయ్ : ఈయుణ్ణి మాధవ పెరుమాళ్, ఈయుణ్ణి పద్మనాభ పెరుమాళ్ళ పేర్లలో “ఈయుణ్ణి” అంటే ఏమిటి నాన్నమ్మా?
బామ్మగారు: “ఈతల్” అంటే తమిళంలో దానము. “ఉణ్ణుతల్” అంటే భుజించడం. ‘ఈయుణ్ణి’ అంటే అతను ఇతర శ్రీ వైష్ణవులకు వడ్డించిన తరువాత మాత్రమే తానూ భుజించే ధర్మాత్ముడు అని అర్థం.
నంపిళ్ళైల శిష్యులలో ఒకరు ల్పింభళగియ పెరుమాళ్ జీయర్ల్. నంజీయర్లు (ఒక సన్యాసి) భట్టర్నిసేవించు కున్నట్టుగా, వీరు సన్యాసి అయి ఉండి కూడా (గృహస్థుడైన) నంపిళ్ళైని సేవించేవారు. వీరిని నంపిళ్ళైల ప్రియ శిష్యుడని, పింభళగియ పెరుమాళ్ జీయర్ అని పిలిచేవారు. ఒక నిజమైన శ్రీ వైష్ణవుడిగా, ఆచార్యుల పట్ల భక్తి గౌరవాలతో తమ జీవితాన్ని గడిపారు. వీరు ఆచార్యాభిమానం ఎంతో పేరుగాంచినది.
పరాశర: నాన్నమ్మా, మీరు ఈ రోజు నంపిళ్ళై, వారి శిష్యుల మధ్య జరిగిన సంభాషణలు గురించి మాకు చెప్పలేదు. వారి మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణల గురించి చెప్పండి.
బామ్మగారు: మన పూర్వాచార్యులందరూ కేవలం భగవత్ విషయం, భాగవత కైంకర్యం గురించి మాత్రమే సంభాషించేవారు. ఒకసారి పింభళగియ పెరుమాళ్ జీయర్ అనారోగ్యంతో బాధపడుతున్నపుడు, తను తొందరగా కోలుకోడానికి పెరుమ్మాళ్ళను ప్రార్థించమని అక్కడి శ్రీ వైష్ణవులకు చెబుతారు. సాధారణంగా మన సంప్రదాయంలో, పెరుమాళ్ళను ఏ కోరికలను కోర కూడదు – ఆరోగ్యం కాసం కూడా. ఇది చూసి, శిష్యులందరు నంపిళ్ళైని వెళ్లి అడుగుతారు. నంపిళ్ళై, “వెళ్ళి శాస్త్రా నిపుణుడైన ఎంగళాళ్వాన్ను అడగండి” అని చెప్తారు. “ఆయనకు శ్రీరంగం అంటే ప్రీతి ఏమో, అందుకని ఇకొన్ని రోజులు ఇక్కడే ఉండాలని కోరికేమో వారికి ” అనిఎంగళాళ్వాన్ అంటారు. తరువాత నంపిళ్ళై వారి శిష్యులను, అమ్మంగి అమ్మాళ్ని అడగమని చెబుతారు, “నంపిళ్ళై కాలక్షేప గోష్ఠిని విడిచి వెళ్లాలని ఎవరు అనుకుంటారు? నంపిళ్ళై కాలక్షేపాలను వినాలని ప్రార్ధన చేస్తున్నారేమో” అని బదులు వస్తుంది. చివరకు నంపిళ్ళై స్వయంగా జీయర్ని అడుగుతారు. జీయర్ నంపిళ్ళైతో ఇలా అంటారు, “నిజమైన కారణం మీకు తెలిసినప్పటికీ, అది నా ద్వారా వినాలని అనుకుంటున్నారు. నేను ఇక్కడ ఉండాలని ఎందుకు అనుకుంటున్నానో చెప్తాను. ప్రతిరోజూ, మీరు స్నానం చేసిన తరువాత, మీ తిరుమేని దర్శనమును పొందగలుగుతున్నాను, వింజామర సేవ చేయగలుగుతున్నాను. నేను ఈ సేవను విడిచిపెట్టి అప్పుడే పరమపదానికి ఎలా వెళ్ళను?”. అని అంటారు. తమ ఆచార్యల దివ్య తిరుమేనిపైన భక్తి ఉండటమే అని అలా పింభళగియ పెరుమాళ్ జీయర్ ఒక శిష్యుడి స్వరూపాన్ని వెల్లడి చేశారు. నంపిళ్ళైపై జీయర్ భక్తి గురించి విన్న వారంతా ఆశ్చర్యపోయారు. నంపిళ్ళైపై పింభళగియ పెరుమాళ్ జీయర్ కు ఎంత ప్రీతి అంటే వారు పరమపద ఆలోచనను కూడా మరచిపోయేవారు. వారి ఆచార్య నిష్ఠ అంత గాఢమైనది.
చివరిగా నంపిళ్ళై ఇంకొక శిష్యుని గురించి మనం చూద్దాము – నడువిళ్ తిరువీధి పిళ్ళై భట్టర్. మొదట్లో, నడువిళ్ తిరువీధి పిళ్ళై భట్టర్ నంపిళ్ళైని అంతగా ఇష్టపడే వారి కాదు. తన గొప్ప కుటుంబ వారసత్వం (కూరత్తాళ్వాన్ల వశస్థుడు) కారణంగా అహంకారంతో నంపిళ్ళైని గౌరవించేవారు కాదు. వారు నంపిళ్ళైల వద్ద శరణాగతి చేయడం వెనక చాలా ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది.
వ్యాస: కూరత్తాళ్వాన్ల వంశస్థుడు అహంకారంతో ఉండటమా? ఎంత విచిత్రం. మాకు ఆ కథ చెప్పండి నాన్నమ్మ!
బామ్మగారు: సరే, కానీ వారి గర్వం ఎక్కువ కాలం ఉండలేదు! ఎంతైనా, వారు కూరత్తాళ్వాన్ల మనుమడు కదా! ఒకసారి, నడువిళ్ తిరువీధి పిళ్ళై భట్టర్ రాజభవనానికి వెళ్తున్నారు. వారికి దారిలో పింభళగియ పెరుమాళ్ జీయర్ కలుస్తారు, తనతో పాటు వారిని కూడా రాజభవనానికి రమ్మని ఆహ్వానిస్తారు. రాజు వారిని స్వాగతించి, సత్కరించి కూర్చోడానికి ఆసనమిస్తారు. భట్టర్ మేధస్సును పరీక్షించడానికి రాజు శ్రీ రామాయణంలో నుండి ఒక ప్రశ్న అడుగుతారు. వారంటారు, “శ్రీ రాముడు తనను తాను సాధారణ మానవుడినని, దశరథ పుత్రుడని అంటారు. కానీ జటాయువు చివరి క్షణాలలో వున్నప్పుడు, శ్రీరాముడు జటాయువుకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఒక సాధారణ మానవుడైతే, వైకుంటం చేరుకుంటావని ఎలా అనుగ్రహించాడు?” అని ప్రశ్నించారు. భట్టర్ వారికి నోట మాట రాలేదు. అంతలో రాజుగారు మరేదో పనిమీద ఉండగా, ఆ సమయంలో, భట్టర్ జీయర్ వైపు మళ్ళి “నంపిళ్ళై ఉంటే ఈ ప్రశ్నకు సమాధానం ఎలా వివరించి ఉండేవారు?” అని వారిని అడుగుతారు. జీయర్ సమాధానమిస్తూ “ఒక నిజాయితీ గల వ్యక్తి అన్ని లోకాలను నియంత్రించగలడని నంపిళ్ళై వివరించి ఉండేవారు” అని అంటారు. భట్టర్, రాజు వారికి అదే సమాధానాన్ని వివరిస్తారు. రాజు ఆ జవాబుకి అంగీకరించి వారిని బహుమతులతో సత్కరిస్తారు. నంపిళ్ళై పట్ల కృతజ్ఞతతో భట్టర్ నంపిళ్ళై ఇంటికి వెళ్లి వారి చరణాల వద్ద ఆ బహుమానాలన్నీ ఉంచి వారికి శరణాగతి చేస్తారు. భట్టార్ నంపిళ్ళైకి చెప్తూ, “మీరు చెప్పిన వాటి నుండి కేవలం ఒక్క చిన్న వివరణతో ఈ సంపద నాకు దక్కింది. మీ విలువైన సంబంధాన్ని ఎప్పుడూ విస్మరిస్తూనే వచ్చాను. ఇప్పటి నుండి, నేను మీకు సేవ చేస్తూ మన సంప్రదాయ సూత్రాలను నేర్చుకుంటానని అంటారు. నంపిళ్ళై భట్టార్ని స్వీకరించి వారికి మన సాంప్రదాయ తత్వార్థాలను బోధిస్తారు. కాబట్టి పిల్లలు, మీరు ఈ కథ నుండి ఏమి నేర్చుకున్నారు?
వేదవల్లి: పూర్వీకుల ఆశీర్వాదంతో, భట్టర్ వారి గమ్యాన్ని చేరుకున్నారని తెలుస్తుంది.
అత్తుళాయ్ : నంపిళ్ళైల మహిమ గురించి నేను తెలుసుకున్నాను.
బామ్మగారు: మీరు ఇద్దరూ చక్కగా చెప్పారు. కానీ ఈ కథ నుండి మనం మరో పాఠం కూడా నేర్చుకున్నాము. మనము మన ఆచార్యాల ద్వారా పెరుమాళ్ళను చేరుకుంటాము. అటువంటి ఆచార్యులను ఆశ్రయించడం కూడా కేవలం శ్రీవైష్ణవుల సంబంధంతోనే సాధ్యమవుతుంది. దీనినే శ్రీవైష్ణవ సంబంధం లేదా అడియార్గల్ సంబంధం అని పిలుస్తారు. ఇక్కడ భట్టార్ని నంపిళ్ళైతో కలిపిన శ్రీవైష్ణవుడు ఎవరు?
పరాశర: పింభళగియ పెరుమాళ్ జీయర్!
బామ్మగారు: అవును! ఇక్కడ భాగవత సంబంధ ప్రాముఖ్యత మనకు కనిపిస్తుంది. ఈ సారి కలుసుకున్నపుడు, వడక్కు తిరువీధి పిళ్ళై వారి ఇద్దరు పుత్రుల గురించి, వారి అసమానమైన కైంకర్యాల గురించి చెప్తాను.
పిల్లలు ఆచార్యలు, వారి దివ్య సేవల గురించి ఆలోచిస్తూ వారి ఇంటికి వెళ్లిపోతారు.
మూలము : http://pillai.koyil.org/index.php/2016/09/beginners-guide-nampillais-sishyas/
పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org