శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
పిల్లలందరూ కలిసి బామ్మగారింటికి వస్తారు.
బామ్మగారు: పిల్లలూ రండి. ఈ రోజు మనం పరాశర భట్టార్ల శిష్యులైన ఆచార్య నంజీయర్ల గురించి చెప్పుకుందాము. ‘శ్రీ మాధవ’ గా జన్మించిన నంజీయార్లు, రామానుజుల ఆదేశంతో పరాశర భట్టర్ల ద్వారా సంప్రదాయంలోకి తీసుకురాబడతారు. భట్టర్లు తిరునేడుంతాండగం, శాస్త్రార్థాల ఆధారంతో మాధవాచార్యులను చర్చలో ఎలా గెలిచారో మనం చూశాము. ఒకప్పుడు అద్వైతులైన మాధవాచార్యులు, తరువాత పరాశర భట్టర్ల మాధ్యమంగా వైష్ణవులుగా మారి ‘నంజీయర్’ అనే పేరును తెచ్చుకుంటారు. వీరిని నిగమాంత యోగి అని, వేదాంతి అని కూడా పిలుస్తారు.
వ్యాస: నాన్నమ్మా! రామానుజులు, పరాశర భట్టర్ల వంటి గొప్ప ఆచార్యులు యాదవ ప్రకాశులు, గోవింద పెరుమాళ్ళు, యజ్ఞ మూర్తులు, శ్రీ మాధవాచార్యుల వంటి ఇతర తత్వాలను అనుసరించే వాళ్ళల్లో మార్పు తెచ్చిననట్లగా, శైవ రాజు రామానుజులకు హాని తలపెట్టినా, వారిని ఎందుకు సంస్కరించే ప్రయత్నం చేయలేదు? శైవ రాజుల నుండి దూరంగా ఎందుకు వెళ్ళారు?
బామ్మగారు: వ్యాస, మన పూర్వాచార్యులకు ఎవరు సంస్కరించబడతారో ఎవరు కాదో బాగా తెలుసు. మనం చెప్పుకున్న ఆచర్యులందరి విషయములో వాళ్ళు ఎదుటి వాని వైభవాన్ని తెలుసుకొని, గౌరవంగా ఓటమిని అంగీకరించి, పెరియ తిరుమలై నంబి, రామానుజులు, భట్టర్ల చరణాల వద్ద శరణాగతి చేసి శ్రీ వైష్ణవ సంప్రదాయంలోకి ప్రవేశించారు. ఆ శైవ రాజు న్యాయమైన వాదనకు సిద్ధంగా లేరు కదా శ్రీమన్నారాయణుని ఆధిపత్యాన్నిగ్రహించి ఓటమిని కూడా స్వీకరించే మనసున్న వారు కాదు. పాత సామెత ఒకటుంది, “నిద్రపోతున్న వారిని మేల్కొలపడం సాధ్యం కాని నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాడిని మేల్కొలపడం సాధ్యం కాదు”. మన పూర్వాచార్యులకు ఎవరు నిజంగా నిద్రలో ఉన్నాడో ఎవరు నటిస్తున్నాడో బాగా తెలుసు. అందువల్ల వారి నిర్ణయాలు ప్రత్యర్ధులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. వ్యక్తులలో లోపాలు ఉన్నప్పటికీ, మన పూర్వాచార్యులు వారిని సంస్కరించాలని నిస్వార్థంగా ప్రయత్నించేవారు. ఎదుటి మనిషి మొండి పట్టు విరోధం చేస్తే కానీ తమ ప్రయత్నం మానుకునేవారు కాదు.
పరాశర: నాన్నమ్మా, మాధవాచార్యులకు ‘నంజీయర్’ అనే పేరు ఎలా వచ్చింది?
బామ్మగారు: వాదనలో మాధవాచార్యులపై పరాశర భట్టర్లు విజయం సాధించిన తరువాత, అతనికి అరుళిచ్చెయల్ నేర్చుకోమని నిర్దేశిస్తారు. మన సంప్రదాయ సూత్రాలను వారికి బోధించి భట్టర్లు శ్రీరంగానికి బయలుదేరుతారు. భట్టర్ వెళ్ళిన తరువాత, వారికి శిష్యుడు కావాలన్న మాధవాచార్యుల నిర్ణయానికి వారిద్దరు భార్యలు ఒప్పుకోరు. భార్యలతో కలహం, ఆచార్యుల నుండి విరహం సహించలేక, సన్యాసిగా మారాలని నిర్ణయించుకొని, ఆచార్యులతో ఉండటానికి శ్రీరంగానికి వెళతారు. వారి సంపదను మూడు భాగాలుగా విభజించి, తన ఇద్దరు భార్యలకు రెండు భాగాలనిచ్చి, మూడో భాగాన్ని భట్టర్లకు సమర్పించాలను తనతో తీసుకువెళతారు. సన్యాస దీక్షను స్వీకరించి శ్రీరంగానికి చేరుకుంటారు. శ్రీరంగంలో మాధవాచార్యులను చూసి భట్టర్, వారి అంకితభావానికి, ఆచార్యాభిమానానికి ముగ్ధులై వారిని “నంజీయర్” (మా ప్రియమైన జీయార్) అని పిలుస్తారు. అప్పటి నుండి వారు నంజీయర్ అని పిలువబడ్డారు. తమ ఆచార్యులతో నంజీయర్లు పరమ భక్తితో ఉండేవారు. వారి ఆచార్య భక్తి అనంతమైనది. వారు “ఒక వైష్ణవుడు మరో వైష్ణవుడి బాధను చూసి తల్లడిల్లితే, అటువంటి వ్యక్తి శ్రీవైష్ణవుడు” అని అనేవారు. వారి కాలంలోని శ్రీవైష్ణవులన్నా, అచార్యులన్నా నంజీయర్లకు ఎంతో గౌరవం ఉండేది.
అత్తుళాయ్: నాన్నమ్మా, నంజీయార్ల ఆచార్య భక్తి గురించిన కథలు కొన్ని మాకు చెప్పరా?
బామ్మగారు: ఒకసారి, భట్టర్ను పల్లకి ఊరేగింపులో, నంజీయర్లు తమ త్రిదండాన్ని ఒక భుజాన భట్టర్ వారి పల్లకీని మరో భుజాన మోయాలని ప్రయత్నిస్తారు. ఇది గమనించిన భట్టర్ వారు “జీయా ! ఇది నీ సన్యాసాశ్రమానికి సరితూగదు. మీరు నన్ను ఎత్తుకోకూడదు” అని అంటారు. నంజీయర్ “మీ సేవకు నా త్రిదండం అడ్డంగా మారితే దానిని విరిచేసి సన్యాసాన్ని వదిలి పెడతాను” అని అంటారు.
ఇంకొక సందర్భంలో, నంజీయర్ల శిష్యులు వచ్చి భట్టర్ వారి రాకతో ప్రశాంతంగా ఉన్న ఈ నందనవనం శాంతిని కోల్పోయిందని ఫిర్యాదు చేస్తారు. నంజీయర్ అంటారు, “ఈ తోట ఉన్నదే భట్టర్ల సేవకోసం, వారి కుటుంబానికి సేవ చేయటం కోసం” అని చెప్పి స్పష్తీకరించి, బాగా గుర్తుపెట్టుకోమని హెచ్చరించారు.
ఆచార్యులు తమ శిరస్సుని శిష్యుల ఒడిళో పెట్టి పడుకునే ఆనవాయితీ ఉంది. ఒకసారి, భట్టర్ విశ్రాంతి తీసుకోవాలని, నంజీయర్ల ఒడిళో తల పెట్టి చాలా సేపు విశ్రాంతి తీసుకుంటారు. నంజీయర్లు కదలకుండా అలాగే ఉంటారు. వారి ఆచార్య భక్తికి ఇది ఒక నిదర్శనం. భట్టర్ నంజీయర్లు ఇద్దరు ఎప్పుడూ ఆసక్తికరమైన సంభాషణలలో మునిగి ఉండేవారు.
వేదవల్లి: మన సంభాషణలు లాగానా?
బామ్మగారు (చిరునవ్వుతో): అవును, మన సంభాషణల లాగానే కానీ అవి ఇంకా చాలా ఆసక్తికరమైనవి!
ఒకసార, నంజీయర్లు, “ఎందుకు ఆళ్వార్లందరు రాముడి కంటే కృష్ణుడిపైన ఎక్కువ ఆకర్షితులై ఉండేవారు” అని భట్టర్ని అడుగుతారు. రాముడి పట్ల ఎక్కువ ఆదరణ ఉన్న భట్టర్ అంటారు, సాధారణంగా అందరూ కొత్త వాటిని గుర్తుంచుకుంటారు. కృష్ణావతారం రామావతారం కన్నా కొత్తది, ఇటీవలి అవతారం. అందువల్ల ఆళ్వార్లు కృష్ణుడిపైన ఎక్కువ మక్కువతో ఉండేవారు.
ఇంకొక సారి, “ఎందుకు మహాబలి పాతాళానికి వెళతారు? శుక్రాచార్యుడు ఎందుకు కంటిని పోగొట్టుకుంటారు? అని నంజీయర్ అడుగుతారు. భట్టర్ వారు జవాబిస్తూ అంటారు, శుక్రాచార్యులు మహాబలిని తన మాటను నిలబెట్టుకోనివ్వలేదు. తన కంటిని కోల్పోయాడు. మహాబలి తన ఆచార్యుని మాట వినలేదు, అందుకని పాతాళ నివాసిగా శిక్షించబడ్డాడు. అందుచేత, ఇక్కడ, ఆచార్యలకు గౌరవం ఇవ్వడం ఎంత ముఖ్యమైనదో భట్టర్ నొక్కి చెబుతున్నారు. వారి మధ్య అనేక ఆసక్తికరమైన సంభాషణలు జరిగాయి. నంజీయర్లకు వారి రచనలలో ఆ సంభాషణలన్నీ కూడా సహాయపడ్డాయి.
ఒక రోజు నంజీయర్ తన రచనల అనుకరణ (కాపీలు) చేయాలని సంకల్పించి, ఈ కార్యాన్ని చేయగల సామర్థ్యం తమ శిష్యులలో ఎవరి ఉన్నదని ఆలోచిస్తుండగా, ‘నంబూర్ వరదరాజు’ చేయగలరని నిర్ణయించుకుంటారు. నంజీయర్లు తమ 9000 పడి కాలక్షేపాన్ని వరదరాజులకిచ్చి, ఏకైక మూల గ్రంథాన్ని కూడా వారికి ఇస్తారు. వరదరాజులు కావేరీ అవతల ఉన్న తన స్వస్థలానికి వెళ్లి నిరాటంకంగా కార్యాన్ని సంపన్నం చేయాలనుకొని, గ్రంథాన్ని తీసుకొని కావేరీ నదిని దాటుతుండగా, హటార్తుగా వరద రావడంతో ఈదటం మొదలు పెడతారు. గ్రంథం వారి చేతుల నుండి జారిపోయి వరదలో కొట్టుపోతుంది. వరదరాజులు కృంగి పోతారు. ఊరికి వెళ్ళాక తమ ఆచార్యులకు మ్రొక్కి, వారిచ్చిన కాలక్షేపమును గుర్తుచేసుకుంటూ 9000 పడి వ్యాఖ్యానాన్ని తిరిగి వ్రాయడం ప్రారంభిస్తారు. వీరు తమిళ భాషా నిపుణులు కావడం వలన, మంచి అర్ధాలు జతచేర్చి గ్రంథాన్ని పూర్తి చేసి చివరికి నంజీయర్కి తిరిగి ఇస్తారు. నంజీయర్లు వ్యాఖ్యానాన్ని చూసి మార్పులు ఉన్నాట్టు గమనించి, ఏమి జరిగిందో అడగగా, వరదరాజులు జరిగిన సంఘటన గురించి వివరిస్తారు. వరదరాజుల గొప్పతనాన్ని తెలుసుకొని నంజీయర్లు వారిని ఆప్యాయంగా ‘నంపిళ్ళై’ అని పిలుస్తారు. తన తరువాత సంప్రదాయ దర్శన ప్రవర్తకుడిగా ప్రకటిస్తారు. కొన్ని కొని విషయాలకు నంపిళ్ళై నంజీయర్ల కంటే మంచి వివరణలు ఇచ్చేవారు. నంపిళ్ళైల ఈ సామర్త్యాన్ని చూసి నంజీయర్లు వారిని ఎంతో మెచ్చుకునేవారు. ఇది నంజీయర్మ గొప్పతనానికి నిదర్శనం.
వ్యాస: నాన్నమ్మా, నంపిళ్ళై గురించి ఇంకా చెప్పరా మాకు?
బామ్మగారు: నంపిళ్ళై గురించి రేపు చెప్పుకుందాము. ఇప్పుడు ఆలస్యమైయ్యింది . ఇప్పుడు ఇంటికి వెళ్ళండి.
పిల్లలు భట్టర్, నంజీయర్, నంపిళ్ళైల గురించి ఆలోచిస్తూ వాళ్ళ ఇళ్లకు వెళ్తారు.
మూలము : http://pillai.koyil.org/index.php/2016/08/beginners-guide-nanjiyar/
పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org