బాల పాఠము – శ్రీమహాలక్ష్మి మాతృ గుణము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీవైష్ణవం – బాల పాఠము

<<బాల పాఠము – శ్రీమన్నారాయణుడి దివ్య అర్చారూపగుణాలు

sriranganachiar-3

మర్నాడు, బామ్మగారు పరాశర వ్యాసులిద్దరిని శ్రీ రంగం ఆలయానికి ఉత్తర వీధి ద్వారా తీసుకువెళ్ళుతుంది. పిల్లలిద్దరి దృష్టి కుడి వైపున ఉన్న ఒక సన్నిధివైపుకి మల్లింది.

వ్యాస: నాన్నమ్మ, ఇది ఎవరి సన్నిధి?

బామ్మగారు: వ్యాస, ఇది శ్రీరంగనాయకి తాయార్ సన్నిధి.

పరాశర: నాన్నమ్మ, కానీ నిన్న ఊరేగింపులో మనము కేవలము శ్రీ రంగనాథుడిని  మాత్రమే కదా చూసాము.

బామ్మగారు: అవును, పరాశర. నువ్వు అన్నది నిజమే. ఎందుకంటే, శ్రీ రంగనాయకి తాయార్ తన సన్నిద్ధి నుండి బయటకు రాదు. శ్రీ రంగనాథుడంతటి వాడే ఆవిడను చూడాలని అనిపించినప్పుడు, తనే స్వయముగా తాయార్ సన్నిధికి వెళ్ళ వలసి ఉంటుంది.

పరాశర: ఆహా, సరే నాన్నమ్మ. అట్లా అయితే, మనము ప్రతిసారి ఆవిడ సన్నిధికి వెళ్ళి ఆమెను సేవించుకోవాలి. అయితే ఇప్పుడు, మనము శ్రీ రంగంలో ఉన్నప్పుడల్లా, ఆలయానికి వెళ్ళడానికి మరో కారణం దొరికింది.

తాయార్ దర్శనం అయ్యాక, వాళ్ళు సన్నిధి నుండి బయటకు వచ్చారు.

బామ్మగారు: నేను మీద్దరిని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు సాయంత్రంపూట ఆడుకొని ఇంటికి ఆలస్యంగా వచ్చినప్పుడు, మీ నాన్నగారు మిమ్మల్ని ఏమంటారు?

వ్యాస: నాన్నమ్మ, అప్పుడు వారు కోప్పడతారు.

బామ్మగారు: అప్పుడు మీ నాన్నగారు మిమ్మల్ని ఇద్దరిని శిక్షిస్తారా?

పరాశర: అయ్యో నాన్నమ్మ! అలాంటి పరిస్థితి రాదు. ఎందుకంటే, నాన్నగారికి కోపం వచ్చినప్పుడల్లా అమ్మ మమ్మల్ని కాపడుతుంది. నాన్నగారు మమ్మల్ని శిక్షించకుండా ఆపుతుంది.

బామ్మగారు: అదే విధముగా, తెలిసో తెలియకో మనము పెరుమాళ్ళకి ఇష్టంలేని పనులు చేస్తుంటాము కదా? ఆ సమయాలలో, స్వామికి మన మీద కోపం వచ్చినప్పుడల్లా, తాయార్ స్వామితో మాట్లాడి మనల్ని ఎన్నో శిక్షల నుండి రక్షిస్తూ ఉంటుంది.

పరాశర: నువ్వు అన్నది నిజమే నాన్నమ్మ. తాయార్ మనకు అమ్మ లాంటిది.

బామ్మగారు: ఏ విధముగా నంపెరుమాళ్ళు మన రక్షణకై ఆయుధాలను ధరించి ఉంటాడో, అలాగే మన అమ్మ తన మాతృ స్వరూపానికి గుర్తుగా ఎప్పుడు తన చేతిలో పద్మాలని ధరించి ఉంటుంది. మనము శ్రీరంగనాథ సన్నిధిలో పెరుమాళ్ళను సేవించుకోవడానికి రంగ-రంగ గోపురాన్ని దాటి, నాళికెత్తాన్ ద్వారాన్ని, గరుడ సన్నిధిని దాటి ఆ తరువాత ధ్వజ స్తంభాన్ని దాటి ఆ తరువాత శ్రీరంగనాథ సన్నిధికి చేరుకుంటాము. కానీ మనము ఉత్తర వీధిలోకి ప్రవేశించిన వెంటనే తాయార్ సన్నిధిలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవచ్చు. మనకు ఆమె అంత దగ్గరగా ఉంటుంది.

వ్యాస: ఓహో, అలాగా నాన్నమ్మ!

బామ్మగారు: మన అమ్మ సీతాదేవి రూపములో ఉన్నప్పుడు కూడా, శ్రీరాముడి నుండి కాకాసురుడిని కాపాడింది. ఇంద్రుని కుమారుడైన కాకాసురుడు ఒక రోజు కాకిలా రూపుదాల్చి, సీతమ్మను ఇబ్బంది పెట్టాడు. అప్పుడు శ్రీ రాముడు అతన్ని శిక్షించబోతుంటే, మన అమ్మ ఎంతో దయతో కాకాసురుడిని శ్రీ రాముడు నుండి కాపాడింది. అదే విధంగా, శ్రీ రాముడు రావణ వధం చేసిన తరువాత,  అశోక వనములో ఉన్న రాక్షసులను కూడా సీతమ్మ కాపాడింది. సీతమ్మను కష్టపెట్టిన రాక్షసులను అంతం చేయాలన్నంత కోపం మన హనుమంతుడుకి వచ్చింది. కానీ అప్పుడు కూడా, ఆ రాక్షసులు రావణుడి ఆదేశ పాలన చేస్తున్నారని వాళ్ళ నిస్సహాయ స్థితి గురించి హనుమంతునికి వివరించి వాళ్ళను కాపాడింది. ఈ విధంగా, ఓ తల్లిలా మన అమ్మ మనని ఏల్లప్పుడూ కాపాడుతునే ఉంటుంది.

sita-rama-kakasura

సీతమ్మ కాకాసురుడిని కాపాడుట

sita_with_rakshasis

రాక్షసుల మధ్య సీతమ్మ

పరాశర వ్యాసులు: నాన్నమ్మ! మనల్ని కూడా ఆ తల్లి ఎప్పుడు కాపాడుతూ ఉంటుందని ఆశిస్తున్నాము.

బామ్మగారు: తప్పకుండా కాపాడుతుంది. ఆమె ఎప్పుడూ మన గురుంచి పెరుమాళ్ళుకు పురుషకారము (సిఫార్సు) చేస్తూ  మనల్ని కాపాడుటయే తన సంకల్పముగా పెట్టుకుంది.

పరాశర: ఆమె స్వామితో మన గురించి అనుకూలంగా మాట్లాడటం కాకుండా ఇంకేమైన చేస్తుందా నాన్నమ్మ?

బామ్మగారు: స్వామి మనల్ని క్షమించేవరకు మన గురించి చెబుతూనే ఉంటుంది. స్వామి మనల్ని ఎప్పుడైతే స్వీకరిస్తాడో, అప్పుడు మన అమ్మ స్వామితో కలిసి మన భక్తిని సేవలను అనందంగా స్వీకరిస్తుంది.

వ్యాస: అదెట్లా నాన్నమ్మ?

బామ్మగారు: ఓ, అది అర్థం చేసుకోవడము చాలా తేలిక. మీరు మీ తల్లిదండ్రులను సేవించేటప్పుడు, కేవలము మీ నాన్నగారికి మాత్రమే సేవ చేస్తారా?

పరాశర: లేదు నాన్నమ్మ. మేము ఇద్దరిని సమానముగా ప్రేమిస్తాము. ఇద్దరికి సేవ చేయాలని అనుకుంటాము.

బామ్మగారు: అవును. ఇప్పుడు మీకు అర్థమైయ్యిందా? అదే విధముగా, మనము స్వామిని చేరే వరకు అమ్మవారు మన గురించి స్వామితో సిఫార్సు చేస్తుంది. మనము పెరుమాళ్ళను చేరుకున్న తరువాత, స్వామితో చేరి మన భక్తి ప్రేమలను అందుకుంటుంది.

namperumal-nachiar_serthi2

నంపెరుమాళ్ళతో తాయారు – పంగుని ఉత్తరము రోజున

పరాశర వ్యాసులు: ఆహా, చాలా తేలికగా అర్థమయ్యేటట్టు చేప్పావు నాన్నమ్మా. మళ్ళీ తరువాత కూడా, ఇంకా విని తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు వెళ్ళి కాసేపు ఆడుకుంటాము నాన్నమ్మ!

పరాశర వ్యాసులిద్దరూ ఆడుకోడానికి బయటకు పరుగెట్టారు!

తేజశ్రీ రామానుజ దాసి

మూలము: http://pillai.koyil.org/index.php/2014/08/beginners-guide-sri-mahalakshmis-motherly-nature/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

1 thought on “బాల పాఠము – శ్రీమహాలక్ష్మి మాతృ గుణము”

Leave a Comment