శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
పరాశర, వ్యాస, వేదవల్లి మరియు అత్తుళాయ్ తో కలిసి నాన్నమ్మ ఇంటికి వస్తారు.
నాన్నమ్మ: స్వాగతం పిల్లలూ. మీరు చేతులు కాళ్ళు కడుక్కోండి, మీకు దేవుడికి పెట్టిన పండ్లను ఇస్తాను. ఈ నెల ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?
పరాశర: నేను చెప్తాను నాన్నమ్మ. మాణవాళ మామునులు పుట్టిన నెల. వారి తిరునక్షత్రం వైశాఖ మాసం తిరుమూలా నక్షత్రంలో వస్తుంది.
వేదవల్లి: అవును. ఈ నెల ముదల్ ఆళ్వార్, సేనాధిపతి విశ్వక్సేన, పిళ్ళై లోకాచార్యుల పుట్టిన నెల కూడా. అవునా నాన్నమ్మా?
నాన్నమ్మ: అవును. ఇప్పటి వరకు ఆళ్వారులు, ఆచార్యులు, ఉత్తమ అనుష్ఠానాలు, కైంకర్యాల గురించి మనం చూసాము. ఇప్పుడు అపచారాల గురించి నేర్చుకుందాము.
వ్యాస: నాన్నమ్మా అపచారం అంటే ఏమిటి?
నాన్నమ్మ: అపచారము అంటే భగవంతుడి పట్ల లేదా వారి భక్తుల పట్ల అపరాధం చేయుట. మనం ఎప్పుడూ భగవానుని మరియు వారి భక్తులను ఆనందపరచాలి. మనం చేసే కార్యాలు ఎమ్బెరుమాన్ మరియు భాగవతులను అసంతృప్తి పరిచితే, దానిని అపచారము అంటారు. మనము ఇప్పుడు ఏ అపచారాలు చేయకుండా దూరంగా ఉండాలో చూద్దాము.
అత్తుళాయ్: నాన్నమ్మ, అవేంటో వివరంగా చెప్తారా?
నాన్నమ్మ: సరే. శ్రీవైష్ణవులకు శాస్త్రం ఒక ఆధారం/మూలం /మార్గదర్శనం. మన పూర్వాచార్యులు శాస్త్రం పట్ల చాలా గౌరవప్రదంగా ఉండి వారి అనుష్టానాలను క్రమం తప్పకుండా అనుసరించారు. వారు భగవానుడి పట్ల వారి భక్తుల పట్ల ఎలాంటి అపరాధాలు చేయాలన్నా చాలా భయపడేవారు. కాబట్టి, మనం కూడా ఏ అపచారాలు చేయకుండా అన్ని సమయాల్లో జాగ్రత్త పడాలి. ఇప్పుడు మనం ఒకదాని తర్వాత ఒకదానిని (అపచారాల రకాలు) వివరంగా చూద్దాము. ముందుగా మనం భగవత్ అపచారాల గురించి చూద్దాము.
వ్యాస: ఎమ్బెరుమానుకు అపచారము చేస్తే భగవత్ అపచారము అంటారు, అవునా నాన్నమ్మా?
నాన్నమ్మ: అవును, భగవత్ అపచారాలు, ఈ క్రింద ఇవ్వబడ్డాయి.
- భగవానుడిని ఇతర దేవతలతో (బ్రహ్మ, శివ, వాయు, వరుణ, ఇంద్ర మొదలగు వారు) సమానంగా పరిగణలోకి తీసుకోవడం ఒక నేరం.
- ఒక శ్రీవైష్ణవుడయిన తరువాత, ఇతర దేవతలను పూజించడం కూడా భగవత్ అపచారమే. అందరిని ఎమ్బెరుమానే సృష్టించారు.
- నిత్యకర్మానుష్టాలు నిర్వహించక పోవడం భగవత్ అపచారము క్రిందకు వస్తాయి. నిత్యకర్మానుష్టాలు మనకు భగవానుని ఆజ్ఞలు, ఆదేశాలు. కాబట్టి మనము వారి మాటలకు కట్టుబడి ఉండాలి. మనం వారి ఆదేశాలను ఆచరించకపోతే, మనం నేరం చేస్తున్నట్టు లెక్క. ఇంతకుముందు ఈ విషయం గురించి మనం చెప్పుకున్నాము, అందరికి గుర్తుందనుకుంటాను.
పరాశర: అవును నన్నమ్మా. వ్యాస మరియు నేను ప్రతిరోజు సంధ్యావందనం క్రమం తప్పకుండా ప్రతిరోజూ చేస్తాము.
నాన్నమ్మ: మీరు నిత్యకర్మానుష్టాలు క్రమం తప్పకుండా ప్రతిరోజూ చేస్తారంటే, వినడానికి సంతోషంగా ఉంది.
- మనం చేయకుండా దూరముండాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే రామ, కృష్ణులను సాధారణ మనుషులుగా పరిగణలోకి తీసుకోకూడదు. భగవానుడు తన భక్తుల కోసం ప్రేమ, కృపతో మన సహాయం కోసం ఈ అవతారాలను తీసుకున్నాడు.
- ఈ భౌతిక ప్రపంచంలో మనము స్వతంతృలమని అనుకోవడం భగవత్ అపచారము. అందరూ ఎమ్బెరుమానుకి ఆధీనులమని, దానికి అనుగుణంగా వ్యవహరించాలని అర్థం చేసుకోవాలి.
- ఎమ్బెరుమానుకి కు చెందిన వస్తువులను దొంగిలించుట. వారి వస్త్రాలు, తిరువాభరణాలు(ఆభరణాలు) మరియు స్థిర ఆస్తులు (భూములు) మొదలైనవి.
అత్తుళాయ్: నన్నమ్మా వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది, మీరు భాగవత అపచారము గురించి మాకు వివరించండి?
నాన్నమ్మ: తప్పకుండా అత్తుళాయ్. ఎమ్బెరుమాన్ యొక్క భక్తులకు అపచారం భాగవత అపచారము క్రిందకు వస్తుంది. భాగవత అపచారము మరియు భగవత్ అపచారము మధ్య, భాగవత అపచారము అత్యంత క్రూరమైనది. ఎమ్బెరుమాన్ తన భక్తుల బాధలను తట్టుకోలేడు. కాబట్టి మనం భాగవత అపచారము చేయకుండా జాగ్రత్తపడాలి. ఈ క్రింది భాగవత అపచారాలు ఇవ్వబడ్డాయి.
- ఇతర శ్రీవైష్ణవులను మనకు సమానంగా పరిగణించడం. ఇతర శ్రీవైష్ణవుల కంటే మనలను తక్కువగా పరిగణించుకోవాలి.
- మనం శారీరికంగా గానీ, మానసికంగా గానీ ఎవరినీ బాధపెట్టకూడదు.
- శ్రీవైష్ణవులను వారి జన్మ, జ్ఞానం, చర్యలు, సంపద, జీవించే ప్రదేశం, రంగు మొదలైనవి ఆధారంగా వారిని అవమానించకూడదు.
మన పూర్వాచార్యులు ఇతర శ్రీవైష్ణవులతో వ్యవహరించేటప్పుడు ఖచ్చితమైన ప్రమాణాలను అనుసరించే వారు. ఇతర శ్రీవైష్ణవులను అసంతృప్తి / మనసును గాయపరచ కుండా వారు చాలా జాగ్రత్తగా ఉండేవారు. వారు ప్రతి ఒక్కరితో గౌరవంగా వ్యవహరించేవారు.
వేదవల్లి: నాన్నమ్మా, మేము తప్పకుండా ఇటువంటి అపచారాలు చేయకుండా ఎమ్బెరుమానుని సంతోషపెడతాం.
మిగితా ముగ్గురు పిల్లలు కూడా ఒకేసారి: అవును నాన్నమ్మా.
నాన్నమ్మ: చాలా మంచిది పిల్లలు. ఇప్పటి వరకు నేను మీకు మన సాంప్రదాయం గురించి చాలా విషయాలు నేర్పించాను. మరోసారి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు, మీకు ఇంకొన్ని విషయాలు చెప్తాను. చీకటి పడుతోంది. మీరు వెళ్ళే సమయమయ్యింది.
పిల్లలు: అవును మేము చాలా నేర్చుకున్నాము నాన్నమ్మా. ఎమ్బెరుమాన్ మరియు ఆచార్యుల కృపతో మేము నేర్చుకున్నవన్నీ ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాము.
నాన్నమ్మ: చాలా మంచిది.
పిల్లలు నాన్నమ్మతో సంభాషణ గురించి ఆలోచించుకుంటూ సంతోషంగా వారి ఇండ్లకు వెళతారు.
మూలము: http://pillai.koyil.org/index.php/2018/11/beginners-guide-apacharams/
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org