బాల పాఠము – శ్రీమన్నారాయణుడి దివ్య కృప

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<<బాల పాఠము – శ్రీమన్నారాయణుడి దివ్య అర్చారూప గుణాలు

ఒక మనోహరమైన ఆదివారం ఉదయాన్నే బామ్మగారు అమలనాదిపిరాన్ పఠిస్తుండగా వ్యాస పరాశరులు వింటున్నారు.

పరాశర: నాన్నమ్మ, మీరు ఏమి పఠిస్తున్నారు? మీరు ప్రతిరోజు ప్రొద్దున్నే పఠిస్తుండగా విన్నాము.

బామ్మగారు: పరాశర, దీన్ని అమలనాదిపిరాన్ అంటారు. 12 ఆళ్వారులలో ఒకరైన తిరుప్పాణ్ ఆళ్వారు రచించారు.

periyaperumal-thiruppanazhwar
శ్రీరంగనాథుడు – తిరుప్పాణ్ ఆళ్వారు

వ్యాస: నాన్నమ్మా, ఆళ్వార్లు ఎవరు? అమలనాదిపిరాన్ అంటే ఏమిటి? వారి గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది, మీరు మాకు చెబుతారా?

బామ్మగారు: ఆళ్వార్ల, వారి రచనల గురించి మీకు తప్పకుండా చెబుతాను. కాని దానికి ముందు, మీరు శ్రీరంగనాథుడి గురించి ఇంకొంచం తెలుసుకోవాలి.

వ్యాస: అది ఏమిటి, నాన్నమ్మ?

బామ్మగారు: వారి కృపను గురించి తెలుసుకోవాలి.

పరాశర: దయచేసి చెప్పండి నాన్నమ్మ.

బామ్మగారు:  నేను చెప్పాబోయేది మీరు గ్రహించటం కొంచం కష్టం. కాబట్టి, జాగ్రత్తగా వినండి, సరేనా?

పరాశర మరియు వ్యాస: సరే నాన్నమ్మ.

బామ్మగారు: మనం ఇప్పటికే ముందు చెప్పుకున్నాము, శ్రీమన్నారాయణ పరమపదము నుంచి దిగి వచ్చి శ్రీరాముడిగా, శ్రీకృష్ణడిగా, శ్రీరంగనాథుడితో మొదలుకొని  ఎన్నో అర్చావతార పెరుమాళ్ళుగా వెలసారని. ఆయనే అంతర్యామిగా ప్రతి ఒక్కరిలో ఉన్నారు.

పరాశర వ్యాసులు ఇప్పుడు బామ్మగారి ప్రతి పదాన్ని జాగ్రత్తగా వింటున్నారు.

బామ్మగారు: ఇన్ని రూపాల్లో ఎందుకు అవతరించారో మునుపు మనం చెప్పుకున్నాం గుర్తుందా?

పరాశర వ్యాసులు: ఓ గుర్తుంది నాన్నమ్మ! మనమంటే వారికి ఎంతో ఇష్టం. అందుకని మన మధ్య ఉండటానికి పెరుమాళ్ళు క్రిందకి దిగి వస్తారు.

బామ్మగారు: బావుంది! మూల సూత్రాలను నువ్వు చాలా బాగా అర్థంచేసుకున్నావు. వారు క్రిందకి మనతో ఉండటానికి మాత్రమే కాదు, క్రమేణా మనందరినీ పరమపదానికి తీసుకొని వెళ్లాలని వారి కోరిక.

పరాశర: ఎందుకు నాన్నమ్మ? పరమపదానికి అంత ప్రత్యేకత ఎందుకు? శ్రీరంగం కంటే బావుంటుందా?

paramapadhanathan
పరమపదంలో (శ్రీవైకుంఠంలో) పరమపదనాథుడు

బామ్మగారు: హ! హా! నిస్సందేహంగా, శ్రీరంగం చాలా బావుంది. కాని పరమపదం వారి నిత్య నివాసం, అక్కడ పరమానందం ఉంటుంది. పైగా ఏ ఆటంకం లేకుండా అతనికి నిత్య సేవ చేయడానికి మనకి అవకాశం ఉంటుండి. ఇక్కడ చూడండి, మనము గుడికి వెళతాము, ఉత్సవాలలో పాల్గొంటాము, కాని కాసేపు అయ్యాక మనము ఇంటికి రావాలి, వేరే పనులు చేసుకోవాలి. కాని పరమపదంలో ఇలాంటి ఆటంకాలు ఉండవు – అది నిత్యానందం.

వ్యాస: ఓ! అలాగే బాగుంటుంది – నిత్యమైన ఆనందం.

బామ్మగారు: పైగా, ఇక్కడ, మన శరీర సామర్ద్యం తక్కువ అలసిపోతాము, కొన్నిసార్లు జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది… కాని పరమపదంలో, ఈ ఇబ్బందులు ఏవీ లేకుండా దివ్య శరీరం దొరుకుతుంది. మనము శాశ్వతముగా కైంకర్యం చేస్తున్నా ఏ అలసట, అనారోగ్యాలు ఉండవు.

పరాశర: ఓ! ఇది ఇంకా బావుంది. అయితే, పెరుమాళ్ళు మనల్ని పరమపదానికి తీసుకువెళ్ళటానికి ఏం చేస్తారు?

బామ్మగారు: మంచి ప్రశ్న. వారు తమ అపారమైన కరుణతో ఎన్నో చేస్తుంటారు. కరుణ అంటే ఎదుటి వారికి దయతో సహాయం చేయడం అన్నమాట. ఆతను స్వయంగా దిగి వచ్చి శ్రీరాముడిలా, శ్రీకృష్ణుడిలా, శ్రీరంగనాథునిలా, శ్రీనివాసునిలా అవతరించాడు. కాని ఇంకా మనలోని చాలా మందిని తీసుకుని వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే ఎంతోమంది ఇంకా ఆతనిని స్పష్టంగా అర్థంచేసుకోలేకపోతున్నారు. అతడు సర్వోత్తముడని నమ్మలేకపోతున్నారు.

వ్యాస: అతడు ఎదుటే ఉండగా ఎందుకు ఇంకా అర్థం చేసుకోవట్లేదు?

బామ్మగారు: ఎందుకంటే ఆతడు ఎంతో పెద్దవాడు. ఈర్ష్యతో కొంతమంది, ఇంకొతమంది ఆతని పెద్దతనానికి (స్వామిత్వానికి) భయపడి దగ్గరకి రావట్లేదు. 

పరాశర: ఓ అలాగా. ఇది ఆళ్వార్ల అవతారాలకి దారితీస్తుందని అనుకుంటున్నాను.

బామ్మగారు: తెలివైన వాడవు. అవును, పెరుమాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. మీరు ఎప్పుడైనా ఊహించారా వేటగాళ్ళు జింకలను ఎలా పట్టుకుంటారో? ఎంతో కష్టపడితే ఒక్క జింకను పట్టుకోగలుగుతాడు. తరువాత ఈ జింకకు ఇతర జింకలు ఆకర్షించేలా ఇస్తాడు. ఎప్పుడైతే ఈ జింక దగ్గరకి మిగతా జింకలు వస్తాయో, వేటగాడు వెంటనే అన్నింటినీ పట్టేసుకుంటాడు.

వ్యాస: అవును నాన్నమ్మ.  ఈ ఉపాయంతోనే ఏనుగులను కూడా పట్టుకుంటారని విన్నాను.

బామ్మగారు: అవును. అలాగే, పెరుమాళ్ తమ నిరహేతుక కృపతో  ప్రతి ఒక్కరికి సహాయం చేయాలన్న ఉద్దేశ్యముతో, కొందరిని ప్రత్యేకంగా ఎంచుకొని, వారికి పరిపూర్ణ భక్తిజ్ఞానాలను అనుగ్రహిస్తాడు. పెరుమాళ్ళ భక్తిలో మునిగితేలే ఇలాంటి వారినే మనం ఆళ్వార్లు అంటారు.

పరాశర: ఓ! అయితే, ఆళ్వార్ల ద్వారా అనేక మంది భక్తులై పెరుమాళ్ళను చేరుకుంటారు. ఓ! అయితే ఇది పెరుమాళ్ళ చమత్కారమన్నమాట.

Azhwars

బామ్మగారు: అవును, ఇది వారి గొప్ప కృప. గుర్తుపెట్టుకోండి, ఎవరూ తమ స్వప్రయత్నంతో ఆళ్వార్లు కారు. భగవత్ కటాక్షంతో మాత్రమే ఆళ్వార్లుగా మారతారు. ఎందుకంటే స్వప్రయత్నముతో కొంతవరకు భక్తి మార్గంలో ముందుకు వెళ్ళవచ్చు – కాని పెరుమాళ్ళపైనే పూర్ణ భక్తి ఉండటం అంటే, వారికి భగవత్ కటాక్షం ఉంటేనే అది సాధ్యమౌతుంది. అలాగే స్వప్రయత్నముతో కొంతవరకు జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళవచ్చు – కాని సంపూర్ణ జ్ఞానం కలగాలంటే జ్ఞాన పరిపూర్ణుడైన భగవానుడి కటాక్షం ఉంటేనే అది సాధ్యమౌతుంది.

పరాశర: అవును, నాన్నమ్మ. మాకు ఇప్పుడు అర్థమైయింది. మీరు ఎంత మంచిగా మాకు ఈ సూత్రాలను వివరిస్తున్నారు. ఇది కొంచం కష్టమైన విషయము అని మీరు చెప్పినందుకు, మేము కనురెప్పలు కూడా వాల్చకుండా విన్నాము.

బామ్మగారు: అవును. మిమ్మల్ని బయటకు ఆడుకోవటానికి వదిలే ముందు, మీరు అడిగారు కాబట్టి నేను మీకు అమలనాదిపిరాన్ గురించి వివరిస్తాను. ఇది రచించినది తిరుప్పాణ్ ఆళ్వార్, పెరియ పెరుమాళ్ళ దివ్య మంగళ సౌందర్యాన్ని పూర్తిగా అనుభవించినవారు వీరు. వీరు 5 వ పాసురములో “మీరు ఎన్నో ఏళ్ళగా కేవలము నన్ను పాప విముక్తుడను చేసి భగవత్ తత్వాన్ని అర్థం చేయించి నిన్ను చేరుకోవడంలో నాకు సహాయం పడే కఠిన తపస్సు చేస్తున్నారు” అని వారు శ్రీరంగనాథుడితో అంటున్నారు. అక్కడినుండే కదా మన సంభాషణ శ్రీమన్నారాయణ కృప గురించి మొదలైయింది. ఇప్పుడు మీరు విషయాన్ని బాగా అర్థంచేసుకున్నారు. ఇంకో సారి, నేను మీకు ఆళ్వార్ల గురించి ఇంకొంచెం వివరిస్తాను. ఇప్పుడు మీరు ఇద్దరూ కాసేపు ఆడుకోడానికి వెళ్ళండి.

పరాశర వ్యాసులు: అలాగే నాన్నమ్మా. మేము తప్పకుండా మళ్లీ వచ్చి ఆళ్వార్ల గురించి వింటాము.

మూలము : http://pillai.koyil.org/index.php/2014/09/beginners-guide-sriman-narayanas-divine-mercy/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment