బాల పాఠము – ఆళవందార్ల శిష్యులు – భాగము 2

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< ఆళవందార్ల శిష్యులు – భాగము 1

తిరుక్కోష్టియూర్ నంబి, తిరుక్కచ్చి నంబి, మాఱనేరి నంబి

 tirukkachinambi

వ్యాస పరాశర బామ్మగారి ఇంటికి వచ్చారు. వాళ్ళ స్నేహితులు వేదవల్లి, అత్తుళాయ్, శ్రీవత్సాంకన్ తో కలిసి వస్తారు.

నాన్నమ్మ నవ్వుతూ : పిల్లలూ రండి. నిన్న చెప్పినందుకు, మీ స్నేహితులందరినీ తీసుకువచ్చావా?

వ్యాస: అవును నాన్నమ్మా! నేను పరాశర ఇద్దరము రామానుజులు, వారి ఆచార్యుల కథలు శ్రీవత్సాంకన్ కి వినిపించాము. మీ నుండి ఇంకా వినాలని మాతోపాటు వచ్చాడు.

బామ్మగారు: బాగుంది. రండి కూర్చోండి. సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉన్న తిరుక్కచ్చినంబి, తిరుక్కోష్టియూర్ నంబి గురించి ఈ రోజు మీకు చెప్తాను.

శ్రీవత్సాంకన్: నాన్నమ్మా! చెన్నై దగ్గర్లో ఉన్న పూవిరుంతవల్లి అనే ఊర్లో తిరుక్కచ్చి నంబి జన్మించారని తెలుసు. పోయిన సంవత్సరం వేసవి సెలవుల్లో మేము ఆ గుడికి వెళ్ళాము.

బామ్మగారు: బావుంది. వీరు దేవ పెరుమాళ్ళకు తమ వింజామర సేవ, నిత్య సంభాషణకు చాలా ప్రసిద్దులు. దేవ పెరుమాళ్ళకు వీరు ప్రియమైనవారు. రామానుజులు కాంచీపురానికి  వచ్చినప్పుడు, మొట్టమొదటి ఆచార్యులుగా తిరుక్కచ్చి నంబి రామానుజులకు అండగా ఉండి పెరుమాళ్ళ కైంకర్యాన్ని ఇస్తారు.

వ్యాస: రామానుజులు ఏ కైంకర్యాన్ని చేసేవారు, నాన్నమ్మా?

బామ్మగారు: సరైన మార్గం చూపించమని రామానుజులు వీరిని ప్రార్థించారు. తిరుక్కచ్చి నంబి పెరుమాళ్ళ తిరుమంజనం కోసం సాలైక్కిణఱు (దగ్గర్లో ఉన్న ఒక బావి) నుండి జలం పట్టుకువచ్చే కైంకర్యాన్ని రామానుజులకు అప్పగిస్తారు. రామానుజులకు తిరుక్కచ్చి నంబి ఇచ్చిన మొదటి కైంకర్యం ఇది. శాస్త్రం పరిజ్ఞానం, పెరుమాళ్ళపై వీరికున్న భక్తి  ప్రేమలు అపారమైనది. రామానుజులకు తిరుక్కచ్చి నంబి పట్ల భక్తి గౌరవాలు పెరిగి వారి శిష్యుడిగా స్వీకరించి పంచ సంస్కారము చేయమని రామానుజులు ప్రార్థిస్తారు.

పరాశర: కానీ, నాన్నమ్మా, మధురాంతగంలో పెరియనంబి వారు కదా రామానుజులకు పంచ సంస్కారము చేసింది?

బామ్మగారు: అవును పరాశర. నీకు ఇంకా గుర్తుంన్నందుకు సంతోషంగా ఉంది. తిరుక్కచ్చి నంబి శాస్త్ర పండితులు. తాను రామానుజులకు పంచ సంస్కారము చేయడం శాస్త్ర విరుద్ధమని, తాను అర్హులు కారని వారికి బాగా తెలుసు. శాస్త్ర నియమాల పట్ల రామానుజులకు కూడా గౌరవించేవారు. కాబట్టి, తిరుక్కచ్చి నంబి చెప్పిన మాటకు రామానుజులు అంగీకరిస్తారు. శాస్త్ర నియమాలు స్వయంగా పెరుమాళ్ళ సంకల్పాలు అని మనం నమ్మి అనుసరించాలి.

రామానుజులకు మన సాంప్రదాయానికి సంబంధించిన ఏ ప్రశ్నలు, సందేహాలు వచ్చినా తిరుక్కచ్చి నంబి దారి చూపేవారు. రామానుజుల సందేహాలకు జవాబుల కోసం దేవ పెరుమళ్ళతో తిరుక్కచ్చి నంబి సంభాషించే సంఘటనల గూరించి చెప్తాను.

వేదవల్లి : నాన్నమ్మా ఆ సందేహాలు ఏమిటి?

బామ్మగారు:  ఒకానొక సందర్భంలో రామానుజుల మనస్సులో కొన్ని సందేహాలు తలెత్తుతాయి. తిరుక్కచ్చి నంబి దేవ పెరుమాళ్ళతో మాట్లాడతారని తెలుసుకొని, రామానుజులు నంబి సహాయం కోరతారు. నంబి పెరుమాళ్ళ దగ్గరకు వెళ్లి యదావిధిగా తమ వింజామ కైంకర్యం చేస్తూ, రామానుజుల సందేహాల గురించి చెప్పాలని అనుకుంటారు. దేవ పెరుమాళ్ళు గమనించి నంబిని ఏమిటి సంగతని అడుగుతారు. రామానుజులకు కొన్ని సందేహాలు ఉన్నాయని, వాటికి సమాధానాలు కోరుతున్నారని అంటారు. నంబికి ఆ సందేహాలు ఏమిటో తెలియదు కాని, అందరి అంతర్యామియైన దేవ పెరుమాళ్ళు, ఇలా అంటారు, “రామానుజులకు చెప్పండి 1) నేను సర్వోత్తముడను 2) సమస్థ చేతనాచేతనులలో అంతర్యామిగా ఉంటున్నాను కాని వారు నాకు సమానులు కారు, నాకు అధీనులై ఉంటారు. 3) నన్ను చేరుకోడానికి నన్ను ఆశ్రయించడమే ఏకైక మార్గం. 4) శరణాగరులైన వారిని వాళ్ళ అంతిమ సమయమున నేను వారిని స్మరించి వాళ్ళ యోగక్షేమాలను నేనే చూసుకుంటాను 5) నా భక్తులు ఈ సంసారాన్ని విడిచిపెట్టిన తరువాత ఆళ్ళకి శాశ్వతముగా శ్రీ వైకుంటంలో కైంకర్యాన్ని ప్రసాదిస్తాను. చివరిగా 6) రామానుజులు పెరియ నంబులను ఆచార్యులుగా స్వీకరించాలి అని దేవ పెరుమాళ్ళు సమాధాననిస్తాడు. రామానుజుల సందేహాలు ఏమిటని దేవపెరుమాళ్ళు అడగలేదు, నంబికి కూడా ఆ సందేహాలు ఏమిటో తెలియదు. ఈ సమాధానాలతో నంబి తిరిగి రామానుజుల దగ్గరకు వెళ్లినప్పుడు, రామానుజుల ఆనందానికి అంతు లేదు. దేవ పెరుమాళ్ళ కృప అలా ఉండేది. రామానుజులకు రకమైన భయంగాని సందేహాలు కాని తలెత్తినప్పుడు సదా పెరుమాళ్ళు తోడు ఉండేవారు. ఇప్పుడు రామానుజులు పంచ సంస్కారము కోసం పెరియనంబులను ఆశ్రయించాలన్న మాట స్పష్టమైనది. తిరుక్కచ్చి నంబి ఆశీర్వాదాలను తీసుకొని, పెరియనంబులను కలుసుకోవడానికి శ్రీరంగానికి బయలుదేరుతారు. తరువాత మిగిలిన కథ మనందరికీ తెలుసిందే.

వ్యాస: అవును నాన్నమ్మా, మాకు గుర్తుంది.

బామ్మగారు: శ్రీవైష్ణవులకు ఉండవలసిన లక్షణాలలో ముఖ్యమైన వినయం. దీనిని తరచూ నైచ్య భావంగా పిలుస్తుంటారు.  వినయం విషయానికి వస్తే పెరియనంబి వారు ఒక సజీవ ఉదాహరణగా భావించాలి. వారికి ఆ స్వభావం స్వాభావికంగా వచ్చినది. పెరియనంబి వారు ఇతర శ్రీవైష్ణవులను ఎప్పుడూ ఆదరించి గౌరవించేవారు. ఒక ఆసక్తికరమైన సంఘటన ఈ విషయాన్ని నిరూపిస్తుంది. పెరియనంబి లాగానే ఆళవందార్ల శిష్యులలో మాఱనేరి నంబి (పంచమ కులస్థుడు) అనే ఒక  గొప్ప ఆచార్యులు ఉండేవారు. మాఱనేరి నంబి తమ చరమ కర్మలు ఒక శ్రీవైష్ణవుని హస్తాలతో చేయించుకోవాలని ఆశించి, ఆ కార్యాన్ని పెరియ నంబి వారిని అప్పగిస్తారు. పెరియ నంబి సంతోషంగా అంగీకరిస్తారు. కాని పెరియ నంబి తక్కువ జాతి వ్యక్తికి చరమ కర్మలు చేసారని, శాస్త్ర విరుద్ధమైన కార్యము చేశారని గ్రామస్థులు కోపంతో అడిగినప్పుడు, పెరియనంబి వారు భాగవత కైంకర్యమే గొప్పదని పవిత్రమైనదన్న నమ్మాళ్వార్ల ఉపదేశాలనే తాను అనుసరిస్తున్నారని చెప్తారు. భాగవతులను  కులమాధారంగానో జన్మాధారంగానో భేదం చూపకుండా గౌరవించాలని అంటారు. నైచ్య భావ సిద్ధాంతమును పెరియ నంబి ఆచరించి చూపించారు. ప్రతి భాగవతుడు భగవంతునికి  ప్రియమైనవాడే, అందరినీ ఆదరించి గౌరవించాలని వారు నమ్మేవారు. నిజమైన భగవత్ భక్తుడు తమ చివరి క్షణాలను ఎలా గడిపినా, తిరుక్కచ్చి నంబికి దేవపెరుమళ్ళు ఇచ్చిన మాట ప్రకారం భగవానుడు వారికి బ్రహ్మానందమైన శ్రీ వైకుంటంలో శాశ్వత కైంకర్యాన్ని ప్రసాదిస్తారు. వీరు జీవితమంతా తమ ఆచార్యులైన ఆళవందార్లు, నమ్మాళ్వార్ల ఉపదేశాలను ఆచరిస్తూ గడిపారు.

పిల్లలూ ఈవాలిటికి ఇక చాలా లేదా మీరు తిరుక్కోష్టియూర్ నంబి గురించి కూడా వింటారా?

azhwar-acharyas-ramanuja

వేదవల్లి: మీకు వారి కథలు కూడా  తెలుసా నాన్నమ్మా?

బామ్మగారు: అవును, వేదవల్లి!

అత్తుళాయ్: అయితే మీరు తిరుక్కోష్టియూర్ నంబి గురించి కూడా ఈవాళే చెప్పండి.

బామ్మగారు:  తిరుక్కోష్టియూర్ నంబి కూడా ఆళవందార్ల ముఖ్య శిష్యులలో ఒకరు. రామానుజులకు తిరుమంత్రం, చరమ శ్లోకార్థాలను నేర్పించే బాధ్యత వీరికి అప్పగించబడింది. మీకు తెలుసా అవి ఏమిటో?

వ్యాస: ‘ఓం నమో నారాయణాయ’ ను తిరుమంత్రం అని పిలుస్తారు.

శ్రీవత్సాంకన్:  ‘సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ; అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాశుచః’ అని చరమ శ్లోకాన్ని పిలుస్తారు.

బామ్మగారు:  చాలా బాగుంది. ఈ మూడు శ్లోకాలకు చాలా లోతైన అర్థాలున్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఆచార్యుల నుండి వీటి అర్థాలను నేర్చుకోవాలి.

వేదవల్లి: కానీ నాన్నమ్మా, మాకు ఈ శ్లోకాల అర్థాలు తెలుసు.

బామ్మగారు: అవును, మనలో చాలా మందికి ఈ శ్లోకాల పైతేట అర్థం కొంతవరకు తెలుసు. కానీ సాంప్రదాయం ప్రకారం ఈ మూడు శ్లోకాలు చాలా లోతైన అర్థాలతో కూడినవి. మన ఆచార్యుల అనుగ్రహం లేకుండా తెలిసుకోవడం మన సామర్థ్యానికి మించిన పని. అందుకని ఈ శ్లోకార్ధాలను రామానుజులకు నేర్పించే ముఖ్యమైన బాధ్యత తిరుక్కోష్టియూర్ నంబికి అప్పగించబడింది.

అత్తుళాయ్: నాన్నమ్మా! ఈ విషయంలో తిరుక్కోష్టియూర్ నంబి దగ్గరికి రామానుజులు 18 సార్లు వెళ్ళవలసి వచ్చిందని నేను విన్నాను. ఇది నిజమా? ఎందుకని అలా ఇబ్బందిపడాల్సి వచ్చింది?

బామ్మగారు: అవును, ఇది నిజం. మన సాంప్రదాయం గురించి తెలుసుకోవడంలో రామానుజులకు ఉన్న నిజాయితీ నిష్ఠను పరీక్షించడానికి తిరుక్కోష్టియూర్ నాంబి పెట్టిన పరీక్ష అని మనం అనుకోవచ్చు. ఇది రామానుజులకున్న పట్టుదలను, సహనాన్ని దర్శిస్తుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనము ధైర్యంగా ఎదుర్కోవాలి, సహనం కోల్పోకూడదు. రామానుజులు ఎన్నిసార్లు వెళ్ళరో చూడండి. 18 సార్లు! చివరకు 18వ సారి తిరుక్కోష్టియూర్ నంబి చరమ శ్లోకార్థాన్ని రామానుజులకు బోధిస్తారు.

వ్యాస: నాన్నమ్మా, తిరుక్కోష్టియూర్ నంబి చాలా నిష్కర్షమైన వారిలా ఉన్నట్టున్నారు. రామానుజులపైన కొంచం జాలి చూపించాల్సింది.

బామ్మగారు: ఈ సంఘటన గురించి విన్న వారందరూ ఇదే మాట అంటారు. కానీ ఇది నిజం కాదు. వీరు ఎప్పుడూ మనస్సులో రామానుజుల యోగక్షేమాలు కోరుతూ ఉండేవారు. బయటికి ఒక తండ్రిలా కఠినంగా అనిపించినా, కొడుకు యోగక్షేమాల కోసం ఎలాంటి త్యాగమైనా చేయడానికి సిద్ధంగా ఉండేవారు. నిన్న మీకు తిరుమాలై ఆండాన్ గురించి చెప్పాను గుర్తుందా?  తిరుమాలై ఆండాన్ రామానుజుల మధ్య కొన్ని అభిప్రాయాల భేదాలు ఉండేవని చెప్పాను?తిరుక్కోష్టియూర్ నంబి వీరిరువుల మధ్య మధ్యవర్తిగా ఉండి వివాదాన్ని పరిష్కరిస్తారు. వాస్తవానికి, శ్రీ వైష్ణవుల పట్ల రామానుజులకున్న నిస్వార్ధ ప్రేమ తిరుక్కోష్టియూర్ నంబిని ఎంతో ఆకట్టుకుంటుంది. వీరే రామానుజులకు ఎంబెరుమానార్ అనే బిరుదాన్ని (ఎంబెరుమాన్ కంటే ఉన్నతమైనవాడు అని అర్థం) ప్రసాదిస్తారు. ఈ విధంగా ఆ అందమైన పేరు “ఎంబెరుమానార్” అని రామానుజులకు వచ్చింది. శ్రీరంగంలో కొంతమంది దుష్టులు రామానుజులకు విషాన్ని ఇస్తారు. వెంటనే తిరుక్కోష్టియూర్ నంబి సమయానికి వచ్చి, రామానుజుల కోసం వంట చేయడానికి కిడాంబి ఆచ్చాన్ ను నియమిస్తారు. తిరుక్కోష్టియూర్ నాంబి ఒక తండ్రి వలె ఎప్పుడూ రామానుజుల యోగక్షేమాలను గమనిస్తూ ఉండేవారు. వీరి మహిమను, జ్ఞానాన్ని, ఆళవందార్ల పట్ల వీరికున్న ఆచార్యభక్తిని చూపుటకు ఎన్నో కథలు ఉన్నాయి. మీకు ఆ కథలను చెప్పాలని ఎంతో ఇష్టంగా ఉంది. మీకూ వినాలని ఉంది అని అనుకుంటున్నాను. కాని, మీకాలస్యం అవుతుంది. మీరు ఈ పండ్లను తీసుకొని ఇంటికి వెళ్లండి. ఇంకొక సారి, మన ఆచార్యుల గురించిన కథలను మీకు చెప్తాను.

పిల్లలు పండ్లు పంచుకుంటూ తిరుక్కచ్చి నంబి, పెరియ నంబి, తిరుక్కోష్టియూర్ నంబి గురించి ఆలోచించుకుంటూ ఇంటికి వెళతారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2016/08/beginners-guide-alavandhars-sishyas-2/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment