బాల పాఠము – ఉత్తమ అనుష్ఠానాలు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

<< బాల పాఠము – అష్ట దిగ్గజులు తదితరులు

పరాశర, వ్యాస, వేదవల్లి, అత్తుళాయ్ అందరు కలిసి బామ్మగారి ఇంటికి వస్తారు.

బామ్మగారు: రండి పిల్లలూ. మీరు చేతులు కాళ్ళు కడుక్కోండి, మీకు పండ్ల ప్రసాదాన్ని ఇస్తాను. ఈ నెలలో విశేషం ఏమిటో  మీకు తెలుసా?

వేదవల్లి: నేను చెప్తాను నాన్నమ్మ. మీరు చెప్పింది నాకు గుర్తుంది. ఇది “శూడి క్కొడుత్త శుడర్కొడి” ఆండాళ్ నాచ్చియార్ పుట్టిన నెల. ఆమె ఆషాడ మాసం పూర్వా ఫాల్గుని నక్షత్రంలో అవతరించింది.

పరాశర: అవును. ఈ నెలలో నాథమునుల మనుమలు ఆళవందార్ల తిరునక్షత్రం కూడా వస్తుంది. వీరు ఆషాడ మాసం ఉత్తర ఆషాడ నక్షత్రంలో అవతరించారు. అవునా నాన్నమ్మా?

బామ్మగారు: బాగా చెప్పావు. ఇప్పటి వరకు మనము ఆళ్వార్లు ఆచార్యుల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు మనం రోజూ ఆచరించవలసిన అనుష్ఠానాల (ఉత్తమ ఆచారాలు) గురించి తెలుసుకుందాము.

అత్తుళాయ్: నాన్నమ్మా, అనుష్ఠానం అంటే ఏంటి?

బామ్మగారు: శాస్త్రం మన మంచి కోసం కొన్ని నియమాలను విధించింది. ఆ నియమాలనే అనుష్ఠానం (ఉత్తమ ఆచరణలు) అని అంటారు. ఉదాహరణకు: ఉదయాన్నే లేచి స్నానం చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక నియమం. తిరుప్పావైలో
ఆండాళ్ నాచ్చియార్ కూడా అన్నారు “నాట్కాలే నీరాడి” అని.

వ్యాస: అవును నాన్నమ్మా, నాకు గుర్తుంది తిరుప్పావై రెండవ పాశురంలో ఉంది.

బామ్మగారు: అవును! ఉదయాన్నే లేచి పెరుమాళ్ళని మనస్సులో స్మరించుకుంటే మన మనస్సులు శుద్ధి అవుతాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఉదయాన్నే స్నానం చేసి, ఊర్ధ్వపుండ్రం పెట్టుకొని, ఉపనయనం అయిన వాళ్ళు సంధ్యావందనం, అన్య రోజువారీ కర్మానుష్ఠానాలు చేయాలి.

వ్యాస పరాశరులు: నాన్నమ్మా, మేము నిత్య కర్మానుష్ఠానాలు క్రమం తప్పకుండా చేస్తాము.

బామ్మగారు: సంతోషం పిల్లలూ!

వేదవల్లి: ఆనందంగా ఊర్ధ్వపుండ్రాలు కూడా ధరించాము. ఊర్ధ్వపుండ్రాలు ధరించడంలో ఉన్న ప్రాముఖ్యత గురించి చెప్పండి నాన్నమ్మా! చాలా వినాలని ఉంది.

బామ్మగారు: సరే, వినండి. ‘తిరుమన్ కాప్పు’ – కాప్పు అంటే రక్షణ అని అర్థం. పిరాట్టి  పెరుమాళ్ళు, మనతో ఉన్నట్టు, మనల్ని ఎప్పుడూ రక్షింస్తున్నట్టు అర్థం. తిరుమన్ కాప్పు ధరిస్తే, మనం పెరుమాళ్ళ భక్తులమని స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి మనము తిరుమన్ కాప్పుని గర్వంగా ధరించాలి.

వేదవల్లి: ఊర్ధ్వపుండ్రాల ప్రాముఖ్యత గురించి అర్థం చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది.

పిల్లలందరూ ఒకే సారి: అవును నాన్నమ్మా.

బామ్మగారు: చాలా మంచిది పిల్లలూ. అదే విధంగా, మన మంచి కోసం శాస్తం మనకి అనేక ఇతర నియమాలను విధించింది. వాటిలో కొన్ని ఇప్పుడు మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి. తినడానికి ముందు, తరువాత మన చేతులూ కాళ్ళు కడుక్కోవాలి. ఎందుకంటే మనం పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యము బాగుంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, పెరుమాళ్ళకి నివేదించిన ప్రసాదాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇలా చేయడం ఎంతో అవసరం. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన స్వభావం ఉంటుంది. పెరుమాళ్ళ ప్రసాదాన్ని తింటే, వారి కృపతో మనలో సత్వ గుణాలు అభివృద్ధి చెందుతాయి.

పరాశర: మా ఇంటిలో, నా అమ్మ ప్రసాదం సిద్ధం చేస్తుంది, నాన్నగారు దేవుడికి నివేదన చేస్తారు. పెరుమాళ్ళ తీర్థం తీసుకున్న తరువాత మాత్రమే ప్రసాదాన్ని తింటాము.

బామ్మగారు: మంచి అలవాటు.

నలుగురూ నవ్వు ముఖంతో సరే అంటారు. 😊

బామ్మగారు: ఇంకా, కొన్ని ఆళ్వార్ల కొన్ని పాశురాలను పఠించిన తరువాత మాత్రమే ప్రసాదం తీసుకోవాలి. పెరుమాళ్ళకు నివేదించినది మన కడుపుకి ఆహారం. మన నాలుకకు ఏమిటి ఆహారం?

అత్తుళాయ్: నాలుకకి ఆహారమా! అంటే ఏమిటి నాన్నమ్మా?

బామ్మగారు: పెరుమాళ్ళ దివ్య నామ జపం మన జిహ్వకి (నాలుకకి) ఆహారం. నమ్మాళ్వార్లను దేవుడిగా భావించేవారు మధురకవి ఆళ్వార్లు. తమ కణ్ణునుణ్ శిఱుత్తాంబులో కురుగూర్ నంబి (నమ్మాళ్వార్ల నామాలలో ఒకటి) అన్నప్పుడల్లా నాలుకపై తేనె పోసినట్టుగా ఉంటుందని మధురకవి ఆళ్వార్లు అనేవారు.

నమ్మాళ్వార్లు – మధురకవి ఆళ్వార్లు

వేదవల్లి: నాన్నమ్మా, మధురకవి ఆళ్వార్లకు నమ్మాళ్వార్ల పట్ల ఉన్న భక్తి గురించి మీరు చెప్పినప్పుడు మా గుండెను కరిగించివేసింది. ఇప్పడి నుండి కణ్ణునుణ్ శిఱుత్తాంబును పఠించిన తరువాతనే మేము ప్రసాదం తీసుకుంటాము.

బామ్మగారు: బావుంది వేదవల్లి.

వ్యాస: మీరు చెప్తుంటే అలాగే వింటూ ఉండాలని అనిపిస్తుంది. ఇంకా చెప్పండి నాన్నమ్మా.

బామ్మగారు: మరో సారి ఇంకా మాట్లాడుకుందాం. బయట చాలా చీకటి పడుతోంది. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్లండి.

పిల్లలు నాన్నమ్మ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ సంతోషంగా వాళ్ళ ఇండ్లకు వెళ్ళారు.

మూలము : http://pillai.koyil.org/index.php/2018/08/beginners-guide-anushtanams/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment