బాల పాఠము – నంపిళ్ళై

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<<బాల పాఠము – నంజీయర్

పిల్లలందరు కలిసి ఆండాళమ్మ ఇంటికి వస్తారు.

బామ్మగారు: పిల్లలూ రండి. ఈ రోజు మనం నంజీయర్ల శిష్యులైన నంపిళ్ళైల గురించి మాట్లాడుకుందాం. ముందు మీకు చెప్పాను గుర్తుందా, వరదరాజుగా నంబూర్లో జన్మించిన నంపిళ్ళై తమిళ, సంస్కృత భాషా పండితులు. నంజీయర్లు తమ 9000 పడి వ్యాఖ్యానాన్ని అనుకరించడానికి, ఈ రెండు భాషల్లో నైపుణ్యత కారణంగా వరదరాజులకు ఇచ్చారని మనందరికీ తెలుసు. నంజీయర్లు వరదరాజుల నైపుణ్యతను, గొప్పతనాన్ని చూసి ‘నంపిళ్ళై’ అనే పేరును వారికి ప్రసాదిస్తారు. నంపిళ్ళైని తిరుక్కలికన్ఱి దాసు, కలివైరి దాసు, లోకాచార్య, సూక్తి మహార్ణవ, జగదాచార్యార్, ఉలగాశిరియర్ అని కూడా పిలుస్తారు.

నంపిళ్ళై – తిరువల్లిక్కేని

వ్యాస: నాన్నమ్మా, కావేరి వరదలో వారి ఆచర్యులిచ్చిన గ్రంథం కొట్టుకుపోయిన తరువాత కూడా నంపిళ్ళై వారి జ్ఞాపకశక్తితో 9000 వ్యాఖ్యానాన్ని మొత్తం తిరిగి వ్రాసారని మాకు గుర్తుంది.

బామ్మగారు: అవును, అంతటి గొప్పతనం, జ్ఞానం ఉన్నప్పటికీ, నంపిళ్ళై ఎంతో వినయ విధేయతలతో ఉండేవారు. ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ, గౌరవంతో ఉండేవారు.

వేదవల్లి: నాన్నమ్మా, నంపిళ్ళై గొప్పతనాన్ని చాటిచెప్పే సంఘటనలు కొన్ని మాకు చెప్తారా?

బామ్మగారు: నంజీయర్ల వద్ద పాసురాలు, వాటి అర్ధాలు నేర్చుకున్న తరువాత నంపిళ్ళై  శ్రీరంగంలో క్రమం తప్పకుండా పెరుమాళ్ళ సన్నిధికి తూర్పు వైపున ప్రసంగించేవారు. ఉభయ వేదాంతులు (సంస్కృత తమిళ భాషా ప్రవీణులు) కావడంతో నంపిళ్ళై పెద్ద సమూహాన్ని ఆకర్షించేవారు. వినే వారికి ఏ సందేహాలు వచ్చినా వాల్మీకి రామాయణాన్ని ఉల్లేఖించి సంతృప్తికరమైన జవాబులు ఇచ్చేవారు. ఒకసారి, నంపిళ్ళై ఉపన్యాసం ఇస్తుంన్నపుడు, పెరియ పెరుమాళ్ళు తమ శయనావస్థ నుండి లేచి నిలబడి, నంపిళ్ళై ఇస్తున్న ఉపన్యాసాన్ని వినాలని ప్రయత్నిస్తారు. తిరువిళక్కు పిచ్చన్  (సన్నిధిలో దీపాలను వెలిగించే సేవ చేసే ఒక శ్రీవైష్ణవుడు) పెరియ పెరుమాళ్ళు నిలబడటం చూసి, అర్చావత స్వరూపంగా ఉన్న పెరియ పెరుమాళ్ళకు కదిలే అనుమతి లేదని, తిరిగి శయనించమని కోరతారు. పెరుమాళ్ళు ఇచ్చిన మాటను (అర్చావతారం రూపంలో కదలనని, మాట్లాడానని) కూడా లెక్కచేయకుండా నంపిళ్ళై ప్రసంగానికి ఆకర్షితులైయ్యేవారు. అంత ఆకర్షణీయంగా ఉండేవి నంపిళ్ళైల ఉపన్యాసాలు. ఉభయ భాషలలో ప్రావిణ్యం కారణంగా వినేవారిని మంత్రముగ్ధులను చేయగలిగేవారు. ఊరెరిగింపులో నంపెరుమాళ్ళ వయ్యారి నడకకు, వారి అందమైన తిరుమేనికి ఎలా ప్రపంచం నలు మూలల నుండి భక్తులు ఆకర్షితులౌతారో అలా నంపిళ్ళై అందరిని ఆకర్షించేవారు.  ఎవరైనా శ్రీరంగంలో నంపెరుమాళ్ళ ఊరెరిగింపు చూసారా?

పెరుమాళ్ళా సన్నిధిలో నంపిళ్ళై ఉపన్యాసం – శ్రీరంగం

అత్తుళాయ్: నాన్నమ్మా, నేను చూసాను. శ్రీ రంగం భ్రహ్మోత్సవాలకు ఒక సారి వెళ్ళాము. తిరుమాడవీధుల్లో పెరుమాళ్ళను ఉరేగిస్తుంటే వారి నడకను చూసాను. చాలా బావుంటుంది.

పరాశర: అవును నాన్నమ్మా, మేము కూడా చాలా సార్లు నంపెరుమాళ్ళ ఊరెరిగింపు చూశాము.

బామ్మగారు: ఎవరు చూసుండరు? కళ్ళకి కట్టినట్టుగా ఉంటుంది కదూ? ఎలాగైతే ఊరెరిగింపులో నంపెరుమాళ్ళు తన భక్తులను ఆకర్షిస్తారో, నంపిళ్ళై కూడా తన ఉపన్యాసాలతో అందరిని ఆకర్షించేవారు. అయినా కానీ, వీరి వినయం అసమానమైనది. ఒకసారి నంపెరుమాళ్ళ ముందు, కందాడై తోళప్పర్ (ముదలియాండాల్ వంశస్తులు) నంపిళ్ళైలతో కఠినంగా మాట్లాడతారు. నంపిళ్ళైని పొగడలేక, కేకలు వేస్తారు. నంపిళ్ళై ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా, అవమానాన్ని మింగేసి, వారి తిరుమాళిగకి (ఇంటికి) వెళ్లిపోతారు.

తోళప్పర్ తిరిగి ఇంటికి వెళ్ళగానే, ఊరి వాళ్ళ ద్వారా అప్పటికే జరిగినది తెలుకున్న వీరి భార్య, తన ప్రవర్తన తప్పని గట్టిగా చెప్పి, నంపిళ్ళైల గొప్పతనం గురించి వివరిస్తుంది. వెళ్ళి నంపిళ్ళై చరణాలపైన పడి  క్షమాపణ వేడుకోమని నొక్కి చెబుతుంది. చివరకు, చేసిన పొరపాటును తెలుసుకుంటారు. మధ్య రాత్రైనా సరే నంపిళ్ళైల తిరుమాళిగకి వెంటనే వెళ్లి క్షమాపణ వేడుకోవాలని అనుకుంటారు. వారు వెళదాం అని తలుపు తెరవగానే, బయట ఎవరో ఒక వ్యక్తి నిలబడి ఉన్నట్టు  గమనిస్తారు. వారెవరో కాదు స్వయంగా నంపిళ్ళై వారే. తోళప్పర్ని చూసి నంపిళ్ళై వెంటనే కింద పడి దండంపెట్టి, ఏదైనా తప్పు జరిగి వారిని బాధ పెట్టినట్లయితే క్షమించమని అడుగుతారు. నంపిళ్ళై గొప్పతనాన్ని చూసి తోళప్పర్ ఆశ్చర్యపోతారు. పొరపాటు తోళప్పర్ వారిది అయినప్పటికీ, నంపిళ్ళై తప్పును తనపైకి తీసుకొని క్షమించమని అడుగుతారు. నంపిళ్ళైల గొప్పతనాన్ని గ్రహించిన తోళప్పర్ వెంటనే వారికి సాష్టాంగ ప్రణామాన్ని సమర్పించుకొని, ఇకపై నంపిళ్ళైవారు “లోకాచార్య” (ప్రపంచానికే గురువు) అని పిలవబడతారు అని ప్రకటిస్తారు. అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉండి అంత వినమ్రతతో ఉండేవారు కొందరు మాత్రమే ఉంటారని, లోకాచార్యుల స్థానానికి సరిగ్గా సరిపోతారని అంటారు. తోళప్పర్ ద్వేషాన్ని విడిచి అతని భార్యతో పాటు నంపిళ్ళైలకు సేవ చేయడం ప్రారంభిస్తారు. వారి నుండి శాస్త్ర  అర్థాలను కూడా నేర్చుకుంటారు.

పరాశర: ఎంత ఆశ్చర్యంగా ఉంది! కఠినంగా మాట్లాడిన వ్యక్తికి పరాశర భట్టర్లు ఖరీదైన శాలువను బహుమతిగా ఇచ్చిన సంఘటన లాగా ఉంది.

బామ్మగారు: బాగా పరిశీలించావు పరాశర! మన పూర్వాచార్యులందరూ ఇంచుమించు సమానమైన గుణాలతో ఉండేవారు – నిజమైన శ్రీవైష్ణవునిలా. రోజులు గడిచినా కొద్ది మళ్ళీ మళ్ళీ మన పూర్వాచార్యాలు, ఒక శ్రీవైష్ణవుడు తన జీవితాన్ని ఎలా గడపాలో, అందరితో ఎలా వ్యవహరించాలో నేర్పుతూనే వచ్చారు, నొక్కిచెబుతూనే ఉన్నారు. మనందరికీ ఈదర్శంగా ఉండి మార్గం చూపించారు. వారి గ్రంథాలలో సిద్ధాంత పరంగానే కాకుండా, ఆచరణాత్మకమైనదని అనుసరించి మరీ మనకు చూపించారు. కావలసింది ఆచార్యుల అనుగ్రహం, కొంచం మన కృషితో, మనం కూడా పూర్వాచార్యుల జీవితాన్ని గడపడానికి ప్రయత్నించవచ్చు. చిన్న చిన్న అడుగులు వేసి చివరికి మన గమ్యానికి చేరుకోవచ్చు.

నిజమైన శ్రీవైష్ణవుడు ఎలా ఉండాలో పరాశర భట్టర్ మనకు చూపించారు. వీరి వశస్థులైన ‘నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్’ వారు నంపిళ్ళై అంటే అసూయ పడేవారు. ఒకసారి నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ వారు పింభళగియ పెరుమాళ్ జీయర్ తో కలసి రాజ భవనానికి వెళ్ళారు. రాజు వారిద్దరిని ఆహ్వానించి, వారికి తగిన గౌరవ మర్యాదలు చేసి, ఆసనాన్నిచ్చి ఆసీనులు కామన్నారు. ఆ రాజు శ్రీ రామాయణంలో నుండి ఒక ప్రశ్న, “శ్రీ రాముడు ఎప్పుడూ తాను ఒక సామాన్య మానవుడని ప్రకటించుకున్నారు, పరమాత్ముడని అక్కడా చూపించుకోలేదు, అలాంటప్పుడు జటాయువుకి ఎలా మోక్షాన్ని ప్రసాదించారు?” అడిగారు. నంపిళ్ళై ఉండి ఉంటే ఈ ప్రశ్నకి వారు సమాధానం ఎలా ఇచ్చుండే వారు అని భట్టర్ జీయర్ని అడుగుతారు. జీయర్ వెంటనే, “రాముడి వంటి సత్యవంతుడు తన నిజాయితీ శక్తితో అన్ని లోకాలను జయించగలడు” అని చెప్పి ఉండేవారు అని అంటారు. రాజు ప్రశ్నకు భట్టర్ అదే వివరణను ఇస్తారు. రాజు ఎంతో సంతోషంచి, భట్టర్ జ్ఞానాన్ని ప్రశంశిస్తూ వారికి ఎన్నో బహుమానాలు సమర్పిస్తారు. భట్టర్ వెంటనే నంపిళ్ళైల వివరణ, దాని శక్తిని గ్రహించి, నంపిళ్ళై ఇంటికి వెళ్లి బహుమానంగా తీసుకున్న సంపదను వారికి సమర్పిస్తారు. అంతే కాకుండా వారు నంపిళ్ళై శిష్యులై వారికి సేవ చేసుకుంటారు. అలా నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ నంపిళ్ళైల అనేక శిష్యులలో ఒకరైనారు.

వేదవల్లి: నాన్నమ్మా, భట్టర్ నంజీయర్ల  మధ్య సంభాషణలు జరిగేవని క్రిందటిసారి మీరు చెప్పారు కదా! అలాగే నంజీయర్ నంపిళ్ళైల మధ్య కూడా సంభాషణలు జరిగేవా?

బామ్మగారు: అవును వేదవల్లి. నంజీయర్ నంపిళ్ళైల మధ్య కూడా అద్భుతమైన సంభాషణలు జరిగేవి. ఒకసారి, నంపిళ్ళై నంజీయర్లను , “భగవానుడు అవతారాలు ఎందుకు ఎత్తుతారు? ప్రయోజనమేమిటి?” అని ఒక ప్రశ్న అడిగారు. నంజీయర్లు సమాధానమిస్తూ “భాగవతాపచారం చేసిన వాళ్ళని శిక్షించాలనేదే భగవానుడి అవతారాల ప్రధాన” అన్నారు. ఉదాహరణకి, కృష్ణావతారంలో తన భక్తులను బాధపెట్టిన దుర్యోధనుడిని శిక్షించాలనేదే ఆ అవతార ఉద్దేశ్యం. భక్త ప్రహ్లాదుడిని హింసించిన హిరణ్యకశిపుడిని చంపాలని నారసింహుడిగా వచ్చాడు. అందువల్ల, భాగవత సంరక్షణమే అన్ని అవతారాల ప్రధాన ఉద్దేశ్యం.

వ్యాస: నాన్నమ్మా, భాగవత అపచారం అంటే ఏమిటి?

బామ్మగారు: నంజీయర్లు అంటారూ, మనం ఇతర శ్రీవైష్ణవులతో సమానమనే భావనే భాగవత అపచారం. వాళ్ళ జన్మ, జ్ఞానం మొదలైన వాటితో సంబంధం లేకుండా ఎప్పుడూ శ్రీవైష్ణవులందరి కంటే మనం తక్కువహా భావించి వ్యవహరించుకోవాలనే వారు నంజీయర్లు. ఆళ్వార్లు, ఇతర పూర్వాచార్యుల  లాగా భాగవతులను నిరంతరం కీర్తించే ప్రయత్నం చేయాలి అని కూడా అనేవారు. 

ఇతర దేవతల భజన, ఇతర దేవతాంతర ప్రార్థన నిరర్థకమైనదని నంపిళ్ళై  స్పష్టంగా నొక్కివెప్పేవారు.

అత్తుళాయ్ : నాన్నమ్మా, నంపిళ్ళైవారు దానిని ఎలా వివరించారు?

బామ్మగారు: ఒకసారి ఒకరు వచ్చి నంపిళ్ళైని అడుగుతారు , “మీ నిత్య కర్మలలో దేవతాంతరులను (ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, సూర్యుడు తదితరాలను) పూజిస్తున్నారు, కాని ఎందుకు వాళ్ళ గుళ్ళకు వెళ్ళరు?” అని అడిగారు. నంపిళ్ళై వెంటనే తెలివైన సమాధానం ఇస్తారు. నంపిళ్ళై వారిని ప్రశ్న ఒకటి అడుగుతారు, “మీరు యజ్ఞ యాగాలలో అగ్నిని ఆరాధిస్తారు, కానీ అదే అగ్నికి స్మశానంలో దూరంగా ఉంటారా? అదే విధంగా, నిత్యా కర్మలను భగవదారాధనంలో భాగంగా నిర్వర్తించాలని, ఆ భగవానుడు అన్ని దేవతలలో అంతర్యామిగా ఉన్నాడన్న భావనతో చేస్తాము. పెరుమాళ్ళనే పూజించాలని శాస్త్రం కూడా చెప్తుంది. ఆ కారణంగా దేవతాంతర గుళ్ళకు వెళ్లము” అని చెబుతారు.

వేదవల్లి: నాన్నమ్మా, ఇది చాలా సున్నితమైన విషయమని అందరూ ఈ భవనతో ఉండరని మా అమ్మ చెప్పింది.

బామ్మగారు: నిజము ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. అయితే చేదు మందులు శరీరానికి మంచి చేస్తాయి, అలాగే ఈ నిజం కూడా ఆత్మకు, శరీరానికి మంచే చేస్తుంది. కొంతమంది ఎవరో ఒప్పుకోవట్లేదని వేద ప్రమాణాలను ఖండించి, అవి వ్యర్థమని చూపించకూడదు. ఆచార్యుల అనుగ్రహంతో, భగవత్ కృపతో ఎదో ఒక సమయంలో ఈ నిజాన్ని తెలుసుకుంటారు. ఆళ్వార్ తమ పాశురాలలో అంటారూ, “అందరూ శ్రీమన్నారాయణుడి పరత్వ నిజాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందితే, భగవానుడు తన కాలక్షేపం కోసం ఆడుకోవడానికి ఈ ప్రపంచమే ఉండదు, అందుకే ఈ ఆలస్యం”. “ఈ రహస్యాన్ని గ్రహించి, వెంటనే తిరుక్కురుగూరుకు పరిగెత్తుకెళ్లి ఆదిప్పిరాన్ పెరుమాళ్ళ పాద పద్మాల యందు శరణాగతి చేయండి” అని కూడా ఆళ్వార్ అన్నారు.

వ్యాస: నాన్నమ్మా, నంపిళ్ళైకి వివాహం అయ్యిందా?

బామ్మగారు : అవును, నంపిళ్ళైకి ఇద్దరు భార్యలు ఉండేవారు. ఒకసారి, వారు ఒక భార్య దగ్గరకు వెళ్లి ఆమె తన గురించి ఏమని భావిస్తుందని అడుగుతారు. ఆమె నంపిళ్ళైని ఒక భగవత్ అవతారంగా, తన ఆచార్యునిగా భావిస్తుందని చెప్తుంది. నంపిళ్ళై చాలా ఆనందపడి ఆమెకు తిరుమాలిగకు వచ్చే శ్రీవైష్ణవుల తదీయారాదన కైంకర్యాన్ని చేయమని అంటారు. ఈ సంఘటనలో నంపిళ్ళై ఆచార్య అభిమాన ప్రాముఖ్యతను చూపించారు.

పరాశర : నాన్నమ్మా, నంపిళ్ళై జీవితం వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. వీరికి ఎంతో మంది శిష్యులు కూడా ఉండి ఉండాలి!

బామ్మగారు: అవును పరాశర! నంపిళ్ళైలకు అనేక మంది శిష్యులు ఉండేవారు, వారిలో ఆచార్యపురుషుల కుటుంబాల వారు కూడా ఉండేవారు, శ్రీరంగంలో వీరి కాలాన్ని ‘నల్లడిక్కాలం’ (మంచి కాలం) అని అందరూ కీర్తించేవారు. నంపిళ్ళై మన సంప్రదాయంలో రెండు అద్భుతమైన స్తంభాలకు పునాది వేసారు – పిళ్ళై లోకాచార్య మరియు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్, వీరిద్దరూ వడక్కు తిరువీధిపిళ్ళై కుమారులు. నంపిళ్ళై వారి ముఖ్య శిష్యులలో వడక్కు తిరువీధిపిళ్ళై, పెరియవాచ్చాన్  పిళ్ళై, పింభళగరాం పెరుమాళ్ జీయర్, కందాడై తోళప్పర్, ఈయుణ్ణి మాధవ పెరుమాళ్, నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ మొదలైనవారు ఉండేవారు.

nampillai-pinbhazakiya-perumal-jeer-srirangam
పింభళగరాం పెరుమాళ్ జీయర్ తో నంపిళ్ళై – శ్రీరంగం

మనము మళ్ళీ కలుసుకున్నపుడు, నంపిళ్ళై శిష్యుల గురించి చెప్తాను. వీరు ఎంతో దయతో  గొప్ప గ్రంథాలను మనకందించి, సంప్రదాయానికి అద్భుతమైన కైంకర్యాలను చేసారు.

పిల్లలు నంపిళ్ళైల చరిత్రను, వారి బోధనల గురించి ఆలోచిస్తూ వాళ్ళ ఇండ్లకు వెళ్ళారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2016/08/beginners-guide-nampillai/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment