బాల పాఠము – ఆళ్వార్ల పరిచయం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీవైష్ణవం – బాల పాఠము

<<శ్రీమన్నారాయణుడి దివ్య కృప

బామ్మ: పిల్లలూ ! నేను కాట్టళగియ శింగ పెరుమాళ్ గుడికి వెళ్లుతున్నాను. (నరసింహ పెరుమాళ్ క్షేత్రం). మీరు కూడా నాతో వస్తారా?

వ్యాస: సరే నాన్నమ్మ, వస్తాము. కిందటి సారి మీరు అళ్వార్ల గురించి చెప్పారు. ఇప్పుడు ఆ ఆళ్వార్ల గురించి ఇంకొన్ని విషయాలు మాకు చెప్తారా?

బామ్మగారు: అడిగి మంచి పని చేసావు. మీ ఇద్దరికీ ఇప్పుడు వాళ్ళ గురించి చెప్తాను.

ముగ్గురు కాట్టళగియ శింగ పెరుమాళ్ సన్నిధి వైపు నడవ సాగరు.

బామ్మగారు:  ఆళ్వార్లు పన్నెండు మంది ఉన్నారు. వాళ్ళు మొత్తం 4000 పాశురాలు (పాటలు) పాడారు. వాళ్ళ పాశురాల సంగ్రహాన్ని ‘నాలాయిర దివ్య ప్రబంధం’ అని అంటారు. నిజానికి నిన్న నేను చదివిన ‘అమలనాదిపిరాన్’ కూడా దివ్య ప్రబంధంలోని ఒక భాగమే.

పరాశర: ఓ! ఈ 12 అళ్వార్లు ఎవరు?

12 అళ్వార్లు

బామ్మగారు: పొయిగై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పెయాళ్వార్, తిరుమళిశై ఆళ్వార్, మధురకవి ఆళ్వార్, నమ్మాళ్వార్, కులశేఖర ఆళ్వార్, పెరియాళ్వార్, ఆండాళ్, తొందరడిప్పొడి ఆళ్వార్, తిరుప్పాణ్ ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్. వీరు 12 అళ్వార్లు.

వ్యాస: బావుంది నాన్నమ్మ. అయితే పెరుమాళ్ళ విశేష అనుగ్రహం వీరిపై ఉన్నదా?

బామ్మగారు: అవును వ్యాస. పెరుమాళ్ళ సంపూర్ణ అనుగ్రహం వీరిపై ఉంది. వేల సంవత్సరాల క్రితం ఈ అళ్వార్లు లోక కళ్యాణం కోసం ఆ భగవత్ కృపను పాశురాల రూపంలో అందరికీ పంచారు. ఈ పాశురముల ద్వారానే మనము పెరుమాళ్ళని అర్థం చేసుకొని వారి కళ్యాణ గుణములను ఆనందిస్తున్నాము.

పరాశర: అవునా నాన్నమ్మ! మనం వేదమాధారంగా భగవానుని అర్థం చేసుకుంటాం కదా?

బామ్మగారు: అవును. నిజమే. కాని, వేదం చాలా విశాలమైనది. ఆ వేదంలో ఎన్నో క్లిష్టమైన విషయాలు సంస్కృతంలో వివరించబడ్డాయి. వాటిని వేదాధ్యయనం లేకుండా అర్థం చేసుకోవడం చాలా కష్టం. కాని, ఆళ్వార్లు ఆ వేదాల సారాన్ని ఈ 4000 పాశురాలలో సరళమైన తమిళభాషలో మనకందించారు. పెరుమాళ్ళని స్తుతించడమే వేద సారమని మీకు తెలుసుకదా! ముఖ్యమైన విషయం ఏమిటంటే స్వయంగా భగవత్ కృపా కటాక్షంతో ఈ జ్ఞానాన్ని ఆళ్వార్లు ప్రసాదంగా పొందారు.

వ్యాస: అవును, మాకిప్పుడు అర్థమైంది. అళ్వార్లు అతి సూటిగా సరళంగా పెరుమాళ్ళను వివరించారు. ఇప్పుడు మీరు మాకు ఇంత సులభంగా వివరిస్తున్నట్టుగా.

బామ్మగారు: చాలా బావుంది వ్యాస. మంచి ఉదాహరణనిచ్చావు. నీకు గుర్తుందా? మునుపు మనం మాట్లాడుకున్నాము, పెరుమాళ్ళు 5 స్వరూపాల్లో ఉంటారని – పరమపదంలో, వ్యూహంలో, అవతార రూపంలో, అంతర్యామిగా, అర్చారూపంలో అని. ఒక్కొక్క ఆళ్వారు పెరుమాళ్ళ ఒక్కొక్క రూపాన్ని ఆరాధించి స్తుతించారు.

పరాశర: ఓ మనకు ఎట్లాగైతే శ్రీ రంగనాథుడు అంటే ఇష్టమో, అలాగే అళ్వార్లకు కూడా వారి వారికి ఇష్టమైన పెరుమాళ్ ఉండేవారా?

బామ్మగారు: అవును. ముదలాళ్వారులకు (మొదటి ౩ ఆళ్వార్లు – పొయిగై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పెయాళ్వార్) భగవానుడి పరత్వ గుణంపైన మిక్కిలి భక్తి ఉండేది – పరమపదంలో ఉన్నట్టుగా. తిరుమళిశై ఆళ్వారుకి అందరి హృదయాలలో అంతర్యామిగా నివసించి ఉన్న భగవానుని యందు మిక్కిలి భక్తి అనురాగాలుండేవి. నమ్మాళ్వార్లు, పెరియాళ్వార్లు, ఆండాళ్ కి శ్రీకృష్ణుడి యందు అమితమైన భక్తి ఉండేది. కులశేఖర ఆళ్వారుకు శ్రీ రాముడిపైన, తొండరడిప్పొడి ఆళ్వారుకి, తిరుప్పాణాళ్వారుకి శ్రీ రంగనాథుని యందు, తిరుమంగై ఆళ్వారుకి అర్చావతార పెరుమాళ్ళపై భక్తి విశేషంగా ఉండేవి.

వ్యాస పరాశరులు: నాన్నమ్మ, మీరు మధురకవి ఆళ్వార్ల గురించి చెప్పడం మరిచిపోయారు.

బామ్మగారు: బాగా గమనించావు. మధురకవి ఆళ్వారుకి నమ్మాళ్వార్ల పట్ల మాత్రమే భక్తి ఉండేది.

పెరుమాళ్ళ కోసం పువ్వులు కొనడానికి అంగడిలో ఆగారు బామ్మగారు.

పరాశర: నాన్నమ్మ, ఒక్కో ఆళ్వారు గురించి వివరంగా చెప్తారా?

బామ్మగారు: తప్పకుండా. కాని ఇప్పుడు గుడి దగ్గరకు వచ్చేసాము. ముందు లోపలికి వెళ్లి పెరుమాళ్ళను దర్శించుకొని సేవించుకుందాం. ఇంకెప్పుడైనా ప్రతి ఆళ్వారు గురించి వివరంగా చెప్తాను.

వ్యాస పరాశరులు: సరే నాన్నమ్మ! లోపలికి వెళదాం. నరసింహా పెరుమళ్ళను తొందరగా దర్శించుకుందాం. ఇక ఆగలేకపోతున్నాము.

మూలము : http://pillai.koyil.org/index.php/2014/10/beginners-guide-introduction-to-azhwars/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment