బాల పాఠము – అపచారాలు (అపరాధాలు)

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< కైంకర్యం

పరాశర, వ్యాస, వేదవల్లి, అత్తుళాయ్ తో కలిసి బామ్మగారి ఇంటికి వస్తారు.

బామ్మగారు: రండి పిల్లలూ. మీరు కాళ్ళు చేతులు కడుక్కోండి, ప్రసాదం ఇస్తాను. ఈ నెల విశేషం ఏమిటో  మీకు తెలుసా?

పరాశర: నేను చెప్తాను నాన్నమ్మ. మాణవాళ మామునుల తిరునక్షత్రం ఈ నెలలోనే ఉంది. వైశాఖ మాసం మూలా నక్షత్రంలో వస్తుంది.

వేదవల్లి: అవును. ముదలాళ్వార్లు, సేనాధి పతి విశ్వక్సేనులు, పిళ్ళై లోకాచార్యుల తిరునక్షత్రాలు కూడా ఇదే నెలలో ఉన్నాయు. అవునా నాన్నమ్మా?

బామ్మగారు: అవును. ఇప్పటి వరకు ఆళ్వార్లు, ఆచార్యులు,  ఉత్తమ అనుష్ఠానాలు, కైంకర్యాల గురించి మనం చూసాము. ఇప్పుడు అపచారాల గురించి తెలుసుకుందాము.

వ్యాస: నాన్నమ్మా ‘అపచారం’ అంటే ఏమిటి?

బామ్మగారు:  భగవంతుడి పట్ల లేదా వారి భక్తుల పట్ల తప్పు చేస్తే దాన్ని ‘అపచారము’ అంటారు. మనమెప్పుడూ భగవానుడిని, వారి భక్తులను సంతోషపెట్టాలి. మనం చేసే పనులు పెరుమాళ్ళకు, భాగవతులకు బాధ కలిగిస్తే దానిని అపచారము అంటారు. ఇప్పుడు ఏయే అపచారాలు చేయకుండా దూరంగా ఉండాలో చూద్దాము.

అత్తుళాయ్: నాన్నమ్మ, అవేంటో వివరంగా చెప్తారా?

బామ్మగారు: సరే వినండి. శ్రీవైష్ణవులకు శాస్త్రం ప్రమాణం. శాస్త్రం నిర్దేశించిన మార్గంలో నడుచుకుంటారు. మన పూర్వాచార్యులు శాస్త్రాన్ని గౌరవించి, తమ అనుష్టానాలను క్రమం తప్పకుండా అనుసరించారు. వీరు భగవానుడి పట్లగానీ భాగవతుల పట్లగానీ హాని తలపెట్టాలని ఆలోచించేవారు కాదు. ఎంతో భయపడేవారు. కాబట్టి, మనం కూడా ఎప్పుడూ ఏ అపచారాలు చేయకుండా అన్ని సమయాల్లో జాగ్రత్త పడాలి. ఇప్పుడు మనం ఒకదాని తర్వాత ఒకటి వివరంగా చూద్దాము. ముందుగా మనం భగవత్ అపచారాల గురించి చూద్దాము.

వ్యాస: పెరుమాళ్ళ పట్ల అపచారము చేస్తే దాన్ని ‘భగవత్ అపచారము’ అంటారు, అవునా నాన్నమ్మా?

బామ్మగారు: అవును, భగవత్ అపచారాలు ఇవి.

  • భగవానుడిని ఇతర దేవతలకు (బ్రహ్మ, శివ, వాయు, వరుణ, ఇంద్ర మొదలగు వారు) సమానమని భావించడం ఒక అపరాధం.
  • ఒక శ్రీవైష్ణవిడిగా మారిన తరువాత, ఇతర దేవతలను పూజించడం కూడా భగవత్ అపచారమే. పెరుమాళ్ళే అందరిని సృష్టించారు.
  • నిత్యకర్మానుష్టాలు నిర్వహించక పోవడం భగవత్ అపచారములోకి వస్తాయి.  నిత్యకర్మానుష్టాలు మనకు భగవానుని ఆజ్ఞలు, ఆదేశాలు. కాబట్టి వారి మాటలకు కట్టుబడి మనము ఉండాలి. మనం వారి ఆదేశాలను ఆచరించకపోతే, మనం నేరం చేస్తున్నట్టు లెక్క. ఇంతకు ముందు ఈ విషయం గురించి మనం చెప్పుకున్నాము, అందరికి గుర్తుందనుకుంటాను.

పరాశర: అవును నన్నమ్మా. ప్రతిరోజు వ్యాస నేను సంధ్యావందనం క్రమం తప్పకుండా చేస్తాము.

బామ్మగారు: మీరు నిత్యకర్మానుష్టాలు క్రమం తప్పకుండా ప్రతిరోజూ చేస్తున్నారంటే, వినడానికి ఎంతో సంతోషంగా ఉంది.

  • మనం చేయకుండా దూరముండాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే శ్రీ రాముడు, కృష్ణుడు సాధారణ మనుషులని భావించరాదు. భగవానుడే తన భక్తుల రక్షణ సహాయం కోసం ఈ అవతారాలు ధరించారని గుర్తుపెట్టుకోవాలి.
  • ఈ సంసారంలో మనం స్వతంతృలమని అనుకోవడం భగవత్ అపచారము. అందరూ పెరుమాళ్ళకు అధీనులమని అర్థంచేసుకొని వ్యవహరించుకోవాలి.
  • భగవానుడికి చెందిన వస్త్రాలు, తిరువాభరణాలు, స్థిర ఆస్తులు (భూములు) మొదలైన వస్తువులను దొంగిలించుట మహాపరాధం.

అత్తుళాయ్: నన్నమ్మా!  భాగవత అపచారము గురించి మాకు చెప్తారా?

బామ్మగారు: తప్పకుండా అమ్మా. భగవత్ భక్తుల పట్ల అపచారం చేస్తే దాన్ని ‘భాగవత అపచారము’ అంటారు. భగవత్ అపచారము కంటే భాగవత అపచారము అత్యంత క్రూరమైనది. పెరుమాళ్ళు తన భక్తుల బాధను తట్టుకోలేడు. కాబట్టి మనం భాగవత అపచారము చేయకుండా జాగ్రత్తపడాలి. ఈ క్రింది భాగవత అపచారాలు ఇవ్వబడ్డాయి.

  • ఇతర శ్రీవైష్ణవులకు మనం సమానమని భావించుట అపరాధం. అందరు శ్రీవైష్ణవుల కంటే మనం తక్కువ అని భావించాలి.
  • మనం శారీరికంగా గానీ, మానసికంగా గానీ భాగవతులను బాధ పెట్టకూడదు.
  • శ్రీవైష్ణవులను వారి జన్మ, కులం, జ్ఞానం, ఆస్తి, ఉండే చోటు, రంగు మొదలైన ఆధారంగా వాళ్ళని అవమానించకూడదు.

మన పూర్వాచార్యులు శ్రీవైష్ణవులతో వ్యవహరించేటప్పుడు ఎన్నో నియమ నిష్ఠలను అనుసరించేవారు. ఇతర శ్రీవైష్ణవులను అసంతృప్తి పరచకుండా, వాళ్ళ మనస్సుని గాయపరచకుండా ఎంతో జాగ్రత్తగా పడేవారు. ప్రతి ఒక్కరితో గౌరవంగా వ్యవహరించేవారు.

వేదవల్లి: నాన్నమ్మా, మేము తప్పకుండా ఇలాంటి అపచారాలు చేయకుండా పెరుమాళ్ళను సంతోష పెట్టే ప్రయత్నం చేస్తాము.

మిగితా ముగ్గురు పిల్లలు కూడా ఒకేసారి: అవును నాన్నమ్మా.

బామ్మగారు: చాలా మంచిది  పిల్లలు. ఇప్పటి వరకు నేను మీకు మన సాంప్రదాయం గురించి చాలా విషయాలు నేర్పించాను. ఇంకోమారు ఇక్కడికి వచ్చినప్పుడు వీలుని బట్టి ఇంకొన్ని విషయాలు చెప్తాను. చీకటి పడుతోంది. మీరు వెళ్ళే సమయమయ్యింది.

పిల్లలు: అవును ఎన్నో విషయాలు  నేర్చుకున్నాము నాన్నమ్మా. పెరుమాళ్ళు ఆచార్యుల కృపతో నేర్చుకున్నవన్నీ ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాము.

బామ్మగారు: చాలా మంచిది.

పిల్లలు బామ్మగారితో మాట్లాడిన విషయాలను స్మరించుకుంటూ సంతోషంగా ఇండ్లకు వెళ్ళారు.

మూలము: http://pillai.koyil.org/index.php/2018/11/beginners-guide-apacharams/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

1 thought on “బాల పాఠము – అపచారాలు (అపరాధాలు)”

Leave a Comment