బాల పాఠము – దివ్య ప్రబంధము – ఆళ్వార్లు అనుగ్రహించిన విలువైన కానుక

ర్ఆఆల్శ్రీఃఅ  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< తిరుమంగై ఆళ్వార్

dhivyaprabandham-small

బామ్మగారు కణ్ణినుణ్ చిరుత్తాంబు ప్రబంధాన్ని పఠిస్తున్నారు. వ్యాస పరాశరులు అక్కడికి వచ్చారు.

వ్యాస: నాన్నమ్మా! మీరు ఏం చేస్తున్నారు?

బామ్మగారు: వ్యాస! నేను దివ్య ప్రబంధంలోని ఒక భాగమైన ‘కణ్ణినుణ్ చిరుత్తాంబు’ పఠిస్తున్నాను.

పరాశర: నాన్నమ్మా! ఈ ప్రబంధాన్ని మధురకవి ఆళ్వార్లు రచించారు కదా?

బామ్మగారు:  అవును. బాగా గుర్తుపెట్టుకున్నావు.

వ్యాస: నాన్నమ్మా! మీరు ఆళ్వార్ల చరిత్రలను వివరిస్తున్నప్పుడు, ప్రతి ఆళ్వారు కొన్ని దివ్య ప్రబంధ పాశురాలను పాడరని మీరు చెప్పారు. దయచేసి దివ్య ప్రబంధాల గురించి చెప్తారా?

బామ్మగారు: తప్పకుండా వ్యాస. దివ్య ప్రబంధాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండటం చాలా మంచిది. మన శ్రీరంగనాథుడిని శ్రీరంగ నాచియార్ను దివ్య దంపతులని పిలుస్తారు. పెరుమాళ్ళ అనుగ్రహంతో ఆళ్వార్లు దివ్య సూరులని (పవిత్రమైనవారు) పిలవబడ్డారు. ఆళ్వార్లు పాడిన పాశురాలను ‘దివ్య ప్రబంధం’ అని పిలుస్తారు. అనేక క్షేత్రాల పెరుమాళ్ళను ఆళ్వార్లు స్తుతించి పాశురాల రూపంలో దివ్య ప్రబంధాలుగా పాడారు. వాళ్ళు స్తుతించిన ఆ క్షేత్రాలనే దివ్య దేశాలని పిలుస్తారు.

పరాశర: ఓ! చాలా బావుంది నాన్నమ్మా. మీరు చెప్పే ఈ దివ్య ప్రబంధాలు ఏమిటి నాన్నమ్మా?

బామ్మగారు: పెరుమాళ్ళ కల్యాణ గుణాలను పూర్తిగా వర్ణించడం. అంతేకాకుండా పెరియ పెరుమాళ్, తిరువేంకటేశ్వరుడు మొదలైన అర్చావతార పెరుమాళ్ళను స్తుతించడం దివ్య ప్రబంధం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

వ్యాస : కానీ వేదం ముఖ్యమని విన్నాము కదా నాన్నమ్మా? దివ్య ప్రబంధానికి వేదానికి ఏమిటి సంబంధం?

బామ్మగారు:  మంచి ప్రశ్న. ‘భగవత్ జ్ఞానం’ వేదం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. వేదాంతాన్ని వేద సారంగా భావిస్తారు. ‘వేదాంతం’ మనకి భగవానుడి దివ్య మంగళ గుణాల గురించి, తత్వశాస్త్రం మొదలైనవాటి గురించిన వివరణలు అందిస్తుంది. కానీ ఇవి సంస్కృతంలో ఉన్నాయి. ఆళ్వార్లు వేదం మరియు వేదాంతం యొక్క సారాన్ని దివ్య ప్రబంధాలలో అందమైన తమిళ భాషలో మనకందించారు.

పరాశర : ఓ! అయితే వేదానికి దివ్యప్రబంధాలకు మధ్య తేడా ఏమిటి నాన్నమ్మ?

బామ్మగారు: శ్రీవైకుంఠము నుండి భగవానుడు అయోధ్యకి శ్రీరాముడి రూపంలో దిగివచ్చినపుడు, వేదం కూడా శ్రీరామాయణం రూపంగా ప్రత్యక్షమైంది. అట్లాగే, పెరుమాళ్ళు అర్చావతార రూపంలో ఈ భూమిపైకి దిగివచ్చినపుడు, ఆళ్వార్ల పాశురాల ద్వారా దివ్య ప్రబంధ రూపంలో వేదం దిగివచ్చింది. ఇక్కడున్న మనము ఆ పరమపదనాథుడిని గ్రహించడం చాలా కష్టం. అందుకని మనము ఇక్కడే అర్చావతార రూపంలో ఉన్న పెరుమాళ్ళను సేవించుకుంటాము. అదే విధంగా, వేదాన్ని / వేదాంతాన్ని అర్థం చేసుకోవడం కష్టం. కానీ అదే జ్ఞానాన్ని ఆళ్వార్లు తమ దివ్య ప్రబంధాలలో అతి సులువుగా స్పష్టమైన రీతిలో వివరించారు.

వ్యాస: నాన్నమ్మా! అంటే మనకు వేదం ముఖ్యం కాదా?

బామ్మగారు: కాదు కాదు! వేదం మరియు దివ్య ప్రబంధం రెండూ మనకు సమానంగా ముఖ్యమే. వేదం ఎందుకు ముఖ్యమంటే అన్ని ప్రమాణాలకు వేదం మూలము. కానీ భగవత్ గుణాలను అర్థం చేసుకోవటానికి ఆస్వాదించడానికి దివ్య ప్రబంధము మనకి తగినది. అంతేకాదు, వేదంలో ఎంతో కఠినమైన సూత్రాలు వివరించబడి ఉన్నాయి. దివ్య ప్రబంధం అర్థాలను తెలుసుకుంటే ఆ కఠినమైన సూత్రాలను సులువుగా అర్ధం చేసుకోవచ్చు. అందువల్ల మన స్థితికి తగినట్టు వేదం, వేదాంతం, దివ్య ప్రబంధం వంటి వాటిని అధ్యయనం చేయాలి.

పరాశర:  దివ్య ప్రబంధ  ప్రధాన లక్ష్యం ఏమిటి నాన్నమ్మా?

బామ్మగారు: మన ఈ సంసార కష్ట సుఖాల బంధాలను తొలగించడమే కాకుండా శాశ్వతంగా పరమపదంలో ఉన్న శ్రీ మహాలక్ష్మికి,  శ్రీమన్నారాయణకి నిత్య సేవలను అందించడమే దివ్య ప్రబంధ ప్రధాన లక్ష్యం. ఆ శ్రీమన్నారాయణకు నిత్య సేవలు అందించటమే మన స్వభావం. కానీ ఈ సంసారంలో లౌకిక వ్యవహారాలలో మునిగి ఉండటం వలన ఆ విలువైన ఆనందాన్ని మనం కోల్పోతున్నాము. ఆళ్వారల దివ్య ప్రబంధం పరమపదంలో పెరుమాళ్ళను నిరంతరం సేవించే  ప్రాముఖ్యత గురించి నొక్కి చెబుతుంది.

వ్యాస: అవును నాన్నమ్మా! మీరు ఇంతకు ముందు కూడా ఈ విషయం గురించి చెప్పారు.

పరాశర: మన పూర్వాచార్యులు ఎవరు నాన్నమ్మా?

బామ్మగారు: పరాశర! మంచి ప్రశ్న. ఆళ్వర్ల తరువాత ఇక మన సాంప్రదాయంలోని అనేక ఆచార్యుల గురించి చెప్తాను. మన పూర్వాచార్యుల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. వాళ్ళు మన ఆళ్వార్ల సూక్తులను ఎలా చూచా తప్పకుండా ఆచరించి జీవించారో, వాళ్ళు వేసిన బాటలో నడుచుకోవాల్సిన అవసరము గురించి మనము తెలుసుకుందాము.

వ్యాస పరాశరులు: సరే నాన్నమ్మా! తెలుసుకోవాలని ఆతృతగా ఉంది.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము : http://pillai.koyil.org/index.php/2015/02/beginners-guide-dhivya-prabandham-the-most-valuable-gift-from-azhwars/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment