బాల పాఠము – అష్ట దిగ్గజులు తదితరులు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ వైష్ణవం – బాల పాఠము

 << బాల పాఠము – అళగియ మణవాళ మామునులు

బామ్మగారు: పిల్లలూ రండి, మనం చర్చించుకున్న విషయాలన్నీ మీకు గుర్తున్నాయని అనుకుంటున్నాను.

పిల్లలందరూ కలిసి ఒకేసారిగా:  నమస్కారం నాన్నమ్మా, అవును గుర్తున్నాయి, అష్ట దిగ్గజుల గురించి తెలుకోడానికి వచ్చాము నాన్నమ్మా.

బామ్మగారు: మంచిది, మొదలు పెడదాం.

పరాశర: నాన్నమ్మా, అష్ట దిగ్గజులు అంటే 8 శిష్యులు. అవునా నాన్నమ్మా?

బామ్మగారు: అవును పరాశర. అష్ట దిగ్గజులు మణవాళ మామునుల ఎనిమిది శిష్యులు. పొన్నడిక్కాల్ జీయర్, కోయిళ్ అణ్ణన్, పతంగి పరవస్తు పట్టర్పిరాన్ జీయర్, తిరువేంకట జీయర్, ఎఱుంబియప్పా, ప్రతివాది భయంకరం అణ్ణన్, అపిళ్ళై, అప్పిళ్ళార్ వారి 8 శిష్యులు. మామునుల తర్వాత మన సంప్రదాయ అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారు.

మణవాళ మామునులకు ‘ప్రాణ సుక్రుత్’ (ప్రాణం కంటే ప్రియమైన) లాంటి వారైన పొన్నడిక్కాల్ జీయర్లతో మొదలుపెడదాం.

ponnadikkal-jiyar

బామ్మగారు: అళగియ వరదర్ గా జన్మించి, వీరు పొన్నడిక్కాల్ జీయర్లుగా ప్రసిద్ధులైయ్యారు.

పరాశర: నాన్నమ్మా, వారిని పొన్నడిక్కాల్ జీయర్ అని ఎందుకు పిలిచేవారు?

బామ్మగారు: పొన్నడిక్కాల్ అంటే మణవాళ మామునుల శిష్య సంపదకి పునాది వేసినవారు అని అర్ధం. ఎంతోమంది ఆచార్యులు మామునులను ఆశ్రయించేందుకు పొన్నడిక్కాల్ జీయర్ని పురుషకారంగా భావించేవారు.

పొన్నడిక్కాల్ జీయర్కి కూడా అష్ట దిగ్గజులను మణవాళ మామునులు నియమించారు. మణవాళ మామునులు పొన్నడిక్కాల్ జీయర్ని వానమామలై దివ్య దేశానికి వెళ్ళమని నిర్దేశిస్తారు. ఎందుకంటే దేవనాయక పెరుమాళ్ళు (వానమామలై పెరుమాళ్ళు) విశ్వక్సేనుల వారిచే శ్రీముఖాన్ని (దివ్య ఆజ్ఞ) మామునులకు పంపి పొన్నడిక్కాల్ జీయర్ని వానమామలై దివ్య దేశానికి పంపి అక్కడి కైంకర్యాలను చూసుకోమని ఆదేశిస్తారు.

వ్యాస: నాన్నమ్మా, పొన్నడిక్కాల్ జీయర్ దైవనాయక పెరుమాళ్ళకు మామగారు అని విన్నాను. నిజమేనా?

బామ్మగారు: అవును వ్యాస. పొన్నడిక్కాల్ జీయర్లు తిరుమల నుండి నాచియార్ విగ్రహాన్ని తీసుకువచ్చి దేవనాయక పెరుమాళ్ళతో దివ్య కళ్యాణం ఏర్పాటు చేస్తారు. వీరే కన్యాదానం కూడా చేసి, పెరయాళ్వార్లలాగా పొన్నడిక్కాల్ జీయర్ కూడా తనకు మామగారు పెరుమాళ్ళని చాటుతారు.

మణవాళ మామునుల ఆదేశాలను పాఠించి దేశం నలుమూలలకు వెళ్లి మన సంప్రదాయ ప్రచారం చేశారు. చివరికి, వారి ఆచార్యులైన అళగియ మణవాళ మామునుల దివ్య తిరువడిని ధ్యానిస్తూ పొన్నడిక్కాల్ జీయర్ తన చరమ తిరుమేనిని విడిచి పరమపదం పొందుతారు.

మనము కూడా పెరుమాళ్ళు, ఆచార్యులపైన భక్తి ప్రపత్తులు పెరగాలని పొన్నడిక్కాల్ జీయర్ల దివ్య తిరువడిని ప్రార్థన చేద్దాం.

బామ్మగారు: ఇప్పుడు ‘కోయిల్ అణ్ణన్’ గురించి చెప్పుకుందాం. మణవాళ మామునుల ప్రియ శిష్యులలో వీరు ఒకరు. అష్ట దిగ్గజులలో ఒకరు. కోయిల్ అణ్ణన్ జీవితంలో ఆసక్తికరమైన సంఘటన ఒకటి జరిగి మణవాళ మామునుల ఆశ్రయించాల్సి వస్తుంది.

koilannan

పరాశర: నాన్నమ్మా, ఏమిటది?

బామ్మగారు: ముదలియాండాన్ లాంటి గొప్ప వంశంలో జన్మించి, వీరు మణవాళ మామునులను ఆశ్రయించాలనుకోలేదు. ఈ ఘట్టం వీరిని మణవాళ మామునుల తిరువడి వద్దకు చేర్చింది. కోయిల్ అణ్ణన్ తమ శిష్యులతో శ్రీరంగంలో ఉండేవారు. శ్రీభాష్యకారులు (శ్రీ రామానుజులు) కోయిల్ అణ్ణన్ ని మణవాళ మామునులను ఆశ్రయించమని ఆజ్ఞాపించారని మనందరికీ తెలుసు. శ్రీ రామానుజులు కోయిల్ అణ్ణన్ వారికి మార్గనిర్దేశం చేస్తూ ముదలియాండాన్లతో తన సంబంధాన్ని బలపరచుకోమని అంటారు.

తాను ఆదిశేషుడినని, మరలా మణవాళ మామునులుగా తిరిగి వచ్చారని, తనతో పాటు తన బంధువులందరినీ మణవాళ మామునుల తిరువడి సంబంధం పొందమని ఎంబెరుమానార్లు తెలుపుతారు. పిల్లలు గమనించండి, ఇదంతా వారి స్వప్నంలో జరుగుతుంది. తరువాత అణ్ణన్ మేలుకొని ఆశ్చర్యపోయి తన సోదరులకు ఈ స్వప్నం గురించి వివరిస్తారు.

కందాడై ఆచార్యపురుషులతో కలిసి అణ్ణన్ జీయర్ మఠానికి వెళ్ళి మణవాళ మామునులను ఆశ్రయిస్తారు. మణవాళ మామునులు వానమామలై (పొన్నడిక్కాల్) జీయర్ని పంచ సంస్కారం కోసం అవసరమైన సామగ్రిని సిద్ధం చేయమని నిర్దేశిస్తారు.

పిల్లలూ, మణవాళ మామునులకు అతి ప్రియమైనవారు కోయిల్ కందాడై అణ్ణన్ల చరిత్ర గురించి కొన్ని అంశాలను చూశాము. వీరికున్న అచార్యాభిమానంలో కొంత మనము కూడా పొందాలని కోరుకుంటూ వారి దివ్య తిరువడిని ప్రార్థన చేద్దాము.

ఇప్పుడు నేను ‘మోర్ మున్నార్ అయ్యర్’ (పరవస్తు పట్టర్పిరాన్ జీయర్) గురించి చెప్తాను. మణవాళ మామునుల అష్ట దిగ్గజులలో ఒకరైన వీరు, తమ ఆచార్యులను ఎప్పుడూ విడవకుండా ఉండేవారు. ఎంబెరుమానార్లతో ఎంబార్ ఉన్నట్టుగా, వీరు ఎప్పుడూ మణవాళ మామునులతోనే ఉండేవారు.

OLYMPUS DIGITAL CAMERA

వేదవల్లి: నాన్నమ్మా, వారిని ‘మోర్ మున్నార్ అయ్యర్’ అని ఎందుకు  పిలిచేవారు?

బామ్మగారు: ఆసక్తికరమైనదిగా ఉంది కదూ.  ప్రతిరోజూ, వీరు మణవాళ మామునుల శేష ప్రసాదాన్ని తినేవారు. మణవాళ మామునులు పెరుగన్నంతో ముగించిన ఆ అరటి ఆకులోనే పరవస్తు పట్టర్పిరాన్ జీయర్ వారు తమ ఆచార్యుల శేష ప్రసాదం రుచి మారనివ్వకుండా అలాగే పెరుగన్న ప్రసాదంతో మొదలుపెట్టి  పప్పన్నంలోకి వచ్చేవారు. అందుకని వీరు “మోర్ మున్నార్ అయ్యర్” గా ప్రసిద్ధులైయ్యారు.

వీరు మణవాళ మామునుల నుండి శాస్త్రార్థాలను నేర్చుకుని, వారికి నిత్యం సేవలు అందిస్తుండేవారు. మణవాళ మామునులు పరమపదించిన తరువాత, పట్టర్పిరాన్ జీయర్ తిరుమలలో స్థిరపడి, అక్కడి స్థానికులెందరినో ఉద్దరించారు. మణవాళ మామునులకు ప్రియమైన వీరు గొప్ప విద్వాంసులు. ఆచార్య నిష్ఠకు పరాకాష్ట అయిన వీరు గురుపరంపర గురించి, మన పూర్వాచార్యులు వాళ్ళ ఆచార్యులపై ఎంతగా ఆధారపడి ఉండేవారో తెలియజేస్తూ  ‘అంతిమోపాయ నిష్ఠ’ అనే గ్రంథాన్ని వ్రాశారు.

eRumbiappA-kAnchi

బామ్మగారు: పిల్లలూ. ఇప్పుడు నేను ఎఱుంబి అప్పా గురించి చెప్తాను. వారి అసలు పేరు దేవరాజు. వారి గ్రామంలో తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటున్న రోజుల్లో మణవాళ మామునుల గురించి విని వారిని కలుసు కోవాలనుకుంటారు. ఎఱుంబి అప్పా కొంతకాలం మణవాళ మామునులతో ఉండి రహస్య గ్రంథాల గురించి నేర్చుకొని చివరికి తమ గ్రామానికి తిరిగి వెళ్లి అక్కడ కైంకర్యాన్ని కొనసాగిస్తారు.

తమ ఆచార్యుడిని నిరంతరం ధ్యానిస్తూ, మణవాళ మామునుల రోజువారీ దినచర్యలను వివరిస్తూ పూర్వ ఉత్తర దినచర్యలను వ్రాసి, ఒక శ్రీ వైష్ణవుని ద్వారా మణవాళ మామునులకు పంపుతారు. మణవాళ మామునులు ఎఱుంబి అప్పా నిష్టకి మెచ్చి, ఎరుంబి అప్పాని మఠానికి రమ్మని ఆహ్వానిస్తారు.

వ్యాస: నాన్నమ్మా, పట్టర్పిరాన్ జీయర్, పొన్నడిక్కాల్ జీయర్ లాగా ఎఱుంబి అప్పాకి కూడా తమ ఆచర్యులంటే భక్తి ఉంది కదా నాన్నమ్మా?

బామ్మగారు:  అవును వ్యాస. ఎఱుంబి అప్పా అత్యంత ముఖ్యమైన రచనలలో ఒకటి “విళక్షణ మోక్ష అధికారి నిర్ణయం”.  ఎఱుంబి అప్పా వారికి,  తమ శిష్యులలో ఒకరైన సేనాధిపతి ఆళ్వన్ మధ్య జరిగిన సంభాషణల సంగ్రహమే ఈ గ్రంథం.

వేదవల్లి: నాన్నమ్మా, ‘విళక్షణ మోక్ష అధికారి నిర్ణయం’ అంటే ఏమిటి?

బామ్మగారు: ఈ గ్రంథం మన ఆళ్వారులు / ఆచార్యుల శ్రీసూక్తులను తప్పుగా అర్థం చేసుకుని అపార్థాలకు దారితీసే సందేహాలను వివరిస్తుంది. ఎఱుంబి అప్పా తమ బోధనలలో ఈ సంసారం నుండి వైరాగ్య ప్రాముఖ్యతను, పూర్వాచార్యుల జ్ఞాన అనుష్ఠానాలపైన ప్రీతిని గురించి తెలిపి, ఎలా ఆచారణలో పెట్టాలో కూడా మనకు మార్గనిర్దేశం చేశారు.

మణవాళ మామునులను ఎల్లప్పుడూ స్మరణలో ఉంచుకున్న ఎఱుంబి అప్పాని మనం స్మరించుకుందాం.

బామ్మగారు: పిల్లలూ, ఇప్పుడు ప్రతివాది భయంకరం అణ్ణా గురించి చెప్పుకుందాం. వేదాంతాచార్యులచే ఆశీర్వదించబడిన  వీరు హస్తిగిరినాథుడిగా జన్మించి, తమ  జీవిత ప్రారంభ కాలంలో కంచీపురంలో నివసించిన గొప్ప విద్వాంసులు.  ఇతర సాంప్రదాయ పండితులపై, అనేక విద్వాంసులపై చర్చలో గెలిచిన వారు వీరు.

pb-annan-kanchi

తరువాత తిరుమలలో ఉంటూ శ్రీవేంకటేశ్వరుడికి సేవలు అందిస్తున్న రోజుల్లో, మణవాళ మామునుల మహిమ గురించి విని, వారిని ఆశ్రయించాలనే ఉద్దేశ్యంతో శ్రీరంగంలోని మామునుల మఠాన్ని చేరుకుంటారు. ఆదే సమయంలో మణవాళ మామునులు కాలక్షేపం చేస్తుండగా విని, మణవాళ మామునులకు శాస్త్ర జ్ఞానంలో ఉన్న పటుత్వాన్ని అర్థం చేసుకొని, వారికి శరణాగతి చేసి శిష్యులౌతారు.

వీరు ఎంబెరుమానార్లను, మణవాళ మామునులను కీర్తిస్తూ అనేక గ్రంథాలను వ్రాసారు. తమ ఆచార్యులైన మణవాళ మామునుల ఆనందం కోసం, అత్యంత ప్రజాదరణ పొందిన వెంకటేశ సుప్రభాతం, వెంకటేశ ప్రపత్తి మొదలైనవి తిరువెంకటేశ్వరుడికి సమర్పించారు.

బామ్మగారు: పిల్లలూ,  చివరిగా మనం అప్పిళ్ళై, అప్పిళ్ళార్ గురించి చర్చించుకుందాం. వారి గురించి ఎక్కువ వివరాలు మనకు అందుబాటులో లేవు. వీరు కూడా మణవాళ మామునులకు అతి ప్రియమైన శిష్యులు, అష్ట దిగ్గజులలో ఒకరైనారు. వారిరువురు ఉత్తర భారతదేశంలో అనేక పండితులపై గెలిచన గొప్ప విద్వాంసులు.

appiLLaiappiLLAr

వీళ్ళు మణవాళ మామునుల కీర్తి గురించి విన్నారు కానీ అంతగా ఆసక్తి చూపేవారు కాదు. కందాడై అణ్ణన్, ఎఱుంబి అప్పా వంటి మహానుభావులు మణవాళ మామునుల తిరువడి సంబంధం పొందారని తెలుసుకొని, కొద్ది కాలంలోనే మణవాళ మామునులను ఆశ్రయిస్తారు.

మణవాళ మామునులు అప్పిళ్ళార్, అప్పిళ్ళైలద్దరికీ  పంచ సంస్కారం చేస్తారు.

అప్పిళ్ళార్లకు జీయర్ మఠంలో తదీయారాదనం కైంకర్య బాధ్యతను అప్పగిస్తారు. ఎలాగైతే కిడాంబి ఆచ్చాన్ మఠం బాధ్యతలతో పాటు ఎంబెరుమానార్లను సేవించారో అలాగే, మణవాళ మామునులకు అప్పిళ్ళార్ సేవలు అందించేవారు.

అప్పిళ్ళై మణవాళ మామునుల దివ్య సూచనలను అనుసరిస్తూ తిరువందాదులకు వ్యాఖ్యానాలు వ్రాసి, అనేక దివ్య ప్రబంధ సంబంధమైన కైంకర్యాలలో మణవాళ మామునులకు సహాయం అందించారు.

మణవాళ మామునుల చివరి రోజులల్లో, అప్పిళ్ళార్ తమ తిరువారారాధనం కోసం అర్చా విగ్రహాన్ని ప్రసాదించమని కోరతారు.  మణవాళ మామునులు నిత్యం ఉపయోగించే ఒక చెంబుని వారికి ఇచ్చి, ఆ చెంబును కరిగించి రెండు విగ్రహాలు తయారు చేయమని ఆదేశిస్తారు. చెరి ఒకటి మణవాళ మామునుల విగ్రహాన్ని తమ తిరువారారాధనం కోసం తీసుకుంటారు.

పిల్లలూ, వీరికున్న అచార్యాభిమానంలో కొంత శాతం మనము కూడా రావాలని కోరుకుంటూ వారి దివ్య  తిరువాడికి ప్రార్థన చేద్దాము.

పిల్లలు ఇప్పటి వరకు మనం మణవాళ మామునుల గురించి, వారి అష్ట దిగ్గజుల మహిమ గురించి తెలుసుకొఉన్నాము.

పరాశర: ఈ రోజు మనం చాలా నేర్చుకున్నాము నాన్నమ్మా.

బామ్మగారు: అవును. నేను ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం అందరికి చెప్తాను. జాగ్రత్తగా వినండి.

మణవాళ మామునుల కాలం తర్వాత అనేక ఆచార్యులు పట్టణాలలో, గ్రామాలలో భక్తులను అనుగ్రహిస్తూ వచ్చారు. ఆచార్యలు దివ్య దేశాలలో, అభిమాన స్థలాలలో, ఆళ్వార్ / ఆచార్య అవతార స్థలాలలో, ఇతర క్షేత్రాలలో నివసించి జ్ఞాన, భక్తి ప్రపత్తులను అందరిలో పెంచే  ప్రయత్నము చేస్తూనే వస్తున్నారు.

తిరుమళిశై అణ్ణవప్పంగార్, మొదటి శ్రీపెరుంబుతూర్ ఎంబార్ జీయర్  ఇటీవలి కాలం (200 సంవత్సరాల క్రితం) వారు. వారి గ్రంథాలు, కైంకర్యాల ద్వారా మన సంప్రదాయానికి గణనీయంగా దోహదపడ్డారు.

నేను మీతో పంచుకున్న జ్ఞానమంతా ఈ పరంపర ఆచార్యుల ద్వారా పొందినదే. ఎప్పుడూ వీరికి కృతజ్ఞతతో ఉండాలి. మీరందరి  సమయం ఆనందంగా గడిచిందని ఆశిస్తున్నాను. మన మనస్సు, బుద్ధి, శరీరం ఇటువంటి ఆచార్యులు, ఆళ్వారులు, ఎంబెరుమానార్ల కైంకర్యంలో ఉపయోగించాలి.

సరే,  చీకటి పడింది. మనం ఆచార్యుల గురించి ఆలోచిస్తూ నేటికి ముగిద్దాం.

పిల్లలు:  ధన్యవాదాలు నాన్నమ్మా.

మూలము : http://pillai.koyil.org/index.php/2018/07/beginners-guide-ashta-dhik-gajas-and-others/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment